• facebook
  • whatsapp
  • telegram

అక్షాంశాలు - రేఖాంశాలు

ఉనికిని తెలిపే ఊహారేఖలు

  వేగంగా వెళుతున్న కారు ఎప్పుడు ఎక్కడుందో కనిపెట్టవచ్చు. సముద్రంలో ఓడ ఎటువైపు ప్రయాణిస్తోందో తెలుసుకోవచ్చు. గాలిలో విమాన గమనాన్ని గమనిస్తూ ఉండవచ్చు. ధ్రువాల వద్ద కొంత చదునుగా, మధ్యలో ఉబ్బెత్తుగా మొత్తం మీద గోళాకారంలో ఉండే భూమిపై ఆ వివరాలన్నీ అంత కచ్చితంగా ఎలా తెలుస్తాయి? దానికో ప్రత్యేక పద్ధతి ఉంది. ఊహించి గీసిన రేఖల సాయంతో ఉనికిని తెలుసుకోవచ్చు. 

  భూగోళం ఉత్తర, దక్షిణ చివరల వద్ద స్థిరంగా ఉన్న రెండు బిందువులకు ఉత్తర, దక్షిణ ధ్రువాలని పేరు. వాటి ఆధారంగా గీసినవే అక్షాంశ, రేఖాంశాలు. ఇవి ఉహారేఖలు. భూమికి బొంగరంలా తన అక్షంపై పడమర నుంచి తూర్పుకు తిరిగే సహజ శక్తి ఉంది. ఇలా తిరగడాన్ని భూభ్రమణం అంటారు.  ధ్రువాలను భూనాభి ద్వారా కలుపుతూ గీసిన ఊహారేఖను భూమి అక్షం అంటారు. భూమి అక్షం 23 1/2o తూర్పు వైపు వంగి ఉంటుంది. భూమి గంటకు 1610 కి.మీ. వేగంతో పడమర నుంచి తూర్పు వైపునకు తిరుగుతుంది.

 

అక్షాంశాలు

  ఉత్తర, దక్షిణ ధ్రువాలకు సమాన దూరంలో భూమిపై ఉన్న బిందువులను కలుపుతూ గీసిన ఊహారేఖను భూమధ్యరేఖ అంటారు. ఈ  భూమధ్యరేఖకు 0o అక్షాంశమని పేరు. ఈ రేఖ భూగోళాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఈ రేఖకు ఉత్తరాన ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధ గోళమని, దక్షిణాన ఉన్న అర్ధ భాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు. భూమధ్యరేఖ ఒక వృత్తం. ఈ రేఖకు సమాంతరంగా ఒక డిగ్రీ అంతరంతో ఉత్తర, దక్షిణ ధ్రువాలకు గీసిన అడ్డు వృత్తాలను అక్షాంశాలు అంటారు. అక్షాంశ రేఖలు భూమధ్యరేఖకు సమాంతరంగా ఉన్న రేఖలు లేదా వృత్తాలు. ఈ అక్షాంశాలు ఉత్తరార్ధ గోళంలో 90, దక్షిణార్ధ గోళంలో 90 ఉంటాయి. ఉత్తరార్ధ గోళంలోని అక్షాంశాలను ఉత్తర అక్షాంశాలు, దక్షిణార్ధ గోళంలోని అక్షాంశాలను దక్షిణ అక్షాంశాలని అంటారు. భూమధ్య రేఖతో కలిపి మొత్తం 181 అక్షాంశాలు ఉన్నాయి. భూమధ్యరేఖ 0o అక్షాంశమైతే ఉత్తర ధ్రువం 90o ఉత్తర అక్షాంశం, ఇది ఒక బిందువు. అదేవిధంగా దక్షిణ ధ్రువం 90o దక్షిణ అక్షాంశం. ఇది కూడా బిందువే.

  ఒక అక్షాంశం విలువ ఆ అక్షాంశంపై ఉండే బిందువును భూకేంద్రాన్ని తెలుపుతూ గీసిన రేఖకు, భూమధ్యరేఖ తలానికి మధ్య గల కోణానికి సమానం.

  అక్షాంశాలు, రేఖాంశాలను నిర్ధారించిన మొదటి శాస్త్రవేత్త హిప్పార్కస్‌. ఈయన ఒక గ్రీకు భూగోళ శాస్త్రవేత్త. దీనికోసం ఆస్ట్రలోబ్‌ అనే పరికరాన్ని రూపొందించారు. భూమధ్యరేఖ అక్షాంశాలన్నింటిలోనూ పెద్దది. దీన్ని అతిపెద్ద వలయం (గ్రేట్‌ సర్కిల్‌) అని కూడా అంటారు. మిగిలిన అక్షాంశాలన్నీ భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు  వెళ్లేకొద్దీ క్రమంగా తగ్గుతూ చిన్న వృత్తాలుగా, ధ్రువాల వద్ద బిందువులుగా మాత్రమే ఉంటాయి.

అక్షాంశాలు తూర్పు పడమరలుగా వ్యాపించి ఉంటాయి. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పరిమాణం తగ్గుతూ విలువలు పెరుగుతాయి. అక్షాంశాల విలువలను సెక్సెంట్‌ అనే పరికరం ద్వారా లెక్కిస్తారు.

 

23 1/2o ఉత్తర అక్షాంశం కర్కటరేఖ
23 1/2o దక్షిణ అక్షాంశం మకరరేఖ
66 1/2o ఉత్తర అక్షాంశం ఆర్కిటిక్‌ వలయం
66 1/2o దక్షిణ అక్షాంశం అంటార్కిటిక్‌ వలయం
90o ఉత్తర అక్షాంశం ఉత్తర ధ్రువం
90o దక్షిణ అక్షాంశం దక్షిణ ధ్రువం

 

* శీతోష్ణస్థితి ప్రాముఖ్యతను అనుసరించి కొన్ని అక్షాంశాలను ప్రత్యేకమైన పైన పేర్కొన్న పేర్లతో పిలుస్తారు.

* అక్షాంశాలను ప్రాతిపదికగా చేసుకొని భూగోళాన్ని మూడు ప్రధాన శీతోష్ణస్థితి మండలాలుగా విభజించారు.

1) ఆయనరేఖ లేదా ఉష్ణ మండల ప్రాంతం: భూమధ్యరేఖకు ఇరువైపులా 23 1/2o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉండే భౌగోళిక ప్రాంతాలు. ఇక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.

2) ఉప ఉష్ణమండల మండల ప్రాంతాలు: వీటిని ఉప ఆయన రేఖా లేదా సమశీతోష్ణ మండల ప్రాంతాలు అని కూడా అంటారు. ఇవి 23 1/2o డిగ్రీల నుంచి 66 1/2o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న భౌగోళిక ప్రాంతాలు. ఇక్కడ సూర్యకిరణాలు ఉష్ణమండల ప్రాంతాలతో పోలిస్తే కొద్దిగా ఏటవాలుగా పడటం వల్ల ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ, తక్కువ కాకుండా ఉంటాయి.

3) ధ్రువ లేదా అతిశీతల ప్రాంతాలు: ఇవి 66 1/2o నుంచి  90o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య గల భౌగోళిక ప్రాంతాలు. ఇక్కడ సూర్యకిరణాలు ఏటవాలుగా పడటం వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

 

రేఖాంశాలు

  భూమధ్యరేఖను ఖండిస్తూ ఉత్తర, దక్షిణ ధ్రువాల గుండా ఒక డిగ్రీ అంతరంతో గీసిన ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. ఇవి అర్ధవృత్తాలు. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశాల్లో ఒకేసారి మిట్టమధ్యాహ్నం అవుతుంది కాబట్టి వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తారు.మొత్తం రేఖాంశాల సంఖ్య 360. ఇందులో 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీనిచ్‌ రేఖాంశం అని పిలుస్తారు. కారణం ఇది లండన్‌ పట్టణంలోని థేమ్స్‌ నదీ తీరాన ఉన్న గ్రీనిచ్‌ పట్టణం మీదుగా వెళ్లడమే. దీన్నే ‘అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం’ అని కూడా అంటారు.

  గ్రీనిచ్‌ రేఖాంశం భూగోళాన్ని నిట్టనిలువుగా రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. దీనికి తూర్పుగా ఉన్న అర్ధభాగాన్ని పూర్వార్ధ గోళం, పశ్చిమంగా ఉన్న అర్ధ భాగాన్ని పశ్చిమార్ధ గోళం అని పిలుస్తారు. 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పున ఉండే 179 రేఖాంశాలను  తూర్పు రేఖాంశాలు, పశ్చిమంగా ఉండే 179 రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలు అని అంటారు. 

   180oల తూర్పు, పశ్చిమ రేఖాంశం ఒకటే. ఈ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ రేఖాంశాల మధ్య దూరం తగ్గుతూ ధ్రువాల వద్ద సున్నాగా ఉంటుంది. భూమధ్యరేఖ వద్ద రేఖాంశాల మధ్య దూరం 69.172 మైళ్లు లేదా 111.4 కిలోమీటర్లు. గ్రీనిచ్‌ రేఖాంశం నుంచి తూర్పు, పశ్చిమ దిశల్లో 180o రేఖాంశం వైపు వెళ్లేకొద్దీ రేఖాంశాల పరిమాణం స్థిరంగా ఉంటూ వాటి విలువలు పెరుగుతాయి.

స్థానిక కాలం

  ఒక రేఖాంశంపై పగలు సూర్యుడు నడి నెత్తిన ప్రకాశించినప్పుడు ఆ సమయాన్ని 12 గంటలుగా తీసుకొని నిర్ణయించిన కాలాన్ని స్థానిక కాలమానం అంటారు. గ్రీనిచ్‌ వద్ద సూర్యుడు నడి నెత్తిన ప్రకాశించినప్పుడు పగలు 12 గంటలు కాలాన్ని చూపే గడియారాన్ని కాలమాపకం (క్రోనోమీటర్‌) అంటారు. సముద్రయానం చేసేవారు ఏ రేఖాంశంపై ఉన్నారో కనుక్కోవడానికి కాలమాపకం ఉపయోగపడుతుంది.

 

ప్రామాణిక కాలం (స్టాండర్డ్‌ టైమ్‌)

  ఒక ప్రాంతం మొత్తం లేదా ఒక దేశం నుంచి వెళ్లే రేఖాంశాల్లో ఏదైనా మధ్య రేఖాంశాన్ని తీసుకొని ఆ రేఖాంశంపై ఉన్న స్థానిక కాలాన్ని ఆ ప్రాంతం మొత్తానికి వర్తించే విధంగా గడియారాల్లో నిర్ధారించుకునే కాలమే ప్రామాణిక కాలం (GST). భారతదేశంలో 82 1/2oల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది మనదేశంలో మొత్తం అయిదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత పరిపాలనా విభాగం మీదుగా వెళుతుంది. అవి... ఆంధ్రప్రదేశ్‌ (కాకినాడ), ఒడిశా (కటక్‌), చత్తీస్‌గఢ్‌ (రాయ్‌పూర్‌), మధ్యప్రదేశ్‌ (వా, జబల్‌పూర్‌), ఉత్తర్‌ప్రదేశ్‌ (వారణాసి, అలహాబాద్‌);  పాండిచ్చేరి పరిపాలనా విభాగమైన యానాం. 

  ప్రపంచంలో తూర్పు, పడమరలుగా ఎక్కువ వెడల్పు గల అవిచ్ఛిన్న దేశాలు ఒకటి కంటే ఎక్కువ ప్రామాణిక కాలాలను అనుసరిస్తున్నాయి. అవి.. రష్యా (9), యూఎస్‌ఏ (6), కెనడా (6), ఆస్ట్రేలియా (3). కొన్ని యూరోపియన్‌ దేశాలు, అమెరికా ఇప్పటికీ వలసవాద ప్రాంతాలను కలిగి ఉన్నాయి. వాటితో కలిపితే ప్రపంచంలో ఎక్కువ ప్రామాణిక కాలాలు ఉన్న దేశం ఫ్రాన్స్‌ (12), యూఎస్‌ఏ (11), రష్యా (9), ఆస్ట్రేలియా (8).

  భూమి తన అక్షంపై ఒకసారి తిరగడానికి అంటే 360o దూరం తిరగడానికి 24 గంటల కాలం పడుతుంది. కాబట్టి భూమి 1o దూరం లేదా ఒక రేఖాంశం దూరం జరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. భూమి సూర్యుడి చుట్టూ పడమర నుంచి తూర్పునకు తిరగడం వల్ల తూర్పు రేఖాంశాలు సూర్యుడికి ముందుగా ఎదురుగా వస్తాయి. అందువల్ల తూర్పు రేఖాంశాల కాల సమయం ముందుగా, పశ్చిమ రేఖాంశాల్లో వెనుకగా ఉంటుంది. కాబట్టి గ్రీనిచ్‌ రేఖాంశం లేదా స్థానిక సమయం నుంచి తూర్పునకు వెళ్లేకొద్దీ ఒక్కో రేఖాంశాన్ని దాటడానికి పట్టే 4 నిమిషాల సమయాన్ని స్థానిక సమయానికి కలపాలి. అదేవిధంగా గ్రీనిచ్‌ రేఖాంశం లేదా ఏదైనా స్థానిక సమయం నుంచి పశ్చిమానికి వెళ్లే కొద్దీ ఒక్కో రేఖాంశాన్ని దాటడానికి పట్టే 4 నిమిషాల సమయాన్ని స్థానిక సమయం నుంచి తీసివేయాలి.

  భారతదేశం గ్రీనిచ్‌ రేఖాంశానికి తూర్పున ఉండటం వల్ల భారత ప్రామాణిక కాలం గ్రీనిచ్‌ స్థానిక సమయానికి 5 1/2 గంటల ముందు ఉంటుంది. ఉదాహరణకు గ్రీనిచ్‌లో సమయం మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు భారతదేశంలో సమయం సాయంత్రం 5 1/2 గంటలు అవుతుంది. ప్రపంచం మొత్తాన్ని 15o అంతరంతో 24 కాల మండలాలుగా విభజించారు. అందువల్ల ఒక కాల మండలానికి మరో కాల మండలానికి మధ్య వ్యత్యాసం ఒక గంట.

 

అంతర్జాతీయ దినరేఖ

  180o రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఈ రేఖాంశానికి ఒకవైపున ఒక తేదీ ఉంటే, మరోవైపు ఇంకో తేదీ ఉంటుంది. అందువల్ల రేఖను దాటేవారు ఒక దినాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే దీనికి అంతర్జాతీయ దినరేఖ అనే పేరు వచ్చింది. ఉదాహరణకు పశ్చిమ రేఖాంశాల నుంచి ఈ రేఖను దాటి తూర్పు రేఖాంశాల్లోకి ప్రయాణించేవారు ఒక రోజును కలపాల్సి ఉంటుంది. అంటే వారు ఒక రోజును నష్టపోతారు. అదేవిధంగా తూర్పు రేఖాంశాల నుంచి ఈ రేఖను దాటి పశ్చిమ రేఖాంశాల్లోకి ప్రవేశించేవారు ఒక రోజును వెనక్కి మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే వారు ఒకరోజు లాభాన్ని పొందుతారు. 

  అంతర్జాతీయ దినరేఖ తిన్నగా ఉండదు. అక్కడక్కడ వంగి ఉంటుంది. దీనికి కారణం ఒక దేశం పరిపాలనలో ఉన్న భూభాగాల గుండా ఈ రేఖ వెళ్లినప్పుడు ఆ దేశంలో రెండు రకాల కాల సమయాలు నమోదవుతాయి. దీనివల్ల ఆ భూభాగంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. దీన్ని నివారించేందుకు ఆ భూభాగం లేదా దీవులకు ఏదో ఒక వైపు సముద్రంలోకి వచ్చేలా గీయడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. అందువల్ల అంతర్జాతీయ దినరేఖను కచ్చితంగా 180o వక్రరేఖ అని పిలుస్తారు. ఈ మార్పు ఒక దేశంలో లేదా దీవుల సముదాయంలో ఒకే కాలంలో రెండు విభిన్న రోజులు లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. 180o తూర్పు, పశ్చిమ రేఖాంశం చాలా వరకు పసిఫిక్‌ మహాసముద్రంలోని ఏలూషియస్, టొంగా, తువాలు, ఫిజీ, కిరిబటి లాంటి దీవులు, బేరింగ్‌ జలసంధి మీదుగా వెళుతుంది.

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣ ప్ర‌పంచ భౌగోళిక నైసర్గిక పరిస్థితులు

 మ‌హాస‌ముద్రాలు-భౌతిక ల‌క్ష‌ణాలు

  సముద్ర జల వనరులు - ఉపయోగం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 07-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌