• facebook
  • whatsapp
  • telegram

రుగ్వేద, మలివేద యుగాలు

ఆర్య జీవన వేదం.. భారత సంస్కృతీ సౌధం!

 

 

గ్రామీణ జీవనం, ప్రకృతి ఆరాధన, వృత్తి ఆధారిత వర్ణాలు, సరళమైన ఆచారాలతో రుగ్వేద కాలం సాగింది. దురాచారాలు లేవు. వితంతు వివక్ష లేదు. వివాహం పవిత్రంగా ఉండేది. ఏకపత్నీవ్రతాన్ని ఆచరించారు. స్త్రీలకు పురుషులతో సమాన గౌరవం ఉంది. కానీ మలివేద కాలానికి విరుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్ణం దృఢమైన గోడగా మారిపోయింది. బాల్య వివాహాలు, బహుభార్యత్వం ప్రబలిపోయాయి. నిర్దిష్ట మతవిధానం రూపొందింది. అంతిమంగా ఆనాటి సమాజాల్లోని బహుముఖ దృక్పథాలు మిళితమై, సమున్నత భారతీయ సంస్కృతి ఆవిర్భవించింది. ఈ అంశాలు, పరిణామాలపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 



రుగ్వేద, మలివేద యుగాలు


క్రీ.పూ. 1500 నుంచి 600 వరకు వర్ధిల్లిన ఆర్య నాగరికత, సంస్కృతుల ప్రతిష్ఠాపనాకాలం ఒక సుదీర్ఘ ప్రయాణంగా సాగింది. కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ యుగాన్ని రుగ్వేద, మలివేద కాలాలుగా అధ్యయనం చేస్తారు. రుగ్వేద ఆర్యులు ప్రధానంగా పశుపోషణపై ఆధారపడిన సంచారజీవులు. మలివేద ఆర్యులు ఉత్తర భారతదేశంలో వ్యవసాయం చేపట్టి, స్థిరజీవనం ఏర్పరుచుకున్నారు. రెండు దశల్లో వారు సంచరించిన భౌగోళిక ప్రాంతాల్లో, రాజకీయ, సామాజిక, ఆర్థిక మత విశ్వాసాల్లో గొప్ప భిన్నత్వం ఉన్నప్పటికీ వారి సంస్కృతి, నాగరికత, జీవన విలువలు రెండు దశల్లోనూ ఒకే విధంగా ఉన్నాయి.


ఆర్యులు సంచరించిన భౌగోళిక ప్రాంతాలు:   ఆర్యులు సంచరించిన ప్రాంతాన్ని ‘సప్త సింధు ప్రాంతం’గా రుగ్వేదం పేర్కొంది. అది సింధు నది, దాని ఉపనదులు, సరస్వతి నదుల పరీవాహక ప్రాంతం. ఆధునిక అఫ్గానిస్థాన్‌లోని తూర్పు ప్రాంతం, భారత్, పాకిస్థాన్‌లలో విస్తరించిన పంజాబ్, హరియాణాలను సప్త సింధు ప్రాంతంగా చరిత్రకారులు నిర్ణయించారు. రుగ్వేద అనంతర వేదసాహిత్యం ప్రకారం ఆర్యులు తూర్పు వైపు ప్రయాణించి గంగా యమునా మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ‘ఆర్యావర్తం’లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. నేటి తూర్పు రాజస్థాన్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తర బిహార్‌ ప్రాంతాలే నాటి ఆర్యావర్తం అని చరిత్రకారులు నిర్ధారించారు.


వేదకాలం నాటి రాజకీయ పరిస్థితులు:  రుగ్వేద రాజ్యానికి మూలం పితృక్రమానుగత కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబ పెద్దను ‘కులాపా’ అని పిలిచారు. అనేక కుటుంబాలు ఒక గ్రామం. అనేక గ్రామాలు ఒక ‘విస్‌’. అనేక విస్‌లు కలిసి ఒక ‘జన’ అంటే తెగ లేదా సమూహం ఏర్పడింది. దీనికి ‘రాజన్‌’ అధిపతిగా ఉండి ధర్మకర్తగా విధులు నిర్వర్తించేవాడు. అతడికి సహాయం చేసేందుకు పురోహిత, సేనాని, గ్రామిణి ఉండేవారు. ఆర్య తెగల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ‘పరుషిణి’ నది ఒడ్డున ఆర్య తెగల మధ్య జరిగిన ‘దశరాజ గణ యుద్ధం’ను రుగ్వేదం ప్రస్తావించింది. తెగ రక్షణ, తెగ సంపద అయిన గోవుల రక్షణ, తెగ సంక్షేమం కోసం మత విధులు నిర్వర్తించడం రాజన్‌ విధులు. రాజన్‌ అధికారాలను నియంత్రించడానికి సభ, సమితి, విధాత, గణ అనే ప్రజాసభలు ఉండేవి. ఆనాటికి వ్యవస్థీకృత పన్నుల విధానం లేదు. రాజన్‌ విధుల నిర్వహణకు తెగలోని ప్రజలు ‘బాలి’ అనే స్వచ్ఛంద పన్ను చెల్లించేవారు.


క్రీ.పూ.900 నాటికి ఇనుము వాడకం మొదలవడం ఈ మహాప్రస్థానంలో ముఖ్య పరిణామం. ఈ లోహ పరిజ్ఞానం ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలపై పెద్ద ప్రభావం చూపింది. దృఢమైన ఇనుప పనిముట్లతో అడవులు నరికి అధిక భూమిని సాగులోకి తెచ్చారు. దీంతో అధికోత్పత్తి జరిగి, మిగులు ఉత్పత్తి వాణిజ్యానికి దారితీసింది. వ్యాపార కూడళ్లు ఏర్పడి పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. రాజన్‌ పన్నులు (భాగ) విధించడం ప్రారంభించడంతో అతడి వద్ద సంపద పెరిగింది. దాంతో సైన్యాన్ని, ఉద్యోగ బృందాన్ని పెంచాడు. మలి వేదకాలం సాహిత్యం రత్నిన్‌లు (మంత్రులు), భాగ దూగ (పన్నులు వసూలుచేసే అధికారి), సంగ్రహిత్రి (కోశాధికారి) లాంటి అనేక ఉద్యోగులను ప్రస్తావించింది. వ్యవసాయం అభివృద్ధి చెంది ఆర్యులు స్థిరనివాసం ఏర్పరచుకోవడంతో భూమితో అనుబంధం పెరిగింది. భూమి కోసం ఆర్య, ఆర్యేతర తెగల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. రాజు అశ్వమేధ, అనారంభ, వాజపేయి మొదలైన విస్తృత క్రతువులు నిర్వహించేవాడు. రాజు అధికారాలు పెరిగి ప్రజాసభలు నియంత్రణ కోల్పోయాయి. రాజ్యాలు పెద్దవి కావడంతో ప్రాంతీయ పాలన ప్రారంభమైంది. ఆ విధంగా రుగ్వేదకాలం నాటి తెగల రాజకీయ వ్యవస్థ, మలివేద కాలానికి గొప్ప రాచరిక వ్యవస్థగా మారింది.


సామాజిక పరిస్థితులు:  పితృక్రమానుగత కుటుంబవ్యవస్థ ఆర్య సమాజానికి మూలం. గోధుమ, బార్లీ, పాలు, పాలతో చేసిన పదార్థాలు, మాంసం, చేపలు ప్రజల ముఖ్య ఆహారాలు. నూలు, ఉన్నితో చేసిన వస్త్రాలను, వివిధ రకాల ఆభరణాలను ధరించేవారు. వివాహాన్ని పవిత్ర బంధంగా భావించేవారు. ప్రజలు సాధారణంగా ఏకపత్నీవ్రతులు. వితంతు వివాహాలను నిషేధించలేదు. పరదా వ్యవస్థ, బాల్యవివాహాలు, సతి వంటి దురాచారాలు లేవు. పురుషుడితో సమానంగా స్త్రీ నాటి ప్రజాసభల కార్యకలాపాల్లో పాల్గొనేది. స్త్రీలలో గొప్ప పండితులు ఉండేవారు. ఆపాల, విశ్వవర, ఘోష వంటి స్త్రీలు రుగ్వేదంలోని కొన్ని శ్లోకాలను సంకలనం చేశారు. రుగ్వేద ఆర్యులు నిరక్షరాస్యులు. ఆ కాలం నాటికి లిపి ఏర్పడలేదు. రుగ్వేద కాలంలో వృత్తి ప్రాతిపదికగా ఆర్య సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలతో కూడిన చాతుర్వర్ణ వ్యవస్థగా ఏర్పడింది. వృత్తి, వర్ణం మార్చుకునే వెసులుబాటు ఉండేది. అయితే మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ దృఢమైన గోడలు నిర్మించుకొంది. వర్ణం అనువంశికంగా మారింది. రుగ్వేద కాలంలో వృత్తికి వర్ణాన్ని నిర్ణయించగా, మలివేదకాలంలో పుట్టుక వర్ణాన్ని నిర్ణయించింది. మొదటి మూడు వర్ణాలను ‘ద్విజులు’గా పిలిచేవారు. వీరికి విద్యాభ్యాసానికి ముందు ఉపనయన ప్రక్రియ ఉంటుంది. వేద అభ్యసనమే నాటి ప్రధాన విద్య. ఇది ద్విజులకే పరిమితం. బాల్య వివాహాలు, పర్దా వ్యవస్థ, బహు భార్యత్వం వంటి ఆచారాలు అధికమయ్యాయి. వితంతు వివాహాలను నిరాకరించారు. రాజకీయ, ప్రజాసభల్లో స్త్రీ స్థానం కోల్పోయింది. వేదసాహిత్యం ఎనిమిది రకాల వివాహాలను గుర్తించి అందులో బ్రహ్మ, ప్రజాపత్య, దైవ, అర్స వివాహాలను ఆమోదించింది. అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహాలను తిరస్కరించింది. తెగల జీవన విధానం మలివేదకాలం చివరినాటికి సంక్లిష్ట వర్ణవ్యవస్థగా మారిపోయింది.


ఆర్థిక పరిస్థితులు: రుగ్వేద ఆర్యులు ప్రధానంగా గ్రామీణ జీవితం గడిపారు. ముఖ్య వృత్తి పశుపోషణ. వ్యవసాయం కూడా చేసేవారు. గోవులు వారి సంపద. ఆవు, ఎద్దు, గుర్రం, గాడిద, కుక్క వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. వడ్రంగం, చర్మకార, చేనేత, లోహపు పనులు వృత్తులుగా మారాయి. ప్రధానంగా కుండలు, ఆయుధాలు, రథాలు చేసేవారు. రుగ్వేద కాలంలో వ్యవసాయం పరిమితంగా ఉండేది. గోధుమ, బార్లీ ప్రధాన పంటలు. నువ్వులు, పత్తి కూడా పండించేవారు. ఆనాటి వ్యాపారాన్ని అనార్య జాతుల వారు నిర్వహించేవారు. వస్తుమార్పిడి విధానం అనుసరించేవారు. గోవు కూడా ద్రవ్య యూనిట్‌గా చెలామణి అయ్యేది. వెండి, బంగారం వంటి లోహాలను ‘ఆయాస్‌’ అని పిలిచేవారు. గుర్రాలు, ఎడ్ల బళ్లు, ఎద్దులు రవాణా సాధనాలు. మలివేద కాలంలో గోధుమ, బార్లీతో పాటు వరి కూడా ప్రధాన పంటగా మారింది. లోహ పరిజ్ఞానం పెరిగి ఇనుము వాడకం ఎక్కువైంది. వ్యవసాయాభివృద్ధి జరిగి ఆర్యులు, సంచార జీవితం వదిలి స్థిర జీవనానికి అలవాటు పడ్డారు. వ్యాపారాభివృద్ధితో అనేక వృత్తులు ఏర్పడి పట్టణాలు వెలిశాయి (హస్తినాపురం, అహిచ్ఛత్రం, తక్షశిల, కౌశాంబి మొదలైనవి).


మత పరిస్థితులు: రుగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులకు దైవత్వాన్ని ఆపాదించి ప్రార్థించారు. ఆ కాలంలో 33 మంది దేవతలను ఆరాధించారు. వీరిని రుగ్వేదం అంతరిక్ష దేవతలు (సూర్య, వరుణ), వాతావరణ దేవతలు (ఇంద్ర, రుద్ర), భూలోక దేవతలు (అగ్ని, పృథ్వి)గా వర్ణించింది. రుగ్వేద  దేవతల్లో ముఖ్యులు ఇంద్రుడు, అగ్ని, సోమ. ఈ కాలం నాటికి విగ్రహారాధన, ఆలయాలు లేవు. తొలి ఆర్యులు సంపద (గోవులు), సంతానం, ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థించారు. వీరి ఆరాధనలో ప్రార్థనలు, క్రతువులు ముఖ్య భాగం. ప్రకృతి శక్తుల ఆరాధనతో కూడిన సరళమైన మతవిధానం ఉండేది. మలివేద కాలంలో ఆర్యుల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు మత పరిస్థితులను ప్రభావితం చేశాయి. ఇంద్రుడు, అగ్ని, సోమ వంటి రుగ్వేద దేవతల స్థానంలో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వర) ప్రాధాన్యం పెరిగింది. క్రతువులు, యాగాలు, యజ్ఞాలు, కర్మకాండలు పెరిగాయి. గృహస్థు ఆచరించే సరళమైన ప్రార్థనల్లో సంక్లిష్ట తంతు ప్రవేశించింది. పురోహిత వర్గం ప్రాముఖ్యం పెరిగింది. మరణం తర్వాత ఏమిటనే ఆసక్తి పెరిగింది. ఆత్మ, పరమాత్మ, కర్మ, జన్మ, పునర్జన్మ వంటి విషయాలు ఆర్యుల ఆలోచనల్లో ప్రముఖ స్థానం ఆక్రమించాయి.  మోక్ష సాధన జీవిత లక్ష్యం అయ్యింది. దానిని సాధించడానికి కర్మ, తపస్య, జ్ఞాన మార్గాలు ఏర్పడ్డాయి. మలివేద కాల తత్వచింతన ‘షడ్దర్శనాలు’గా రూపొందింది. అవి 1) సాంఖ్య (స్థాపకుడు - కపిల) 2) యోగ (పతంజలి) 3) న్యాయ (గౌతమ) 4) వైశేషిక (కణాద) 5) పూర్వ మీమాంస (జైమిని) 6) ఉత్తర మీమాంస (బాదరాయణ). షడ్డర్శనాలు భారతీయ తత్వశాస్త్రానికి పునాదులు.

 


ప్రకృతి ఆరాధనతో కూడిన రుగ్వేద ఆర్యుల మత విధానం మలివేదకాలం చివరి నాటికి విభిన్న దృక్పథాలతో కూడిన ఒక నిర్దిష్ట మత విధానంగా పరిణామం చెందింది. భిన్న సంస్కృతీ స్రవంతులు, బహుముఖ దృక్పథాలు మిళితమై భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మహోన్నత భారతీయ సంస్కృతికి పునాదులు పడ్డాయి.

 ‘‘రుగ్వేద కాలంలో వృత్తి ప్రాతిపదికగా వర్ణాలు ఉండేవి. వృత్తిని, వర్ణాన్ని మార్చుకునే వెసులుబాటు ఉండేది.’’

‘‘మలివేద కాలం నాటికి చాతుర్వర్ణ వ్యవస్థ దృఢమైన గోడలను నిర్మించుకుంది. వర్ణం అనువంశికంగా మారింది. పుట్టుక వర్ణాన్ని నిర్ణయించింది.’’

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 14-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌