• facebook
  • whatsapp
  • telegram

వాతావరణ పీడనం

గాలి బరువు ఎక్కువైనా.. తక్కువైనా!

 

గాలికి బరువు ఉంటుంది తెలుసా? అది భూమిపై కలుగజేసే ఒత్తిడే పీడనం. అది ఎక్కువైతే అధిక పీడనం, తక్కువైతే అల్ప పీడనం. వాతావరణంలోని మార్పుల‌న్నీ వాటి ప్రభావాలే. ఆ పీడనాలు ఎలా ఏర్పడతాయి? ఒకచోట తక్కువ, మరోచోట ఎక్కువ ఎందుకు ఉంటాయి? ఈ అంశాలను ప్రపంచ భూగోళశాస్త్రం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 


సృష్టిలో ప్రతి వస్తువుకు కొంత బరువు ఉన్నట్లు భూవాతావరణానికి 56,000 కోట్ల టన్నుల బరువు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. భూవాతావరణం ఒత్తిడి రూపంలో భూమిపై కలగజేసే బరువే వాతావరణ పీడనం. శాస్త్రీయంగా చెప్పాలంటే ప్రమాణ వైశాల్యం ఉన్న భూభాగంపై ఉండే వాతావరణ బరువును వాతావరణ పీడనం అంటారు. గాలికి బరువు ఉంటుందని మొదటగా నిరూపించిన శాస్త్రవేత్త గెలీలియో.


సమాన పీడనం ఉండే ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోబార్స్‌ అంటారు. వాయువు పీడనాన్ని కొలిచే పరికరం మానో మీటర్‌. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం భారమితి/బారోమీటర్‌. దీన్ని ఎవాంజెలిస్టా టారిసెల్లి అనే శాస్త్రవేత్త రూపొందించారు. భారమితిలో పాదరస మట్టం అకస్మాత్తుగా తగ్గడం తుపాను రాకను, పెరగడం సాధారణ వాతావరణాన్ని సూచిస్తుంది.


పీడనానికి ప్రమాణాలు మి.మీ. లేదా సెం.మీ లేదా మిల్లీబార్‌ లేదా పాస్కల్‌. సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనం 76 సెం.మీ. లేదా 760 మి.మీ. లేదా 1013.25 మిల్లీబార్‌లు. ప్రపంచంలో నమోదైన అత్యధిక పీడనం 1083.3 మిల్లీబార్‌లు (సైబీరియాలోని అగాటా), అత్యల్ప పీడనం 870 మిల్లీబార్‌లు (మెరియానా దీవుల్లోని టుఫ్‌ అని పిలిచే చక్రవాత కేంద్రం).

 

వాతావరణ పీడనం వివిధ అంశాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది.

ఉష్ణోగ్రత: ఏదైనా భౌగోళిక ప్రాంతంలో వాయు ఘనపరిమాణం స్థిరంగా ఉన్నప్పుడు ఆ ప్రాంత వాతావరణ పీడనానికి, దాని ఉష్ణోగ్రతకు విలోమ సంబంధం ఉంటుంది (బాయిల్ నియమం). ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ వాతావరణంలోని గాలి వేడెక్కి వ్యాకోచించడంతో దాని సాంద్రత తగ్గి పైకి సంవహనం చెందుతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో పీడనం తగ్గుతుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత తగ్గేకొద్దీ వాతావరణం చల్లబడుతుంది. దాంతో గాలి సంకోచించి సాంద్రత పెరిగి, వాతావరణ పీడనం ఎక్కువవుతుంది.

భూభాగాల ఎత్తు: ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు ఆ ప్రాంత వాతావరణ పీడనం భూభాగం ఎత్తుకు విలోమ సంబంధంలో ఉంటుంది (ఛార్లెస్‌ నియమం). సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది. భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ భూవాతావరణం తేలికైన వాయువులతో నిండి ఉండటం, ఆక్సిజన్‌ పరిమాణం తగ్గడమే అందుకు కారణం.

వాతావరణంలోని నీటిఆవిరి: పొడిగాలి బరువుతో పోలిస్తే తడిగాలి బరువు తక్కువగా ఉంటుంది. దాంతో పొడిగాలి ఉన్న భౌగోళిక ప్రాంతాల్లో వాతావరణ పీడనం అధికంగానూ, తడిగాలి ఉన్న ప్రాంతాల్లో తక్కువగానూ ఉంటుంది.


            ఈ మూడు వాతావరణ అంశాలు అన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఒకేవిధంగా లేకపోవడంతో కొన్ని అధిక పీడన ప్రాంతాలు, మరికొన్ని అల్పపీడన ప్రాంతాలు ఏర్పడతాయి. వీటినే పీడన మేఖలలు (ప్రెషర్‌ బెల్ట్‌) అని పిలుస్తారు. భూమిపై మొత్తం నాలుగు రకాలైన ఏడు పీడన మేఖలలు ఏర్పడతాయి. అవి..


ఎ) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల - 1

బి) ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖలలు - 2

సి) ఉపధ్రువ అల్పపీడన మేఖలలు - 2

డి) ధ్రువ అధిక పీడన మేఖలలు- 2

 


ఎ) భూమధ్యరేఖ అల్పపీడన మేఖల: భూమధ్యరేఖకు ఇరువైపులా 0 - 5o లేదా 10o ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న భౌగోళిక ప్రాంతాలనే ‘భూమధ్యరేఖ అల్పపీడన మేఖల’ అంటారు. ఈ ప్రాంతాన్నే ప్రశాంత మండలం/డోల్‌డ్రమ్స్‌ అని పిలుస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల గాలి వేడెక్కి, వ్యాకోచించి ఊర్ధ్వముఖంగా సంవహనం చెంది అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ మేఖలలో జరిగే అధిక సంవహన ప్రక్రియ వల్ల రోజూ సాయంత్రం ఉరుములు, మెరుపులతో తక్కువ సమయంలో అధికంగా వర్షం కురుస్తుంది.


బి) ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖల: 25o - 35oల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉండే భౌగోళిక ప్రాంతాలనే ‘ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖలలు’ అంటారు. ఉప ఆయనరేఖ అక్షాంశాలను అశ్వ అక్షాంశాలు అని పిలుస్తారు. భూమధ్యరేఖ ప్రాంతంలో వేడెక్కి పైకి లేచిన గాలులు కోరియాలిస్‌ ప్రభావం వల్ల 26o - 35o ల అక్షాంశాల మధ్య కనుమరుగవుతాయి. అందుకే ఈ ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. కనుమరుగయ్యే గాలులే వ్యాపార పవనాలకు మూలాధారం.


సి) ఉపధ్రువ అల్పపీడన మేఖల: 45o - 65ల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య భౌగోళిక ప్రాంతాలనే ఉపధ్రువ అల్పపీడన మేఖలలు అంటారు. భూభ్రమణం వల్ల పుట్టే అపకేంద్ర బలాలు భూమధ్యరేఖ నుంచి (ధ్రువాల వైపు వెళ్లేకొద్దీ భూమి కోణీయ ద్రవ్యవేగం పెరుగుతుంది) గాలి ఉన్నత అక్షాంశాల (కోణీయ వేగం తక్కువగా ఉన్న భూమధ్యరేఖ) వైపు పయనించడంతో ఉపధ్రువ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడుతుంది.


డి) ధ్రువ అధిక పీడన మేఖల: 75o - 90oల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉండే భౌగోళిక ప్రాంతాలనే ధ్రువ అధిక పీడన మేఖలలు అంటారు. ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ప్రసరించడంతో అల్ప ఉష్ణోగ్రత ఉంటుంది. దాంతో అధిక పీడనం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ ప్రాంతంలో గాలి చల్లబడి బరువెక్కుతుంది.


         భూమధ్యరేఖ అల్పపీడన మేఖల, ధ్రువ అధిక పీడన మేఖలలు ఉష్ణోగ్రతలో మార్పు వల్ల (థర్మల్‌ ఎఫెక్ట్‌) సంభవిస్తాయి. ఉప ఆయనరేఖ అధిక పీడన మేఖల, ఉపద్భవ అల్పపీడన మేఖలలు కోరియాలిస్‌ ప్రభావం (డైనమిక్‌ ఎఫెక్ట్‌) వల్ల ఏర్పడుతున్నాయి.


      భూమిపై ఒకే వాతావరణ పీడనం ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను సమభార రేఖలు (ఐసోబార్స్‌) అని పిలుస్తారు. పీడనంలో కలిగే మార్పులను సముద్ర మట్టానికి సవరించి వీటిని లెక్కించాలి. టోపోగ్రాఫిక్‌ మ్యాప్స్, సమభార రేఖలు దగ్గరగా ఉంటే ఆ ప్రాంతంలో పీడన వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందని, దూరంగా ఉంటే తక్కువగా ఉంటుందని గ్రహించాలి.

పీడన ప్రవణత (ప్రెషర్‌ గ్రేడియంట్‌): ప్రమాణ క్షితిజ సమాంతరంలోని పీడనంలో కలిగే మార్పురేటును పీడన ప్రవణత అంటారు. పీడన ప్రవణత రేఖ, సమభార రేఖలకు లంబంగా ఉంటుంది.


భూమిపై సమాన భూస్వరూపాలు, వాతావరణ అంశాలను తెలియజేసే ఊహారేఖలు


ఐసోపెల్త్‌: సమాన విలువలున్న (పీడనం, వర్షం, ఉష్ణోగ్రత) ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలు. 


ఐసోబార్స్‌: సమ పీడన ప్రాంతాలను కలుపుతూ గీసిన ఊహారేఖ. 


ఐసోబాత్‌: సమాన సముద్ర లోతులను కలుపుతూ గీసిన రేఖలు.


ఐసోబ్రాంట్స్‌: సమాన కాలాల్లో సంభవించే పిడుగులతో కూడిన తుపాన్లు ఏర్పడే ప్రదేశాలను కలుపుతూ గీసినవి.


ఐసోథర్మ్స్‌: సమాన ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసినవి. 


ఐసోహైట్స్‌: సమాన వర్షపాతాన్ని కలుపుతూ గీసిన రేఖలు.


ఐసోహిప్స్‌: సముద్ర మట్టం నుంచి సమాన ఎత్తు ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసినవి.


ఐసోసెసిమల్స్‌: సమాన భూకంప తీవ్రత ఉండే ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలు. 


ఐసోనిఫ్‌: సమాన మంచు ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలు. 


ఐసోరిమ్‌: సమాన తుహిన/తుషార‌ (శీతల వాతావరణం) ప్రదేశాలను కలుపుతూ గీసినవి.


ఐసోగోన్స్‌: సమాన అయస్కాంత పతనం కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలు. 


ఐసోహెలయిన్‌: సమాన లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసినవి.


ఐసోనెఫ్స్‌: సమాన మేఘావరణం కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలు.


హాట్‌లైన్‌: ఇది టెలికమ్యూనికేషన్‌ సంధానం. రెండు ప్రదేశాలు లేదా రెండు ఉద్ధృత ప్రాంతాల మధ్య ఉపయోగించే టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థలను కలిపే ఊహారేఖలు.


ప్లిమ్‌సోల్‌ లైన్‌: ఓడల్లో లోడింగ్‌ చేస్తున్నప్పుడు అది మునిగిపోకుండా సూచించే గుర్తు. ఇది ఓవర్‌ లోడింగ్‌ జరగకుండా చూస్తుంది.


ఐసోహెల్‌: సమానమైన సూర్యకాంతి.


ఐసోకెరాన్‌: సమానమైన థండర్‌స్టార్మ్స్‌ (ఉరుములతో కూడిన గాలివాన).


రచయిత: సక్కరి జయకర్‌ 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ ప్ర‌పంచ భౌగోళిక నైసర్గిక పరిస్థితులు

 మ‌హాస‌ముద్రాలు-భౌతిక ల‌క్ష‌ణాలు

  సముద్ర జల వనరులు - ఉపయోగం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 21-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌