• facebook
  • whatsapp
  • telegram

పంచాయతీరాజ్‌ వ్యవస్థ - రాజ్యాంగ భద్రత

 

సుపరిపాలనకు.. సుస్థిర ప్రగతికి!

 

పాలనలో ప్రజలను ప్రత్యక్షంగా భాగస్వాములను చేసే లక్ష్యంతో, గ్రామాలకు సాధికారతను సమకూర్చే ఉద్దేశంతో, అధికార వికేంద్రీకరణ ప్రధానంగా ఒక విశిష్ట వ్యవస్థ ఆవిర్భవించింది. దానికి రాజ్యాంగ భద్రతను కల్పించారు. పాలకుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు, పల్లె సీమల్లో సుస్థిరాభివృద్ధిని, సుపరిపాలనను నెలకొల్పేందుకు ఆ వ్యవస్థ దోహదపడుతోంది. ఇండియన్‌ పాలిటీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు దాని పూర్వాపరాలు, రాజ్యాంగ సవరణ చట్టంతో అందులో వచ్చిన మార్పుల వివరాలను తెలుసుకోవాలి. 

 

 

స్థానిక స్వపరిపాలనా సంస్థలు సమర్థంగా పనిచేయాలంటే వాటికి రాజ్యాంగ భద్రత అవసరం. రాజ్యాంగం ద్వారా నిర్దిష్ట నియమాలను రూపొందించి, తగిన అధికారాలు, విధులు, ఆర్థిక వనరులను అందిస్తే గ్రామాల పాలన సక్రమంగా సాగుతుంది. గ్రామీణుల ఆకాంక్షలు నెరవేరతాయి. ఈ మహోన్నత లక్ష్య సాధన దిశలో స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు విశేష కృషి జరిగింది.

 

గాంధీజీ భావనలు

గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని, భారతదేశ ప్రగతికి గ్రామాలే పట్టుగొమ్మలని, పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంపొందించాలని గాంధీజీ సూచించారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామం స్వయంసమృద్ధితో, చిన్న చిన్న ‘రిపబ్లిక్‌’ల తరహాలో వర్ధిల్లేవని పేర్కొన్నారు.

* గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పరిపాలనా వికేంద్రీకరణ జరగాలని, స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రాధాన్యాన్ని వివరిస్తూ శ్రీమన్నారాయణ్‌ అగర్వాల్‌ ‘గాంధీ ప్లాన్‌’ను ప్రతిపాదించారు.

* 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగం నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 40 ‘గ్రామ పంచాయతీల’ ఏర్పాటును పేర్కొంటుంది. వీటిద్వారా పరిపాలనా వికేంద్రీకరణ జరిగి, ప్రజల భాగస్వామ్యం పెంపొందుతుందని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.

* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను పొందుపరిచారు. స్థానిక స్వపరిపాలనా సంస్థల ఏర్పాటు బాధ్యతను రాష్ట్ర జాబితాలో చేర్చారు.

 

రాజ్యాంగ భద్రత ప్రయత్నాలు

ఎల్‌.ఎం.సింఘ్వీ, పి.కె.తుంగన్‌ కమిటీల సిఫార్సు మేరకు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించేందుకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును లోక్‌సభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించింది. కానీ రాజ్యసభలో బిల్లు వీగిపోవడంతో చట్టరూపం దాల్చలేదు. * విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ (వీపీ సింగ్‌) ప్రభుత్వ కాలంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు 70వ రాజ్యాంగ సవరణ బిల్లును 1990, సెప్టెంబరు 7న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కానీ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో బిల్లు వీగిపోయింది.

పీవీ హయాంలో సాకారం:  పీవీ నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 1992, డిసెంబరు 22న ఈ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. దీనికి దేశంలో 17 రాష్ట్రాల శాసనసభలు కూడా అంగీకారం తెలిపాయి. ఈ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ 1993, ఏప్రిల్‌ 20న ఆమోదముద్ర వేయడంతో 73వ రాజ్యాంగ సవరణ, చట్టం (1992)గా మారి 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ‘ఏప్రిల్‌ 24’ను ఏటా జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

 

73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992

పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 ద్వారా రాజ్యాంగంలో రెండు ప్రధాన మార్పులు జరిగాయి.1) రాజ్యాంగానికి 9వ భాగాన్ని చేర్చారు. అందులో ఆర్టికల్స్‌ 243, 243(A) నుంచి 243(O) వరకు (మొత్తం 16 ఆర్టికల్స్‌) పంచాయతీరాజ్‌ వ్యవస్థ విధివిధానాలను సమగ్రంగా నిర్దేశించారు. 2) రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 243: పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సంబంధించిన నిర్వచనాల గురించి వివరిస్తాయి. వీటిని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా వెలువరిస్తారు. 

ఆర్టికల్‌ 243 (ఎ)- గ్రామసభ: గ్రామ పంచాయతీ పరిధిలోని రిజిస్టరైన ఓటర్లందరూ ‘గ్రామసభ’లో సభ్యులవుతారు. గ్రామసభ సమావేశాలకు సర్పంచి అధ్యక్షత వహిస్తారు. సర్పంచి అందుబాటులో లేకపోతే ఉపసర్పంచి అధ్యక్షత వహిస్తారు. గ్రామసభ సమావేశాలను సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు.

* గ్రామసభ సమావేశాలను సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్‌ 14, అక్టోబరు 3) తప్పనిసరిగా నిర్వహించాలి. అందులో విఫలమైతే ‘సర్పంచి’ తన పదవిని కోల్పోతారు. అలా పదవి కోల్పోయిన వ్యక్తికి సంవత్సరం పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు ఉండదు.* గ్రామసభ సభ్యుల్లో కనీసం 50 మంది లేదా కనీసం 10 శాతం మంది గ్రామసభ ఏర్పాటు చేయాలని లిఖితపూర్వకంగా కోరితే ‘సర్పంచి’ తప్పనిసరిగా సమావేశం ఏర్పాటు చేయాలి. * భారత ప్రభుత్వం 2009-10 సంవత్సరాన్ని గ్రామసభల సంవత్సరంగా ప్రకటించి దేశవ్యాప్తంగా గ్రామసభల ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది.

గ్రామసభ - అధికారాలు, విధులు: * గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక నివేదికలను పరిశీలిస్తుంది.

* గ్రామ పంచాయతీకి శాసనసభలా వ్యవహరిస్తుంది.

* ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా నిలుస్తుంది.

* వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.

* గ్రామ పంచాయతీ గ్రామసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది.

* మన గ్రామసభను పోలిన వ్యవస్థ స్విట్జర్లాండ్‌లోనూ ఉంది. దాని పేరు ‘ల్యాండ్స్‌ గెమెండ్‌’

 

ఆర్టికల్‌ 243(బి)(1)- పంచాయతీ రాజ్‌ వ్యవస్థాపన:  దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. 1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ 2) మధ్య/ బ్లాకు స్థాయి - పంచాయతీ సమితి 3) ఉన్నత స్థాయి - జిల్లా పరిషత్తు.

ఆర్టికల్‌ 243(బి)(2):  ఇరవై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో మాధ్యమిక/బ్లాక్‌ స్థాయిలో పంచాయతీ సమితుల ఏర్పాటు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆర్టికల్‌ 243(సి):- సభ్యుల, అధ్యక్షుల ఎన్నిక విధానం: * మూడు స్థాయిల్లో (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తు) సభ్యులను ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగుతో ఎన్నుకుంటారు. * గ్రామ పంచాయతీ (దిగువ స్థాయి) అధ్యక్ష/ సర్పంచి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్వహించుకోవచ్చు. ఎలా నిర్వహించాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా నిర్దేశిస్తుంది. * పంచాయతీ సమితి/బ్లాకు (మాధ్యమిక స్థాయి), జిల్లా పరిషత్తు (ఉన్నత స్థాయి) అధ్యక్షుల ఎన్నిక విధానం పరోక్షంగా ఉండాలి. * గ్రామ పంచాయతీ అధ్యక్షులు/ సర్పంచులు మాధ్యమిక వ్యవస్థలో సభ్యులుగా కొనసాగుతారు. * మాధ్యమిక వ్యవస్థ లేని రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ అధ్యక్షులు/సర్పంచులు ‘జిల్లా పరిషత్తు’లో సభ్యులుగా కొనసాగుతారు. * మాధ్యమిక వ్యవస్థ (పంచాయతీ సమితి) ఉన్న రాష్ట్రాల్లో మాధ్యమిక వ్యవస్థ/బ్లాకు కు చెందిన అధ్యక్షులు జిల్లా పరిషత్తులో సభ్యులుగా కొనసాగుతారు. * లోక్‌సభ సభ్యులు, విధానసభ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలోని మాధ్యమిక వ్యవస్థ, జిల్లా పరిషత్తుల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా కొనసాగవచ్చు.* రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు తాము ఓటరుగా నమోదైన జిల్లాలోని జిల్లా పరిషత్తు, మాధ్యమిక వ్యవస్థలలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా కొనసాగవచ్చు.

ఆర్టికల్‌ 243(డి)- రిజర్వేషన్లు: * పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. వారికి ఇచ్చిన రిజర్వేషన్లలో ఆయా వర్గాల మహిళలకు 1/3వ వంతు స్థానాలు రిజర్వ్‌ చేయాలి.

* పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 1/3వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి.

* పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం - బిహార్‌

* కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2022, మార్చి 31 నాటికి మన దేశంలో 21 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లున్నాయి. 

* స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 110వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఇప్పటివరకు ఆమోదించలేదు.

 

సుప్రీంకోర్టు తీర్పు: అబ్దుల్‌ అజీజ్‌ అసాద్‌ జు( స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రపదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మహిళలకు స్థానికసంస్థల ఎన్నికల్లో 1/3వ వంతు స్థానాలను రిజర్వ్‌ చేయడం అనేది ‘రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు’ అనే నిబంధనకు వ్యతిరేకం కాదు అని పేర్కొంది.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల వారికి (ఓబీసీ) రిజర్వేషన్లు నిర్దేశించలేదు. ఈ వర్గాల వారికి ఎంతశాతం రిజర్వేషన్లు కల్పించాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభల అభీష్టానికి వదిలిపెట్టారు.

* ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 ప్రకారం స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ వర్గాలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018 ప్రకారం స్థానికసంస్థల ఎన్నికల్లో ఓబీసీ వర్గాలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్‌ చేశారు.

* అరుణాచల్‌ ప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) జనాభా లేని కారణంగా ఆ రాష్ట్ర స్థానికసంస్థల ఎన్నికల్లో ఎస్సీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేశారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 18-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌