• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ - నీటి పారుదల ప్రాజెక్టులు

 

తరతరాలకు తాగు... సాగు నీరు!

వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు నీటి పారుదల అత్యంత ప్రధానమైనది. వర్షాలు లేదా వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు, నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తారు. తరతరాలకు తాగు, సాగు నీరు వీటి ద్వారా అందుతుంది. ఒక ప్రాంతం ప్రగతిలో  ప్రధానపాత్ర పోషించే ఈ నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి పరీవాహక ప్రాంతాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

తెలంగాణ - నీటి పారుదల ప్రాజెక్టులు 

భారతదేశంలో ప్రాముఖ్యత కలిగి ఉన్న రెండు ముఖ్యమైన నదులైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం విస్తరించి ఉంది. తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ ఈ నదులపైనే నిర్మించారు. 2020 - 21 గణాంకాల ప్రకారం పరిశీలిస్తే రాష్ట్రంలోని మొత్తం స్థూల నీటిపారుదల భూమి 113.27 లక్షల ఎకరాలు కాగా నికర నీటిపారుదల సాగు భూమి 71.71 లక్షల ఎకరాలు. 

* తెలంగాణలో అత్యధిక నీటిపారుదల ఉన్న జిల్లాలు జగిత్యాల (95.4%), నిజామాబాద్‌ (92.1%), పెద్దపల్లి (90.5%). అత్యల్ప నీటిపారుదల జిల్లాలు కొమురంభీం (15.6%), వికారాబాద్‌ (22.9%), మహబూబ్‌నగర్‌ (27.5%). 

 

గోదావరి నది పరీవాహక ప్రాంతం - ప్రాజెక్టులు 

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ): ఇది గోదావరి నదిపై తెలంగాణలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు. దీని నిర్మాణాన్ని 1963 జులై 26న జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. ఇది నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు వద్ద జాతీయ రహదారి 44కు 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు నీరు అందిస్తారు. ఈ ప్రాజెక్టుపై మూడు ప్రధాన కాలువలు ఉన్నాయి. 

కాకతీయ కాలువ: ఇది తెలంగాణలో పొడవైన ప్రధాన కాలువ. దీని పొడవు సుమారు 254 కి.మీ. ఈ కాలువ ద్వారా నిజామాబాద్‌ నుంచి వరంగల్‌కు నీరు అందుతుంది.

లక్ష్మీ కాలువ: దీని పొడవు 3.5 కి.మీ. ఇది నిజామాబాద్‌కు నీరు అందిస్తుంది.  

సరస్వతి కాలువ: ఇది 47 కి.మీ. పొడవును కలిగి నిర్మల్, ఆదిలాబాద్‌కు నీరు అందిస్తుంది.

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు (కేఎల్‌ఐపీ): ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంప్‌ హౌజ్‌ ప్రాజెక్టు. ఇటీవల ఈ ప్రాజెక్టుపై డిస్కవరీ ఛానల్‌ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. ఇది భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఉంది. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం - 2021 ప్రకారం ప్రారంభంలో దీని ప్రాథమిక అంచనా రూ.40 వేల కోట్లు. 2020 బడ్జెట్‌లో రూ.88 వేల కోట్లు, 2021లో రూ.1.06 లక్షల కోట్లు ఉండగా, ఆలస్యం కారణంగా రూ.1.15 లక్షల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2016లో చేపట్టి 2019 జూన్‌ 21న మొదటి దశను ప్రారంభించారు.

          కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు మొత్తం ఏడు లింకులు, 28 ప్యాకేజీలుగా 13 జిల్లాల ద్వారా సుమారు 500 కి.మీ. విస్తరించి 1800 కి.మీ. కంటే ఎక్కువ కాలువలను ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 240 టీఎంసీలు. దీనిలో మేడిగడ్డ నుంచి 195 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీలు, భూగర్భ సొరంగాల నుంచి 25 టీఎంసీలు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మొత్తం 240 టీఎంసీలలో నీటిపారుదల కోసం 169 టీఎంసీలు  

హైదారాబాద్‌ మున్సిపల్‌ తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు 10 టీఎంసీలు ఉపయోగించాలని నిర్ణయించగా బాష్పీభవన నష్టం 15 టీఎంసీలుగా ఉంది.  

 

కేఎల్‌ఐపీలో ప్రధానంగా మూడు పంపింగ్‌ పాజెక్టులు ఉన్నాయి. 

* మేడిగడ్డ - లక్ష్మీ బ్యారేజి - గోదావరి నది - భూపాలపల్లి   

* అన్నారం - సరస్వతి బ్యారేజి - గోదావరి నది - భూపాలపల్లి  

* సుందిల్లా - పార్వతి బ్యారేజి - గోదావరి నది - పెద్దపల్లి

 

గోదావరి నదిపై ఉన్న ఇతర ప్రాజెక్టులు  

అలీ సాగర్‌ ప్రాజెక్టు - గోదావరి నది - నిజామాబాద్‌    

ఆర్గూల రాజారామ్‌ - గోదావరి నది - నిజామాబాద్‌   

శ్రీపాదరావు ఎల్లంపల్లి - గోదావరి నది - పెద్దపల్లి

రామడుగు ప్రాజెక్టు - రామడుగు వాగు - నిజామాబాద్‌   

ఇచ్చంపల్లి ప్రాజెక్టు - గోదావరి నది - భూపాలపల్లి 

పి.వి.నర్సింహారావు కంతన పల్లి - గోదావరి నది - ములుగు 

జె.బొక్కారావు దేవాదుల ప్రాజెక్టు - గోదావరి నది - ములుగు  

సీతారామ దుమ్ము గూడెం ప్రాజెక్టు - గోదావరి నది - భద్రాద్రి 

సింగూర్‌ ప్రాజెక్టు - మంజీర నది - సంగారెడ్డి 

 

కృష్ణానది పరీవాహక ప్రాంతం - ప్రాజెక్టులు 

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ): ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట, మానవ నిర్మిత ప్రాజెక్టు. దీన్ని కృష్ణానదిపై నిర్మించారు. ఇది దేశంలో రెండో అతిపెద్ద నీటి నిల్వ ప్రాజెక్టు. నల్గొండ జిల్లాలోని నందికొండ వద్ద 1955 డిసెంబరు 10న ఈ ప్రాజెక్టుకు జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారు. దీన్ని 1967 ఆగస్టు 4న ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఇది తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి పథకం. ఈ ప్రాజెక్టులో రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి.

ఎడమ గట్టు కాలువ: దీన్ని లాల్‌బహదూర్‌ కాలువ అంటారు. దీని పొడవు 178 కి.మీ. దీని కింద నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లోని 4,19,816 హెక్టార్‌లకు నీటిని అందిస్తున్నారు. 

కుడి గట్టు కాలువ: దీన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ కాలువ అంటారు. దీని పొడవు 203 కి.మీ. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 4,75,465 హెక్టార్‌లకు నీరు అందుతుంది. 

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు: కరవు బాధిత ప్రాంతాలకు నీటిపారుదల అవసరాలను తీర్చడానికి జూరాల ప్రాజెక్టును చేపట్టారు. దీన్ని గద్వాల్‌ జిల్లాలోని థరూర్‌ మండలం రావులపల్లి సమీపంలో కృష్ణా నదిపై నిర్మించారు. దీనికి రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి.

కుడి ప్రధాన కాలువ: నల్ల సోమనాద్రి కాలువ    

ఎడమ ప్రధాన కాలువ: ఎన్‌టీఆర్‌ కాలువ  

శ్రీశైలం ప్రాజెక్టు: దీన్ని నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టు అంటారు. నంద్యాల - నాగర్‌ కర్నూల్‌ సరిహద్దులో పాతాళగంగ వద్ద కృష్ణా నదిపై దీన్ని నిర్మించారు. దీని ప్రధాన ఉద్దేశం పవర్‌గ్రిడ్‌. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొత్తం 1670 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనిలో తెలంగాణ 900 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌ 770 మెగావాట్లు ఉత్పత్తి చేస్తాయి. దీనికి రెండు కాలువలు ఉన్నాయి. 

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ): ఎలిమినేటి మాధవ రెడ్డి కెనాల్‌

శ్రీశైలం ప్రధాన కుడి కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ): దీన్ని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ అంటారు.

 

కృష్ణా నదిపై గల ఇతర ప్రాజెక్టులు

ఆర్‌.విద్యాసాగర్‌ రావు డిండి ప్రాజెక్టు - డిండి నది - నల్గొండ   

నక్కలగండి ఎత్తిపోతల పథకం - కృష్ణానది - నల్గొండ 

పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్‌ ప్రాజెక్టు - కృష్ణానది - నాగర్‌ కర్నూల్‌    

జవహర్‌ నెట్టెంపాడు లిఫ్ట్‌ ప్రాజెక్టు - కృష్ణానది - నాగర్‌ కర్నూల్‌ 

మహాత్మా కల్వకుర్తి గాంధీ లిఫ్ట్‌ ప్రాజెక్టు - కృష్ణానది - గద్వాల్‌   

రాజీవ్‌ భీమా లిఫ్ట్‌ ప్రాజెక్టు - కృష్ణానది - వనపర్తి 

కోయిల్‌ సాగర్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టు - కృష్ణానది - మహబూబ్‌నగర్‌

 

మాదిరి ప్రశ్నలు 


1. సింగూర్‌ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?

1) మంజీర నది   2) కడెం నది  3) గోదావరి నది   4) ప్రాణహిత 


2. జవహర్‌లాల్‌ నెహ్రూ నాగర్జున సాగర్‌ బహుళ సాధక ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు?

1) 1955 డిసెంబరు 10    2) 1953 డిసెంబరు 10  


3) 1963 డిసెంబరు 10   4) 1956 డిసెంబరు 10 

 

3. ఆర్‌.విద్యాసాగర్‌ రావు ఎత్తిపోతల పథకం అని ఏ ప్రాజెక్టుకు పేరు?

1) డిండి     2) మూసీ   3) పాలేరు    4) జూరాల   

 

4. కిన్నెరసాని డ్యామ్‌ ఏ జిల్లాలో ఉంది? 

1) ఖమ్మం   2) భద్రాద్రి    3) ములుగు    4) భూపాలపల్లి

 

5. నాగర్జున సాగర్‌ నీటిపారుదల ప్రాజెక్టు ఎడమ గట్టు కాలువను ఏ విధంగా పిలుస్తారు? 

1) జవహర్‌లాల్‌ నెహ్రూ కాలువ   2) లాల్‌బహదూర్‌ కాలువ  

3) ఆర్‌.విద్యాసాగర్‌ రావు కినాల్‌   4) సోమనాద్రి కాలువ  

 

6. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ పంప్‌ హౌస్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అని దేనికి పేరు?

1) ప్రాణహిత - చేవేళ్ల   2) కాళేశ్వరం లిఫ్ట్‌ ప్రాజెక్టు   

3) దేవాదుల లిఫ్ట్‌ ప్రాజెక్టు   4) పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్‌ ప్రాజెక్టు 

 

సమాధానాలు

1-1,   2-1,   3-1,   4-2,   5-2,   6-2.


రచయిత: కొత్త గోవర్ధన్‌ రెడ్డి

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣  తెలంగాణ నదీ వ్యవస్థ

‣  నదీ వ్యవస్థ - నీటిపారుదల

  అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాలు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 10-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌