• facebook
  • whatsapp
  • telegram

గుప్త యుగం

   గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. గుప్త రాజ్య స్థాపకుడు మొదటి చంద్రగుప్తుడు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు లాంటి చక్రవర్తులు గుప్త రాజుల్లో ముఖ్యులు. చివరి గుప్త చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో హూణుల దండయాత్ర వల్ల గుప్త సామ్రాజ్యం పతనమైంది. గుప్తులకాలం భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరొందింది.
గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:
    1. పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు.
   2. సాహిత్య ఆధారాలు.


శాసనాలు
మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని 'మహారాజ' బిరుదుతో పేర్కొంది. స్కంధగుప్తుడి భిలారి శాసనం హూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని (సంధి విగ్రాహి) హరిసేనుడు వేయించాడు.
* ఎరాన్ శాసనం గుప్తుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలీ (దిల్లీ) ఉక్కు స్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి.
* గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే, మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు.


సాహిత్యం
   మొదటి చంద్రగుప్తుడి కాలంనాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలంనాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రాసిన 'నారదస్మృతి', 'బృహస్పతి స్మృతి' లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన 'దేవీ చంద్రగుప్తం' నాటకం రామగుప్తుడు శక రాజైన బసన చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జికుడు రచించిన 'కౌముదీ మహోత్సవం' గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన 'మూలకల్ప' గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీ.శ.672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చీ-లి-కిటో (శ్రీగుప్తుడు) అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన 'తిలస్య పన్నాటి' అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో-కువో-కి గ్రంథంలో వివరించాడు.


రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 375 - 415)

      ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి, వదిన ధ్రువాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ పాటలీపుత్రంలో మూడు సంవత్సరాలు, తామ్రలిప్తిలో రెండు సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో 'నవ రత్నాలు' అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి, ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతీ గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి, 'శకారి' అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనానియైన అమరకర దేవుడు బౌద్ధ మతాభిమాని. మంత్రి శబర వీరసేనుడు శైవ మతాభిమాని. దిల్లీలోని మెహరౌలీ ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే.
చివరి గుప్త చక్రవర్తులు

     మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కంధగుప్తుడు హూణుల దండయాత్రను తిప్పికొట్టాడు. కానీ స్కంధగుప్తుడు రాజైన తర్వాత హూణులు గుప్త రాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయ్యింది. ఇతడు హూణుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్త వంశం అంతమైంది.
 

పాలనా విశేషాలు
      గుప్తులు తమ సామ్రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. విషయపతి జిల్లాలకు (విషయాలకు) అధిపతిగా, భుక్తులకు ఉపరిక అధిపతిగా ఉండేవాడు. గ్రామాధిపతిని గ్రామైక అనేవారు. అయిదుమంది సభ్యులున్న నగరసభ విషయపతికి పరిపాలనలో తోడ్పడేది. గ్రామంలో ఉండే సభను పంచ మండలం సభ అనేవారు. చక్రవర్తి మంత్రి పరిషత్తు లేదా మంత్రి మండలి సహాయంతో పరిపాలించడం వల్ల మంత్రి మండలి నాయకుడిని మంత్రి ముఖ్యుడు అనేవారు. నైతిక, ధార్మిక విషయాల్లో పురోహితుడు కీలకపాత్ర పోషించేవాడు. రాష్ట్రాలకు (భుక్తులకు) యువ రాజులను అధిపతులుగా నియమించేవారు. వారిని 'కుమారామాత్య' అనేవారు. వీరు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేవారు. మొత్తంగా గుప్తుల కాలంలో పాలన వికేంద్రీకృత పాలనగా ఉండేది.


రెవెన్యూ పాలన
     గుప్తుల కాలంలో 1/6వ వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. పన్నులను నగదు రూపంలో చెల్లించేవారు. ఫాహియాన్ తన రచనల్లో ఎక్కువగా రాచరిక భూముల గురించి ప్రస్తావించాడు. బుద్ధగుప్తుడి పహాడ్‌పూర్ శాసనం భూమిపై ప్రభుత్వానికున్న ప్రత్యేక యాజమాన్యపు హక్కును వివరిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన భూమిని 'క్షేత్రం' అనేవారు. నివాసయోగ్యమైన భూమిని 'వస్తి' , అటవీ భూమిని 'అప్రహత' , పచ్చిక బయళ్లను 'గపధసార' , బంజరు భూములను 'ఖిలం' అని పేర్కొనేవారు.
భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ చేసే జిల్లా ప్రధాన కార్యాలయ అధిపతిని 'పుస్తపాల' అనేవారు. నాటి ప్రధాన న్యాయమూర్తి 'మహా దండనాయక'. ఆ కాలంలో విధించే శిక్షల గురించి ఫాహియాన్ తన రచనల్లో ప్రస్తావించాడు. మహా సేనాపతి, రణభండారిక లాంటి సైనికాధికారులు యుద్ధ సమయాల్లో ప్రధానపాత్ర పోషించేవారు. ఆ కాలంలో  యుద్ధ ఆయుధాల గురించి అలహాబాద్ శాసనంలో ప్రస్తావన ఉంది. ప్రత్యేక యుద్ధమండలి కూడా ఉండేది.  పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండటం గొప్ప విషయం. మంత్రి మండలికి, చక్రవర్తికి మధ్య సంధాన కర్తగా 'కంచుకి' అనే ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించేవాడు.


ఆర్థిక విషయాలు
    గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి 'పహాడ్‌పూర్' శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను (అగ్రహారాలు) దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలందా, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను 'ఉక్కకల్ప' మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను 'దేవాగ్రహారాలు' అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పుళిందభట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా రెండు గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి.
  రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్ఛ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్థవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది.


సాంఘిక, మత పరిస్థితులు
   వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఛండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాసీ ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం/ హిందూమతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు 'పరమ భాగవత' అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజ చిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. స్కంధగుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి, వామనుల కథనాన్ని వివరించారు. మౌఖరీ వంశస్థుడైన అనంతవర్మబారాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహ అవతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఎరాన్‌లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు.


రాజకీయ చరిత్ర
    గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీ గుప్తుడిని చిలికిత (చీ-లీ-కిటో) మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోద్గజ గుప్తుడు 'మహారాజు' బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్ఛవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. 'రాజాధిరాజ' బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీ.శ.335 - 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి, సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది.
     హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి, వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగి రాజు హస్తివర్మ (శాలంకాయన రాజు), కంచి పాలకుడు విష్ణుగోపుడు (పల్లవ రాజు) ముఖ్యమైనవారు.
     ఆంగ్ల చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని కీర్తించాడు. 'కవిరాజు', 'అశ్వమేధ యోగి' లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతినాగ, అచ్యుతనాగ, లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుడిని ఓడించి, అశ్వమేధ యాగం చేసి 'అశ్వమేధ యోగి' బిరుదు పొందాడు. ఇంకా అయిదు సరిహద్దు రాజ్యాలను, తొమ్మిది ఆటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు, శక రాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు, రెండో చంద్రగుప్తుడు బసనను, రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది.


నాణేలు
     గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. వీరు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్ర గుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి, 'అశ్వమేధ యోగి' బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను 'దీనార్', 'కారా', 'సువర్ణ' అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై 'మహా రాజాధిరాజ శ్రీచంద్రగుప్త' అనే బిరుదును ముద్రించారు. గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించింది రెండో చంద్రగుప్తుడే. రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమభాగవత, మహారాజాధిరాజు బిరుదులను, మరో వైపు గరుడి (గద్ద) బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు.

 

గుప్త యుగం - సాంస్కృతిక వికాసం

* భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. హిందూమత పునరుద్ధరణ, భాషా, సాహిత్యాల వికాసం, వాస్తు, కళారంగాలు, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లాంటి కారణాల వల్ల గుప్త యుగాన్ని స్వర్ణయుగం అంటారు.
* కాళిదాసు సంస్కృత భాషలో గొప్ప రచనలు చేసి, 'ఇండియన్ షేక్‌స్పియర్‌'గా పేరొందాడు. ఇతడు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, విక్రమోర్వశీయం, మేఘసందేశం, కుమార సంభవం లాంటి రచనలు చేశాడు.
* గుప్తుల కాలంలో అధికార భాష సంస్కృతం.
* వసుబంధు అనే బాస మహాకవి 'స్వప్న వాసవదత్త' అనే గ్రంథాన్ని రాశాడు.
* వాత్సాయనుడు కామసూత్రాలను రచించాడు.
* శూద్రకుడు మృచ్ఛకటికం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నాటి పట్టణ జీవితాన్ని వర్ణించాడు.
* విశాఖదత్తుడు దేవీచంద్రగుప్తం, ముద్రా రాక్షసం అనే గ్రంథాలను రచించాడు.
* అమరసింహుడు తొలి సంస్కృత భాషా నిఘంటువుగా పేరొందిన 'అమరకోశం' అనే గ్రంథాన్ని రాశాడు.
* పాలకవ్యుడు హస్తాయుర్వేదం అనే పశు వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.
* కామందకుడు రచించిన నీతిశాస్త్రం గుప్తుల అర్థశాస్త్రంగా పేరొందింది.
* బెంగాల్‌కు చెందిన చంద్రగోమియా 'చంద్ర వ్యాకరణం' గ్రంథాన్ని రాశాడు.
* రామచంద్రుడు అనే కవి 'నాట్య దర్పణం' గ్రంథాన్ని రచించాడు.
* రామాయణాన్ని జైనమతానికి అనుగుణంగా రచించింది విమలుడు.
* దివాకరుడు అనే కవి న్యాయవర్త, సమ్మతి తర్కసూత్ర అనే గ్రంథాలు రాశాడు.
* పాణిని అష్టాధ్యాయి గ్రంథాన్ని, పతంజలి మహాభాష్యం అనే వ్యాఖ్యానాన్ని రాశారు.
* గుప్తుల కాలంలో ప్రాకృత భాషను శూరసేన (మగధ ప్రాంతం), అర్ధమగధి (బుందేల్‌ఖండ్ ప్రాంతం), మగధి (బిహార్ ప్రాంతం) లాంటి పేర్లతో పిలిచేవారు.
* వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు (వైద్యశాస్త్ర గ్రంథం).
* నవరత్నాలు - కాళిదాసు, శంఖువు, బేతాళభట్టు, ఘటకర్పరుడు, అమర సింహుడు, వరాహమిహిరుడు, వరరుచి, ధన్వంతరి, క్షహరాటుడు.


శాస్త్ర విజ్ఞానం
* గుప్తుల కాలంలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంనాటి గొప్ప గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట.
* ఆర్యభట్ట రచనలు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం, లఘు జాతకం. సూర్య సిద్ధాంతం గ్రంథంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటానికి కారణాలు వివరించారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పారు.
* వృత్త పరిధికి, వృత్త వ్యాసానికి సరైన π నిష్పత్తిని 22/7 గా చెప్పింది ఆర్యభట్టు.
* వరాహమిహిరుడు 'బృహత్ సంహిత' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని గుప్తుల కాలంనాటి విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు.  వరాహమిహిరుడు పంచ సిద్ధాంతిక, బృహత్ జాతక లాంటి ఇతర రచనలు కూడా చేశాడు.
* భూమికి ఆకర్షణ శక్తి ఉందని గుప్తుల కాలంలోనే చెప్పిన బ్రహ్మగుప్తుడు 'ఇండియన్ న్యూటన్‌'గా పేరొందాడు.  (ఖండఖాద్యక, బ్రహ్మస్ఫుటక సిద్ధాంతం అనేవి ఈయన రచనలు)
* వివిధ మందులు, ఔషధాల తయారీ విధానం గురించి వివరిస్తున్న గ్రంథం 'నవనీతకం'.
* గుప్తుల కాలంలో గొప్ప ఆయుర్వేద వైద్యుడిగా పేరొందింది ధన్వంతరి.
* ''శుశృత సంహిత'' అనే శస్త్ర చికిత్స గ్రంథాన్ని శుశృతుడు రచించాడు.
* వజ్జిక అనే రచయిత 'కౌముది మహోత్సవం' అనే గ్రంథాన్ని రాశాడు.
* గుప్తుల కాలంలో శబరుడు అనే వ్యక్తి సాంఖ్య, యోగ లాంటి దర్శనాలపై వ్యాఖ్యలు రాశాడు


గుప్తుల కాలంనాటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలు
* నాచన్ కుటారా - పార్వతీదేవి దేవాలయం
* భూమ్రా - శివాలయం, మధ్యప్రదేశ్
* దేవఘడ్ - దశావతార దేవాలయం, మధ్యప్రదేశ్
* టిగావా - విష్ణు దేవాలయం, మధ్యప్రదేశ్
* బిట్టర్‌గావ్ - ఇటుకల దేవాలయం, ఉత్తర్ ప్రదేశ్
* దశావతార దేవాలయ గోడలపై రామాయణ, మహాభారత గాథలను శిల్పాలుగా చెక్కారు.
* ఉదయగిరి గుహాలయం (ఒడిశా) వద్ద వరాహ విగ్రహాన్ని చెక్కారు.
* గ్వాలియర్ సమీపంలోని పవాయి వద్ద నాట్యగత్తె, సంగీతకారిణుల విగ్రహాలు లభించాయి.
* సుల్తాన్‌గంజ్‌లో బుద్ధ విగ్రహం (కంచుతో తయారు చేసింది) ఏడున్నర అడుగుల పొడవుతో లభించింది.
* నలందాలో 18 అడుగుల ఎత్తున్న బుద్ధుడి రాగి విగ్రహం లభించింది.
* వారణాసిలో కార్తికేయ శిల్పాలు లభించాయి.
* గుప్తుల కాలంనాటి ముద్రలు ఎక్కువగా వైశాలిలో లభించాయి.
* గుప్తుల కాలంనాటి బుద్ధుడి శిల్పాలు 'తౌమ బుద్ధులు'గా పేరొందాయి.
* నాటి శిల్పాలను ఎక్కువగా చూనార్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో చెక్కారు.
* సారనాథ్ మ్యూజియంలో బుద్ధ విగ్రహం (సారనాథ్ బుద్ధుడు) యోగిముద్రలో ఉంటుంది.
* అజంతా, బాగ్ గుహల్లో గుప్తుల కాలంనాటి చిత్రలేఖనాలు లభించాయి.
* అజంతా 16వ గుహలోని 'మరణశయ్యపై రాకుమార్తె' చిత్రం గుప్తుల కాలానిదే.
* గుప్తుల శిల్పకళ మహోన్నతి పొందిన హైందవ శిల్పకళ అని విన్సెంట్ స్మిత్ పేర్కొన్నారు.
* 23 అడుగుల 8 అంగుళాల పొడవున్న మెహరౌలీ ఉక్కు స్తంభం (దిల్లీ) ఇప్పటికీ తుప్పుపట్టలేదు.
* ''బిట్టర్‌గావ్ దేవాలయ శిల్ప నిర్మాణం సుదీర్ఘ సంప్రదాయానికి ప్రతీకగా ఉంది'' అని పెర్సీబ్రౌన్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.


హర్షవర్ధనుడు
* గుప్తుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్ధనుడు.
* హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినవాడు. ఇతడి రాజధాని స్థానేశ్వరం.
* హర్షుడి తండ్రి ప్రభాకరవర్ధనుడు. తల్లి యశోమతి దేవి. సోదరుడు రాజ్యవర్ధనుడు. సోదరి రాజ్యశ్రీ.
* పుష్యభూతి వంశీకుల పాలన గురించి వివరిస్తున్న శాసనాలు మధుబన్, బాన్స్‌ఖేరా.
* మధుబన్ శాసనం ప్రకారం ప్రభాకరవర్ధనుడు పరమభట్టారక, మహారాజాధిరాజు అనే బిరుదులతో పాలించాడని తెలుస్తోంది.
* బాణుడి హర్షచరిత్రలో ప్రభాకరవర్ధనుడు హూణుల హరిణాలకు (జింకలకు) సింహం లాంటి వాడని పేర్కొన్నారు.
* యశోమతీదేవి భర్తతో సతీసహగమనం చేసింది.
* రాజ్యశ్రీని కనోజ్ పాలకుడైన గ్రహవర్మకు ఇచ్చి వివాహం జరిపించారు.
* గ్రహవర్మ, అతడి మిత్రుడు గౌడ శశాంకుడు కుట్రచేసి రాజ్యవర్ధనుడిని చంపారు.
* హర్షుడు అస్సాం/ కామరూప పాలకుడు భాస్కరవర్మ సహాయంతో గ్రహవర్మ, గౌడ శశాంకుడిని ఓడించాడు.
* మాళ్వారాజు దేవగుప్తుడు గ్రహవర్మను చంపి, కనోజ్‌ను ఆక్రమించాడు.
* హర్షుడు సోదరిని రక్షించి, కనోజ్ పాలకురాలిగా నియమించాడు.
* కనోజ్ ప్రజల కోరిక మేరకు హర్షవర్ధనుడు క్రీ.శ.606లో శీలాదిత్య బిరుదుతో స్థానేశ్వరం, కనోజ్‌లను కలిపి పట్టాభిషేకం చేసుకున్నాడు.
* హర్షుడి పాలనాకాలం క్రీ.శ.606 - 647
* హర్షుడి కాలంలో హుయాన్‌త్సాంగ్ అనే చైనా యాత్రికుడు అతడి రాజ్యాన్ని సందర్శించాడు.
* హుయాన్‌త్సాంగ్ రచన 'సియుకి'.
* హుయాన్‌త్సాంగ్ యాత్రికుల్లో రాజు (కింగ్ ఆఫ్ పిలిగ్రిమ్స్)గా పేరొందాడు.
* హర్షుడి బిరుదులు శీలాదిత్య, రాజపుత్ర.
* హర్షుడిని నర్మదా నది యుద్ధంలో ఓడించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి.
* రెండో పులకేశి ఐహోలు శాసనంలో హర్షుడిని సకలోత్తర పథేశ్వరుడు అనే బిరుదుతో ప్రస్తావించడం కనిపిస్తుంది.
* హర్షుడు మహామోక్ష పరిషత్, కనోజ్ పరిషత్తులను నిర్వహించాడు.
* ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తన సంపదనంతా పేదలకు పంచే కార్యక్రమమే 'మహామోక్ష పరిషత్'. దీన్నే 'ప్రయాగ పరిషత్' అంటారు.
* హర్షుడు మొత్తం ఆరు మహామోక్ష పరిషత్‌లు నిర్వహించాడు. 6వ పరిషత్‌కు హుయాన్‌త్సాంగ్ హాజరయ్యాడు.
* హర్షుడు కనోజ్‌లో హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన సర్వమత సమావేశాన్ని నిర్వహించాడు. దీన్నే 'కనోజ్ పరిషత్' అంటారు.
* హర్షుడు తన రాజ్యాన్ని భుక్తులు, విషయాలు, పథక గ్రామాలుగా విభజించాడు.
* వల్లభి రాజ్య రాజు రెండో ధ్రువసేనుడిని హర్షుడు ఓడించినట్లు నౌశాసితామ్ర ఫలకం (శాసనం) తెలియజేస్తోంది.
* యుద్ధభూమిలో చక్రవర్తే సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. చక్రవర్తికి పాలనలో సహాయపడటానికి సచివులు/అమాత్యులు అనే మంత్రులను నియమించేవారు.
* హర్షుడి ప్రధానమంత్రి పేరు 'భండి'.
* యుద్ధమంత్రి - మహాసంధి విగ్రహాధికృత, సైన్యాధికారి - మహాబలాధికృత.
* గజబలాధ్యక్షుడు - కాటుక, విదేశీ కార్యదర్శి - రాజస్థానీయ.
* హర్షుడి కాలంలో రాష్ట్రాలను భుక్తులు అని, జిల్లాలను విషయాలు అని పిలిచారు.
* భుక్తి అధిపతిని ఉపరిక/గోస్త్రీ అని పిలిచేవారు.
* నాడు రహదారులు క్షేమంగా లేవని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.630లో భారతదేశానికి వచ్చి 15 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. (సి-యు-కి అంటే పశ్చిమ ప్రపంచ ప్రతులు)
* హర్షుడు యుద్ధం, శాంతి కళల్లో సమాన ప్రతిభ కలిగి ఉన్నాడని ఆర్.సి. మజుందర్ పేర్కొన్నారు.
* నాటి కాలంలో మగధ వరి పంటకు ప్రసిద్ధి చెందింది.
* నాడు భూమి శిస్తు పంటలో 1/6వ వంతు ఉండేది. భూమి శిస్తును 'ఉద్రంగ' అనేవారు. భూమి శిస్తు కాకుండా మరో 18 రకాల పన్నులు వసూలు చేసేవారు.
* హర్షుడు వివిధ స్థాయుల్లో పన్ను వసూలు కోసం ఆయుక్త, భోజక, ద్రువాధికరణ, గౌల్మిక లాంటి అధికారులను నియమించాడు.
* గ్రామంలో పన్ను వసూలు కోసం అక్షపటలిక, కరణిక్ అనే ఉద్యోగులను నియమించాడు.
* వస్తువు బరువు ఆధారంగా 'తుల్యమేయ' పేరుతో అమ్మకం పన్నును వసూలు చేసేవారు.
* భారతదేశంలో వ్యవసాయ రంగంలో తొలిసారిగా నీటివేగంతో నడిచే తులాయంత్రాలను ప్రవేశపెట్టింది హర్షుడే.
* హర్షుడి కాలంలో మౌఖరీ వంశీయులు వల్లభి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేశారు.
* హర్షుడు నలందా విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసినట్లు హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు.
* హర్షుడి ఆస్థానకవి బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు.
* హర్షుడు సంస్కృత భాషలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శి లాంటి గ్రంథాలు రాశాడు.
* సుభాషిత శతకం - భర్తృహరి, సూర్యశతకం - మయూరుడు. వీరు హర్షుడి ఆస్థానంలో ఉండేవారు.
* హుయాన్‌త్సాంగ్ క్రీ.శ.645లో ఉదిత అనే సహాయకుడితో చైనా చేరాడు.
* గౌడ శశాంకుడు వంగ, మగధ, ఒరిస్సాలను 'మహారాజాధిరాజ' బిరుదుతో పాలించినట్లు గంజాం శాసనం తెలుపుతోంది.
* నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాన్ని 'ధర్మఘంజ్' అనేవారు.
* ధర్మపాల, ఆర్యదేవ, శీలభద్ర లాంటి ఆచార్యులు నలందా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
* స్థిరమతి, గుణమతి లాంటి ఆచార్యులు వల్లభి విశ్వవిద్యాలయంలో పనిచేశారు.


వాస్తు, కళారంగాలు
* గుప్తుల కాలంనాటికి నగర, ద్రవిడ శైలులు రూపాంతరం సంతరించుకున్నాయి.
* గుప్తుల వాస్తు నిర్మాణంలో ప్రధానమైనవి గుహాలయాలు, దేవాలయాలు, స్తూపాలు.
* మహారాష్ట్రలోని అజంతా గుహలు, మధ్యప్రదేశ్‌లోని బాగ్ గుహలు గుప్తుల కాలంలోనే అభివృద్ధి చెందాయి.
* గుప్తుల కాలంలో సారనాథ్ (ఉత్తర్ ప్రదేశ్), రత్నగరి (ఒడిశా), మీర్‌పూర్‌ఖాన్ (సింధు) ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు.
* మధ్యప్రదేశ్‌లోని భూమ్రాలో శివాలయాన్ని నిర్మించారు.

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌