• facebook
  • whatsapp
  • telegram

సంఘ సంస్కరణోద్యమాలు

ఆనాటి సమాజంలో ఎన్నెన్నో దురాచారాలు.. సతీసహగమనం, బాల్యవివాహాలు, బహుభార్యత్వం, వితంతువులపై ఆంక్షలు, దేవదాసీ విధానం, అంటరానితనం.. ఇవన్నీ సమాజాన్ని పట్టి పీడిస్తుంటే వారి గుండె రగిలింది. కట్టుబాట్ల పేరుతో మహిళలు, అణగారిన వర్గాల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంటే.. అలాంటి దురాచారాలను రూపుమాపడానికి నడుం బిగించారు నాటి సంఘ సంస్కర్తలు. వీరి దృఢ సంకల్పానికి నాటి పాలకులు కూడా కొందరు గట్టి మద్దతు ఇవ్వడంతో చాలామేర సమాజంలో మార్పును తీసుకురాగలిగారు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, జ్యోతిబా ఫూలే తదితరులంతా ఈ సంఘసంస్కరణోద్యమ నిర్మాతలే.. ఇలాంటి మహానుభావులపై అధ్యయన సమాచారం పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం..
        స్వాతంత్య్రానికి పూర్వం సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలైన బాల్యవివాహాలు, బహుభార్యత్వం, సతీసహగమనం, దేవదాసీ విధానం, అంటరానితనం లాంటివాటిని రూపుమాపడానికి సంఘ సంస్కర్తలు ఎంతో కృషి చేశారు. కొందరు మొగల్, బ్రిటిష్ పాలకులు కూడా ఇలాంటి ఆచారాలకు వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశారు.. చర్యలు చేపట్టారు.. అక్బర్ చక్రవర్తి, పీష్వాలు సతీసహగమనంపై ఆంక్షలు విధించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ జనరల్స్ కారన్ వాలిస్, మింటో, లార్డ్ హేస్టింగ్స్‌లు నాటి ప్రజల సాంఘిక, ఆచార వ్యవహారాల్లో తలదూర్చరాదని భావించినా, సతీసహగమనాన్ని సమాజం నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టారు. ఈ దురాచారాన్ని ప్రోత్సహించడాన్ని, గర్భిణులు సతీసహగమనానికి పాల్పడటాన్ని నిషేధించారు. అలాగే 16 సంవత్సరాల లోపు వయసున్న వితంతువులు సతీసహగమనం చేయడాన్ని ఆపడం.. సతీసహగమనానికి సిద్ధం చేస్తున్న సమయాల్లో పోలీసులు హాజరై, బలవంతంగా ఆ దురాచారాన్ని జరపడాన్ని నిరోధించడం.. లాంటి చర్యల ద్వారా కొంత అడ్డుకట్ట వేయగలిగారు.
        రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా 1829లో అప్పటి వైస్రాయి విలియం బెంటింక్ సతీసహగమన నిషేధ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం మొదట్లో బెంగాల్ ప్రెసిడెన్సీకి మాత్రమే వర్తింపజేసినా, కొన్ని మార్పులతో 1830లో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల్లో కూడా అమలు చేశారు.
       బెంగాలీలు, రాజపుత్రుల్లో ఆడపిల్లలను చిన్నప్పుడే చంపేసే మరో దురాచారం ఉండేది. 1795లో రూపొందించిన బెంగాల్ రెగ్యులేషన్ - XXI చట్టం, 1804లో చేసిన రెగ్యులేషన్ చట్టం - III.. ద్వారా ఈ దురాచారాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించారు. 1870లో రూపొందించిన చట్టం పుట్టిన పిల్లల నమోదును తప్పనిసరి చేసింది.
     బ్రహ్మసమాజం వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించింది. పండిట్ ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాల కోసం పోరాడారు. ఆయన కృషి ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం 1856లో హిందూ వితంతు పునర్‌వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. విద్యాసాగర్ బాల్యవివాహాలను, బహుభార్యత్వాన్ని వ్యతిరేకించారు. స్త్రీ విద్య కోసం పాటుపడ్డారు.
      మహారాష్ట్రలోని డి.కె.కార్వే, ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు వితంతు పునర్‌వివాహాల కోసం కృషి చేశారు. ఈ లక్ష్యంతోనే వీరేశలింగం 1878లో 'రాజమండ్రి సాంఘిక సంస్కరణ సంస్థ'ను స్థాపించారు. కార్వే 1899లో పుణెలో వితంతు సదన్‌ను స్థాపించారు. 1916లో భారతదేశంలో మొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించారు. లోకహితవాదిగా ప్రసిద్ధి చెందిన గోపాల హరి దేశ్‌ముఖ్ మహారాష్ట్రలో సంఘ సంస్కరణలకు నడుం కట్టారు.
     మహదేవ గోవింద రనడే ప్రార్థన సమాజంలో ప్రముఖ సభ్యుడు. రనడే స్ఫూర్తితో గోపాల గణేష్ అగార్కర్ 1884లో పుణెలో దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించారు. రనడేను గోపాలకృష్ణ గోఖలే తన గురువుగా పేర్కొన్నారు. గోపాలకృష్ణ గోఖలే 1905లో బొంబాయిలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపింటచారు. మాతృభూమికి సేవ చేయడానికి వీలుగా భారతీయులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
      1872లో రూపొందించిన స్వదేశీ వివాహ చట్టం కనీస వివాహ వయసును బాలికలకు 14 ఏళ్లు, బాలురకు 18 ఏళ్లుగా నిర్ణయించింది. అయితే ఈ చట్టం హిందువులు, ముస్లింలు, ఇతర గుర్తింపు పొందిన మతాలవారికి వర్తించకపోవడంతో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది.
      పార్శీ సంఘ సంస్కర్త బి.ఎం.మలబారి కృషి వల్ల 1891లో ఏజ్ ఆఫ్ కన్సెన్ట్ యాక్ట్‌ను రూపొందించారు. ఈ చట్టం 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలకు వివాహం చేయడాన్ని నిషేధించింది.
     1849లో జె.ఇ.డి.బెత్యూన్ కలకత్తాలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో 35 బాలికల పాఠశాలలు స్థాపించారు.
     1833లో బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని నిషేధించారు. 1843లో భారతదేశంలో బానిసత్వాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించారు. 1860లో రూపొందించిన పీనల్ కోడ్ బానిస వ్యాపారాన్ని చట్ట విరుద్ధం చేసింది.
    సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో ముఖ్య సభ్యుడైన నారాయణ మల్హర్ జోషి 1911లో సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించారు. సామాన్య ప్రజలకు నాణ్యతతో కూడిన జీవితాన్ని, పనిని అందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ అనేక పాఠశాలలు, గ్రంథాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, బాలుర క్లబ్బులు, స్కౌట్లను స్థాపించింది. ఈ సంస్థలో మరో ముఖ్య సభ్యుడైన హృదయనాథ్ కుంజు అలహాబాద్‌లో 1914లో సేవాసమితి అనే సంస్థను స్థాపించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. విద్యావ్యాప్తి, సహకారం, పరిశుభ్రత, అణగారిన వర్గాల అభ్యున్నతి, నేరగాళ్లలో మార్పు తీసుకురావడానికి ఈ సంస్థ కృషి చేసింది.
    పాశ్చాత్య విద్యనభ్యసించిన దాదాభాయ్ నౌరోజీ, జె.బి.వాచా, ఎస్.ఎస్.బంగాలి, నౌరోజీ ఫిర్దోంజీ లాంటి పార్శీలు 1851లో 'రహనుమయి మజ్‌దయసనన్ సభ' అనే సంస్థను ప్రారంభించారు. పార్శీల సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం, జొరాస్ట్రియన్ మతాన్ని సంస్కరించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశాలు. వీరు రాస్త్‌గోఫ్తార్ అనే వారపత్రికను నడిపారు.
    రాజా రామ్మోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, జె.ఇ.డి.బెత్యూన్, కందుకూరి వీరేశలింగం, మహదేవ గోవింద రనడే, పడింత రమాబాయి, డి.కె.కార్వే లాంటివారు స్త్రీ విద్య, వారి అభ్యున్నతికి ఎంతో శ్రమించారు. కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్థిని పత్రికను స్థాపించారు. 1874లో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. 1878లో దేవదాసీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.
మహదేవ గోవింద రనడే, ఆయన భార్య రమాబాయి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. రమాబాయి వితంతువుల కోసం బొంబాయి, పుణె దగ్గర ముక్తి వద్ద శారదా సదన్‌ను ప్రారంభించారు. భారతదేశంలో మొదటిసారిగా వితంతువులకు విద్యను నేర్పించిన ఘనత ఆమెకే దక్కింది. ముస్లింలలో క్వాజా అల్తాఫ్ హుస్సేన్ అలీ, షేక్ మహమ్మద్ అబ్దుల్లా, బేగం రొకియా సఖావత్ హుస్సేన్ ముస్లిం బాలికల విద్య కోసం పాటుపడ్డారు.
    మాతాజీ మహారాణి తపస్వినిగా పేరుగాంచిన గంగాబాయి దక్కన్ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ మహిళ. ఆమె కలకత్తాలో స్థిరపడి 1893లో మహాకాళి పాఠశాలను ప్రారంభించారు.
     మద్రాసు ప్రెసిడెన్సీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మొదటి వితంతువు సిస్టర్ సుబ్బలక్ష్మి. సమాజంలో ఎవరూ పట్టించుకోని బాల వితంతువులను గొప్పవారిగా తీర్చిదిద్దాలని ఆమె భావించారు. మద్రాసు ప్రెసిడెన్సీలో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 22,000 మంది వితంతువుల కోసం వితంతు శరణాలయాలు, బాలికల పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలను స్థాపించారు. సుబ్బలక్ష్మి భారత మహిళల సంఘం, అఖిల భారత మహిళల సదస్సుల్లో కీలకపాత్ర పోషించారు. బాల్యవివాహాల నిరోధక బిల్లు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.
   పండిత రమాబాయి 'ఆర్య మహిళా సమాజ్‌'ను స్థాపించారు. పార్శీ మహిళలు స్త్రీ జర్తోస్తి మండల్‌ను; 1910లో అలహాబాద్‌లో సరళాదేవి చౌదరాని భారత్ స్త్రీ మహామండల్‌ను ప్రారంభించారు. ఐర్లాండుకు చెందిన స్త్రీవాద రచయిత్రి, దివ్యజ్ఞాన సమాజం సభ్యురాలు దొరోతి జన రాజదాస 1915లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు. అనిబిసెంట్ దీనికి మొదటి అధ్యక్షురాలయ్యారు. ఈ సంస్థ వయోజన స్త్రీలకు విద్య, దుస్తులు కుట్టడం, ప్రాథమిక చికిత్స లాంటివాటిలో శిక్షణ ఇవ్వడానికి అనేక కేంద్రాలను స్థాపించింది. 1917లో స్త్రీలకు ఓటుహక్కు ఇవ్వాలని కోరుతూ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగ్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. స్త్రీ ధర్మ అనే పత్రికను స్థాపించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఇండియా అనే సంస్థను 1925లో మెహ్రీబాయి టాటా స్థాపించారు.
   మార్గరెట్ కజిన్స్ కృషి ఫలితంగా 1927లో అఖిల భారత మహిళల సదస్సును ఏర్పాటు చేశారు. 1941లో రోష్నీ అనే పత్రికను ప్రారంభించారు. 1927లో మద్రాసు శాసనమండలికి ముత్తులక్ష్మీరెడ్డి తొలి మహిళా శాసన మండలి సభ్యురాలిగా నియమితులయ్యారు. దేశంలో వివిధ మహిళా సంఘాలు స్త్రీలకు ఓటుహక్కు ఇవ్వాలని డిమాండు చేశాయి. 1935 - భారత ప్రభుత్వ చట్టం మహిళలకు పరిమితంగా ఓటుహక్కును కల్పించింది.
పశ్చిమ భారతదేశంలో జ్యోతిరావ్ గోవిందరావ్ ఫూలే నిమ్నజాతుల కోసం పోరాడారు. ఆయన 1827లో పుణెలో జన్మించారు. జ్యోతిరావ్ 'మాలి' అనే కులానికి చెందినవారు. వీరి కుటుంబం పీష్వాలకు పూలు, దండలు సరఫరా చేయడంతో వీరు ఫూలేగా పేరుపొందారు.
   ఒకసారి బ్రాహ్మణ వివాహ ఊరేగింపులో పాల్గొన్న ఫూలేను వారంతా అవమానించారు. ఆయన నిమ్న కులాల స్త్రీల కోసం పాఠశాల నడపడాన్ని వారు వ్యతిరేకించి అడ్డుకోవడంతో పూలే ఆ పాఠశాలను మూసివేయాల్సి వచ్చింది.
ఆగ్రకులాల ఒత్తిడి వల్ల జ్యోతిబా, ఆయన భార్య ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మతం సాకుతో బ్రాహ్మణులు మిగతా కులాలవారిని అణిచివేశారని, బానిసలుగా మార్చారని జ్యోతిబా అభిప్రాయ పడ్డారు. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు బలహీనవర్గాల ప్రయోజనాలను పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. నిమ్న, వెనుకబడిన కులాల సంక్షేమం గురించి పట్టించుకోనంతవరకు కాంగ్రెస్‌ను జాతీయపార్టీగా పేర్కొనలేమని స్పష్టంగా చెప్పారు. 1873లో సత్య శోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు. సమాజంలో బలహీనవర్గాల వారికి సామాజిక న్యాయాన్ని అందించాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఫూలే 'గులాంగిరీ', 'స్వారజనిక్ సత్యధర్మ పుస్తక్' అనే రెండు గ్రంథాలను రచించారు. అంటరానివారు, బ్రాహ్మణేతర కులాల మధ్య వ్యత్యాసం లేదన్నారు. వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు వారి గ్రంథాల సహాయంతో సామాన్యులను తక్కువ కులానికి చెందినవారిగా ప్రకటించి వారిని దోపిడీ చేశారని జ్యోతిబా భావించారు. ఫూలే అన్ని కులాలకు చెందిన పిల్లలు, స్త్రీల కోసం అనేక పాఠశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించారు. 1876లో పుణె మున్సిపల్ కమిటీ సభ్యుడిగా ఫూలే ఎన్నికయ్యారు. 1888లో ఆయన్ని మహాత్మ బిరుదుతో సత్కరించారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితంగా 1894లో తమకు సైన్యంలో ఎక్కువ ఉద్యోగాలు, క్షత్రియ హోదాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌