• facebook
  • whatsapp
  • telegram

మైదానాలు

సమతలం.. విశాలం.. సారవంతం!

  భూస్వారూపాల్లో ప్రధానమైనవి మైదానాలు. సాధారణంగా నదులు, ఉపనదుల వల్ల ఏర్పడతాయి. నివసించడానికి, పంటలు పండించడానికి, పరిశ్రమల ఏర్పాటుకు, ఇంకా అనేక రకాలుగా మానవాళికి ఇవి ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఏర్పడే విధానాలను అనుసరించి వాటిని వర్గీకరించారు. ఆ వివరాలను పరీక్షల కోణంలో అభ్యర్థులు తెలుసుకోవాలి. 

  

  సముద్ర మట్టానికి సమతలంగా లేదా కొద్దిగా ఎత్తుగా ఉన్న విశాలమైన పల్లపు ప్రాంతాలను మైదానాలు అని పిలుస్తారు. సాధారణంగా సారవంతంగా ఉండే ఇవి సముద్ర మట్టం నుంచి విభిన్న ఎత్తుల్లో ఉంటాయి. మైదానాలు ఏర్పడటానికి భూఅంతర్జనిత, బహిర్జనిత బలాలే కారణం. అవి ఏర్పడిన విధానం ఆధారంగా వాటిని మూడు రకాలుగా విభజించారు. అవి 1) భూచలనాల వల్ల ఏర్పడిన మైదానాలు  2) క్రమక్షయ మైదానాలు 3) నిక్షేపిత మైదానాలు.

 

భూచలనాల వల్ల ఏర్పడిన మైదానాలు

ఇవి రెండు రకాలుగా ఉన్నాయి.

 

ఎ) ఖండాంతర్గత మైదానాలు: భూమిలో వచ్చిన చలనాల వల్ల క్షితిజ సమాంతరంగా ఉన్న పొరలు ఖండాల మధ్య భాగంలో కొద్ది ఎత్తు వరకు పైకి లేచి మైదానాలుగా ఏర్పడతాయి. వీటిని ఖండాంతర్గత మైదానాలంటారు. రష్యాలోని మైదానాలు, అమెరికాలోని మధ్య మైదానాలు వీటికి ఉదాహరణ.

 

బి) తీర మైదానాలు: ఖండాల తీర ప్రాంతంలో సముద్ర అడుగు భాగాలు ఊర్థ్య బలాల వల్ల సముద్రమట్టం కంటే కొంచెం ఎత్తు మాత్రమే పైకి లేచి తీర మైదానాలుగా ఏర్పడతాయి. భారతదేశ తూర్పు మైదానం, అమెరికా తూర్పు తీరంలో, మెక్సికో సింధుశాఖ, బెల్జియం, జర్మనీ తీర ప్రాంతాల్లో ఇవి ఏర్పడ్డాయి. 

 

క్రమక్షయ మైదానాలు

బహిర్జనిత బలాల వల్ల భూఉపరితలం నిర్విరామంగా క్రమక్షయం చెంది ఎత్తయిన ప్రాంతాలు శిథిలమై  పల్లపు ప్రాంతాలను పూడుస్తాయి. క్రమేణా మిట్టపల్లాలు సమానమై ఈ మైదాన ప్రాంతాలు ఏర్పడతాయి. ఇవి రెండు రకాలు..

 

ఎ) పెనిప్లేన్స్‌: ఉష్ణమండల ప్రాంతాల్లో నదీ క్రమక్షయ చర్య వల్ల ఏర్పడిన మైదానాలు. వీటిలో అక్కడక్కడ మిగిలిపోయి ఉన్న ఎత్తయిన కఠిన శిలాఖండాలు లేదా బోడిగుట్టలను మొనాడ్‌నాక్స్‌ అని పిలుస్తారు.

ఉదా: తెలంగాణ పీఠభూమిలోని మైదానాలు, చోటానాగపూర్‌ పీఠభూమిలోని మైదానాలు, కెనడాలోని హడ్సన్‌ అఖాతం చుట్టూ ఉన్న మైదానాలు.

 

బి) పెడిప్లేన్స్‌: ఎడారి ప్రాంతాల్లో పవన క్రమక్షయ చర్య వల్ల ఏర్పడిన మైదానాలు. ఇవి రెండు రకాలు..


1) హమ్మడాలు (సెరీర్‌ లేదా రెగ్‌): ఎడారి ప్రాంతాల్లో ఏర్పడే రాతి మైదానాలు లేదా రాతి ఎడారులు హమ్మడాలు. ఇవి రాజస్థాన్‌లోని జైసల్మీర్‌ ప్రాంతంలో, ఆఫ్రికా నైరుతి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.


2) ఏర్గ్స్‌: ఇవి ఎడారి ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఇసుక మైదానాలు.

 

సి) స్త్రండ్‌ ఫ్లాట్‌: సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర తరంగ క్రమక్షయ చర్య వల్ల ఏర్పడిన మైదానాలు. ఇవి ఎక్కువగా నార్వే వాయవ్య తీర ప్రాంతాల్లో ఉన్నాయి.

 

డి) టెర్రరోసా: సున్నపురాయి భౌగోళిక ప్రాంతాల్లో అంతర్భూజల క్రమక్షయ చర్య వల్ల ఏర్పడిన ఎరుపు వర్ణపు మైదానాలు.

 

నిక్షేపిత మైదానాలు

బహిర్జనిత బలాల ద్వారా ఒండ్రుమట్టి, ఇసుక, గులకరాళ్లు వంటి శిథిలాలు లోతట్టు ప్రాంతాలకు చేరి ఇవి ఏర్పడతాయి. ఈ మైదానాలు మూడు రకాలు.

నదీ ప్రవాహ మార్గంలో నిక్షేపణ చర్య వల్ల ఏర్పడే మైదానాలు: ఈ మైదానాలను మళ్లీ మూడు రకాలుగా విభజించారు.

 

ఎ) పీడ్‌ మౌంట్‌ మైదానాలు: పర్వత పాదాల వద్ద ఇసుక, గుళకరాళ్లతో ఏర్పడిన మైదానాలు. ఉదా: శివాలిక్‌ పర్వత పాదాల వద్ద ఉన్న భాబర్‌ నేలలు.

 

బి) వరద మైదానాలు: నది ప్రవహించేటప్పుడు దానికి ఇరువైపులా ఏర్పడిన మైదానాలు. ఉదా: మిసిసిపి, గంగా-యమున, కృష్ణా, గోదావరి నదులకు ఇరువైపులా ఉన్న మైదానాలు.

 

సి) డెల్టా మైదానాలు: నదులు సముద్రాల్లో కలిసే చోట (నదీ ముఖద్వార ప్రాంతాలు) ఏర్పడే మైదానాలు. ఆకారాన్ని అనుసరించి కింది విధంగా విభజించారు. 

 

లోబేట్‌ డెల్టా: ఇది విసనకర్ర ఆకారంలో ఉంటుంది. సముద్రపు నీటికంటే నదిలోని నీరు ఎక్కువ సాంద్రత ఉంటే ఇవి ఏర్పడతాయి. ఉదా: మహానది డెల్టా.

 

పక్షిపాద డెల్టా: సముద్రపు నీటికంటే నదిలోని నీరు తేలికగా ఉన్నపుడు, నదులు సముద్రంలో కలిసే ముందు వివిధ శాఖలుగా విడిపోయే ప్రదేశాల్లో ఏర్పడతాయి. ఉదా: అమెరికాలోని మిసిసిపి-మిస్సోరి నదీ డెల్టా.

 

చాపాకార లేదా ఆర్క్యుయేట్‌ డెల్టా: నైలు, గంగా, రైన్, నైగర్, ఇర్రవాడి, ఓల్గా, ఇండస్, డాన్యుబ్, మెకాంగ్, పో నదీ డెల్టాలు వీటికి ఉదాహరణ.

 

ఎస్ట్యుయెరైన్‌ డెల్టా: నర్మద, తపతి, అమెజాన్, మెకంజి, మిస్తులా, ఎల్బే, సెయిన్, హడ్సన్‌లు ఈ రకమైన డెల్టాలుగా చెప్పవచ్చు.

 

కస్పేట్‌ డెల్టా: జర్మనీలోని ఎబ్రోస్‌ నదీ డెల్టా దీనికి ఉదాహరణ.

 

లోయస్‌ మైదానాలు:  అర్ధశుష్క శీతోష్ణస్థితి ప్రాంతాల్లో పవన నిక్షేపణ చర్య వల్ల ఏర్పడే పసుపు వర్ణపు మైదానాలను లోయస్‌ మైదానాలుగా పిలుస్తారు. ఆగ్నేయ చైనా ప్రాంతంలో ప్రపంచంలో అతిపెద్ద లోయస్‌ మైదానం విస్తరించింది. ఈ మైదానం నుంచి చైనా దుఖఃదాయనిగా పిలిచే హోయాంగ్‌ నది ప్రవహిస్తుంది. ఈ నదీ జలాలు పసుపు వర్ణంలో ఉండటం వల్ల దాన్ని పసుపు నది అని కూడా అంటారు.

 

సరోవరీయ మైదానాలు:  నదులు సరస్సుల ద్వారా ప్రవహించేటప్పుడు వాటిలోని ఒండ్రుమట్టి శిథిలాలు సరస్సు అడుగు భాగంలో నిక్షేపించడం వల్ల ఏర్పడే మైదానాలు.

ఉదా: కశ్మీర్‌ లోయ మైదానం.

 

రచయిత: సక్కరి జయకర్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 భూమి అంతర్భాగం

  సౌర కుటుంబం

 అక్షాంశాలు - రేఖాంశాలు

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 24-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌