• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాద్‌ సంస్థానంలో 1857 తిరుగుబాటు

నిజాం రాజ్యంలో ప్రకంపనలు!

 

భారతదేశంలో బ్రిటిష్‌ పాలనకు సవాలు విసిరిన తొలి ఘట్టంగా చరిత్ర పుటలకెక్కిన 1857 తిరుగుబాటు, నాటి ఆంగ్లేయ అనుకూల నిజాం రాజ్యంలోనూ ప్రకంపనలు రేపింది. హైదరాబాద్‌ సహా నిజాం ఏలుబడిలోని అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయి. పలు సంస్థానాల పాలకులు మొదలు స్థానిక సైనికుల వరకు చాలామంది తెల్లవారితో ప్రత్యక్ష పోరాటాలు చేశారు. ఈ విధంగా ఆంగ్లేయులపై ఎక్కడెక్కడ తిరగబడ్డారు? ఎవరెవరు ప్రాణాలర్పించారు? ఎలాంటి శిక్షలకు గురయ్యారనే విషయాలను పరీక్షార్థులు అవగతం చేసుకోవాలి.


బ్రిటిషర్లు మనదేశాన్ని ఆక్రమించి తమ పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టారు. వాటి పట్ల భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. అది 1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో బహిర్గతమైంది. మొదట ఉత్తరాదిన మీరట్‌లో ప్రారంభమైన ఉద్యమం దేశంలోని మిగతా ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. 

 

మక్కా మసీదు వేదికగా..

క్రీ.శ.1800లో నిజాం అలీఖాన్‌ ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న తర్వాత హైదరాబాద్‌ రాజ్యంలోనూ బ్రిటిష్‌ వ్యతిరేకత ప్రారంభమైంది. 1839 వహాబి ఉద్యమం, బీరారు ఒప్పందం నాటికి ఆ అసంతృప్తి తీవ్రమైంది. 1857 తిరుగుబాటు సందర్భంలో హైదరాబాద్‌ నగరంలోని మసీదు గోడలపై పోస్టర్లు అతికించి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రబోధించారు. తిరగబడాలంటూ మౌల్వీ ఇబ్రహీం నేరుగా ప్రజలను కోరాడు. ఈ మేరకు మక్కా మసీదులో సమావేశమైన ముస్లింలందరికీ పిలుపునిచ్చాడు. షంసుల్‌ ఉమ్రా చిన్న కుమారుడైన ఇఫ్తె ఖారుల్‌ ముల్క్‌ హైదరాబాద్‌లో బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీశాడని అప్పటి బ్రిటిష్‌ రెసిడెంట్‌ కల్నల్‌ డేవిడ్‌సన్‌ రిపోర్టు చేశాడు. సికింద్రాబాద్‌లోని సైనికులు నగర వీధుల్లో తిరుగుతూ ఆంగ్లేయుల తలలు నరికి మూసీ నదిలోకి విసిరేస్తామంటూ హెచ్చరికలు చేశారు.

 

ఔరంగాబాదులో ఎదురుతిరిగిన దళాలు

సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయుల సహాయార్థం దివాన్‌ సాలార్‌జంగ్‌ హైదరాబాదు కాంటింజెంట్‌కు చెందిన రెండు దళాలను ఉత్తర భారతదేశానికి పంపించాడు. జమేదారు అమీర్‌ఖాన్, డఫేదారు మీర్‌పైదా అలీ నాయకత్వంలో వెళ్లిన ఈ రెండు దళాలు ఔరంగాబాదు సమీపంలో ఎదురుతిరిగి తిరుగుబాటు చేశాయి. కెప్టెన్‌ అబ్బాట్‌ అనే బ్రిటిష్‌ సైనికాధికారిని మీర్‌పైదా అలీ కాల్చిచంపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో అతడిని బ్రిటిషర్లు ఉరితీశారు. అమీర్‌ఖాన్, ఇతర సైనికులకు శిక్ష విధించారు. దీంతో ఔరంగాబాదు తిరుగుబాటు ఆగిపోయింది. అదేసమయంలో జమేదారు చీదాఖాన్‌ నాయకత్వంలో కౌండు అశ్వికులు ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టాడు. హైదరాబాదులో అలజడి రేపాలనే ఉద్దేశంతో చీదాఖాన్‌ హైదరాబాద్‌ నగరానికి చేరుకోగా, సాలార్‌జంగ్‌ అతడిని బంధించి 1857 జులై 17న బ్రిటిష్‌ రెసిడెంట్‌కు అప్పగించాడు. చీదాఖాన్‌ నిర్బంధానికి వ్యతిరేకంగా మక్కా మసీదులో పెద్ద సభ జరిగింది. ఇందులో పలువురు బ్రిటిష్‌ వ్యతిరేక ఉపన్యాసాలు చేశారు. చీదాఖాన్‌ను విడుదల కోరుతూ మౌల్వీలను నిజాం దగ్గరికి పంపాలని ఈ సభలో తీర్మానించారు. ఒకవేళ నిజాం అంగీకరించకపోతే హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి చేయాలని నిర్ణయించారు.

 

ఇతర తిరుగుబాట్లు

షోరాపూర్‌ సంస్థానాధీశుడైన వెంకటప్పనాయక్‌ తన రాయబారి సుంకేశ్వర్‌ను మహారాష్ట్ర తిరుగుబాటుదారుడైన నానాసాహెబ్‌ వద్దకు పంపి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మంతనాలు జరిపించాడు. ఖమర్‌ అలీ అనే జమేదారు సహాయంతో పెద్ద సైన్యాన్ని, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నాడు. 1858 ఫిబ్రవరి 7న ఆంగ్లేయులతో పోరాడి ఓడిపోయి పారిపోయాడు. కర్ణాటక ప్రాంతంలోని కొప్పల్‌కోట జమీందారు భీంరావు దేశాయ్‌ తెల్లవారిని ఎదిరించి మరణించాడు. మహబూబ్‌నగర్‌ (పాలమూరు) జిల్లాకు చెందిన కులకర్ణి నర్సింగరావు అనే జమీందారు నానాసాహెబ్‌ ప్రోత్సాహంతో వలస పాలకులపై తిరుగుబాటు చేశాడు. వారితో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందాడు. ఔరంగాబాదు జిల్లాలోని భిల్లులు అనే గిరిజనులు సియాజి నాయక్‌ నాయకత్వంలో విజాపూర్‌ దేశ్‌ పాండ్యా గోవింద కాశీరాజ్‌ ప్రోత్సాహంతో బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటం చేశారు. కానీ, ఇంగ్లిష్‌వారు వారిని  అణచివేశారు. నిజాం రాజభవనం (దేవిడి)లో బ్రిటిష్‌ రెసిడెంట్‌ డేవిడ్‌సన్‌పై నిజాం రొహిల్లా సైనికుడు జహంగీర్‌ ఖాన్‌ తన భర్‌మార్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు. అది గురితప్పి సాలార్‌జంగ్‌ ఉద్యోగికి తగిలింది. 1858లో రాజా దీప్‌సింగ్‌ సహా వెయ్యి మంది సైన్యాన్ని కూర్చుకొని బ్రిటిషర్లపై పోరాటానికి సఫ్దర్‌ ఉద్దౌలా రంగారావు పథకం వేశాడు. దాన్ని ముందే గ్రహించిన ఆంగ్లేయులు ఉద్దౌలాను అరెస్ట్‌ చేసి జీవితఖైదు విధించారు.

 

రోహిల్లాలు, గోండుల పోరాటాలు

ఆదిలాబాద్‌ జిల్లాలోని బస్మత్‌నగర్, నిర్మల్‌ ప్రాంతాల్లో రొహిల్లాలు, గోండులు దోపిడీలు చేసి తీవ్రమైన అల్లర్లు సృష్టించారు. అది బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. నిర్మల్‌లో రోహిల్లాలకు గోండుజా నాయకుడైన రాంజీ గోండు సహాయం చేశాడు. 1860 ఏప్రిల్‌లో రొహిల్లా, గోండు బలగాలు బ్రిటిష్‌ సైన్యంతో తలపడి, ఓడిపోయి చెదిరిపోయాయి. గోండు నాయకుడు రాంజీ గోండును బంధించి ఉరి తీయడంతో ఈ పోరాటం ఆగిపోయింది. 1857 తిరుగుబాటు అణచివేతలో తమకు అన్నివిధాలుగా సహకరించిన నిజాం అఫ్జలుద్దౌలాకు బ్రిటిష్‌ వైస్రాయ్‌ కానింగ్‌ బ్రిటిష్‌ ప్రభుత్వం తరఫున ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ (భారతదేశానికి వేగుచుక్క) అనే బిరుదు ఇచ్చి సత్కరించాడు. నిజాం నాణేలపై బ్రిటిష్‌ చక్రవర్తి పేరు లేకుండా పూర్తిగా నిజాం నవాబు పేరుతోనే ముద్రించుకొనే అవకాశం ఇచ్చాడు.

 

తుర్రెబాజ్‌ ఖాన్‌

రొహిల్లా జమేదార్‌ అయిన తుర్రెబాజ్‌ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్‌లు కలిసి చీదాఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి చేస్తామని సాలార్‌జంగ్‌కు వర్తమానం పంపించారు. సాలార్‌జంగ్‌ నుంచి ఎలాంటి జవాబు రాలేదు. దీంతో తుర్రెబాజ్‌ ఖాన్, అల్లాఉద్దీన్‌లు 500 మంది రొహిల్లా సైనికులతో 1857 జులై 17న హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీ వద్దకు చేరుకున్నారు. రెసిడెన్సీకి పశ్చిమాన ఉన్న డబ్బు సింగ్, జయగోపాల్‌ దాసు భవనాలపై ఎక్కిన రొహిల్లాలు బ్రిటిష్‌ రెసిడెన్సీపై కాల్పులు ప్రారంభించారు. రెసిడెన్సీ రక్షణ బాధ్యత తీసుకున్న కల్నల్‌ డేవిడ్‌సన్‌ అటు నుంచి ఎదురుకాల్పులు జరిపించాడు. తర్వాతి రోజు తెల్లవారుజామున సాలార్‌జంగ్‌ అరబ్బు పటాలంతో బ్రిటిష్‌ రెసిడెన్సీకి చేరుకోవడంతో తుర్రెబాజ్‌ ఖాన్, రొహిల్లా సైనికులు పారిపోయారు. తుర్రెబాజ్‌ ఖాన్‌ను మొగల్‌గూడ వద్ద అరెస్టు చేయగా తప్పించుకున్నాడు. రెండోసారి ఖుర్బానలీ సహాయంతో తూప్రాన్‌ వద్ద అరెస్టు చేసే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో మరణించాడు. బెంగళూరుకు పారిపోయిన మౌల్వీ అల్లాఉద్దీన్‌ మళ్లీ తిరిగి వచ్చినప్పుడు మంగళపల్లి వద్ద అరెస్టు చేశారు.1859 జూన్‌ 28న ద్వీపాంతర శిక్ష విధించి అండమాన్‌ జైలుకు పంపారు. అక్కడే అతడు 1884లో మరణించాడు.

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి 

Posted Date : 07-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌