• facebook
  • whatsapp
  • telegram

అంతఃస్రావ వ్యవస్థ

ఆకలి.. నిద్ర.. అన్నింటికీ అవే కారణం!

  మన శరీరంలో వివిధ రకాల పనులు నిరంతరాయంగా, సమయానుకూలంగా జరగడం, వయసుకు తగ్గట్టుగా శరీర మార్పులు, ఆకలి, దప్పిక, నిద్ర వంటివి ఉండటానికి కారణం శరీరంలోని హార్మోన్లే. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు వీటి పనితీరు, అందుకు గ‌ల‌ కారణాలు తెలుసుకోవాలి.

 

హార్మోన్లు: ఇవి శరీరంలో నియంత్రణ సమన్వయానికి తోడ్పడతాయి. వివిధ రకాల జీవక్రియలైన ఆక‌లి, నిద్ర‌, దాహం లాంటివి సక్రమంగా జరగడానికి కారణం హార్మోనులే. ఇలాంటి హార్మోనుల్ని స్రవించే గ్రంథులను అంతఃస్రావ గ్రంథులు అంటారు. ఈ గంథ్రులన్నీ కలిపి ఏర్పరిచే వ్యవస్థను అంతఃస్రావ వ్యవస్థ అంటారు. 

 

మన శరీరంలో గ్రంథులు - 3 రకాలు

1) అంతఃస్రావ గ్రంథులు (Endocrine Glands): వీటినే వినాళ గ్రంథులు అంటారు. వీటికి నాళాలు ఉండకపోవటం వల్ల వీటి నుంచి వెలువడే హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి.

2) బహిస్రావ గ్రంథులు (Exocrine Glands): ఈ గ్రంథులకు నాళాలుండటం వల్ల వీటిని నాళాయుత గ్రంథులని పిలుస్తారు. ఇవి స్రావాలను నాళం ద్వారా మరో ప్రదేశంలోకి విడుదల చేస్తాయి. లాలాజల గ్రంథులు, స్వేద గ్రంథులు, కాలేయం, క్షీర గ్రంథులు, అశ్రు గ్రంథులు వీటికి ఉదాహరణ.

3) మిశ్రమ గ్రంథులు (Heterocrine Glands): ఇవి అంతఃస్రావ, బహిస్రావ గ్రంథులుగా పనిచేస్తాయి. క్లోమం, బీజకోశాలు (ముష్కాలు, అండాశయాలు) వీటికి ఉదాహరణ.

 

హార్మోన్ల ప్రత్యేకతలు

వీటిని రసాయన వార్తావాహకాలు అంటారు. ఇవి కొద్దిమొత్తంలో ఉన్నా ప్రభావం చూపిస్తాయి. హార్మోన్లు నిర్ణీత కణజాలం మీద మాత్రమే ప్రభావం చూపుతూ, నిర్ణీత పనినే నిర్వహిస్తాయి. ఇవి (హార్మోన్లు) రసాయనికంగా అమైన్‌లు, స్టిరాయిడ్‌లు, ప్రోటీన్‌లు, పెప్టైడ్‌లుగా ఉంటాయి. మన శరీరంలోని వివిధ అంతఃస్రావ గ్రంథులు వివిధ ర‌కాల హార్మోన్‌ల‌ను స్ర‌విస్తాయి. ఒక్కో గ్రంథికి వేర్వేరు విధులు ఉంటాయి. ఈ గ్రంథులు స్ర‌వించే హార్మోన్లు మోతాదుకు మించినా లేదా లోపించినా వివిధ ర‌కాల వ్యాధులు వ‌స్తాయి. 

పిట్యూటరీ గ్రంథి: దీన్నే హైపోఫైసిస్‌ అంటారు. బఠానీ గింజ పరిమాణంలో మెదడులో హైపోథలామస్‌ కింద కాడ సహాయంతో అతుక్కుని ఉంటుంది. ఈ గ్రంథినే మాస్టర్‌ గ్రంథి, అన్ని గ్రంథులను నియంత్రించే గ్రంథి అంటారు. దీనిలో పూర్వలంబిక (Anterior lobe), పరలంబిక (Posterior lobe) ఉంటాయి.

 

పూర్వలంబిక స్రవించే హార్మోన్లు 

 

సొమాటోట్రోపిక్‌ హార్మోన్‌ (STH): దీన్ని పెరుగుదల హార్మోన్‌ అంటారు. ఇది మన శరీరంలో కణవిభజనను, ప్రొటీన్‌ల తయారీని, గ్లూకోజ్‌ స్థాయుల్ని పెంచుతుంది. కాల్షియం శోషణను ఎక్కువ చేసి ఎముకలు పెరిగేలా చేస్తుంది. పిల్లల్లో దీనిలోపం వల్ల మరుగుజ్జుతనం (Dwarfism),ఎక్కువయితే అతిదీర్ఘకాయత్వం (Gigantism) వస్తాయి. పెద్దవారిలో ఈ హార్మోను లోపం వల్ల ఆక్రోమిక్రియా వ్యాధి, ఎక్కువైతే ఆక్రోమెగాలి వ్యాధి వస్తాయి. ఆక్రోమిక్రియా వల్ల కాళ్లు, చేతులు, ముఖం చిన్నగా ఉండటం, ఆక్రోమెగాలిలో అతి తక్కువగా పెరగడంతోపాటు కింది దవడ, పాదాలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి.

 

థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్ (TSH): దీన్నే థైరోట్రోపిన్‌ అంటారు. దీని ప్రభావంతో థైరాయిడ్‌ గ్రంథి థైరాక్సిన్‌ హార్మోన్‌ను స్రవిస్తుంది.

 

అడ్రినోకార్టికోట్రోపిక్‌ హార్మోన్‌ (ACTH): ఈ హార్మోన్‌ అడ్రినల్‌ గ్రంథిలోని వల్కలం (కార్టెక్స్‌)పై పనిచేయడం వల్ల, వల్కలం నుంచి హార్మోన్లు విడుదలవుతాయి. 

 

ప్రొలాక్టిన్‌: దీన్ని లాక్టోజెనిక్‌ హార్మోన్, మామ్మోట్రోపిక్‌ హార్మోన్, ల్యూటియోట్రోపిక్‌ హార్మోన్‌ వంటి పేర్లతో పిలుస్తారు. ఇది క్షీరగ్రంథుల అభివృద్ధికి, శిశుజననం తర్వాత పాలు ఉత్పన్నమవడానికి తోడ్పడుతుంది. కార్పస్‌ల్యూటియం నుంచి ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ను స్రవించడాన్ని ప్రేరేపించడం ఈ హార్మోన్‌ విధి.

 

ఫాలిక్యులార్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (FSH): దీన్నే గామిటో కైనెటిక్‌ ఫ్యాక్టర్‌ అంటారు. బీజకోశాలైన ముష్కాలు, అండాశయాల్లో పురుష, స్త్రీ బీజకణాలు (శుక్ర కణాలు, అండాలు) ఏర్పడటానికి ఈ హార్మోన్‌ చాలా అవసరం. ఇది అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్‌ను స్రవించడాన్ని ప్రేరేపిస్తుంది.

 

ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ (LH): స్త్రీలలో అండాశయాల నుంచి అండాలు విడుదల కావడానికి, కార్పస్‌ల్యూటియం అనే నిర్మాణం ఏర్పడేందుకు ఈ హార్మోను తోడ్పడుతుంది.  అంతేకాకుండా రుతుచక్రంలో కార్పస్‌ల్యూటియం నుంచి ప్రొజెస్టిరాన్‌ ఏర్పడేందుకు ఉపకరిస్తుంది.

  ఈ హార్మోన్‌నే పురుషుల్లో ఇంటర్‌స్టీషియల్‌ సెల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (I.C.S.H.) అని అంటారు. ఇది ముష్కాల్లోని  ఇంటర్‌స్టీషియల్‌ కణాల నుంచి టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

 

పిట్యూటరీ గ్రంథి పరలంబిక నుంచి విడులయ్యే హార్మోన్లు


ఆక్సిటోసిన్‌: దీన్ని పిటోసిన్, శిశుజనన హార్మోను, క్షీరం బయటకు రావడానికి (Milk Ejection) తోడ్పడే హార్మోన్‌ అంటారు.


వాసోప్రెసిన్‌: దీన్ని యాంటీ డైయూరిటిక్‌ హార్మోన్‌ (ADH) అంటారు. ఇది మూత్రం రూపంలో బయటకు వెళ్లే నీటి పరిమాణాన్ని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్‌ లోపంతో డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బాధితులు రోజుకు 10 - 15 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తారు.

 

థైరాయిడ్‌ గ్రంథి: ఇది ఆంగ్ల అక్షరం - ‘హెచ్‌’ ఆకారంలో లేదా సీతాకోకచిలుక ఆకారంలో మెడలో ఉంటుంది. ఇది అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి. రెండు హార్మోన్లను స్రవిస్తుంది. అవి..

 

1) థైరాక్సిన్‌: ఇది తిరిగి T3 (ట్రై ఐయడోథైరోనిన్‌), T4 (టెట్రా ఐయడోథైరోనిన్‌) రూపంలో ఉంటుంది. ఈ హార్మోను ఆధార జీవక్రియ రేటు (BMR - Basal Metabolic Rate) ను నియంత్రిస్తుంది. అలాగే కణశ్వాస క్రియను, మైటోకాండ్రియాలో శక్తి ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఈ హార్మోను లోపం వల్ల చిన్నపిల్లల్లో క్రిటినిజమ్‌ అనే వ్యాధి, పెద్దవారిలో మిక్సోడిమా (హైపో థైరాయిడిజమ్‌) వస్తుంది. ఈ హోర్మోను ఎక్కువైతే హైపో థైరాయిడిజమ్‌ (ఎక్సాఫ్తాల్మిక్‌ గాయిటర్‌) వ్యాధి వస్తుంది

 

2) థైరోకాల్సిటోనిన్‌: రక్తంలో కాల్షియం పరిమాణం ఎక్కువైనప్పుడు ఈ హార్మోను విడుదలై ఆ మూలకం స్థాయిని నియంత్రిస్తుంది. ఈ హార్మోను ఎముకల్లో కాల్షియం స్థాపనను పెంచుతుంది. అలాగే మూత్రం ద్వారా విసర్జించే కాల్షియాన్ని పెంచుతుంది.

 

పారాథైరాయిడ్‌ గ్రంథులు: ఇవి నాలుగు ఉంటాయి. ఇవి థైరాయిడ్‌ గ్రంథి కణజాలంలో అమరి ఉండి పారాథార్మోన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి. రక్తంలో కాల్షియం స్థాయులు తగ్గినప్పుడు ఈ హార్మోను విడుదలై కాల్షియం స్థాయుల్ని పెంచుతుంది. పారాథార్మోన్‌ హార్మోన్‌ తక్కువైతే పారా థైరాయిడ్‌ టెటని అనే వ్యాధి వస్తుంది. దీన్నే హైపో పారాథైరాయిడిజమ్‌ అంటారు. ఈ వ్యాధిలో రక్తంలో కాల్షియం స్థాయులు తగ్గుతాయి.

  పారాథార్మోన్‌ ఎక్కువైతే ఆస్టిన్‌ ఫైబ్రోసా అనే వ్యాధి వస్తుంది. ఈ స్థితినే హైపర్‌ పారాథైరాయిడిజమ్‌ అంటారు. దీనిలో ఎముకల నుంచి కాల్షియం విడుదలై అవి మెత్తగా మారతాయి. అలాగే ఆస్టియోపోరోసిస్‌ వస్తుంది. రక్తంలో కాల్షియం స్థాయులు ఎక్కువ కావడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

 

 

డాక్టర్‌ బి.నరేశ్‌

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ సూక్ష్మజీవులు - ప్రాముఖ్యం 

‣ బ్యాక్టీరియా వ‌ల్ల క‌లిగే వ్యాధులు

‣ వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 28-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌