• facebook
  • whatsapp
  • telegram

విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలు

కుడిఎడమల్లో కొన్ని నిబంధనలు


స్విచ్‌ వేయగానే భూమిలోని నీళ్లను లాగి ఇంటిపై ట్యాంకులో పోసేస్తుంది ఒక మోటార్‌. నిప్పులేకుండా వంట వండేస్తుంది ఇంకో ఇండక్షన్‌ స్టవ్‌. ఎవరో వచ్చారు తలుపు తీయమని పిలుస్తుంది మరో ఎలక్ట్రిక్‌ కాలింగ్‌బెల్‌. ఇవన్నీ చేసేపనులు వేరైనా, వాటి వెనుక పనిచేసే సూత్రం మాత్రం ఒకటే. దానికి సంబంధించి శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన నియమాలను, నిత్యజీవిత అనువర్తనాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

విద్యుత్‌ వల్ల ఏర్పడే అయస్కాంత ఫలితాలు, అయస్కాంతం వల్ల ఏర్పడే విద్యుత్‌ ఫలితాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర భాగాన్ని విద్యుదయస్కాంత శాస్త్రం అంటారు. విద్యుత్, అయస్కాంతం పరస్పరం ప్రేరేపించుకుంటాయి. ఈ ప్రక్రియను విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు. 


ఆయిర్‌స్టెడ్‌ నియమం

విద్యుత్‌ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని 1820లో ఆయిర్‌స్టెడ్‌ అనే శాస్త్రవేత్త నిరూపించాడు. దీన్ని ఆయిర్‌స్టెడ్‌ నియమం అంటారు. ఈ ప్రయోగం తర్వాత భౌతిక శాస్త్రవేత్తలు విద్యుత్, అయస్కాంతత్వం వేర్వేరు కాదు, అవి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయనే నిర్ధారణకు వచ్చారు. 

అదేవిధంగా ఆయిర్‌స్టెడ్‌ నియమం ప్రకారం చలనంలో ఉన్న ఆవేశ కణాలు విద్యుత్, అయస్కాంత క్షేత్రాలను ఉత్పత్తి చేస్తాయని అర్థమవుతుంది. నిశ్చల స్థితిలోని ఆవేశ కణాలు విద్యుత్‌ క్షేత్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి.


ఆంపియర్‌ కుడి చేయి నిబంధన

ఈ నిబంధన విద్యుత్‌ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ ఏర్పడిన ప్రేరిత అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది. దీని ప్రకారం కుడి చేయి బొటనవేలు విద్యుత్‌ ప్రవహిస్తున్న దిశలో ఉండే విధంగా వాహకాన్ని పట్టుకుంటే, మిగిలిన నాలుగు వేళ్లు ముడుచుకునే దిశ వాహకం చుట్టూ ఏర్పడిన అయస్కాంతక్షేత్ర దిశను తెలియజేస్తుంది. 

    కుడి చేయి నిబంధన నుంచి సవ్యదిశలో విద్యుత్‌ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అభిముఖం దక్షిణ ధ్రువంలా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా అపసవ్య దిశలో విద్యుత్‌ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అభిముఖం ఉత్తర ధ్రువంలా ప్రవర్తిస్తుంది. విద్యుత్‌ ప్రవాహ దిశను ధనావేశ ప్రవాహ దిశగా పరిగణిస్తారు. 

 

ఫ్లెమింగ్‌ ఎడమ చేయి నిబంధన

ఈ నిబంధన విద్యుత్‌ ప్రవహిస్తున్న వాహకాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై కలిగే బల దిశను తెలియజేస్తుంది. దీని ప్రకారం ఎడమ చేయి చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేళ్లను ఒకదానికొకటి లంబంగా  ఉంచినట్లయితే చూపుడు వేలు బాహ్య అయస్కాంత క్షేత్ర దిశను, మధ్య వేలు విద్యుత్‌ ప్రవాహ దిశను తెలియజేస్తే బొటనవేలు వాహకంపై కలిగే బలదిశను తెలుపుతుంది. విద్యుత్‌ మోటార్‌లు ఈ నిబంధన ఆధారంగా పనిచేస్తాయి.

 

ఫారడే మొదటి నియమం

దీని ప్రకారం విద్యుత్‌ ప్రవాహం లేని ఒక వలయంలోకి మారుతున్న అయస్కాంత క్షేత్రం ప్రవేశిస్తే దానిలో విద్యుత్‌ ప్రవాహం ప్రేరేపించబడుతుంది. 

 

అనువర్తనాలు: * విద్యుత్‌ మోటార్‌లు, జనరేటర్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఎలక్ట్రిక్‌ ఫ్యాన్‌లు, మిక్సర్‌ గ్రైండర్‌లు పనిచేయడం.

* మైక్రోఫోన్‌లు, లౌడ్‌స్పీకర్‌లు, ఎలక్ట్రిక్‌ కాలింగ్‌ బెల్‌లు పనిచేయడం.

* ఇండక్షన్‌ స్టవ్‌లు పనిచేసే సూత్రం.

* రేడియోలు, టేపు రికార్డ్‌లు, సెక్యూరిటీ చెక్‌ పనిచేయడం. 

 

ఫ్లెమింగ్‌ కుడిచేయి నిబంధన

ఈ నియమం వాహకంలో ప్రేరేపితమయ్యే విద్యుత్‌ ప్రవాహదిశను తెలియజేస్తుంది. దీని ప్రకారం కుడిచేయి బొటనవేలు, చూపుడువేలు, మధ్య వేళ్లను ఒకదానికొకటి లంబంగా ఉంచితే, బొటనవేలు బలదిశను, మధ్యవేలు ప్రయోగించిన అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తే చూపుడు వేలు ప్రేరిత విద్యుత్‌ ప్రవాహదిశను తెలియజేస్తుంది. జనరేటర్‌లు ఈ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి.

 

లెంజ్‌ నియమం 

 వాహకంలో ప్రేరేపితమైన విద్యుత్‌ ప్రవాహ దిశ ఎల్లప్పుడూ దానికి కారణమైన దాన్ని వ్యతిరేకించే దిశలో ఏర్పడుతుంది. ఈ నియమం శక్తి నిత్యత్వ నియమాన్ని తెలియజేస్తుంది.దీనినే ఫారడే రెండో నియమం అని కూడా అంటారు.

స్వయం ప్రేరణ: ఒక వాహక సంవృత పరిపథం ద్వారా విద్యుత్‌ ప్రవహిస్తున్నప్పుడు ఆ విద్యుత్‌ ప్రవాహం వల్ల అదే వాహకంలో ప్రేరిత విద్యుత్‌ పుట్టడాన్ని స్వయంప్రేరణ అంటారు. దీని గురించి వివరించే భౌతికరాశి స్వయం ప్రేరణ గుణకం లేదా స్వయం ప్రేరకత్వం. 

అన్యోన్య ప్రేరణ: ఒక చుట్టలోని విద్యుత్‌ మార్పు వల్ల దగ్గరలోని మరో తీగచుట్టలో విద్యుత్‌ ప్రేరేపితమయ్యే ప్రక్రియను అన్యోన్య ప్రేరణ అంటారు. దీన్ని వివరించే భౌతికరాశి అన్యోన్య ప్రేరణ గుణకం లేదా అన్యోన్య ప్రేరకత్వం. 

* స్వయం ప్రేరకత్వం, అన్యోన్య ప్రేరకత్వాలకు S.I ప్రమాణాలు హెన్రీ లేదా వోల్ట్‌.సెకన్‌/ఆంపియర్‌ లేదా వెబర్‌/ఆంపియర్‌

 

ట్రాన్స్‌ఫార్మర్‌ లేదా పరివర్తకం

ఏకాంతర వోల్టేజ్‌ (ఏసీ వోల్టేజ్‌)ను పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగించే సాధనాన్ని ట్రాన్స్‌ఫార్మర్‌ అంటారు.అది అన్యోన్య ప్రేరణ అనే సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది.ఏకాంతర వలయంలో మాత్రమే పనిచేస్తుంది. ఏసీ వోల్టేజ్‌ను పెంచే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆరోహణ పరివర్తకం లేదా స్టెప్‌-అప్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అంటారు. దీనిలో కరెంట్‌ విలువ తగ్గుతుంది. దీన్ని ఎక్కువగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల వద్ద ఉపయోగిస్తారు. ఏసీ వోల్టేజ్‌ను తగ్గించే ట్రాన్స్‌ఫార్మర్‌ను అవరోహణ పరివర్తకం లేదా స్టెప్‌-డౌన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అంటారు. దీనిలో కరెంట్‌ విలువ పెరుగుతుంది. దీన్ని ఎక్కువగా సబ్‌స్టేషన్‌ల వద్ద ఉపయోగిస్తారు. ఏ రకమైన ట్రాన్స్‌ఫార్మర్‌లో అయినా విద్యుత్‌ సామర్థ్యం స్థిరంగా ఉంటుంది.

 

మాదిరి ప్రశ్నలు


1. చలనంలో ఉండే విద్యుదావేశ కణాలు దేన్ని ఉత్పత్తి చేస్తాయి?

1) విద్యుత్‌ క్షేత్రం              2) అయస్కాంత క్షేత్రం

3) విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు   4) ఏదీకాదు

 


2. ఒక వృత్తకార వాహకంలో ఎలక్ట్రాన్‌లు సవ్యదిశలో కదులుతుంటే దాని అభిముఖం ఏ ధ్రువంలా పనిచేస్తుంది?

1) దక్షిణ      2) ఉత్తర       3) సగభాగం దక్షిణ, మిగిలిన సగభాగం ఉత్తర ధ్రువం      4) ఏదీకాదు


3. ఆయిర్‌స్టెడ్‌ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు? 

1) 1720      2) 1920       3) 2000      4) 1820


4. విద్యుత్‌ మోటార్‌లు ఏ నిబంధనపై ఆధారపడి చేస్తాయి?

1) ఫ్లెమింగ్‌ ఎడమ చేయి           2) ఫ్లెమింగ్‌ కుడి చేయి

3) ఆంపియర్‌ కుడి చేయి         4) ఏదీకాదు


5. ఒక వాహకంలో ఏర్పడే ప్రేరిత విద్యుత్‌ ప్రవాహదిశను ఏ నిబంధన ద్వారా తెలుసుకోవచ్చు?

1) ఆంపియర్‌ కుడి చేయి నిబంధన        2) ఫ్లెమింగ్‌ కుడి చేయి నిబంధన

3) ఫ్లెమింగ్‌ ఎడమ చేయి నిబంధన         4) ఏదీకాదు


6. అన్యోన్య ప్రేరకత్వానికి S.I. ప్రమాణాలు

1) ఆంపియర్‌        2) ఫారడే       3) ఓమ్‌       4) హెన్రీ


7. ట్రాన్స్‌ఫార్మర్‌లో స్థిరరాశి

1) వోల్టేజ్‌         2) కరెంట్‌        3) సామర్థ్యం       4) 1, 2


8. అన్యోన్య ప్రేరణ అనే సూత్రాలపై పనిచేసే పరికరాలు?

1) ఇండక్షన్‌ స్టవ్‌          2) ట్రాన్స్‌ఫార్మర్‌

3) విద్యుత్‌ మోటార్‌       4) 1, 2


9. కిందివాటిలో శక్తి నిత్యత్వ నియమాన్ని తెలియజేసేది?

1) ఓమ్‌ నియమం      2) లెంజ్‌ నియమం

3) ఆంపియర్‌ నియమం  4) పాస్కల్‌ నియమం


10. ఎలక్ట్రిక్‌ ఫ్యాన్‌లు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి?

1) ఆంపియర్‌ నియమం       2) ఓమ్‌ నియమం

3) ఫారడే నియమం        4) లెంజ్‌ నియమం

 

సమాధానాలు 

1-3,   2-2,    3-4,    4-1,    5-2,    6-4,    7-3,    8-4,    9-2,    10-3.

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!
‣   విద్యుత్తు 

‣  కొలతలు - ప్రమాణాలు

‣ ఉష్ణం

 

 ‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 02-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌