• facebook
  • whatsapp
  • telegram

మౌర్యుల చరిత్రకు ఆధారాలు

(ప్రాచీన భారతదేశ మహా సామ్రాజ్య యుగం)

గతకాల ఘనతకు సజీవ సాక్ష్యాలు!


 

ఆధునిక యుగంలోనూ ఆచరిస్తున్న, ఇప్పటికీ ఆదర్శనీయమైన  అనేక పాలనా విధానాలను, సంస్కృతీ సంప్రదాయాలను, వర్తక వాణిజ్యాలను క్రీస్తు పూర్వమే మౌర్యులు అమలు చేసినట్లు పలు రకాల ఆధారాలు తెలియజేస్తున్నాయి. అర్థశాస్త్రం సహా  పలు రచనలు అప్పటి పరిపాలనను కళ్లకు కట్టినట్లు వివరిస్తే, అశోకుడి రాతి శాసనాలు అతడు ప్రబోధించిన, ప్రచారం చేసిన ధర్మాలకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ రెండు రకాల ఆధారాలు ప్రాచీన భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యాల ఆవిర్భావ ఘట్టాలను పునర్నిర్మించడానికి అవసరమైన అమూల్య సమాచారాన్ని అందించాయి. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు అధ్యయనం చేయాలి. మహోజ్వల మౌర్యశకం నాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. 

 

 


ప్రాచీన భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్య యుగం మౌర్యులతో ప్రారంభమైంది. ఈ కాలానికి సంబంధించి చారిత్రక రచనలు స్వల్పంగా ఉండటంతో చరిత్రకారులు సాహిత్య, పురావస్తు ఆధారాలతో నాటి చరిత్రను వివరించారు. మహోజ్వల ఘట్టం - పాటలీపుత్రం రాజధానిగా మౌర్య సామ్రాజ్య స్థాపన, ఆ వంశ రాజుల చరిత్ర వెలుగులోకి వచ్చాయి. ఈ వంశంలో ముఖ్య రాజులు చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ. 321-298), బిందుసారుడు (క్రీ.పూ. 298-273), అశోకుడు (క్రీ.పూ. 269-231), చివరి రాజు బృహద్రదుడు (క్రీ.పూ.191-184). మొదటిసారిగా మౌర్యుల పాలనలో భారత ఉపఖండమంతా ఒక రాజకీయ ఛత్రం కింద ఏకీకృతమైంది.క్రీ.పూ. 321 నుంచి క్రీ.పూ. 184 వరకు పాటలీపుత్రం కేంద్రంగా భారతదేశాన్ని పాలించిన మౌర్యవంశ చరిత్రకు సంబంధించిన అనేక సాహిత్య, పురావస్తు ఆధారాలు లభించాయి. 


సాహిత్య ఆధారాలు


అర్థశాస్త్రం: మౌర్యవంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడి గురువు, ప్రధాని కౌటిల్యుడు/చాణక్యుడు ఈ గ్రంథ రచయిత. 6000 శ్లోకాలతో 150 అధ్యాయాలుగా రచించిన ఈ గ్రంథం గొప్ప రాజనీతి, పాలనా శాస్త్రం. ప్రజల సంతోషమే రాజు సంతోషమని, రాజు సంక్షేమం ప్రజల సంక్షేమంలోనే ఉందని రాచరిక ప్రభుత్వ లక్ష్యాన్ని నిర్దేశించిన గ్రంథం అర్థశాస్త్రం. చంద్రగుప్త మౌర్యుడి పరిపాలనా విధానాన్ని, నాటి రాజనీతిని తెలుసుకోవడానికి; మౌర్యుల కాలంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను గ్రహించడానికి ప్రధాన ఆధారం. 


ముద్రారాక్షసం: గుప్తుల కాలం నాటి సంస్కృత నాటకం, విశాఖదత్తుడు రచయిత. ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడికి, నందవంశపు రాజు ధననందుడికి మధ్య జరిగిన సంఘర్షణను రచయిత తెలియచేశాడు. చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా నంద రాజులను నిర్మూలించి, మగధ సింహాసనాన్ని అధిష్టించాడో ఈ గ్రంథం వివరిస్తుంది. 


పురాణాలు: ఇవి పద్దెనిమిది ఉన్నాయి. అష్టాదశ పురాణాలు అంటారు. వీటిని సంస్కృతంలో వేదవ్యాసుడు రాసినట్లుగా చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ పురాణాల్లో కొన్ని రాజ వంశాల పట్టిక/వంశావళి ఉన్నాయి. ఉదాహరణకు గరుడ, వాయు, విష్ణు పురాణాల్లో మౌర్య వంశ పట్టిక ఉంది.       


పరిశిష్ట పర్వం: హేమచంద్ర ఈ గ్రంథ రచయిత. ఈయన క్రీ.శ. 12వ శతాబ్ది చాళుక్యవంశ రాజు కుమారపాలుడి ఆస్థాన పండితుడు. ఈ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు జైన మతం స్వీకరించిన విధానాన్ని, దక్షిణాదిలో అంటే ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెళగోళకు వెళ్లి ‘సల్లేఖన వ్రతాన్ని’ ఆచరించి కేవల స్థితి పొందిన తీరును వివరించింది. 


ఇండిక: ఈ గ్రంథ రచయిత మెగస్తనీసు. ఇతడు చంద్రగుప్తుడి ఆస్థానంలోని గ్రీకు రాజు సెల్యూకస్‌ నికేటర్‌ రాయబారి. ‘ఇండిక’లో పాటలీపుత్ర పరిపాలనకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. మౌర్య సామ్రాజ్య సామాజిక, రాజకీయ పరిస్థితుల అధ్యయనానికి ఇది ఉపయోగపడింది.


దీపవంశ, మహావంశ: ఇవి ప్రాచీన యుగ శ్రీలంక గ్రంథాలు. వీటిలో అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి చేసిన కృషి గురించి ఉంది. 


చైనా దేశపు బౌద్ధ యాత్రికుల రచనలు: ఫాహియాన్‌ (రెండో చంద్రగుప్తుడి కాలంలో), హుయాన్‌త్సాంగ్‌ (హర్షుడి కాలంలో) భారత దేశంలో బౌద్ధ మత క్షేత్రాల సందర్శనకు వచ్చిన యాత్రికులు. వరుసగా వీరు రచించిన ఫు-కువో-కి, సి-యు-కి గ్రంథాలు మౌర్యుల చరిత్రకు ఆధారాలు. 


ఇతర రచనలు: బౌద్ధ జాతక కథలు, బద్రబాహుడు రాసిన కల్పసూత్ర గ్రంథం కూడా ఆనాటి సాంఘిక, మత పరిస్థితుల అవగాహనకు ఆధారంగా ఉంది. అలెగ్జాండర్‌ సేనానులైన నియార్కస్, అరిష్టబ్యులస్‌లు మౌర్యుల కాలంనాటి పరిస్థితులను తమ రచనల్లో ప్రతిబింబిపజేశారు. ఈజిప్టు రాజు టాలమీ ఫిలడెల్ఫస్‌-II తమ దేశం తరఫున డయానీషియస్‌ను బిందుసారుడి కొలువులో ఉంచాడు. ఈయన రచనలు కూడా మౌర్య చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి. 



శాసన ఆధారాలు

భారతదేశ చరిత్రలో మొదటగా శాసనాలు వేయించిన రాజు అశోకుడు. తన రాచరిక సిద్ధాంతాలను ప్రకటించడానికి, నైతికతను ప్రబోధించడానికి ఈయన శాసనాలను జారీ చేశాడు. శాసనాలు వేయించడంలో అశోకుడికి పర్షియన్‌ చక్రవర్తి డేరియస్‌ స్ఫూర్తి అని చరిత్రకారుల అభిప్రాయం. దేశవ్యాప్తంగా ఉన్న అశోకుడి శాసనాలను మొదటిసారిగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి జేమ్స్‌ ప్రిన్సెప్‌ 19వ శతాబ్ది ప్రథమార్ధంలో కనుక్కున్నాడు. బ్రాహ్మి లిపి, ప్రాకృత భాషలో ఉన్న వీటిని (పశ్చిమోత్తర దిక్కులో ఉన్న మంషెహర, షెహేబ్జాగిరి చోట్ల తప్ప) ప్రిన్సెప్‌ అధ్యయనం చేసి అవి మౌర్య చక్రవర్తి అశోకుడివని 


ప్రకటించాడు. వాటి అర్థాన్ని వివరించి చరిత్ర గతినే మార్చివేశాడు. అశోకుడి శాసనాలు ప్రాథమికంగా మూడు రకాలు. అవి: 1) లఘు శిలా శాసనాలు  2) బృహత్‌ శిలా శాసనాలు 3) స్తంభ శాసనాలు. ఇవి అశోకుడి వ్యక్తిగత విషయాలు, సామ్రాజ్య ఎల్లలు, బౌద్ధమతం పట్ల ఆయనకు ఉన్న అనురక్తి, ‘దమ’ పాలనా సూత్రాలను తెలియజేస్తున్నాయి. అశోకుడు తన శాసనాల్లో ‘దేవనాం ప్రియ’, ‘ప్రియదర్శి రాజ’, ‘మగధ రాజన్య’ లాంటి బిరుదులతో; పురాణాల్లో అశోక వర్ధనుడిగానూ పేరు గాంచాడు. పాటలీ పుత్రం, తక్షశిల, సువర్ణగిరి, వైశాలి, కౌశాంబి పట్టణాల గురించి అశోకుడి శాసనాల్లో ఉన్నాయి.


లఘు శిలా శాసనాలు: ఈ శాసనాల ద్వారా అశోకుడి వ్యక్తిగత విషయాలు, ‘దమ’ విధానం తెలుస్తున్నాయి. అశోకుడి ‘దమ’ సర్వమతాలకు ఆమోదయోగ్యమైన నైతిక నియమావళి. లఘు శిలా శాసనాలు రూపనాథ్‌ (మధ్యప్రదేశ్‌), సహస్రం (బిహార్‌) మస్కి, గోవిమఠ్, సిద్ధాపుర్, జతింగా రామేశ్వర్‌ (కర్ణాటక), ఎర్రగుడి (ఆంధ్రప్రదేశ్‌) ప్రాంతాల్లో ఉన్నాయి. 


బబ్రు శిలాశాసనం: రాజస్థాన్‌లోని భైరత్‌ పట్టణంలో లభించింది. దీన్ని కోల్‌కతాలోని మ్యూజియంలో భద్రపరిచారు. ఈ శిలా శాసనంలో బౌద్ధ మత త్రిరత్నాలైన ‘బుద్ధుడు, ధర్మం, సంఘం’పట్ల అశోకుడు గౌరవ విశ్వాసాలు ప్రకటించిన తీరు గురించి ఉంది. 


పద్నాలుగు బృహత్‌ శిలా శాసనాలు: ఈ శాసనాలు అశోకుడి ప్రభుత్వ సిద్ధాంతాలను, పౌరులు పాటించాల్సిన నైతిక విలువలను ప్రకటిస్తున్నాయి. బృహత్‌ శిలాశాసనాలు కాల్సి (ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌), గిర్నార్‌ (గుజరాత్‌), సోపార (మహారాష్ట్ర), దౌలీ, జౌగడ (ఒడిశా), ఎర్రగుడి (ఆంధ్రప్రదేశ్‌), షాహబ్జగిరి, షెహేబ్జాగిరి (ప్రస్తుత పాకిస్థాన్‌)లలో లభించాయి.  

 ఒకటో శిలాశాసనంలో జంతుబలి, విందులు, వినోదాలను నిషేధించారు. 

 రెండో శిలాశాసనంలో మనుషులు, జంతువుల ఆరోగ్య సంరక్షణకు వైద్య సదుపాయాల గురించి ఉంది.

 మూడో శిలాశాసనంలో అశోకుడు బ్రాహ్మణులకు, శ్రామణులందరికీ సమానమైన గౌరవం ఇచ్చినట్లు తెలుస్తోంది.

 నాలుగో శిలాశాసనంలో అశోకుడి ధర్మవిధానం గురించి ప్రధానంగా జంతువుల పట్ల ఆదరణ, బంధువుల పట్ల ప్రేమ, అహింస పాటించాలని పేర్కొంది.

 అయిదో శిలా శాసనంలో అశోకుడు ధర్మ మహామాత్యులు అనే అధికారులను నియమించినట్లు తెలుస్తోంది.

 ఆరో శిలాశాసనంలో అశోకుడు అన్ని సమయాల్లో అంటే అంతఃపురంలో ఉన్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు అధికారులు ప్రజా సమస్యలను తమకు నివేదించవచ్చని ప్రకటించినట్లు ఉంది. ఈ శిలాశాసనంలో ప్రజలందరూ తన బిడ్డలే అని అశోకుడు పేర్కొన్నాడు. 

 ఏడో శిలా శాసనం సమాజంలోని అన్ని వర్గాల మధ్య సామరస్యం అవసరమని చాటుతోంది.

 ఎనిమిదో శిలా శాసనంలో అశోకుడు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలకు తీర్థయాత్రలు చేసినట్లు ఉంది  

 తొమ్మిదో శిలాశాసనంలో క్రతువుల పట్ల అశోకుడి వ్యతిరేకత తెలుస్తోంది.

 పది, పదకొండు శిలాశాసనాలు ‘దమ’ను, దాని ఫలితాలను వివరిస్తాయి.

 పన్నెండో శిలాశాసనం మత సహనానికి ప్రాముఖ్యత ఇచ్చింది.

 పదమూడోది అన్నిటికంటే పెద్ద శిలా శాసనం. ఇదే కళింగ శాసనం. కళింగ యుద్ధం, అశోకుడి మనసుపై దాని ప్రభావం గురించి తెలియజేస్తుంది.

 పద్నాలుగో శిలాశాసనం దేశవ్యాప్తంగా ఉన్న శాసనాల ఉద్దేశాన్ని తెలుపుతుంది.


స్తంభ శాసనాలు: అశోకుడు అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారుతున్న పెద్ద శిలా స్తంభాలను వేయించి వాటిపై శాసనాలను ప్రకటించాడు. స్తంభ శాసనాలను అలహాబాదు, మీరట్, సోపార, లావుర్యా నందంగర్, నెగ్లి సాగర్, రామపూర్వ, రూమిన్‌ డై మొదలైన చోట్ల కనుక్కున్నారు. శిలా శాసనాల మాదిరిగానే ఈ స్తంభ శాసనాలు - ధర్మం, ధర్మాచరణ, జీవహింస, జంతు హింసను పరిమితం చేసే చర్యలు, అశోకుడు ధర్మ వ్యాప్తికి చేసిన ప్రయత్నాల గురించి తెలియజేస్తున్నాయి. మౌర్యుల కాలం నాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి.  


ఈ ఆధారాలతోపాటు మౌర్యుల నాటి పంచ్‌ మార్క్‌ నాణేలు, కుండలు, పురావస్తు కట్టడ అవశేషాలు (సాంచి, సారనాథ్, బర్హుట్, తక్షశిల మొదలైనవి) కూడా మౌర్యుల చరిత్ర రచనకు ఉపయోగపడ్డాయి. ఈ విధంగా పుష్కలంగా లభిస్తున్న సాహిత్య, పురావస్తు ఆధారాలతో ఘనమైన మౌర్య సామ్రాజ్య చరిత్రను వీలైనంత సమగ్రంగా చరిత్రకారులు పునర్నిర్మించే ప్రయత్నం చేశారు. అర్థవంతమైన, అమూల్యమైన వివరాలను అందించడంలో చాలా వరకు సఫలీకృతులయ్యారు.



రచయిత: వి.వి.ఎస్‌ రామావతారం

Posted Date : 27-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌