• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయం - భూవనరులు

అర్ధభాగంపైనే ఆహారపంటలు

 తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారమైన వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. వైవిధ్య పంట విధానాలను అవలంబించడంతోపాటు, రకరకాల పథకాలతో రైతులను ప్రోత్సహిస్తోంది. పంట ఉత్పత్తుల అభివృద్ధితోపాటు రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా రూపొందించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. తెలంగాణ  జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వ్యవసాయ భూముల విస్తీర్ణాలు, పంటల వివరాలను గణాంకాలు సహా తెలుసుకోవాలి. 

 

  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్ర శ్రామిక శక్తిలో దాదాపు 55% మంది కార్మికులు వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల్లో ఉపాధి పొందుతున్నారు. 2020 - 21లో వ్యవసాయ రంగంలో స్థూల విలువ జోడింపు (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ - జీవీఏ) 20.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో వైవిద్యభరితమైన పంటల విధానం ఉంది. గోదావరి, కృష్ణా లాంటి నదుల ద్వారా ప్రధాన నీటిపారుదల వ్యవస్థలు ఉన్నాయి. చెరువులు, చిన్న నీటిపారుదల వనరులను పునరుద్ధరించేందుకు మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా ప్రోత్సహించడానికి విత్తనోత్పత్తి, హరితగృహ సాంకేతికతను ఉపయోగించి ఉద్యాన అభివృద్ధి, ఇతర ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది.

 

భూ వినియోగం

రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం 112.07 లక్షల హెక్టార్లు. అందులో 26.98 లక్షల హెక్టార్లు అటవీ భూమి (26.69 శాతం). 2019-20 లెక్కల ప్రకారం నికర సాగు భూమి 46.59 లక్షల హెక్టార్లు (49.5 శాతం). 

2019 - 20 ప్రకారం:

* ఒకసారి కంటే ఎక్కువ విత్తనసాగు - 48.89 లక్షల ఎకరాలు (17.65%)

* స్థూల సాగు ప్రాంతం - 184.78 లక్షల ఎకరాలు (66.72%)

* నికర సాగు ప్రాంతం - 71.71 లక్షల ఎకరాలు (25.89%)

* స్థూల సాగు నీటిపారుదల ప్రాంతం - 113.27 లక్షల ఎకరాలు (40.90%)

 

భూకమతదారులు

రాష్ట్రంలో ప్రస్తుతం అయిదు ఎకరాల్లోపు భూకమత పరిమాణం ఉన్నవారు 88 శాతం. రాష్ట్రంలో మొత్తం 59.47 లక్షల భూకమతదారులు ఉన్నారు. అత్యధికంగా ఉపాంత కమతదారులు (2.47 ఎకరాల్లోపు) 64.6 శాతం, చిన్న కమతదారులు (2.48 - 4.94 ఎకరాల మధ్య) 23.7 శాతం ఉన్నారు. సగటు భూకమత పరిమాణం 1.12 హెక్టార్లు. అత్యధిక భూకమతాలు ఆదిలాబాద్, కుమురం భీం; అత్యల్ప భూకమత పరిమాణం జగిత్యాల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి.

2020 ప్రకారం పంటల సాంద్రత సగటున 1.36 ఉంది. అత్యధికంగా నిజామాబాద్‌ 1.78; పెద్దపల్లి, సూర్యాపేట 1.69; అత్యల్పంగా కుమురం భీం, సంగారెడ్డి 1.07గా ఉంది.

 

వ్యవసాయ - శీతోష్ణస్థితి మండలాలు

వర్షపాతం, ఉష్ణోగ్రత, మృత్తికల ఆధారంగా తెలంగాణ రాష్ట్రాన్ని స్థూలంగా మూడు ప్రాంతీయ వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు.

 

ఉత్తర మండలం: దీని ప్రధాన కార్యాలయం జగిత్యాల జిల్లా పొలాసలో ఉంది. ఈ జోన్‌ పరిధిలో ఆదిలాబాద్, కుమురం భీం - ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్లా, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలు ఉన్నాయి. వార్షిక సగటు వర్షపాతం 86.7 - 118.9 సెం.మీ., ఉష్ణోగ్రత 31* - 39* గా ఉంటుంది. ఈ జోన్‌ పరిధిలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్, నువ్వులు, పత్తి, చెరకును పండిస్తున్నారు. 

 

కేంద్రీయ మండలం: దీని ప్రధాన కార్యాలయం హనుమకొండలోని ఆరెపల్లిలో ఉంది. ఈ మండల పరిధిలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 77.9 - 121.3 సెం.మీ., గరిష్ఠ ఉష్ణోగ్రత 29* - 39* గా ఉంటుంది. ఈ మండలంలో పత్తి, వరి, మొక్కజొన్న, పెసర, మామిడి, చెరకు, మిరప ప్రధాన పంటలు.

 

దక్షిణ మండలం: దీని ప్రధాన కార్యాలయం నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పాలెంలో ఉంది. ఈ మండల పరిధిలో వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ వార్షిక సగటు వర్షపాతం 60.6 - 85.3 సెం.మీ., గరిష్ఠ ఉష్ణోగ్రత 28o - 38o. ఈ మండలంలో పప్పుధాన్యాలు, పత్తి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదాలు, వేరుశనగ ప్రధాన పంటలు.

 

వ్యవసాయం - పంటలు

రాష్ట్రంలో మొత్తం 184.78 లక్షల ఎకరాల్లో ఆహార, ఆహారేతర వ్యవసాయ సాగు వైశాల్యం ఉంది. ఇందులో ఆహార పంటలు 122.10 లక్షల ఎకరాలతో 66.08% ఉండగా, ఆహారేతర పంటలు 62.67 లక్షల ఎకరాలతో 33.92% ఉన్నాయి. మొత్తం పంట వైశాల్యంలో 129.15 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌; 55.61 లక్షల ఎకరాలు రబీ కాలంలో పండిస్తున్నారు. మొత్తం సాగు పంట వైశాల్యం అత్యధికంగా నల్లగొండ, సూర్యాపేట; అత్యల్పంగా మేడ్చల్, ములుగు జిల్లాల్లో ఉంది.

 

ఆహార పంటలు ఉత్పత్తులు
వరి (ప్రధాన పంట) పెద్దపల్లి, సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల, ములుగు 
అత్యధిక ఉత్పత్తి - నిజామాబాద్‌
దిగుబడి - కామారెడ్డి
జొన్నలు (రెండో పంట) మహబూబ్‌నగర్, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్‌
సజ్జలు నిజామాబాద్, జోగులాంబ, జగిత్యాల, నిర్మల్, రంగారెడ్డి
మొక్కజొన్న వరంగల్, సిద్దిపేట, ములుగు, కామారెడ్డి, రంగారెడ్డి
చిరుధాన్యాలు వరంగల్, నిర్మల్, సూర్యాపేట
మైనర్‌ మిల్లెట్‌ జోగులాంబ, నాగర్‌కర్నూల్‌
పప్పు ధాన్యాలు వికారాబాద్, మేడ్చల్‌
రాగులు మహబూబ్‌నగర్, సిరిసిల్ల
కందులు సంగారెడ్డి, ఖమ్మం, వికారాబాద్‌
శనగలు

నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌

పెసర ఆదిలాబాద్, కామారెడ్డి, నల్లగొండ, నిర్మల్‌
మినుములు సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి
ఉలవలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి

 

వాణిజ్య పంటలు (నూనె గింజలు) ఉత్పత్తులు

* ఆముదాలు - మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ

* నువ్వులు - జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్‌

* పొద్దుతిరుగుడు - నిజామాబాద్, సిద్దిపేట, మెదక్‌

* వేరుశనగ - మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌

* సోయాబీన్‌ - ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి

* చెరకు - సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం

* పత్తి - నల్లగొండ, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, ఆసిఫాబాద్‌

* పొగాకు - జోగులాంబ, భద్రాద్రి, జనగాం

* మిరప - ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌

* పసుపు - నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్‌

* ఉల్లిగడ్డలు - జోగులాంబ, వికారాబాద్‌

 

* ఉద్యాన పంటలను పరిశీలిస్తే తెలంగాణ పసుపు ఉత్పత్తి, వైశాల్యంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా మిరపసాగు, ఉత్పత్తి, ఆయిల్‌పామ్‌ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. మామిడి ఉత్పత్తిలో 6వ స్థానం, కూరగాయల ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉంది. 

* సుగంధద్రవ్యాల పార్క్‌ పడగల్‌ (నిజామాబాద్‌)లో ఉంది. కూరగాయలు, పూలకు సంబంధించిన అధ్యయన కేంద్రం - జీడిమెట్ల (మేడ్చల్‌)లో ఉండగా, పండ్ల అధ్యయన కేంద్రాలు ములుగు, సిద్దిపేటలో ఉన్నాయి.

 

తెలంగాణ - సాధించిన లక్ష్యాలు

రైతుబంధు: రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదట పట్టదారు రైతుకు ఎకరానికి రూ.4000 ఇచ్చేది. ఆ తర్వాత 2019 నుంచి ఏటా ఎకరాకు రూ.10,000 ఇస్తోంది. ఇందులో ఖరీఫ్, రబీ పంటలకు రూ.5000 చొప్పున అందిస్తోంది.

* 2019 ఫిబ్రవరి నుంచి ప్రధానమంత్రి కిసాన్‌ పథకం ద్వారా 4.94 ఎకరాల్లోపు భూమి ఉన్న చిన్న రైతులకు కేంద్రప్రభుత్వం ఏడాదికి రూ.6000 ఇస్తోంది.

* రైతు బీమా ఆర్థిక, సామాజిక భద్రత కోసం ‘తెలంగాణ ఫార్మర్‌ గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పథకం’ కింద 18 - 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులకు సహజ మరణం సంభవించినప్పుడు 10 రోజుల్లోపు రూ.5 లక్షల పరిహారం అందిస్తారు.

 

ధరణి పోర్టల్‌: సమీకృత వ్యవసాయ భూమి నమోదు నిర్వహణ కోసం రెవెన్యూ శాఖ ప్రారంభించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఇది. దీని ద్వారా భూమి రిజిస్ట్రేషన్, పరిపాలన సేవలు అందిస్తారు. 

 

రైతు వేదిక: అధిక రాబడి పొందడంలో అన్నదాతలకు సహాయపడే లక్ష్యంతో జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌ రైతు వేదికను ప్రారంభించారు. రాష్ట్రంలో 2601 రైతు వేదికలను నిర్మించాలని, ఒక్కో వేదిక నిర్మాణానికి మొత్తం రూ.22 లక్షల ఖర్చు అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.

 

రచయిత: కొత్త గోవర్ధన్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  తెలంగాణ శీతోష్ణస్థితి

 తెలంగాణ నదీ వ్యవస్థ

 తెలంగాణ - నీటి పారుదల ప్రాజెక్టులు

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 13-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌