• facebook
  • whatsapp
  • telegram

భారత నైసర్గిక స్వరూపం - హిమాలయాలు

ఆ పర్వతాల్లోనే ఆకాశ దేవత!

  భూగోళశాస్త్రాన్ని ఒక క్రమంలో అధ్యయనం చేయాలంటే ముందుగా నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అందులో పర్వతాలు, కొండలు, పీఠభూములు,  మైదానాలు, ద్వీపాలు, ద్వీపకల్పాల గురించి ఉంటుంది. వైవిధ్య భౌగోళిక లక్షణాలతో కూడిన భారత ఉపఖండాన్ని పరిశీలిస్తే ప్రముఖంగా కనిపించేవి హిమాలయాలు.  పలుదేశాల్లో వీటి విస్తరణ, ఏర్పడిన తీరు, శిఖరాల ఎత్తులు, వాటి పేర్లు తదితరాంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

  ఒక ఖండానికి ఉండే విభిన్న లక్షణాలు, విశాలమైన భూభాగం లాంటి అంశాల వల్ల భారతదేశాన్ని ఉపఖండంగా వర్ణిస్తారు. ఇక్కడి నిమ్నోన్నత స్వరూపాలను పరిశీలిస్తే 1951 సెన్సస్‌ కమిషన్‌ రూపొందించిన అంచనా ప్రకారం దేశంలోని మొత్తం భూభాగంలో 10.7 శాతం ఎత్తయిన పర్వత ప్రాంతం, 18.6 శాతం కొండ ప్రాంతం, 27.7 శాతం పీఠభూమి, 43.3 శాతం మైదాన ప్రాంతం ఉన్నట్లు గుర్తించారు. భారత ద్వీపకల్పంలో ఉండే కఠిన శిలల ఆధారంగా ఈ ప్రాంతం 150 కోట్ల సంవత్సరాల కంటే ముందే ఏర్పడినట్లు తెలుస్తోంది. ద్వీపకల్ప భూభాగం తొలుత గోండ్వానా మహాఖండంలో భాగంగా ఉండేది. టెథిస్‌ అనే సముద్రం గోండ్వానా మహాఖండానికి ఉత్తరాన ఉండేది. టెథిస్‌ సముద్రానికి ఉత్తరాన ఉన్న అమెరికా, యురేషియా ఖండాలను అంగారా మహాఖండం అనేవారు. సుమారు 30 కోట్ల సంవత్సరాలకు పూర్వం (కార్బోనిఫెరస్‌ యుగం) గోండ్వానా భూమిలో అంతర్జనిత శక్తుల వల్ల పగుళ్లు ఏర్పడ్డాయి. వాటివల్ల భూమి కుంగిపోయి, నీటి ప్రవాహాలు ఏర్పడటంతో ఆ ప్రవాహంలో కొట్టుకొచ్చిన మట్టిరేణువులు పొరలుగా ఏర్పడి శిలలుగా మారాయి. వాటినే గోండ్వానా శిలలు అంటారు. వాటి కింద ఉన్న వృక్ష సంపద కాలక్రమంలో బొగ్గుగా మారింది. వీటి మందం 6 నుంచి 12 మీటర్లు. ఇలా బొగ్గు ఏర్పడిన యుగాన్ని కార్బోనిఫెరస్‌ యుగం అంటారు.

  హిమాలయాల పుట్టుక 6 కోట్ల సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైంది. ఇవి ఏర్పడటానికి సుమారు 4 కోట్ల సంవత్సరాలు పట్టింది. భూ అభినతిలో (జియోసింక్లైన్‌) ఏర్పడిన నిక్షేపాలు ఖండ చలనం వల్ల ముడుతలు పడి ఎత్తు పెరగడం ప్రారంభమైంది. హిమాలయ పర్వతాలు ముడుతలు పడటానికి కారణం దక్షిణ భారత ద్వీపకల్పం ఉత్తరం, ఈశాన్యం వైపునకు; అంగారా భూభాగం దక్షిణం, పశ్చిమం వైపునకు జరగడమని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ ముడుతలు పడిన నిక్షేపాలు అంతర్జనిత శక్తుల వల్ల పైకి నెట్టుకువచ్చి మొదట ప్రస్తుతం మనకు కనిపించే ఎత్తయిన శ్రేణులు ఏర్పడ్డాయి. తర్వాత మధ్య భాగం, ఆ తర్వాత వాటి దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. 90 - 120 మీ. ఎత్తున్న శివాలిక్‌ కొండలు హిమాలయాల దిగువన ఉండటం వల్ల వీటిని పర్వతపాద హిమాలయాలు అంటారు. 25 వేల సంవత్సరాలకు పూర్వం గంగా, సింధూ మైదానాలు ఏర్పడ్డాయి.

  హిమాలయాలు ఏర్పడిన కాలంలోనే దక్షిణాన ద్వీపకల్ప భాగం అగ్నిపర్వత ప్రక్రియకు లోనవడంతో శిలాద్రవం పైకి వచ్చి చాలా ఎత్తుగా ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడిన శిలాద్రవం క్రమంగా కోతకు గురై నునుపుగా ఉండే పడమటి కనుమలు ఏర్పడ్డాయి. భారత భూభాగాన్ని అయిదు ముఖ్య స్వాభావిక మండలాలుగా విభజించవచ్చు. అవి హిమాలయ పర్వత ప్రాంతం, గంగా - సింధూ మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీరప్రాంత మైదానాలు, దీవులు.

 

హిమాలయ పర్వతాలు

  ఇవి భారతదేశానికి ఉత్తర దిక్కున తూర్పు, పడమరలుగా విస్తరించి ఉన్నాయి. వీటి పొడవు 3000 కి.మీ., వెడల్పు 300 - 350 కి.మీ. ప్రపంచ పర్వత శ్రేణులన్నింటిలో హిమాలయ పర్వతాలే నూతన పర్వతాలు. ఇవి సుమారు 5 లక్షల చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. హిమాలయాల ఎగువ భాగాలు నదుల క్రమక్షయ క్రియల ద్వారా కోతకు గురై హిమానీ నదాల ప్రవాహం వల్ల ఇక్కడ ఎక్కువ లోతులో జు ఆకారపు లోయలు ఏర్పడినట్లు కనిపిస్తాయి. హిమాలయాలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.

1) ఉన్నత హిమాలయాలు (హిమాద్రి శ్రేణులు)

2) మధ్య హిమాలయాలు (హిమాచల్‌/మధ్య హిమాలయాలు)

3) బాహ్య హిమాలయాలు (శివాలిక్‌ కొండలు)

4) ట్రాన్స్‌ హిమాలయాలు (టిబెట్‌/టెథిస్‌ హిమాలయాలు)

 

ఉన్నత హిమాలయాలు: వీటినే ఉత్తర హిమాలయాలు, హిమాద్రి శ్రేణులు, ఇన్నర్‌ హిమాలయాలు అని కూడా అంటారు. ఎవరెస్ట్‌ శిఖరం (8,848 మీ.), రీ2 - గాడ్విన్‌ ఆస్టిన్‌ (8,611 మీ.), కాంచనగంగా (8,598 మీ.), ధవళగిరి (8,172 మీ.), నంగప్రభాత్‌ (8,126 మీ.), అన్నపూర్ణ (8,078 మీ.) ఈ శ్రేణిలోనే ఉన్నాయి. ఈ శ్రేణిని గ్రేటర్‌ హిమాలయాలు అని కూడా పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 6,100 మీ., వెడల్పు 120 - 190 కి.మీ. ప్రపంచంలో ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ కాగా, భారతదేశంలో ఎత్తయిన శిఖరం కాంచనగంగా. ఎవరెస్ట్‌ను టిబెట్‌లో చోమోలుంగ్మా (ఆకాశ దేవత), చైనాలో కోమోలాంగ్మా (ప్రపంచ మాత), నేపాల్‌లో సాగరమాత అని పిలుస్తారు. ఎవరెస్ట్‌ను 1841 - 52 మధ్య జార్జ్‌ ఎవరెస్ట్‌ అనే ఆంగ్లేయుడు కనుక్కున్నాడు. 1865లో ఆయన పేరు మీదనే దీనికి ఎవరెస్ట్‌ అని పేరు పెట్టారు. దీని పాత పేరు శిశ్రీజు ్బశి15్శ.

 

మధ్య హిమాలయాలు: వీటినే హిమాచల్‌ శ్రేణులు అని కూడా అంటారు. వీటి సరాసరి ఎత్తు 3,300 మీ. ఇవి 75 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఈ శ్రేణిలోని చాలా శిఖరాల ఎత్తు 5,000 మీ. కంటే ఎక్కువ. హిమాచల్‌ప్రదేశ్‌ ఈ శ్రేణిలోనే ఉంది. ముస్సోరి, సిమ్లా, డార్జిలింగ్‌లు కూడా ఉన్నాయి. మధ్య హిమాలయాల దక్షిణపు వాలు ఎక్కువగా, ఉత్తరం వైపు వాలు తక్కువగా ఉంటుంది. ఇక్కడ సతతహరిత, శృంగాకార అడవులు ఉన్నాయి. పీర్‌పంజల్‌ శ్రేణి, ధౌలధర్‌ శ్రేణి, మహాభారత శ్రేణి, కశ్మీర్‌ లోయ దీనిలో భాగమే.

 

బాహ్య హిమాలయాలు: వీటినే హిమాలయాల పాద గిరులు, పర్వత పాద హిమాలయాలు అని అంటారు. ఇవి 600 మీ. - 1200 మీ. సరాసరి ఎత్తుతో 2,400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. వీటి వెడల్పు 8 - 48 కి.మీ. మధ్య ఉంటుంది. ఈ శివాలిక్‌ కొండలు ప్రధాన హిమాలయాల ఒండ్రుమట్టి క్రమక్షయం వల్ల ఏర్పడ్డాయి. ఈ శ్రేణిలో అనేక లోయలు ఉన్నాయి. వీటినే డూన్‌లు అంటారు. డెెహ్రాడూన్‌ ఇక్కడే ఉంది.

 

ట్రాన్స్‌ హిమాలయాలు:  హిమాద్రికి ఉత్తరాన జమ్మూ-కశ్మీర్‌ (లద్దాఖ్‌), టిబెట్‌ భూభాగాల్లో ఈ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో కారకోరం, లద్దాఖ్‌ (రాకపోసి), జస్కర్‌ పర్వత శ్రేణులు ఉన్నాయి.

 

కశ్మీర్‌ లోయ: ఇది అభినతి లోయ. గతంలో సరస్సుగా ఉండి ఒండ్రుమట్టితో పూడుకుపోయింది. దీనికి ఉత్తరాన ఉన్నత హిమాలయాలు, దక్షిణాన పీర్‌పంజల్‌ శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. కశ్మీర్‌ లోయ 150 కి.మీ. పొడవు, 80 కి.మీ. వెడల్పుతో ఆగ్నేయ దిశ నుంచి వాయవ్య దిశగా వ్యాపించి ఉంది. దీని సరాసరి ఎత్తు 1,700 మీ.

 

హిమాలయాల్లో ఎత్తయిన శిఖరాలు - వాటి ప్రదేశాలు

 

శిఖరం ఎత్తు ప్రదేశం
ఎవరెస్ట్‌ 8848 మీ. నేపాల్‌
k2గాడ్విన్‌ ఆస్టిన్‌ 8611 మీ. జమ్మూ కశ్మీర్‌ (పీఓకే)
కాంచనగంగా 8598 మీ.  భారత్‌ (సిక్కిం)
లోత్‌సే - 1 8501 మీ. నేపాల్‌
మకాలు 8481 మీ. నేపాల్‌
ధవళగిరి 8172 మీ. నేపాల్‌
మన్షాలు 8156 మీ. నేపాల్‌
చో-ఓ-యు 8153 మీ. నేపాల్‌
నంగప్రభాత్‌ 8126 మీ. భారత్‌ (జమ్మూ కశ్మీర్‌)
అన్నపూర్ణ 8078 మీ. నేపాల్‌
గేఘర్‌ బమ్‌ 8068 మీ. నేపాల్‌
నందాదేవి 7817 మీ. భారత్‌ (ఉత్తరాఖండ్‌)
కామెట్‌ 7756 మీ. భారత్‌ (ఉత్తరాఖండ్‌)
నామ్చాబర్వా 7754 మీ. భారత్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌) - టిబెట్‌
బద్రీనాథ్‌ 7138 మీ. భారత్‌ (ఉత్తరాఖండ్‌)
కేదార్‌నాథ్‌ 6970 మీ. భారత్‌ (ఉత్తరాఖండ్‌)

 

ముఖ్యమైన హిమానీ నదాలు

హిమానీ నదం ప్రాంతం పొడవు
సియాచిన్‌ కారాకోరం (నుబ్రా వ్యాలీ) 75 కి.మీ.
ఫెడ్‌చెంకో కారాకోరం (షామిర్థు) 74 కి.మీ.
హిస్సర్‌ కారాకోరం (హుంజా వ్యాలీ) 62 కి.మీ.
భైపో కారాకోరం (గిల్‌గిత్‌ - బాలిస్థాన్‌) 60 కి.మీ.
బోల్తారో కారాకోరం (గిల్‌గిత్‌ - బాలిస్థాన్‌) 58 కి.మీ.
బాతుర కారకోరం (హుంజా జిల్లా, గిలిగిత్‌ - బాలిస్థాన్‌) 58 కి.మీ.

 

హిమాలయాల్లోని వివిధ పర్వత శ్రేణులు

పీర్‌పంజల్‌ శ్రేణి: ఇది జమ్మూ కశ్మీర్‌లో ఉంది. హిమాచల్‌ పర్వత శ్రేణిలో ఇది పొడవైంది. దీన్ని గేట్‌ వే ఆఫ్‌ శ్రీనగర్‌ అని పిలుస్తారు. 

ధౌలధర్‌ శ్రేణి: హిమాచల్‌ ప్రదేశ్‌లో (సిమ్లా) ఉంది.

నాగటిబ్బా, ముస్సోరి, మహాభారత్‌ శ్రేణి: ఇవి ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి. 

కారాకోరం శ్రేణి: ఇది వాయవ్య కశ్మీర్‌లో ఉంది. వీటినే కృష్ణగిరి పర్వతాలు అంటారు. వీటిని ఆసియా భూభాగపు వెన్నెముక (బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ ఏసియా) అని పిలుస్తారు.

లద్దాఖ్‌ శ్రేణి: సింధు, సియాక్‌ నదుల మధ్య ఉంది. జస్కర్‌ శ్రేణికి సమాంతరంగా ఉంది.

జస్కర్‌ శ్రేణి: హిమాద్రి పర్వతాల నుంచి 80o తూర్పు రేఖాంశం వద్ద వాయవ్య దిశగా విడిపోయిన పర్వత శ్రేణి.

 

రచయిత: డాక్టర్‌ జి.ఆనంద్‌

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 భారతదేశం - వ్యవసాయం

 భారతదేశం - పరిశ్రమలు

  సహజ ఉద్భిజ సంపద

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 04-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌