• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రకూటులు

రాష్ట్రకూటుల పాల‌నా కాలాన్ని ద‌క్షిణ భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఒక ముఖ్య ఘ‌ట్టంగా చ‌రిత్ర‌కారులు పేర్కొంటారు. వీరు బాదామీ చాళుక్యుల‌కు సామంతులుగా ఉండేవారు. వారు బ‌ల‌హీనులు కాగానే స్వ‌తంత్ర రాజ్యాన్ని స్థాపించారు. రాష్ట్రకూటుల త‌మ‌ను తాము ల‌ట్ట‌లూరు పుర‌వరాధీశ్వ‌రులు అని చెప్పుకున్నారు. వీరి రాజ‌ధాని కర్ణాక‌ట‌లోని మాన్య‌ఖేటం. రాష్ట్రకూట వంశానికి మూల‌పురుషుడు మొద‌టి ఇంద్ర‌రాజు(క్రీ.శ‌.696 - 710). ఈయ‌న మాన్య‌ఖేట, ప‌డ‌మ‌ర తెలంగాణ ప్రాంతాల‌ను ప‌రిపాలించాడు.
 

దంతిదుర్గుడు (క్రీ.శ.748-58): స్వతంత్ర రాష్ట్రకూట రాజ్య స్థాపకుడిగా దంతిదుర్గుడిని పేర్కొంటారు. ఈయన మహారాష్ట్ర మొత్తానికీ అధిపతిగా ఉన్నారు. మహారాజాధిరాజ, పరమ మహేశ్వర, పరమ భట్టారక బిరుదులు ఉన్నాయి. సయంగఢ్‌ శాసనం, ఎల్లోరాలోని దశావతార గుహాలయ శాసనంలో దంతిదుర్గుడి యుద్ధ విజయాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఈయన మాల్వాపై దండెత్తి జయించాడు. ఉజ్జయినిలో హిరణ్యగర్భ దానాన్ని చేసి, తన విజయాన్ని ప్రకటించాడు. 


మొదటి కృష్ణుడు (క్రీ.శ.758-72): ఈయనకు సుభత్తుంగ, అకాలవర్షుడు అనే బిరుదులు ఉన్నాయి. ఎల్లోరాలో కైలాసనాథ దేవాలయాన్ని (ఏకశిలా నిర్మితం) నిర్మించాడు. దీని నిర్మాణం దాదాపు వందేళ్లు కొనసాగింది. దీనికి వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు లభించింది.


ధ్రువరాజు (క్రీ.శ.780-92): ఈయన పాల, ప్రతీహార వంశ రాజులను జయించాడు. తన విజయానికి గుర్తుగా గంగా - యమున తోరణాన్ని తన రాజ్య చిహ్నంగా ఏర్పాటుచేశాడు. ధ్రువరాజుకు శ్రీవల్లభ, విరూపకేళి వల్లభ, దానార్ణవ అనే బిరుదులు ఉన్నాయి.


మూడో గోవిందుడు (క్రీ.శ.793-814): ఈయన రాష్ట్రకూటుల్లో అగ్రగణ్యుడు. గోవిందుడికి ప్రభూతవర్ష, రాజాధిరాజ, రాజాపరమేశ్వర, త్రిభువనధవళి, శ్రీవల్లభ, జనవల్లభ, కీర్తినారాయణ అనే బిరుదులు ఉన్నాయి. సంజిన్‌ శాసనంలో ఈయన గొప్పతనం, విజయాల గురించి వివరణ ఉంది. ఈయన చిత్రకూటం, ఉజ్జయిని, బెంగాల్, కాళప్రియం, గంగా-యమున తీరప్రాంత మైదానాలను జయించాడు.


అమోఘవర్షుడు (క్రీ.శ.814-80): ఈయన అసలు పేరు శర్యుడు. గొప్ప కవి. కన్నడ భాషలో ‘కవిరాజ మార్గం’ అనే తొలి అలంకార గ్రంథాన్ని రచించాడు. ‘ప్రశ్నోత్తర రత్నమాలిక’ అనే కావ్యాన్ని రచించాడు. ఈయనకు ‘కవిరాజు’ అనే బిరుదు ఉంది. ఈయన కాలంలో జైనమత కవులైన మహావీర ఆచార్య ‘గణితసార సంగ్రహాన్ని’, శాత్తాయన ‘అమోఘవృత్తి’ని రచించారు. 
* అమోఘవర్షుడు మాన్యఖేట (మాల్ఖేడ్‌) నగరాన్ని నిర్మించి, దాన్ని రాష్ట్రకూట రాజధానిగా చేసుకున్నాడు. అరబ్‌ యాత్రికుడైన సులేమాన్‌ ఈయన కార్యకలాపాలను వర్ణిస్తూ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన నలుగురు గొప్ప చక్రవర్తుల్లో అమోఘవర్షుడు ఒకరని ప్రశంసించాడు. 
* అమోఘవర్షుడు తన రాజ్యంలో కరవుకాటకాలు సంభవించినప్పుడు వాటిని నివారించేందుకు కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేళ్లను బలిగా సమర్పించాడు.
* జైనమతాన్ని స్వీకరించి, సల్లేఖనవ్రతాన్ని ఆచరించి మరణించాడు.
* రాష్ట్రకూటుల్లో చివరి రాజు రెండో కర్కరాజు (క్రీ.శ.97273) 


పరిపాలనా విధానం
రాష్ట్రకూటులు పటిష్ఠమైన పరిపాలనా వ్యవస్థను నెలకొల్పి, ప్రజాహితంగా రాజ్యపాలన చేశారు. మొదట్లో వీరికి ఎల్లిచ్‌పూర్, ఎల్లోరా, పైఠాన్‌ నగరాలు రాజధానులుగా ఉండేవి. అమోఘవర్షుడు మాన్యఖేటాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. 
* రాజ్య పాలనలో రాజుకు సహాయంగా మంత్రులు ఉండేవారు. వీరిలో ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, కోశాధికారి, న్యాయ మంత్రి, సైన్యాధిపతి ముఖ్యులు. 
* భిన్నప్రాంతాల్లో నియమితులైన రాజోద్యోగులను ‘రాజస్థానీయ’ అనేవారు. 
* పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రం, విషయం, గ్రామాలుగా విభజించారు. రాష్ట్రానికి ‘మహాసామంత’ లేదా ‘మహామండలేశ్వర’ అనే ప్రధాన పాలనాధికారి ఉండేవారు. విషయపతి, భోగపతి అనే జిల్లా అధికారులు ఉండేవారు. పట్టణాన్ని పాలించేవారు ‘నగర పతి’. గ్రామానికి ‘గ్రామపతి’ అధిపతిగా ఉండేవారు. 
* రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. సైన్యాన్ని నిర్వహించడానికి కోసం ప్రజల నుంచి ‘పడేనాళ’ పన్నును వసూలు చేసేవారు. 
* దక్షిణ భారతదేశంలో వ్యవసాయ భూమిని ప్రత్యేకంగా ‘ఎరిపట్టి’ లేదా ‘చెరువు కట్టు భూమి’ అని పిలిచేవారు. 

 

విద్యా, సారస్వత పోషణ
రాష్ట్రకూట రాజులు విద్యాభివృద్ధి కోసం బ్రాహ్మణులకు అగ్రహారాలు, భూములను దానం చేశారు. అగ్రహారాలు, దేవాలయ ప్రాంగణాలు సంస్కృత విద్యకు కేంద్రాలుగా ఉండేవి. 
* కర్ణాటక ప్రాంతంలోని సెలోర్గిలో త్రయిపురుష దేవాలయంలో ఉన్న పెద్ద కళాశాలలో 27 వసతి గృహాలు ఉన్నట్లు సెలోత్గి శాసనం పేర్కొంది.
* జైన, బౌద్ధ మతాలు మత విద్యను బోధించేవి. మాల్ఖేడ్, నాసిక్, పైఠాన్‌ నగరాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. 
* వేదాలు, వ్యాకరణం, జ్యోతిషం, సాహిత్యం, ధర్మశాస్త్రం, పురాణాలు మొదలైన విద్యలను అభ్యసించేవారు. 
* క్రీ.శ.779లో ధ్రువ మహారాజు ధూలియా శాసనాన్ని వేయించాడు. అందులో దాన గ్రహీతలు వేద, వేదాంగ, ఇతిహాస, పురాణ, వ్యాకరణ, మీమాంస, తర్క శాస్త్రాల్లో పండితులుగా ఉన్నట్లు పేర్కొంది. 
* సంస్కృత వ్యాకరణం సమస్త శాస్త్రాలకు మూలమని పేర్కొన్నారు. ధార్వాడ్‌ మండలంలోని భుజభేశ్వరాలయంలోని మఠానికి క్రీ.శ.975లో 50 మత్తరాల భూమిని దానంగా ఇచ్చారు. ఆ మఠంలో విద్యార్థులకు ఉచితంగా విద్య, ఆహారాన్ని అందించేవారు. ధార్వాడ్‌ మండలంలోని కౌలాస్‌ అగ్రహారంలో సంస్కృత విద్యాపీఠాన్ని ఏర్పాటు చేశారు. అందులో 200 మంది బ్రాహ్మణ కుటుంబాలు వ్యాకరణ, నీతి శాస్త్ర, సాహిత్య, పురాణ విద్యల్లో నిష్ణాతులుగా ఉండేవారు. 
* రాష్ట్రకూట రాజులు సంస్కృతం, కన్నడ భాషలను పోషించారు. రాజభాష సంస్కృతం. జైన వాజ్మయం రాష్ట్రకూట రాజ్యంలో విలసిల్లింది. హలాయుధుడు ‘కవిరహస్యం’ను మూడో కృష్ణుడి కాలంలో రచించాడు. ఇందులో సంస్కృత ధాతువుల వివరణ, కృష్ణమహారాజు ప్రశస్తి ఉంది. 
* అమోఘవర్షుడి గురువు జనసేనుడు. ఆదిపురాణ రచనను జనసేనుడు మొదలుపెట్టగా, మరో శిష్యుడైన గుణచంద్రుడు పూర్తిచేశాడు. ఆదిపురాణం జైనతీర్థంకరుల జీవిత చరిత్ర. 
* కన్నడ కవిత్రయంలో రెండోవారైన ‘పొన్న’ మూడో కృష్ణుడి ఆస్థానకవి. ఈయన శాంతి పురాణాన్ని రచించారు. 
* రాష్ట్రకూటులకు సామంతులైన వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో కన్నడ త్రయంలో మొదటి వారైన పంపకవి ఉండేవారు. ఆయన ‘ఆదిపురాణం’, ‘విక్రమార్జున విజయం’ గ్రంథాలను రచించారు. 
* సంస్కృత భాషలో మొదటి చంపూ (పద్య గద్య సంకలనం) కావ్యాన్ని త్రివిక్రమభట్టు రచించారు. ఈయన రాష్ట్రకూట రాజైన ఇంద్రుడి సమకాలీకుడు.


సామాజిక వ్యవస్థ
దక్షిణ భారతదేశంలో సామాజిక నిర్మాణం ప్రధానంగా శాస్త్రాల్లో పేర్కొన్న వర్ణాశ్రమధర్మం, చతుర్వర్ణాల విభజనను అనుసరించి ఉంది. మత, కర్మకాండల్లో బ్రాహ్మణులకు ఆధిక్యత ఉండేది. వారికి సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించారు. పన్నులతో నిమిత్తం లేకుండా రాజు నుంచి అగ్రహారాలు, బ్రహ్మదేయాలను దానాలుగా పొందారు. 
* రాష్ట్రకూటులు క్షత్రియుల్లో ‘సత్‌క్షత్రియులు’ అనే ఒక ప్రత్యేక ఉపతెగగా గుర్తింపు పొందారు. వైశ్యులు వర్తక, వ్యవసాయం పనులు చేసేవారు. వారిని ‘కోమట్లు’, ‘సేట్‌’లు అనే పేర్లతో పిలిచేవారు. 
* శూద్రులు ప్రధానంగా వ్యవసాయం, కూలీ, సైనికసేవ లాంటి వృత్తులు చేసేవారు. 
* క్రీ.శ.10వ శతాబ్దంలో రచించిన సాహిత్య గ్రంథం ‘యశస్థిలక’లో వెట్టిచాకిరీని వ్యతిరేకించారు. క్రీ.శ.11వ శతాబ్దంలో ఆంధ్రాలో ‘పంచాణం వారు’, తమిళనాడులో ‘ఇడంగై’ అనే వృత్తివిద్యల వర్గాలు ఏర్పడ్డాయి.
* వీరశైవం, ఆరాధ్యశైవం, శ్రీవైష్ణవం లాంటి నూతన మతోద్యమాలు ప్రారంభమయ్యాయి. భూస్వామ్య రైతులు వృత్తి తరగతుల వారిని పోషించారు.


వ్యాపార పరిస్థితులు
దక్షిణ భారతదేశంలోని తూర్పు, పశ్చిమ కోస్తాప్రాంతాలకు; పశ్చిమ ఆగ్నేయాసియా దేశాలకు మధ్య వ్యాపార సంబంధాలు ఉండేవి. వాటి గురించి గ్రీకు వ్యాపారి కాస్‌మస్‌ ఇండికాపీలెస్ట్స్‌ వివరించారు. మిరియాలు, యాలుకలు, ముత్యాలు ప్రధానంగా ఎగుమతి అయ్యేవి. 
* ‘మనిగారం’, ‘నానాదేశీయులు’, ‘తిస్సెవ ఆయుత్త పొన్నూరువర్‌’ లేదా ‘అయ్యవోలెపుర’, ‘500 స్వాములు’ అనేవి ఆ కాలంలో ప్రముఖ వర్తక సంఘాలు. వీరు భారతదేశంలోని అన్ని ప్రాంతాలను, పర్షియా, ఆగ్నేయాసియా దేశాలను సందర్శించారు. వీరు ప్రముఖ వర్తకుల న్యాయ సంరక్షకులు. ‘మనిగారం’ అనేది స్థానిక వర్తక సంఘం. ‘నగరం’ అంటే దక్షిణ భారతదేశంలో వ్యవస్థీకరించిన విక్రయ కేంద్రం.
* చైనా, శ్రీవిజయ దేశాలతో వ్యాపార లావాదేవీలు జరిగేవి. తూర్పు తీరంలో మహాబలిపురం, నాగపట్టణం, కావేరీపట్టణం, కృష్ణపట్టణం; పశ్చిమ తీరంలో చౌల్, సోప్రా, కాలికట్‌లు ప్రసిద్ధ రేవు పట్టణాలు.


వాస్తుకళ
రాష్ట్రకూటులు శిల్పకళకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వారు తమిళనాడు, కేరళ ప్రాంతాలను దిగువ ద్రావిడ దేశమని; ఆంధ్రా, కర్ణాటకలను ఎగువ ద్రావిడ దేశమని పిలిచేవారు. దిగువ ద్రావిడ దేశంలోని కట్టడాలను ‘ద్రావిడరీతి’ లేదా శైలిలో నిర్మించారు. ఎగువ ద్రావిడ దేశంలో కట్టిన దేవాలయాలు నగరరీతి వ్యాప్తికి చిహ్నాలుగా ఉండేవి. 
* రాష్ట్రకూటులు ఎల్లోరా గుహల్లో ఆలయాలను నిర్మించారు. దంతిదుర్గుడు మొదటి గుహలో దశావతార దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ నంది మండపం ప్రత్యేక నిర్మాణం. 
* ఎల్లోరాలోని 16వ గుహలో కైలాసనాథ ఆలయాన్ని మొదటి కృష్ణుడు నిర్మించాడు. ఈ ఆలయ గోడలు, కప్పుల కింది భాగం చిత్రలేఖనానికి ప్రసిద్ధిగాంచింది. 
* ముంబయి సమీపంలోని ఎలిఫెంటా గుహాలయాలు, పట్టడకల్‌లోని జైనదేవాలయం వీరి కాలానికి చెందినవే.


మాదిరి ప్రశ్నలు
1. రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు ఎవరు?
1) దంతిదుర్గుడు      2) నందిదుర్గుడు 
3) విక్రమార్కుడు      4) విక్రమాదిత్యుడు


2. 27 వసతిగృహాలు ఉన్న పెద్ద కళాశాలను ఏ శాసనంలో పేర్కొన్నారు?
1) మాన్యఖేట శాసనం           2) సతారా శాసనం 
3) సెలోత్గి శాసనం           4) కొల్హాపూర్‌ శాసనం


3. మాన్యఖేట నగరాన్ని నిర్మించి, దాన్ని రాజధానిగా చేసుకున్న పాలకుడు ఎవరు?
1) రెండో కృష్ణుడు                  2) అమోఘవర్షుడు 
3) రెండో గోవిందుడు            4) దంతిదుర్గుడు


4. కన్నడ భాషలో మొదటి అలంకార శాస్త్ర గ్రంథమైన కవిరాజ మార్గాన్ని రచించింది ఎవరు?
1) అమోఘవర్షుడు        2) జనసేనుడు   
3) శకటాయనుడు        4) పంప


5. కన్నడ కవిత్రయంలో రెండోవారైన పొన్న ఎవరి ఆస్థానంలో ఉండేవారు?
1) రెండో కృష్ణుడు         2) మూడో కృష్ణుడు 
3) ధ్రువుడు            4) అమోఘవర్షుడు


6. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయాన్ని నిర్మించింది ఎవరు?
1) దంతిదుర్గుడు           2) మొదటి గోవిందుడు 
3) మొదటి కృష్ణుడు        4) మూడో కృష్ణుడు


7. కింది ఏ గ్రంథంలో వెట్టిచాకిరీ వ్యవస్థను వ్యతిరేకించారు?
1) యశస్థిలక          2) కవిరాజ మార్గం 
3) రత్నావళి            4) విక్రమార్జున విజయం


8. ఎల్లోరాలోని దశావతార దేవాలయం ఎవరి కాలానికి చెందింది?
1) రాష్ట్రకూటులు            2) చాళుక్యులు 
3) విష్ణుకుండినులు         4) పల్లవులు


సమాధానాలు: 1-1;  2-3; 3-2; 4-1; 5-2; 6-3; 7-1; 8-1.

Posted Date : 10-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌