• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి పాలన

సంక్లిష్ట పరిస్థితులను సరిదిద్దే సాధనం!
 


రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు,  రాజ్యాంగం ప్రకారం పాలన సాగనప్పుడు, పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రపతి పాలన లాంటి కొన్ని ప్రత్యేక సాధనాలను వినియోగించవచ్చు.  సమాఖ్య వ్యవస్థలో కేంద్రం ఆధిపత్యానికి రుజువుగా ఆ అధికారాన్ని రాజ్యాంగం ప్రసాదించింది.  కానీ దానిని లక్ష్యాలకు భిన్నంగా ఉపయోగించడంతో అనేక వివాదాలు తలెత్తాయి.  ప్రతిపక్షాలపై ప్రతీకార అస్త్రంగా పలుమార్లు ప్రయోగించారు. కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సంబంధిత రాజ్యాంగ వివరణలు, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలో సంభవించే మార్పులపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ఇప్పటి వరకు విధించిన సందర్భాలు, రాజకీయ ఉద్దేశాలతో దుర్వినియోగమైన తీరు, చేసిన రాజ్యాంగ సవరణలు, తలెత్తిన వివాదాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ చేసిన సిఫార్సులను వివరంగా తెలుసుకోవాలి.

క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు దేశాన్ని ఏకతాటిపై నడిపేందుకు రాజ్యాంగంలోని 18వ భాగంలో అత్యవసర అధికారాలను పొందుపరిచారు. వీటిలో ఆర్టికల్‌ 356 ప్రకారం విధించే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి/రాష్ట్రపతి పాలన తరచూ వివాదాస్పదంగా నిలుస్తోంది. 

కేంద్ర ప్రభుత్వ బాధ్యత: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 355 ప్రకారం ప్రతి రాష్ట్రం రాజ్యాంగపరంగా పరిపాలన నిర్వహించే విధంగా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఏదైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి, పరిపాలన సక్రమంగా జరగకపోతే, రాజ్యాంగ యంత్రాంగం విఫలమై పరిపాలన అస్తవ్యస్తంగా మారినప్పుడు ఆర్టికల్‌ 356ను ప్రయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటించి సాధారణ పరిపాలనను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది.

ఆర్టికల్‌ 356ను ప్రయోగించే సందర్భాలు:

1) రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన నిర్వహించడంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గవర్నర్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆర్టికల్‌ 356ను విధిస్తారు.

2) ఆర్టికల్‌ 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించినప్పుడు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు.

పార్లమెంట్‌ ఆమోదం:  

* ఆర్టికల్‌ 356 (1) ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన ప్రకటనను జారీ చేస్తారు.

*  ఆర్టికల్‌ 356 (2) ప్రకారం రాష్ట్రపతి పాలనను ఎప్పుడైనా రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. 

* ఆర్టికల్‌ 356 (3) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు రెండు నెలల్లోపు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే అది అమలులోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రపతి పాలన ప్రకటన వెలువడే సమయానికి లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది. అయితే కొత్త లోక్‌సభ ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా రాష్ట్రపతి పాలన ప్రకటనను లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే ఆ ప్రకటన రద్దవుతుంది.

కాలపరిమితి: ఆర్టికల్‌ 356 (4) ప్రకారం పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి పాలన 6 నెలలు కొనసాగుతుంది. దానిని 6 నెలలకోసారి పార్లమెంటు ఆమోదంతో ఒక రాష్ట్రంలో గరిష్ఠంగా 3 సంవత్సరాలు విధించవచ్చు. 3 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్రపతి పాలనను కొనసాగించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి.

ఉదా: పంజాబ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను 3 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగించేందుకు పార్లమెంటు 59వ రాజ్యాంగ సవరణ చట్టం 1988, 64వ రాజ్యాంగ సవరణ చట్టం 1990, 68వ రాజ్యాంగ సవరణ చట్టం 1991లను రూపొందించింది.

44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978: మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 (5) ప్రకారం రాష్ట్ట్ర్రంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన కొనసాగించాలంటే కొన్ని అంశాలు తప్పనిసరి అని నిర్దేశించారు.

* దేశం మొత్తంమీద లేదా దేశంలోని ఏదైనా ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉండాలి.

* సంబంధిత రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ఇవ్వాలి.

పునఃపరిశీలనకు పంపడం:

* ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి చేసిన సిఫార్సును రాష్ట్రపతి తప్పనిసరిగా అమలుచేయాల్సిన అవసరం లేదు. పునఃపరిశీలన చేయమంటూ వెనుకకు పంపవచ్చు. పునఃపరిశీలన అనంతరం వచ్చిన సిఫార్సును రాష్ట్రపతి తప్పనిసరిగా అమలు చేయాలి.

ఉదా:

1) 1997లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్‌ ప్రభుత్వాన్ని ఆర్టికల్‌ 356 ప్రకారం రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని ఐ.కె.గుజ్రాల్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ పునఃపరిశీలనకు పంపారు.

2) బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఆర్టికల్‌ 356 ప్రకారం రద్దు చేసి, రాష్ట్రపతి పాలనను విధించాలని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ తిరస్కరించి పునఃపరిశీలనకు పంపారు. వాజ్‌పేయీ ప్రభుత్వం బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రెండోసారి సిఫార్సు చేయడంతో రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చింది.

* 1999లో బిహార్‌లో ఆర్టికల్‌ 356 ప్రకారం విధించిన రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించినప్పటికీ, రాజ్యసభ తిరస్కరించడంతో రాష్ట్రపతి పాలన రద్దయింది.

రాష్ట్రపతి పాలన - రాష్ట్రంలో సంభవించే మార్పులు:

* ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రి మండలి/రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దవుతుంది. రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతి పేరు మీదుగా అమలవుతాయి.

* రాష్ట్రంలో రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్‌ వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటారు. గవర్నర్‌కు పరిపాలనలో సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమిస్తుంది.] రాష్ట్ర శాసనసభను పూర్తిగా రద్దు చేస్తారు లేదా సుప్త చేతనావస్థలో ఉంచుతారు.

* రాష్ట్రానికి అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. పార్లమెంటు సమావేశాలు లేకపోతే రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి జారీ చేస్తారు. 

న్యాయ సమీక్ష:

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 38వ రాజ్యాంగ సవరణ చట్టం-1975 ద్వారా రాష్ట్రపతి తన అభీష్టం మేరకు  లేదా సంతృప్తి మేరకు ఆర్టికల్‌ 356ను ప్రయోగించవచ్చని, రాష్ట్రపతి నిర్ణయమే తుది నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నించ కూడదని నిర్దేశించింది.

* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా ఆర్టికల్‌ 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలనను న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చని, రాష్ట్రపతి పాలన న్యాయసమీక్ష పరిధిలో ఉంటుందని నిర్దేశించింది.

ఆర్టికల్‌ 356 దుర్వినియోగం: ఆర్టికల్‌ 356ను కేంద్రం తరచూ దుర్వినియోగం చేస్తుందన్న విమర్శలున్నాయి.

* 1977లో మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం చేసిన సిఫార్సుల మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతి బి.డి.జెట్టి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు.

* 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించారు. ఎస్‌.ఆర్‌.బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1994: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ ఆర్టికల్‌ 356 ద్వారా విధించే రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది.అవి-

* భారతదేశ సమాఖ్యకు భంగం కలిగే విధంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించకూడదు. రాష్ట్రపతి పాలనను న్యాయసమీక్షకు గురి చేయవచ్చు.

*  లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం. లౌకికతత్వానికి విఘాతం కలిగించే రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356 ప్రకారం రద్దు చేయవచ్చు.

*  రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదించే వరకు రాష్ట్ర శాసనసభను రద్దు చేయకూడదు.

* రాష్ట్రపతి పాలన రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభను పునరుద్ధరించాలి.

* ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్రమంత్రి మండలికి పూర్తిస్థాయి మెజార్టీ ఉందా? లేదా? అనే అంశాన్ని శాసనసభలోనే పరీక్షించాలి.

* కేంద్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం సమంజసం కాదు.

రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ సిఫార్సు:  జస్టిస్‌ ఎమ్‌.ఎన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ, ఆర్టికల్‌ 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని, దాన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని పేర్కొంది (2002లో).

1951లో తొలిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం పంజాబ్‌. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 సార్లు, కేరళలో 9 సార్లు, పంజాబ్‌లో 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఆర్టికల్‌ 356ను అత్యధికంగా 48 సార్లు వినియోగించారు.

రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే?

* రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం

* పరిపాలన నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడం.

* రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించడం

* ప్రభుత్వాలు తరచూ పడిపోవడం, ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఏర్పడకపోవడండాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ మరణించారు. కానీ ఆర్టికల్‌ 356 నేటికీ   సజీవంగానే ఉంది.

- హెచ్‌.వి.కామత్‌

ఆర్టికల్‌ 356 రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా మారింది.

*  ఆర్టికల్‌ 356 ఎప్పటికీ వినియోగానికి నోచుకోని మృత అధికరణగా ఉంటుందని ఆశిస్తున్నాను. 

- డాక్టర్‌  బి.ఆర్‌.అంబేడ్కర్‌
 

రచయిత: బంగారు సత్యనారాయణ 
 

Posted Date : 17-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు