• facebook
  • whatsapp
  • telegram

పల్లవులు


* కె.పి.జైశ్వాల్‌ అనే చరిత్రకారుడు ‘‘ఉత్తర భారతదేశానికి గుప్తులు ఎలాగో, దక్షిణ భారతదేశానికి పల్లవులు అలాంటివారు’’ అని వ్యాఖ్యానించారు.


చారిత్రక ఆధారాలు

*వివిధ శాసనాలు, సాహిత్యాలు పల్లవుల చరిత్రకు ముఖ్య ఆధారాలుగా ఉన్నాయి.

* మొదటి మహేంద్రవర్మ తిరుచిరాపల్లి, మందగపట్టు, కుడుమియామలై శాసనాలు; మొదటి నరసింహవర్మ బాదామి శాసనం; నందివర్మ ఉదియేందిర శాసనం, మంచికల్లు, మైదవోలు శాసనాలు వీటిలో ముఖ్యమైనవి. 

* ఇవేకాకుండా పల్లవులకు సమకాలికులైన బాదామి చాళుక్యరాజు రెండో పులకేశి వేయించిన ఐహోల్‌ శాసనం; గాంగ వంశీయుల శాసనాలు కూడా పల్లవుల చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.

*పల్లవ మహేంద్రవర్మ రచించిన ‘మత్తవిలాస ప్రహసనం’; దండి ‘దశకుమార చరిత్ర’, ‘కావ్యదర్శనం’; భారవి కిరాతార్జునీయం వీరి చరిత్రను తెలుపుతున్నాయి. 

*తమిళంలో ఆళ్వార్లు, నాయనార్లు రచించిన గ్రంథాలు (దేవారం); తిరునాళ్వార్‌ రచించిన ‘కురళ్‌’; సింహళ బౌద్ధగ్రంథాలైన దీపవంశం, మహావంశం; హుయాన్‌త్సాంగ్‌ సి-యు-కి గ్రంథాలు పల్లవుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. 

* పల్లవుల కట్టడాలు, నాణేలు, శిల్పాలు మొదలైనవి పురావస్తు ఆధారాలుగా ఉన్నాయి. కంచి, మహాబలిపురంలోని కట్టడాలు, వైకుంఠ పెరుమాళ్‌ దేవాలయంలో నిర్మించిన శిల్పాలు పల్లవుల కాలం నాటి వాస్తు, శిల్పకళను తెలుపుతున్నాయి.


పుట్టుపూర్వోత్తరాలు

* పల్లవుల పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. 

* ‘‘పల్లవుల వంశోత్పత్తి భారతదేశ చరిత్రలోని నిగూఢ రహస్యాల్లో ఒకటి’’ - వి.ఎ.స్మిత్‌

*‘‘పర్షియా నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన పార్థియన్లే పల్లవులు’’ 

                                                                                                                                                                                                                                                                                                                                                                  - లూయీరైస్, డూబ్రె, వెంకయ్య 

*‘‘అశోకుడి శాసనాల్లో పేర్కొన్న పాలర్లు లేదా పుళిందులే పల్లవులు’’ - సత్యనాథ్‌ అయ్యర్‌ 

* ‘‘పల్లవులు వాకాటక వంశ శాఖకి చెందినవారు’’ - కె.పి.జైశ్వాల్‌ 

*‘‘పల్లవ పదం తొండై పదానికి సంస్కృతీకరణ. వీరు తొండైమండలానికి చెందినవారు’’ 

                                                                                                                                                                                                                                                                                                                                                                     - కృష్ణస్వామి అయ్యంగార్‌

*సింహళ బౌద్ధగ్రంథం ‘మహావంశం’లో కృష్ణానదీ తీరంలో ‘పల్లవబోగ్గ’ అనే ప్రదేశం గురించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పల్నాడు. ఇక్కడే తొలి పల్లవ శాసనాలైన మంచికల్లు, మైదవోలు లభించాయి. కాబట్టి పల్లవులు ఆంధ్రులని కొంతమంది చరిత్రకారుల వాదన.

*మరికొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పల్లవులు మొదట పల్నాడులో నివసించారు. తర్వాత తొండైమండలం (తమిళనాడు)కి వలస వెళ్లి అక్కడ నాగవంశీయులతో వైవాహిక సంబంధాలు ఏర్పర్చుకుని స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించారు. 

*‘మణిమేఖలై’ అనే తమిళ కావ్యంలోని కథ ఆధారంగా చోళ-నాగ వంశానికి జన్మించిన వారు పల్లవులని తమిళనాడుకి చెందిన చరిత్రకారులు పేర్కొన్నారు. 

* పురాణాలు ఆంధ్రులను, పల్లవులను కలిపి పేర్కొన్నాయి.

* రాజశేఖర కవి రచించిన ‘భువనకోశం’లో వాయవ్య సరిహద్దుల్లో పహ్లవులు, దక్షిణాన పల్లవులు ఉన్నట్లు ఉంది.

*పల్లవ రాజవంశం ఒక్కటే అయినప్పటికీ చరిత్రకారులు దీన్ని నాలుగు వర్గాలుగా విభజించారు. 

1. ప్రాకృత శాసన పల్లవులు       2. సంస్కృత శాసన పల్లవులు 

3. మహా పల్లవులు                 4. కడపటి పల్లవులు

* వీరిలో మొదటి రెండు వర్గాలను ప్రాచీన పల్లవులని, మిగిలిన వారిని నవీన పల్లవులు లేదా బృహత్‌ పల్లవులని పేర్కొన్నారు.

నవీన పల్లవులు

* వీరినే మహా పల్లవులు లేదా బృహత్‌ పల్లవులు అంటారు. వీరు క్రీ.శ. 575 నుంచి క్రీ.శ.897 మధ్య రాజ్యాన్ని పాలించారు. నవీన పల్లవుల వంశానికి మూల పురుషుడు సింహ విష్ణువు.

సింహ విష్ణువు  

*ఇతడు క్రీ.శ. 575 నుంచి క్రీ.శ.600 వరకు రాజ్యపాలన చేశాడు.

*ఇతడు చోళ మండలాన్ని జయించి, తన రాజ్యాన్ని కావేరి నది వరకు విస్తరింపజేశాడు. 

*కలభ్ర, చోళ, పాండ్య, కేరళ రాజ్యాలను ఓడించాడు. ‘కంచి’లో పల్లవ రాజ్యాన్ని బలోపేతం చేశాడు. 

*ఇతడి ఆస్థానంలో ‘భారవి’ అనే కవి ఉండేవాడు. భారవి ‘కిరాతార్జునీయం’ అనే గ్రంథాన్ని రచించాడు. 

* ఇతడికి ‘అవని సింహ’ అనే బిరుదు ఉంది.

మొదటి మహేంద్రవర్మ

* ఇతడు క్రీ.శ. 600 నుంచి క్రీ.శ. 630 వరకు రాజ్యపాలన చేశాడు

* సింహ విష్ణువు కుమారుడు ‘మొదటి మహేంద్రవర్మ’. ఇతడు మొదట జైన మతాభిమాని. ‘అప్పార్‌’ బోధనల వల్ల శైవమతాన్ని స్వీకరించారు. 

* పల్లవ రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణా నది వరకు విస్తరించి బాదామి చాళుక్యులు, పాండ్యులతో వైరాన్ని ప్రారంభించాడు. 

*మొదటి మహేంద్రవర్మ పాండ్యులను ఓడించి కావేరి నదీ ప్రాంతంలోని డెల్టా భూములను ఆక్రమించాడు. 

* క్రీ.శ. 630లో రెండో పులకేశి ఇతడిపై దండెత్తాడు. దీన్ని ‘పుల్లలూరు యుద్ధం’గా పేర్కొంటారు. ఈ యుద్ధంలో పులకేశి మహేంద్రవర్మను ఓడించి, పల్లవ రాజ్యంలోని ఉత్తర ప్రాంతాలను ఆక్రమించాడు.  ఈ యుద్ధం జరిగిన కొద్దికాలానికే మహేంద్రవర్మ మరణించాడు. 

ఇతర విశేషాలు

* మహేంద్రవర్మ సంగీత విద్వాంసుడు, చిత్రకారుడు. వాస్తు, శిల్పానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. 

*మహేంద్రవర్మ ‘మత్తవిలాస ప్రహసనం’ అనే గ్రంథాన్ని రచించాడు. ‘రుద్రాచార్యుడి’ దగ్గర సంగీతం నేర్చుకున్నాడు.

*పుదుక్కొట సమీపంలోని కుడుమియామలైలో ఇతడు శిలాశాసనం వేయించాడు. ఇందులో  గోడపై చెక్కిన గణపతి విగ్రహంతోపాటు వీణపై సాధన చేయడానికి అవసరమైన సంగీత పాఠాలు ఉన్నాయి. 

* ఇతడు ‘భగవదజ్జుక’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. 

* మహేంద్రవాడి, మామండూర్, దళవానూర్‌లో చెరువులు తవ్వించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. 

* మహేంద్రవర్మ దక్షిణ భారతదేశంలో ద్రావిడ వాస్తు శిల్పకళారీతులకు నాంది పలికాడు. 

* ఇతడి కాలంలోనే కొండలను తొలిచి ఆలయాలు నిర్మించే పద్ధతి ప్రారంభమైంది. ఇటుక, కలప, లోహాలతో సంబంధం లేకుండా ఆలయాలు నిర్మించేవారు. తిరుచిరాపల్లి, చెంగల్పట్టు, మల్లవరం, మామండూర్, దళవానూర్‌లోని గుహాలయాలు ఇతడి కాలంనాటివే. 

* సిత్తన్న వాస గుహల్లోని వర్ణచిత్రాలు ఇతడి కాలానికి చెందినవే. 

* ఇతడికి విచిత్ర చిత్రుడు, చిత్రకార పులి, గుణభర, అవనీ భాజన, సత్యసంధి, పరమ మహేశ్వర అనే బిరుదులు ఉన్నాయి.


మొదటి నరసింహవర్మ

*ఇతడు క్రీ.శ. 630 నుంచి క్రీ.శ.668 వరకు రాజ్యపాలన చేశాడు.

*ఇతడు మొదటి మహేంద్రవర్మ కుమారుడు. నరసింహవర్మ తన తండ్రిని ఓడించిన రెండో పులకేశిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అతడిపై దండెత్తి ‘మణిమంగళ యుద్ధం’లో ఓడించి, వధించాడు. బాదామి, వాతాపిలను నాశనం చేశాడు.

*ఈ యుద్ధంలో సింహళరాజు ‘మారవర్మ’ నరసింహవర్మకు సహాయం చేశాడు.

*ఈ విజయాలకు చిహ్నంగా నరసింహవర్మ ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ అనే బిరుదులు పొందాడు.

* నరసింహవర్మ సేనాని ‘చిరుతొండ పరంజ్యోతి’.


ఇతర విశేషాలు

*మొదటి నరసింహవర్మ తన తండ్రి ప్రారంభించిన వాస్తు, శిల్ప కళారీతులను కొనసాగించాడు.

* తండ్రి పేరు మీద సముద్ర తీరాన ‘మామల్లపురం’ లేదా ‘మహాబలిపురం’ అనే రేవు పట్టణాన్ని నిర్మించాడు. ఇది విదేశీ వ్యాపారానికి, సముద్రయానానికి ఉపయోగపడింది.

*చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ ‘కంచి’ని దర్శించి, దీని గురించి తన రచనల్లో వర్ణించాడు. మామల్లపురం కంచికి 10 కి.మీ. దూరంలో ఉందని, కంచిలో 100 బౌద్ధారామాలు, 10 వేల మంది బౌద్ధ బిక్షువులు, 80కి పైగా హిందూ దేవాలయాలు ఉన్నట్లు పేర్కొన్నాడు.

* ఏకశిలా నిర్మితమైన ఏడు రాతి రథాలను (seven pagodas) నరసింహవర్మ మహాబలిపురంలోనే నిర్మించాడు.

*ఇతడి చివరి దశలో రెండో పులకేశి కుమారుడైన మొదటి విక్రమాదిత్యుడు పల్లవ రాజ్యంపై దండెత్తి, నరసింహవర్మను ఓడించి చాళుక్య ప్రాంతాలను తిరిగి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఈ యుద్ధంలో విక్రమాదిత్యుడికి గంగ దుర్వినీతుడు సాయం చేశాడు.

* నలందా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేసిన ‘ధర్మపాలుడు’ కంచి నగరానికి చెందినవాడని కొంతమంది చరిత్రకారుల భావన.

ప్రాచీన పల్లవులు

*ప్రాచీన పల్లవుల గురించి తెలుసుకోవడానికి 20 శాసనాలు ఉన్నాయి. వీటిలో నాలుగు శాసనాలు ప్రాకృతంలో, మిగిలినవి సంస్కృతంలో ఉన్నాయి. అయితే ప్రాచీన పల్లవుల గురించి పూర్తి సమాచారం ఇంకా లభ్యం కాలేదు.

* ప్రాచీన పల్లవ వంశానికి మూల పురుషుడు ‘వీరకూర్చవర్మ’ (క్రీ.శ. 285310). ఇతడు నాగరాజు కుమార్తెను వివాహం చేసుకుని ఇక్ష్వాకులను జయించాడు. వీరకూర్చవర్మ కంచిని రాజధానిగా చేసుకుని పాలించాడు.

*వీరకూర్చవర్మ తర్వాత అతడి కుమారుడు శివస్కందవర్మ (క్రీ.శ. 310335) రాజ్యపాలన చేశాడు. ఇతడు వాజపేయ, అశ్వమేధ యాగాలు చేశాడు. ఇతడికి ‘ధర్మమహారాజాధిరాజు’ అనే బిరుదు ఉంది. ఇతడు ప్రాచీన పల్లవుల్లో గొప్పవాడు.

*శివస్కందవర్మ తర్వాత త్రిలోచన పల్లవుడు రాజ్యపాలన చేశాడు. ఇతడు శ్రీశైల పర్వతానికి చుట్టుపక్కల ఉన్న అడవులను నరికించి, వాటిని నివాసయోగ్యంగా మార్చాడు. అక్కడ బ్రాహ్మణులకు అగ్రహారాలు నిర్మించాడు. త్రిలోచనుడి కాలంలో కరికాల చోళుడు తొండైమండలంపై దాడిచేసి ఇతడ్ని ఓడించి, బానిసగా చేసుకున్నాడని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం.

* త్రిలోచనుడి తర్వాత మొదటి కుమార విష్ణువు, బుద్ధవర్మ, రెండో కుమార విష్ణువు, మొదటి సింహవర్మ, స్కందవర్మ, నందివర్మ రాజ్యాన్ని పాలించారు.

* ప్రాచీన పల్లవుల్లో చివరివాడు ‘నందివర్మ’. ఇతడి కాలంలో ‘కలభ్రులు’ దండెత్తి దక్షిణ భారతదేశాన్ని జయించారు. వీరి గురించి పూర్తి సమాచారం లేదు. నందివర్మతో ప్రాచీన పల్లవ వంశం అంతమైంది.
 

Posted Date : 15-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌