• facebook
  • whatsapp
  • telegram

అసఫ్‌జాహీ యుగం-నిజాం పాల‌న‌

 క్రీ.శ.1724లో నిజాం ఉల్‌ముల్క్‌ మొగలుల అధికారాన్ని ధిక్కరించి స్వతంత్ర హైదరాబాద్‌ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి వంశీయులు క్రీ.శ.1948 వరకు హైదరాబాద్‌ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ కాలాన్నే అసఫ్‌జాహీయుగం లేదా నిజాంల పాలనగా పేర్కొంటారు.

నిజాం ఉల్‌ముల్క్‌ 
ఇతడు నిజాంల మొదటి పాలకుడిగా పేరు పొందారు. అసలు పేరు మీర్‌ కమ్రుద్దీన్‌. మొగలుల కొలువులో పని చేస్తున్న సమయంలో ఔరంగజేబ్‌ ‘చిన్‌ - ఖిలిజ్‌ - ఖాన్‌’ అనే బిరుదిచ్చాడు. చిన్‌ - ఖిలిజ్‌ - ఖాన్‌ అంటే కుర్రకత్తి వీరుడు అని అర్థం. అనంతరం మొగల్‌ చక్రవర్తి ఫరూక్‌షియర్‌ నిజాం ఉల్‌ముల్క్, ఫతేజంగ్‌ బిరుదులను ప్రదానం చేశాడు. మరో మొగల్‌ చక్రవర్తి మహ్మద్‌షా ఇతడికి అసఫ్‌ జా అనే బిరుదు ఇచ్చాడు. నిజాం ఉల్‌ముల్క్‌ ముబారిజ్‌ఖాన్‌ సైన్యాలను 1724 నాటి షక్కర్‌ఖేడ యుద్ధంలో ఓడించి, ఔరంగాబాద్‌ రాజధానిగా అసఫ్‌జాహీ పాలనను ప్రారంభించాడు. తన రాజ్యాన్ని ఆరు సుబాలు (బీరర్, బీదర్, బీజాపూర్, ఖాందేష్, హైదరాబాద్, ఔరంగాబాద్‌)గా విభజించాడు. షాకిర్‌ (సంతృప్తుడు) అనే కలం పేరుతో కవితలు రాసేవాడు. 1748, మే 22న బర్దాన్‌పూర్‌ వద్ద మరణించాడు.

నాజర్‌జంగ్‌ 
    నిజాం ఉల్‌ముల్క్‌ మరణానంతరం అతడి కుమారుడు నాజర్‌జంగ్‌ పాలనాధికారాలు చేపట్టాడు. కానీ నిజాం ఉల్‌ముల్క్‌ కుమార్తె పుత్రుడు (మనవడు) ముజఫర్‌జంగ్‌ వారసత్వ పోరులో కర్నూలు నవాబు హిమ్మత్‌ఖాన్‌తో నాజర్‌జంగ్‌ను హత్య చేయించాడు. ఈ పోరులో ఫ్రెంచి వారు ముజఫర్‌జంగ్‌కు సహాయపడగా, ఆంగ్లేయులు నాజర్‌జంగ్‌ పక్షం వహించారు.

ముజఫర్‌జంగ్‌
ఫ్రెంచివారి సాయంతో పాలకుడైన ముజఫర్‌జంగ్‌  వారికి మచిలీపట్నం, పుదుచ్చేరి, కరైకాల్‌ ప్రాంతాల్లో అధికారం కల్పించాడు. తన ఆస్థానంలో ఉండే ఫ్రెంచి అధికారికి హైదర్‌జంగ్‌ అనే బిరుదు ఇచ్చాడు. డూప్లేను తన ఏడు వేల అశ్వికదళానికి మున్సబ్‌దారుగా నియమించాడు. కానీ కడప, కర్నూలు నవాబు హిమ్మత్‌ఖాన్‌ చేతిలో కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లె వద్ద హత్యకు గురయ్యాడు.

సలాబత్‌జంగ్‌
ముజఫర్‌జంగ్‌ హత్యకు గురవడంతో ఫ్రెంచివారు సలాబత్‌జంగ్‌ను హైదరాబాద్‌ నిజాంగా నియమించారు. అందుకే సలాబత్‌ ఫ్రెంచివారికి ఉత్తర సర్కారులను బహుమతిగా ఇచ్చాడు. బుస్సీ నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం సలాబత్‌జంగ్‌కు రక్షణ కల్పించింది. ఇందుకు కొండవీడు, నిజాంపట్నం, నరసాపురం ప్రాంతాలను ఫ్రెంచివారికిచ్చి రూ.24 లక్షలు సైనిక ఖర్చుగా చెల్లించాడు. ఖజానాను గోల్కొండ నుంచి ఔరంగాబాద్‌కు మార్చాడు. మూడో కర్ణాటక యుద్ధ సమయంలో ఫ్రెంచివారు ఆంగ్లేయుల చేతిలో ఓడిపోవడంతో ఇతడు ఆంగ్లేయుల వైపు చేరి వారికి ఉత్తర సర్కారులను అప్పగించాడు. తన సోదరుడైన నిజాం అలీఖాన్‌ను ఖైదు నుంచి విడుదల చేసి, బీదర్‌ సుబేదారుగా నియమించాడు. కానీ 1761లో నిజాం అలీఖాన్‌ సలాబత్‌జంగ్‌ను తొలగించి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. దీంతో రెండో నిజాం పాలకుడిగా గుర్తింపు పొందిన నిజాం అలీఖాన్‌ పాలన ప్రారంభమైంది. ్బవారసత్వ యుద్ధాల్లో మునిగి తేలిన నాజర్, ముజఫర్, సలాబత్‌జంగ్‌లను మొగల్‌ చక్రవర్తులు నిజాం పాలకులుగా గుర్తించలేదు.) 

నిజాం అలీఖాన్‌ 
నిజాం అలీఖాన్‌ (రెండో అసఫ్‌జా/ రెండో నిజాం) ఉత్తర సర్కారులపై ఆంగ్లేయుల అధికారాన్ని అంగీకరించలేదు. అయితే ఆంగ్లేయులు దుబాసీˆ కాండ్రేగుల జోగిపంతులును రాయబారిగా పంపి, 1766 నాటికి ఉత్తర సర్కారులను స్వాధీనం చేసుకున్నారు. మూడో మైసూర్‌ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించి కడప, బళ్లారి, గుత్తి ప్రాంతాలను పొందాడు. కానీ మహారాష్ట్రుల చేతిలో ఓడిపోయి (1767 ఖర్ధా యుద్ధంలో) దౌలతాబాద్‌ దుర్గాన్ని కోల్పోయాడు. వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన మొదటి భారతీయ పాలకుడు నిజాం అలీఖాన్‌ ్బ1798్శ. 1800లో కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం ప్రాంతాలను ఆంగ్లేయులకు దత్తత ఇచ్చాడు. అందుకే వాటిని దత్త మండలాలుగా పేర్కొంటారు. నిజాం తన రాజాధానిని ఔరంగాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. 1788లో గుంటూరు సర్కారును ఆంగ్లేయులకుఇచ్చాడు. కిర్క్‌పాట్రిక్‌ను తన రాజధానిలో బ్రిటిష్‌ రెసిడెంట్‌గా నియమించాడు. 
* రేమండ్‌ అనే ఫ్రెంచి నిపుణుడి సహాయంతో హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ వద్ద ఆయుధాగారాన్ని నెలకొల్పాడు. నేటి మూసారాంబాగ్‌లో రేమండ్‌ సమాధి ఉంది. కిర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమకు చిహ్నంగా నిర్మించిన కట్టడంలోనే ప్రస్తుతం కోఠిలోని మహిళా కళాశాలను నిర్వహిస్తున్నారు.

సికిందర్‌ ఝా 
మూడో నిజాం/అసఫ్‌ జాగా పేరొందిన పాలకుడు. ఇతడి పాలనా కాలంలోనే రెండో ఆంగ్ల - మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నిజాం సైన్యాన్ని బీరర్‌ గవర్నర్‌ రాజా మహీపతిరామ్‌ నడిపాడు. ఆంగ్లేయులు మహీపతి రామ్‌ స్థానంలో దివాన్‌ చందూలాల్‌ను పేష్కార్‌గా నియమించారు. సికిందర్‌ ఝా ప్రధాని మీర్‌ ఆలం కూడా ఆంగ్ల వ్యతిరేకి. 1811లో రెసిడెంట్‌గా వచ్చిన హెన్రీ రస్సెల్‌ నాయకత్వంలో దళాన్ని ఏర్పాటు చేశాడు. దీన్నే రస్సెల్‌ బ్రిగేడ్‌ లేదా హైదరాబాద్‌ కంటింజెంట్‌గా పేర్కొన్నారు. విలియం పామర్‌ అనే వ్యక్తి పామర్‌ అండ్‌ కో కంపెనీని స్థాపించాడు. నిజాం ప్రభుత్వం పామర్‌ కంపెనీ నుంచి 25 శాతానికి అప్పు తీసుకుంది. సికిందర్‌ ఝా పేరు మీదే నేటి సికింద్రాబాద్‌ను నిర్మించారు. ఇతడి కాలంలోనే మెట్‌కాఫ్‌ సంస్కరణలను ప్రవేశపెట్టారు.

నాసిర్‌ - ఉద్‌ - దౌలా  
ఇతడు నాలుగో నిజాం/ అసఫ్‌జా గా పేరొందాడు. ఇతడి కాలంలోనే ఆంగ్లేయులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందారు. 1829లో నాటి గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటిక్‌కు వారి సంఖ్యను తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. తన రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించాడు. హైదరాబాద్‌ రాజ్యంలో సతీసహగమనాన్ని రద్దు చేశాడు. ఇతడి కాలంలోనే వహాబీ ఉద్యమం జరిగింది. సయ్యద్‌ అహ్మద్‌ బ్రైల్వీ సిక్కులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఈ ఉద్యమం నిజాం కాలంలో ఆంగ్ల వ్యతిరేక ఉద్యమంగా మారింది. నిజాం సోదరుడు ముబారిజ్‌ - ఉద్‌ - దౌలా నాయకత్వంలో హైదరాబాద్‌ రాజ్యంలో ఉద్యమం జరిగింది. కర్నూలు నవాబు గులాం రసూల్‌ఖాన్‌ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. 1843లో దివాన్‌ చందూలాల్‌ రాజీనామా చేయడంతో సిరాజ్‌ ఉల్‌ముల్క్‌ను ప్రధానిగా నియమించాడు. 1853లో మొదటి సాలార్‌జంగ్‌ను ప్రధానిగా నియమించాడు. నాసిరుద్దౌలా కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది కానీ తిరుగుబాటును ఎదుర్కొన్నది మాత్రం అఫ్జల్‌ - ఉద్‌ - దౌలా). హైదరాబాద్‌ కంటింజెంట్‌ ఖర్చుల నిమిత్తం రూ.64 లక్షలు అప్పు చేయడంతో, నిజాం తన రాజ్యంలోని రాయచూర్, ఉస్మాన్‌బాద్, బీరర్‌ ప్రాంతాలను ఆంగ్లేయులకు స్వాధీనం చేయాల్సి వచ్చింది.

అఫ్జల్‌ - ఉద్‌ - దౌలా  
1857, మే 18న అయిదో నిజాంగా పాలన చేపట్టాడు. ఇతడి కాలంలోనే 1857, జులై 17న హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. (భారతదేశంలో తిరుగుబాటు ప్రారంభం మే 10, నాటి నిజాం నాసిరుద్దౌలా). మొగల్‌ చక్రవర్తి పేరు మీద కాకుండా నిజాం పేరు మీద కుత్బా చదవడం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ఆంగ్ల రెసిడెన్సీపై తుర్రేబాజ్‌ఖాన్‌ దాడి చేశాడు. తిరుగుబాటును అణచడంలో ఆంగ్లేయులకు తోడ్పడినందుకు నాటి బ్రిటిష్‌ రెసిడెంట్‌ కల్నల్‌ డేవిడ్‌సన్, సైన్యాధికారి మేజర్‌ బ్రిగ్స్‌ నిజాంకు ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ బిరుదుతో పాటు రాయచూర్, ఉస్మానాబాద్‌ ప్రాంతాలను తిరిగిచ్చారు. అతడు చెల్లించాల్సిన రూ.50 లక్షల రుణాన్ని రద్దు చేశారు. నిజాం రాజ్య ప్రధానమంత్రి నవాబ్‌ తురాబ్‌ అలీఖాన్‌కు ‘సాలార్‌జంగ్‌’ అనే బిరుదు ఇచ్చారు. ప్రధాని సాలార్‌జంగ్‌ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1865లో జిలాబందీ రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. హాలిసిక్కా అనే నూతన వెండి నాణేన్ని ప్రవేశపెట్టాడు. హైదరాబాద్‌ - వాడి రైలు మార్గాన్ని నిర్మించాడు.

మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ 
అఫ్జల్‌ - ఉద్‌ - దౌలా మరణించే నాటికి ఇతడు రెండున్నర సంవత్సరాల బాలుడు. మీర్జా గాలీబ్‌ మనవడైన మీర్జా ఆషాబేగ్‌ను ఇతడికి సంరక్షకుడిగా నియమించారు. 1884 నాటికి పూర్తి అధికారాలను స్వీకరించాడు. ఖానున్‌చా - ఇ - ముబారక్‌ పేరుతో క్యాబినెట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేశాడు. చట్టాల నిర్మాణం కోసం 1893లో ఒక లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేశాడు. బీరర్‌పై నిజాం సార్వభౌమాధికారాన్ని గుర్తించాడు. హైదరాబాద్‌ కంటింజెంట్‌ను రద్దు చేసి, బ్రిటిష్‌ సైన్యంలో విలీనం చేశాడు. 1905లో రాజ్యాన్ని నాలుగు సుబాలుగా విభజించాడు. అవి: వరంగల్, మెదక్, గుల్బర్గా, ఔరంగాబాద్‌. ఇతడి కాలంలోనే కిషన్‌రావు అనే న్యాయవాది ముల్కీ నిబంధనలను రూపొందించాడు. చాందా రైల్వే పథకం ఆందోళన ఇతడి కాలంలోనే జరిగింది. నిజాం కళాశాల తొలి ప్రిన్సిపల్‌గా అఘోరనాథ చటోపాధ్యాయను నియమించాడు. మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ను ఆంగ్లేయులు నియమించిన తొలి నిజాం నవాబుగా పేర్కొంటారు. మొదటి సాలార్‌జంగ్‌ మరణంతో మీర్‌ లాయక్‌ అలీని (రెండో సాలార్‌జంగ్‌) ప్రధానిగా నియమించాడు. ఇతడు 1887లో నిజాం కళాశాలను స్థాపించాడు. మూడో సాలార్‌జంగ్‌గా పేరొందిన మీర్‌ యూసఫ్‌ అలీఖాన్‌ సాలార్‌జంగ్‌ మ్యూజియానికి విదేశాల నుంచి అనేక వస్తువులు తెప్పించాడు. 
* 1884లో లార్డ్‌ రిప్పన్‌ హైదరాబాద్‌ వచ్చి నిజాంకు సర్వాధికారాలు అప్పగించాడు. అదే సంవత్సరం నిజాం ఉర్దూను రాజభాషగా ప్రవేశపెట్టాడు. మంత్రివర్గం, ద్విసభా విధానం ఏర్పాటు చేశాడు. 
* మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు ఆంగ్లేయులు ‘గ్రాండ్‌ కమాండర్‌’ బిరుదును ప్రదానం చేశారు. ఇతడు 1909లో మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో మూసీ నదిపై వంతెన నిర్మించాడు. ఇతడి కాలంలోనే యంగ్‌మెన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. 1882లో థియోసాఫికల్‌ సొసైటీశాఖ, 1892లో ఆర్యసమాజ శాఖ హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి.

మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌
చివరి, ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌. ఇతడి కాలంలో హైదరాబాద్‌ సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్‌ చెరువులను తవ్వించాడు. న్యాయశాఖను ఇతర శాఖల నుంచి వేరు చేశాడు. 1919లో సర్‌ అలీ ఇమామ్‌ను ప్రధానిగా నియమించాడు. 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 

* సిర్పూర్‌ పేపరు మిల్లు, అజంజాహీ దుస్తుల మిల్లు, బోధన్‌ చక్కెర కర్మాగారం, చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ, వజీర్‌ సుల్తాన్‌  టొబాకో కంపెనీలను స్థాపించాడు. 1932లో అరవముదు అయ్యంగార్‌ నాయకత్వంలో రాజకీయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశాడు. రజాకార్ల వ్యవస్థను ప్రోత్సహించాడు. తొలిసారి ఆదాయ, వ్యయ పద్దులను పునర్విభజించాడు. 1938లో 85 మంది సభ్యులతో ఒక శాఖను ఏర్పాటు చేసి, అందులో హరిజనులకు కూడా స్థానం కల్పించాడు. 
* భద్రాచలం, తిరుపతి దేవాలయాలకు విరాళాలు అందించేవాడు. నాందేడ్‌లో గురుద్వారాను నిర్మించాడు. 

* ఆంగ్లేయులకు విశ్వసనీయుడైన మిత్రుడిగా (ఫెయిత్‌ఫుల్‌ అలై) గుర్తింపు పొందాడు. 1918లో కింగ్‌జార్జ్‌ నిజాంను ‘హిజ్‌ ఎగ్జాల్టెడ్‌ హైనస్‌’గా కీర్తించాడు. 
* స్టాన్లీ బాలికల ఉన్నత పాఠశాల, జనానా పాఠశాల, శాలిబండ మిడిల్‌ స్కూల్, హన్మకొండ ప్రభుత్వ మిడిల్‌ స్కూలు లాంటి విద్యాలయాలను ప్రారంభించాడు. రైల్వేలు, రోడ్డు రవాణా సంస్థలను ఏర్పాటు చేశాడు.
* భారత ప్రభుత్వం 1948లో సెప్టెంబరు 13  17 మధ్య ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో సైనిక చర్య జరిపి, హైదరాబాద్‌ రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసింది. 1950, జనవరి 2న హైదరాబాద్‌ భారత యూనియన్‌లో చేరినట్లు ప్రకటించి, నిజాంను రాజ్‌ప్రముఖ్‌గా నియమించారు.

యుగ విశేషాలు
* మొదటి సాలార్‌జంగ్‌ ప్రధానిగా హైదరాబాద్‌ రాజ్య అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టాడు.
* 1853 నుంచి 1883 వరకు ముగ్గురు నిజాంల వద్ద ప్రధానిగా మొదటి సాలార్‌జంగ్‌ పని చేశాడు.
* ఇతడు రాజ్యాన్ని 5 సుబాలు, 17 జిల్లాలుగా విభజించారు.
* సుబా అధిపతిని సుబేదార్, తాలుకా అధిపతిని తహసీల్దార్, జిల్లా అధిపతిని తాలూక్‌దార్‌ అనేవారు.
* 1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు.
* సదర్‌ - ఉల్‌ - మహమ్‌ పేరుతో పోలీసు, రెవెన్యూ, న్యాయ, విద్య, ఆరోగ్య శాఖలు ఏర్పాటు చేశారు.
* భూమి శిస్తును జమ అని, కౌలును ఇజారా అని పిలిచేవారు.

* అవల్‌ తాలూక్‌దార్‌ నేటి జిల్లా కలెక్టర్‌తో సమాన అధికారి. దోయం తాలూక్‌దార్‌ను సబ్‌కలెక్టర్‌ హోదాతో, సోయం తాలూక్‌దార్‌ను తహసీల్దార్‌ హోదాతో సమానంగా భావించేవారు.
* పోలీసు సూపరింటెండెంట్‌ను ముహతామీన్‌ అని, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను అమీన్‌ అని పిలిచేవారు.
* వసూలు చేసిన శిస్తులో జమీందార్ల వాటాను రుసుం అనేవారు.
* శిస్తు వసూలు అధికారులను బిల్‌ మక్తదారులు అనేవారు.
* చివరి నిజాం పాలనా కాలంలో కింది పట్టణాల పేర్లను మార్చారు.
ఎలగండల - కరీంనగర్, మహబూబ్‌నగర్‌ - పాలమూరు, ఇందూరు - నిజామాబాద్, మానుకోట - మహబూబబాద్, భోన్‌గిరి - భువనగిరి}

* హైదరాబాద్‌ పాఠశాలల్లో డబ్ల్యూ.హెచ్‌. విల్కిన్‌సన్‌ అనే విద్యాశాఖ కార్యదర్శి నూతన బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాడు.
* 1871లో హైదరాబాద్‌లో తపాలా శాఖను ఏర్పాటు చేశారు.
* 1856లో డాక్టర్‌ స్మిత్‌ హైదరాబాద్‌లో వస్తు ప్రదర్శన (పారిశ్రామిక) ఏర్పాటు చేశాడు.
* బ్రిటిష్‌ రెసిడెంటైన జేమ్స్‌ పాట్రిక్‌ ఖైరున్నీసా బేగం అనే ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడు.
* భద్రాచలం రాముడికి తలంబ్రాలు పంపే ఆచారాన్ని నాసిరుద్దౌలా ప్రవేశ పెట్టాడు.
* రాజ్య కేంద్ర ద్రవ్య ముద్రణాలయం హైదరాబాద్‌లో, జిల్లా ద్రవ్య ముద్రణాలయాలు గద్వాల్, నారాయణపేట్‌ల్లో ఏర్పాటు చేశారు.
* కె.ఎం. మున్షీ హైదరాబాద్‌లోని దక్కన్‌ హౌస్‌లో ఉంటూ ‘ది ఎండ్‌ ఆఫ్‌ యాన్‌ ఎరా’ అనే గ్రంథాన్ని రచించారు. 
* 1918లో ఏర్పడిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1919, ఆగస్టు 28 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌