• facebook
  • whatsapp
  • telegram

భూ అంతర్నిర్మాణం

అవక్షేప అగ్నిమయ రూపాంతర శిలలమయం!

  భూమి లోపల ఏముంది? అంతర నిర్మాణం ఎలా ఉంటుంది? అంతా మట్టే ఉంటుందా? మరేమైనా ఉందా? నీళ్లు, ఖనిజాలు, శిలలులాంటివి ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలు. పరీక్షల కోణంలోనూ ముఖ్యమైన ప్రశ్నలు. వాటికి సమాధానాలు కావాలంటే భూ అంతర్నిర్మాణం గురించి చదవాలి.

  

భూఉపరితలంపై జరిగే అనేక సంకోచ, వ్యాకోచాలు; ఊర్ధ్వ, అథో, పార్శ్వ చలనాలు; ప్రకృతిపరమైన మార్పులకు భూ అంతర్భాగంలో ఏర్పడే వివిధ రకాల బలాలు లేదా శక్తులే కారణం. వాటి గురించి తెలియాలంటే భూఅంతర్భాగం గురించి అధ్యయనం చేయాలి. భూఅంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారాలు లేవు. భూకంప తరంగాలు, ఉల్కాపాతాలను పరిశీలించడం లాంటి పరోక్ష విధానాలు మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా భూఉపరితలం నుంచి భూకేంద్రం వైపు వెళ్లే కొద్దీ కొన్ని మార్పులు జరుగుతున్నట్లు గుర్తించారు.  

* భూఉపరితలం నుంచి ప్రతి 32 మీటర్ల లోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు 1oC చొప్పున పెరుగుతాయి.

* భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు 6000oC ఉన్నట్లు అంచనా వేశారు.

* భూకేంద్రం వైపు వెళ్లే కొద్దీ భూమి విశిష్ట సాంద్రతలు, పీడన బలాలు పెరుగుతుంటాయని గుర్తించారు.  

* భూ వ్యాసార్ధం 6400 కి.మీ. వరకు ఉన్నట్లు లెక్కించారు. 

ఈ అంశాల ఆధారంగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు భౌతిక, రసాయనిక లక్షణాల పరంగా భూమిని వివిధ పొరలుగా విభజించారు. 

  భూ అంతర్నిర్మాణాన్ని సూయస్‌ అనే శాస్త్రవేత్త సియాల్, సిమా, నిఫే అనే మూడు పొరలుగా; వాండర్‌ గ్రాచ్, గూటెన్‌బర్గ్‌ అనే శాస్త్రవేత్తలు నాలుగు పొరలుగా విభజించారు.

 

సాధారణంగా భూఅంతర్నిర్మాణాన్ని మూడు పొరలుగా విభజించవచ్చు. 

1) భూపటలం లేదా లిథో  స్ఫియర్‌ లేదా శిలావరణం  

2) భూప్రావారం లేదా మీసోస్ఫియర్‌

3) భూకేంద్ర మండలం లేదా బారిస్ఫియర్‌

 

భూపటలం 

భూఉపరితలం నుంచి సగటున 40 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉన్న ఘనస్థితిలోని బాహ్యపొర. మొత్తం భూ ఘనపరిమాణంలో ఇది 0.5 శాతాన్ని ఆక్రమించి ఉంటుంది. భూపటలం పైభాగం అవక్షేప శిలాపదార్థాలతో, లోపలి భాగం అగ్నిమయ, రూపాంతర శిలలతో ఏర్పడి ఉంటుంది. దీని మందం ఖండ భూభాగాల దిగువన 35 కి.మీ., సముద్రాల దిగువన 5 కి.మీ. నుంచి 10 కి.మీ. ఉంటుంది. భూపటలంలో అధికంగా ఉన్న మూలకం ఆక్సిజన్‌ (42%), సిలికాన్‌ (27%), అల్యూమినియం (8%), ఐరన్‌ (5 - 6%). భూపటలంలో అధికంగా ఉన్న ఖనిజ సమ్మేళనం సిలికా. 

 

భూపటల ఉపరితల దృశ్యంపై రెండు భాగాలు గుర్తించవచ్చు. 

 

ఖండ భూభాగాలు: ఇది సిలికాన్, అల్యూమినియం ఖనిజ మూలకాలతో ఏర్పడి ఉండటం వల్ల దీన్ని సియాల్‌ పొర అని పిలుస్తారు. ఇందులో గ్రానైట్‌కు సంబంధించిన శిలలు ఎక్కువగా ఉండి తేలికగా ఉంటుంది. దీని విశిష్ట సాంద్రత 2.5 - 3.0.

 

సముద్ర భూతలాలు: ఇవి ప్రధానంగా సిలికాన్, మెగ్నీషియం మూలకాలతో ఏర్పడి ఉండటం వల్ల వీటిని సిమా పొర అని పిలుస్తారు. సముద్రాల అడుగు భాగం దీనితో ఏర్పడి ఉంటుంది. ఇది బసాల్ట్‌ శిలలతో ఏర్పడి అధిక బరువును కలిగి ఉంటుంది. దీని విశిష్ట సాంద్రత 3.0 - 3.5. 

* సియాల్‌ పొర సిమా పొర కంటే తేలికగా ఉండటం వల్ల ఖండాలు సముద్రంపై తేలియాడుతున్నట్లు కనిపిస్తాయి. సియాల్, సిమా పొరలను వేరుచేసే సరిహద్దును కాన్రాడ్‌ డిస్‌కంటిన్యూటీ అంటారు.

 

భూప్రావారం 

భూపటలం నుంచి 2900 కి.మీ. వరకు వ్యాపించి ఉన్న భూఅంతర్భాగం. దీని విశిష్ట సాంద్రత 3.5 నుంచి 5.5 వరకు ఉంటుంది. ఇది భూమి మొత్తం ఘనపరిమాణంలో 16 శాతాన్ని ఆక్రమించి ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు.

ఎగువ ప్రావారపు పొర: ఇది భూపటలం నుంచి దాదాపు 100 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉన్న ఘనస్థితిలోని భూప్రావారం. భూపటలం, ఎగువ ప్రావారపు పొరలను కలిపి శిలావరణం లేదా ఆస్మావరణం అని పిలుస్తారు. ఇది పూర్తిగా ఘనరూపంలో ఉంటుంది. ఇందులో భూఉపరితలంతో పాటు సముద్ర భూతలం కూడా ఉంటుంది.

దిగువ ప్రావారపు పొర: ఇది పాక్షిక ద్రవ, ఘనస్థితిలో (కొల్లాయిడల్‌) ఉండి ప్రధానంగా సిలికేట్స్‌ మిశ్రమంతో ఏర్పడి ఉంటుంది. అందువల్ల దీన్ని అంతర సిలికేట్‌ పొర అంటారు.

* ఎగువ ప్రావారపు పొర, దిగువ ప్రావారపు పొరకు మధ్య 90 కి.మీ. మందంతో ప్లాస్టిక్‌ ధర్మాలు కలిగిన పలుచని భూభాగం ఉంటుంది. దీన్ని ఎస్తనోస్ఫియర్‌ లేదా ప్రతిబలరహిత ఆవరణం అని పిలుస్తారు. దీని మీద సముద్రాలు, ఖండాలతో కూడిన శిలావరణ పలకాలు కదులుతూ ఉంటాయి.  

* భూపటలం, భూప్రావారాన్ని వేరుచేస్తున్న పొర మెహోరోవిక్‌ డిస్‌కంటిన్యూటీ. 

 

భూకేంద్ర మండలం 

  ఇది భూప్రావరం నుంచి దాదాపు 3300 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉంటుంది. ప్రధానంగా నికెల్, ఐరన్‌ మూలకాలతో ఏర్పడి ఉండటం వల్ల దీన్ని నిఫే పొర అని కూడా పిలుస్తారు. దీని విశిష్ట సాంద్రత 11 నుంచి 13 వరకు ఉంటుంది. ఇది భూమి మొత్తం పరిమాణంలో 85.35 శాతాన్ని ఆక్రమించి ఉంటుంది. దీన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు.

  బాహ్య భూకేంద్ర మండలం: భూఅంతర్భాగంలో ద్రవస్థితిలో ఉన్న ప్రాంతం బాహ్య భూకేంద్ర మండలం. ఇది పూర్తిగా ద్రవస్థితిలో ఉంటుంది. 2900 నుంచి 4980 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది. 

  మధ్య భూకేంద్ర మండలం: ఇది పాక్షిక ద్రవ, ఘనస్థితిలో ఉండే పలుచని పొర.

  అంతర భూకేంద్ర మండలం: ఇది పూర్తిగా ఘనస్థితిలో ఉంటుంది. 5 వేల నుంచి 5120 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది. భూకేంద్ర మండలం, భూప్రావారాన్ని వేరు చేస్తున్న పొరను గూటెన్‌బర్గ్‌ డిస్‌కంటిన్యూటీ అంటారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భూపటల ఉపరితల దృశ్యంపై ఖండ భూభాగాలు ఎంత శాతాన్ని ఆక్రమించి ఉన్నాయి?

1) 71%    2) 29%    3) 21%    4) 30%

 

2. భూపటల ఉపరితల దృశ్యంపై సముద్ర భూతలాలు ఎంత శాతాన్ని ఆక్రమించి ఉన్నాయి?

1) 71%    2) 29%    3) 21%    4) 79%

 

3. సియాల్‌ పొర అని దేన్ని పిలుస్తారు?

1) ఖండ భూభాగాలు   2) సముద్ర భూతలాలు   3) భూప్రావారం    4) భూకేంద్ర మండలం

 

4. సిమాపొర అని దేన్ని పిలుస్తారు?

1) భూపటలం    2) సముద్ర భూతలాలు    3) భూప్రావారం    4) భూకేంద్ర మండలం

 

5. నిఫే పొర అని దేన్ని పిలుస్తారు?

1) ఖండ భూభాగాలు    2) సముద్ర భూతలాలు

3) భూప్రావారం       4) భూకేంద్ర మండలం

 

6. మీసోస్ఫియర్‌ అని దేన్ని పిలుస్తారు?

1) ఖండ భూభాగాలు    2) సముద్ర భూతలాలు    3) భూప్రావారం    4) భూకేంద్ర మండలం

 

7. మెహోరోవిక్‌ డిస్‌కంటిన్యూటీ వేటి మధ్య ఉంటుంది?

1) సియాల్‌ - సిమా పొర

2) భూపటలం - భూప్రావారం

3) భూప్రావారం - భూకేంద్ర మండలం

4) బాహ్య భూకేంద్రం మండలం - మధ్య భూకేంద్ర మండలం

 

8. భూమిలో అధికంగా లభ్యమయ్యే మూలకం?

1) ఆక్సిజన్‌  2) సిలికాన్‌  3) అల్యూమినియం  4) ఐరన్‌

 

9. భూ అంతర్భాగంలో ద్రవస్థితిలో ఉన్న ప్రాంతం?

1) భూపటలం  2) భూప్రావారం  3) బాహ్య భూకేంద్ర మండలం  4) అంతర్భూకేంద్రమండలం.

 

10. భూ అంతర్భాగంలో ఉష్ణ జనిత సంవహన ప్రవాహాలు జనించే ప్రాంతం?

1) మీసో స్ఫియర్‌     2) లిథోస్ఫియర్‌  3) ఎస్తనోస్ఫియర్‌   4) బారిస్ఫియర్‌ 

 

11. గూటెన్‌బర్గ్‌ డిస్‌కంటిన్యూటీ ఏ ప్రాంతాల మధ్య ఉంది?

1) సియాల్‌ - సిమా పొరలు

2) భూపటలం - భూప్రావారం

3) భూప్రావారం - భూకేంద్ర మండలం

4) బాహ్య భూకేంద్ర మండలం - మధ్య భూకేంద్ర మండలం

 

సమాధానాలు

1-2,   2-1,   3-1,   4-2,   5-4,   6-3,   7-2,   8-4,   9-3,   10-3,   11-3.

 

రచయిత: సక్కరి జయకర్‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  ఖండచలన సిద్ధాంతం

 మ‌హాస‌ముద్రాలు-భౌతిక ల‌క్ష‌ణాలు

‣ భూమి ఆవిర్భావం

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 25-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌