• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక విద్యావ్యాప్తి

    ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుకుని బ్రిటిష్ కాలంలో భారత్‌లో విద్యాభివృద్ధి ఎలా సాగిందన్నది ఆధునిక చరిత్ర ప్రధానాంశాల్లో ఒకటి. 1813 చార్టర్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏటా లక్ష రూపాయలు కేటాయించడం విద్యారంగంలో కీలక పరిణామం.. అనంతర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యావ్యాప్తికి వివిధ కమిటీలను నియమించి అనేక మార్పులు తీసుకొచ్చింది. ఆంగ్లవిద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రధానాంశం. స్వాతంత్య్రానంతరం రాధాకృష్ణన్, కొఠారి కమిషన్లు మన దేశంలో విద్యకు వన్నెలద్ది ప్రగతిపథంలో పరుగులు తీసేందుకు బాటలు వేశాయి. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు విద్యారంగ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడం అవసరం.
భారత్‌లో 18వ శతాబ్దం నాటికి హిందూ, ముస్లిం విద్యా కేంద్రాలు కనుమరుగయ్యాయి. స్వదేశీ రాజుల పాలన అంతం కావడంతో విద్యా కేంద్రాలకు నిధుల సమస్య ఎదురైంది. 1784, ఫిబ్రవరి 21న వారన్ హేస్టింగ్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లకు రాసిన ఉత్తరంలో - ఉత్తర భారతదేశం, దక్కనులో విద్యాలయాల దుస్థితిని వివరించారు.
బెంగాల్ 1765లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం కిందకు వచ్చింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఇంగ్లండ్‌లో మాదిరిగా భారతదేశంలోనూ ప్రజలకు విద్యను అందించే బాధ్యత నుంచి వైదొలగాలని నిర్ణయించారు. ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే భారతీయ అధికారుల కోరిక మేరకు విద్యాభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపట్టారు. 1781లో వారన్ హేస్టింగ్స్ పర్షియన్, అరబిక్ భాషల అధ్యయనం కోసం కలకత్తాలో మదరసాను స్థాపించాడు. 1791లో బెనారస్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా పనిచేసిన జొనాథన్ డంకన్ హిందూ చట్టాలు, సాహిత్యం, మతానికి సంబంధించిన అధ్యయనాల కోసం ఒక సంస్కృత కళాశాలను స్థాపించాడు. 1784లో సర్ విలియం జోన్స్ మరో ముప్పైమందితో కలిసి 'ఆసియా' విషయాల అధ్యయనం కోసం 'ఏసియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు. అయితే 1829 వరకు ఇందులో భారతీయులకు ప్రవేశం కల్పించలేదు.

 

ఆంగ్ల భాషకే నిధులు
    క్రైస్తవ మిషనరీలు, మానవతావాదులు ఒత్తిడి తేవడంతో భారతదేశంలో ఆధునిక విద్యావ్యాప్తికి ఈస్ట్ ఇండియా కంపెనీ నడుం బిగించింది. 1813 చార్టర్ చట్టం విద్యాభివృద్ధికి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు కేటాయించింది. అయితే ఈ మొత్తాన్ని ఆధునిక పాశ్చాత్య విద్య కోసం ఖర్చు పెట్టాలా? లేదా భారతీయ విద్య కోసం ఖర్చు పెట్టాలా? అనే విషయంపై వాదోపవాదాలు జరిగాయి. ఈ చర్చలో పాల్గొన్న ఆంగ్లేయులు 1835లో ప్రాచ్యవాదులు, పాశ్చాత్యవాదులుగా విడిపోయారు. జేమ్స్ సూదర్‌లాండ్, జాన్ షేక్‌స్పియర్, జేమ్స్ ప్రిన్సెప్, హెన్రీ ప్రిన్సెప్‌లతో కూడిన ప్రాచ్య వర్గం అరబిక్, సంస్కృత భాషలకు ప్రాధాన్యం తగ్గించడం 1813 చట్టస్ఫూర్తికి విరుద్ధమని వాదించింది. డబ్ల్యూ.డబ్ల్యూ.బర్డ్, సి.బి.సౌండర్స్, జె.ఆర్.కాల్విన్, సి.ఇ.ట్రెవెల్యాన్‌లతో కూడిన పాశ్చాత్య వర్గం ఆంగ్ల భాషలో పాశ్చాత్య ఆధునిక విద్యను అందించడాన్ని బలపరిచింది. థామస్ బాబింగ్టన్ మెకాలే పాశ్చాత్యవాదులను సమర్థించారు. చివరికి అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ మెకాలే వాదనతో ఏకీభవించి విద్య కోసం కేటాయించిన నిధులన్నీ ఆంగ్ల భాషాభివృద్ధికే ఖర్చు చేయాలని నిర్ణయించాడు. మెకాలే ప్రతిపాదనను 1835, మార్చి 7న ఆమోదించి ఆంగ్లభాషను భారతదేశ అధికార భాషగా ప్రకటించారు.
1843-53 మధ్యకాలంలో ఉత్తర్‌ప్రదేశ్ (వాయవ్య రాష్ట్రం) లెఫ్టినెంట్ గవర్నరుగా పనిచేసిన జేమ్స్ థామ్సన్ ప్రాంతీయ భాషా మాధ్యమాలను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామాల్లో విద్యాభివృద్ధికి ప్రయత్నించాడు. విద్యాశాఖను ఏర్పాటు చేసి, భారతీయ పాఠశాలలను తనిఖీ చేయడం ద్వారా వాటిని అభివృద్ధి చేశాడు.

 

మాగ్నాకార్టా
     అప్పటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడిగా ఉన్న చార్లెస్ ఉడ్ ఒక తాఖీదును 1854లో రూపొందించాడు. తర్వాత అతడిని భారతదేశ మొదటి రాజ్య కార్యదర్శిగా నియమించారు. ఆ తాఖీదునే భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించి 'మాగ్నాకార్టాగా భావిస్తారు. ప్రజలందరికీ విద్యను అందించడం, స్త్రీ విద్య, ప్రాంతీయ భాషల అభివృద్ధి, లౌకిక విద్యకు ఇది ప్రాధాన్యం ఇచ్చింది. 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఈ తాఖీదును దశలవారీగా అమలు చేశారు. బొంబాయి, మద్రాసు, బెంగాల్, వాయవ్య రాష్ట్రం, పంజాబ్‌లలో 1855లో విద్యాశాఖలను ఏర్పాటు చేశారు. తర్వాత వివిధ విశ్వవిద్యాలయాలను స్థాపించారు.
 

హంటర్ కమిషన్
    డబ్ల్యూ.డబ్ల్యూ.హంటర్ 1882లో అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించింది. 1854 ఉడ్ తాఖీదు తర్వాత భారతదేశంలో జరిగిన విద్యాభివృద్ధిని సమీక్షించడం ఆ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం. కమిషన్‌ను అప్పటి వైస్రాయి లార్డ్ రిప్పన్ నియమించాడు. ప్రాథమిక విద్య అభివృద్ధికి సూచనలను, సలహాలను సిఫారసు చేయాల్సిందిగా ఈ కమిషన్‌ను కోరాడు. కొత్తగా ఏర్పాటు చేసిన స్థానిక సంస్థలకు (జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు) ప్రాథమిక విద్య నిర్వహణను అప్పగించాలని ఈ కమిషన్ సూచించింది. ప్రభుత్వం కొన్ని కళాశాలలు, సెకండరీ పాఠశాలలను మాత్రమే నిర్వహించాలని, మిగిలినవాటి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు వదిలి పెట్టాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం అమలు చేసింది.
 

 

భారత విశ్వవిద్యాలయాల చట్టం

1901 సెప్టెంబరులో లార్డ్ కర్జన్ విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయ ప్రతినిధులతో సిమ్లాలో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాడు. వైస్రాయి కార్యనిర్వాహక మండలిలో లా మెంబరు అయిన థామస్ ర్యాలీగ్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ కమిషన్‌ను నియమించారు.
 
ఈ కమిషన్ సిఫార్సుల మేరకు 1904లో భారత విశ్వవిద్యాలయాల చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని అనుసరించి విశ్వవిద్యాలయాలు బోధన బాధ్యతలను స్వీకరించాయి. అంతవరకు అవి పరీక్షల నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యేవి. విశ్వవిద్యాలయ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సిండికేట్లను నియమించారు. ఈ చర్యల వల్ల ఉన్నత విద్య నాణ్యత పెరిగింది. అయితే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణ పెరగడాన్ని జాతీయవాదులు తీవ్రంగా విమర్శించారు. 1910లో కేంద్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేశారు.
 

విద్యావిధానంపై తీర్మానం

   1906లో అభ్యుదయ భావాలు ఉన్న బరోడా రాష్ట్రం నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని పాటించాలని భారతీయ నాయకులు ఒత్తిడి చేశారు. 1910-13 మధ్య కాలంలో గోపాలకృష్ణ గోఖలే విధాన మండలిలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య బాధ్యతను తీసుకోవాలని గట్టిగా కోరారు. 1913, ఫిబ్రవరి 21న చేసిన తీర్మానం ప్రకారం ప్రభుత్వం నిర్బంధ విద్య సూత్రాన్ని తిరస్కరించింది. అయితే నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అంగీకరించింది. అలాగే పేదలకు ఉచిత విద్యను అందించడానికి అన్ని రాష్ట్రాలు సత్వర చర్యలు చేపట్టాలని కోరింది.
 

శాడ్లర్ కమిషన్ (1917-19)

చెమ్స్‌ఫర్డ్ కలకత్తా విశ్వవిద్యాలయ పనితీరును సమీక్షించడానికి శాడ్లర్ కమిషన్‌ను నియమించాడు. ఈ కమిషన్ సెకండరీ విద్య, సెకండరీ విద్యాబోర్డు నియంత్రణలో ఉండాలని, డిగ్రీ కోర్సు వ్యవధి మూడు సంవత్సరాలు ఉండాలని సిఫార్సు చేసింది. అనంతరం 1921 నాటికి భారతదేశంలో విశ్వవిద్యాలయాల సంఖ్య 12కు పెరిగింది. కొత్తగా బెనారస్, మైసూరు, పాట్నా, అలీగఢ్, ఢాకా, లక్నో, ఉస్మానియా విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఇదే సమయంలో గాంధీజీ, లాలాలజపతిరాయ్, అనిబిసెంట్ జాతీయ విద్య ఆవశ్యకతను గుర్తించారు. ప్రస్తుత విద్యావిధానం జాతీయవాద అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయదని వాదించారు. మాతృభూమిపై ప్రేమను పెంపొందించే విద్యావిధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడ్డారు. దీనికి అనుగుణంగా కాశీ విద్యాపీఠ్, జామియా మిలియా ఇస్లామియా, బీహార్ విద్యాపీఠ్ లాంటి జాతీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.
 

హార్టాగ్ కమిటీ నివేదిక
1928 మే లో సైమన్ కమిషన్.. సర్ ఫిలిప్ జోసెఫ్ హార్టాగ్ అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ఇండియాలో విద్య మరింతగా అభివృద్ధి చెందేందుకు గల అవకాశాలపై నివేదికను ఇవ్వాలని ఈ కమిటీని కోరింది. కమిటీ తన నివేదికలో - ప్రజలందరికీ విద్య నేర్పించే బాధ్యత ప్రధానంగా రాష్ట్రాలపై ఉంది. సెకండరీ విద్య పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఎక్కువమంది ఉత్తీర్ణులు కాకపోవడం ఇబ్బందికరంగా ఉంది. ప్రాథమిక విద్యావ్యవస్థలో మానవ వనరుల వృథా అధికంగా ఉంది. ఉపాధ్యాయుల జీతాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది - అని పేర్కొంది.
 

'బేసిక్' విద్యా విధానం
భారత ప్రభుత్వ చట్టం-1935 రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. 1937లో ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 7 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పరచింది. 1937లో గాంధీజీ తన 'హరిజన్ పత్రికలో బేసిక్ విద్య ఆవశ్యకతను వివరిస్తూ వరుసగా వ్యాసాలను ప్రచురించారు. 'కార్యక్రమాల ద్వారా నేర్చుకోవడం అనేది బేసిక్ విద్య సూత్రం. జాకీర్ హుస్సేన్ కమిటీ ఈ విధానంపై కసరత్తు చేసి సిలబస్‌ను రూపొందించింది. ఈ విధానంలో చేతితో వస్తువులను చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపాధ్యాయుల జీతం కోసం వినియోగిస్తారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం, కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా చేయడంతో ఈ విధానాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
 

సార్జంట్ విద్యాప్రణాళిక
1944లో కేంద్రీయ విద్యా సలహా బోర్డు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది. ఆ బోర్డుకు భారత ప్రభుత్వ విద్యా సలహాదారు సర్ జాన్ సార్జెంట్ అధ్యక్షుడు. ఈ ప్రణాళిక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలని, 6-11 ఏళ్ల వయసు వారికి సార్వత్రిక ఉచిత నిర్బంధ విద్యను అందించాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలలు.. సాధారణ విద్య; సాంకేతిక-వృత్తి విద్యను నేర్పేవి అని రెండు రకాలుగా ఉండాలని సిఫార్సు చేసింది. ఇంటర్మీడియట్ కోర్సును తొలగించి ఉన్నత విద్య, కళాశాల విద్యకు చెరో సంవత్సరం కలపాలని పేర్కొంది.
 

కొఠారి కమిషన్ (1964-66)
 డాక్టర్ డి.ఎస్.కొఠారి అధ్యక్షతన భారత ప్రభుత్వం 1964 జులైలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అన్ని స్థాయుల్లో విద్యాభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలను తెలియజేయాలని కమిషన్‌ను కోరింది.

 

కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు:
* అన్ని స్థాయుల్లో పని అనుభవం, సామాజిక సేవను ప్రవేశపెట్టాలి.
* నైతికవిద్యపై దృష్టి సారించాలి. సామాజిక బాధ్యతను పెంపొందించాలి.
* సెకండరీ విద్యలో వృత్తి విద్యను భాగం చేయాలి.
* అత్యున్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిమిత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి.
* పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* వ్యవసాయ విద్య, వ్యవసాయంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.

 

రాధాకృష్ణన్ కమిషన్

విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి తగిన సూచనలతో ఒక నివేదికను ఇవ్వాలని కోరుతూ.. భారత ప్రభుత్వం 1948 నవంబరులో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ 1949 ఆగస్టులో తన నివేదికను సమర్పించింది.
 

నివేదికలోని ప్రధాన విషయాలు
* పన్నెండు సంవత్సరాల విశ్వవిద్యాలయ పూర్వవిద్య.
* విశ్వవిద్యాలయాల పని దినాలు 180 రోజుల కంటే తక్కువ కాకూడదు. (పరీక్షలు జరిగే రోజులు మినహాయించి).
* పరీక్షా ప్రమాణాలను పెంపొందించి.. అన్ని విశ్వవిద్యాలయాల్లో పరీక్షా విధానం ఒకేలా ఉండాలి.
* విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యాపకుల జీతాలు పెంచాలి.
* దేశంలో విశ్వవిద్యాలయాల విద్యను పర్యవేక్షించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

 

ముఖ్యాంశాలు

* 1813-53 మధ్య బెంగాల్, బీహార్, మద్రాసు ప్రెసిడెన్సీలలో అనేక పాఠశాలలు, కళాశాలలను స్థాపించారు.
* 1844లో అప్పటి గవర్నర్ జనరల్ హార్డింజ్ ఆంగ్లవిద్యను అభ్యసించిన భారతీయులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాడు.
* 1919లో చేసిన మాంట్‌ఫర్డ్ (మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్) చట్టం ప్రకారం... మొదటిసారిగా విద్య భారతీయుల నియంత్రణలోకి వచ్చింది. ఫలితంగా అన్ని స్థాయుల్లో మునుపెన్నడూ లేని విధంగా విద్య అభివృద్ధి చెందింది.
* డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సు మేరకు 1953లో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ)ను ఏర్పాటు చేశారు. దీనికి పార్లమెంటు చట్టం ద్వారా 1956లో స్వయం ప్రతిపత్తి కల్పించారు.

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌