• facebook
  • whatsapp
  • telegram

చాళుక్యుల కాలం నాటి పరిస్థితులు

* సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు పాటించేవారు. శూద్రులను చతుర్థకులానికి చెందినవారిగా వర్గీకరించారు. 

* జైనులకు సమాజంలో బలమైన శాఖలు ఉండేవి. వాటిలో ‘యూపనీయశాఖ’ ప్రముఖమైంది. వీరు బ్రాహ్మణుల్లాగా అన్ని కార్యకలాపాలు నిర్వహించేవారని ‘సోమదేవసూరి’ రాసిన యశస్తిలకలో ఉంది. బ్రాహ్మణులు భూ, ధన దానాలు స్వీకరించేవారు. 

* విజయాదిత్యుడి శాసనంలో నాటి సమాజంలో 14 రకాల విద్యలు తెలిసిన గురువులు ఉన్నారని, బాదామిలో నాలుగు ప్రధాన శాస్త్రాలను బోధించే ఒక సంస్థ ఉందని పేర్కొన్నారు.

*హుయాన్‌ త్సాంగ్‌ రెండో పులకేశి ఆస్థానాన్ని సందర్శించాడు. అతడు చాళుక్య రాజ్యంలో 5000 మంది బిక్షువులు, 100 బౌద్ధారామాలున్నాయని పేర్కొన్నాడు. వైదిక, వైదికేతర మతాలు సమానంగా ప్రజాదరణ పొందాయని తెలిపాడు.

* చాళుక్యయుగంలో తరచూ యుద్ధాలు జరగడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. 

* పాల్కురికి సోమనాథుడి ‘బసవపురాణం’ గ్రంథం నాటి సామాన్య ప్రజల జీవనపరిస్థితులను తెలుపుతుంది. 

* పాలకవర్గ కుటుంబాలకు చెందిన స్త్రీలు సమాజంలో గౌరవం పొందారు. 

* చాళుక్య యుగంలో ‘అక్కదేవి’ యుద్ధాలు చేసింది. ఆరో విక్రమాదిత్యుడి భార్య లక్ష్మాదేవి పాలనలో రాజుకు తోడ్పడింది. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండేది. 

* సమాజంలో వివిధ రకాల వృత్తులు చేసేవారు ఉండేవారు.


వర్తక, వాణిజ్యం 

చాళుక్యుల కాలంలో వర్తక, వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. వీరు ఎక్కువగా అరబ్బులతో వ్యాపారం చేసేవారు.

* ‘శ్రేణులు’ అనే వర్తక సంఘాలు ఉండేవి. కమ్మకోమట్లు, నకరపువాడ కోమట్లు, వీరబలిజ సమయధర్మ ప్రతిపాలకులు, మహానగర, నానాదేశి సమస్త పెక్కండ్రు, ఉభయ నానాదేశి పెక్కండ్రు లాంటి వర్తక శ్రేణులు ఉండేవి.

* కల్యాణి చాళుక్య శాసనాల్లో గవరె, గాత్రిక, సెట్టి, సెట్టిగుట్ట, బీర, బీరబణిజగండిగ మొదలైనవారు విడిగా లేదా శ్రేణులుగా వ్యాపారం చేసేవారు.

* గ్రామాల్లో ‘మహాజనులు’, విషయ (జిల్లా) స్థాయిలో రాష్ట్రకూట ప్రముఖులు, నగరస్థాయిలో ‘తెరిడాలు’ ఆర్థికపరమైన వ్యవహారాలు నిర్వహించేవారు. 

* బాదామి, మాన్యఖేటం, కల్యాణపురం, ధారానగరం, వేంగి లాంటి రాజధాని నగరాలు; అష్టాదశనగరాలు వాణిజ్యానికి అనుకూలంగా ఉండేవి.

* చాళుక్యుల కాలంలో భటవృత్తి (సైనికులు పొందిన భూమి), మాన్యగ్రామాలు (దేవాలయాలకు ఇచ్చినవి), చతుర్వేది మంగళాలు (పండితులకి ఇచ్చినవి) అనే గ్రామాలు ఉండేవి. వీటిపై శిస్తు ఉండదు, దీన్నే ‘సర్వకరి పరిహారం’ అంటారు.

* వీరి కాలంలో నూలు వస్త్రాలు, చర్మాలు, చేపలు, నీలిమందు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి, చందనం, టేకు, దంతం ప్రధాన ఎగుమతులు. బంగారం, రాగి, సీసం, మద్యం ప్రధాన దిగుమతులు.

* బరుకచ్చం, కల్యాణి ఓడరేవుల ద్వారా పశ్చిమాసియా, అరబ్‌ దేశాలతో వాణిజ్యం జరిపారు. ఏనుగులు, గుర్రాలు, నవరత్నాలు, సుగంధ ద్రవ్యాలు వాణిజ్యంలో ప్రముఖ స్థానం పొందాయి. 

* రాష్ట్రకూటుల కాలంలో విదేశీ వాణిజ్యం అభివృద్ధి చెందింది. బన్నగర్, గుజరాత్, ఉజ్జయిని, పైఠాన్, తగర ప్రధాన వాణిజ్యకేంద్రాలు.

* చాళుక్య రాజవంశాలవారు నాణేలు ముద్రించారు. వేంగి చాళుక్యుల కాలానికి చెందిన పావులూరి మల్లన తన ‘గణితసార సంగ్రహం’లో నాణేల గురించి వివరించాడు. ఆ కాలంలో పొన్నులు, గద్వాణాలు, మండలు, పణాలు, పొగలు, కాసులు అనే నాణేలు ఉండేవి. ప్రభుత్వానికి టంకశాల ఉండేది. నాణేలను మారకంగా ఉపయోగించారు.


సాహిత్యం 

*బాదామి, వేంగి, కల్యాణి చాళుక్యుల కాలంలో సాహిత్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందింది.

* క్రీ.శ. 915లో త్రివిక్రమభట్టు రాసిన నలచంపు, మదాలస చంపు; క్రీ.శ. 950లో సోమదేవసూరి రచించిన ‘యశస్తిలక’ పద్య - గద్య రూపాల్లో ఉన్నాయి.

* మూడో సోమేశ్వరుడి ఆస్థానకవి విద్యామాధవుడు. ఈయన పార్వతీరుక్మిణీయం రచించారు. కదంబ కామదేవుడి ఆస్థాన కవి మాధవభట్టు. ఈయన రచన ‘రాఘవపాండవీయం’ ద్వ్యర్థికావ్యం (రెండర్థాలు)గా ప్రసిద్ధి పొందింది. 

* నీలకంఠుడి ‘కల్యాణి సౌగంధికం’; సోడలుడి ‘ఉదయ సుందరి కథ’; బిల్హణుడి ‘విక్రమాంకదేవ చరిత్ర’; లీలాశకుడి ‘కృష్ణకర్ణామృతం’; వాదిరాజు ‘యశోధర చరిత్ర’, ‘పార్శ్వనాథ చరిత్ర’; యాదవభట్టు ‘పారిజాతాపహరణం’; జగదేకమల్లుడి ‘సంగీత చూడామణి’ మొదలైనవి సాహిత్యపరంగా, చారిత్రకంగా, సృజనాత్మకంగా ఎంతో పేరొందాయి. 

* ధనుంజయుడి ‘నామమాల’; శాకటామనుడి ‘శబ్దానుసారం నిఘంటువు’; సోమదేవసూరి ‘నీతివాక్యామృతం; మూడో సోమేశ్వరుడి ‘మానసోల్లాసం’, ‘అభిలాష చింతామణి’; విజ్ఞానేశ్వరుడి ‘మితాక్షరం’; నారాయణుడి ‘వ్యవహార శిరోమణి’ గ్రంథాలు  ఎంతో పేరొందాయి.

* కన్నడ సాహిత్యంలో శివకోటి రాసిన ‘వడ్డారాధనే’; క్రీ.శ. 941లో పంపకవి రచించిన ‘ఆదిపురాణం’, ‘విక్రమార్జున విజయం’; పొన్న ‘శాంతి పురాణం’; రన్న ‘అజీతపురాణం’, ‘చక్రేశ్వర చరిత్ర’ ‘సాహసభీమ విజయం (గదాయుద్ధం)’ ముఖ్య రచనలు. 

* శ్రీధరాచార్యుడి ‘చంద్రప్రభా చరిత్ర’; నాగచంద్రుడి ‘మల్లినాథపురాణం’ (చంపూకావ్యం); కర్ణపార్యుడి ‘నేమినాథపురాణం’ కన్నడ సాహిత్యంలో ప్రసిద్ధ రచనలుగా పేరొందాయి.

* నాగవర్మ ‘కర్ణాటకాదంబరి’; దుర్గసింహుడి‘పంచతంత్రం’; చంద్రరాజు ‘మదన తిలకం’ చంపూ కావ్యాలుగా ప్రసిద్ధి పొందాయి. 

* నృపతుంగుడి ‘కవిరాజమార్గం’; శ్రీవర్ధదేవుడి ‘చూడామణి’; మొదటి నాగవర్మ ‘చందోంబుధిని’; రెండో నాగవర్మ ‘కావ్యావలోకనం’,‘కర్ణాట భాషా భూషణ వాస్తుకోశం’ ముఖ్య సాహిత్య గ్రంథాలు.

* చాళుక్యుల కాలంలోనే తెలుగు సాహిత్యాభివృద్ధి జరిగింది. 

* గుణగ విజయాదిత్యుడి కాలం నాటి పండరంగడి అద్దంకి శాసనం, చాళుక్య భీముడి ధర్మవర శాసనం, యుద్ధమల్లుడి బెజవాడ శాసనాల్లో తరువోజ, సీసం, మధ్యాక్కర లాంటి దేశీ చందస్సు ఉన్నాయి. 

* నన్నయ ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించారు. ఈయన ఆంధ్రమహా భారతంలోని ఆది, సభాపర్వాలను తెలుగులోకి అనువదించారు. ఈయన ఆదికవిగా పేరొంది, సంస్కృత భాషాభివృద్ధికి తోడ్పడ్డారు.

*మంచన భట్టారకుడు (విష్ణుకుండిని రాజు) రచించిన ‘జనాశ్రమ చందోవిచ్ఛిత్తి’ తొలి చందోగ్రంథం. 

* నన్నెచోడుడు ‘కుమార సంభవం’ రచించాడు. ఇది మొదటి తెలుగు ప్రబంధంగా గుర్తింపు పొందింది. 

* ఈ కాలంలోనే తెలుగులో పదాలు, మంజరులు, రగడలు, ద్విపదలు లాంటి వైవిధ్య సాహిత్య రూపాలు బాగా అభివృద్ధి చెందాయి.


ఆర్థిక పరిస్థితులు

*చాళుక్యుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. పాలకులు వ్యవసాయాభివృద్ధికి చెరువులు తవ్వించారు. 

* క్రీ.శ. 1037 నాటి హోట్టూరు శాసనంలో ‘కెంగెరె’ (ఎర్ర చెరువు) గురించి ఉంది. క్రీ.శ. 1053లో బాదామి తాలూకా ‘కీలవాడి’ వద్ద, క్రీ.శ. 1071లో షిమోగా జిల్లాలో ‘నెట్టికెరలో’ చెరువులు తవ్వించారు. 

* ఉత్పత్తి, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం వసూలు చేసే ఆదాయాన్ని‘అయం’, ‘కరం’ అని పిలుస్తారు. 

* అయం వస్తురూపంలో, కరం ద్రవ్యరూపంలో ఉండేవి.

* సిద్దాయం, దశవంద, నీటిసుంకం, మేలివనం అనేవి భూమికి సంబంధించిన పన్నులు.

* మేళివంశం (నాగళ్లపై వేసే పన్ను), అంగడిదెరె (అంగళ్లపై పన్ను), గణ్నదెరె (గానుగలపై పన్ను), నావిదదెరె (మంగలివారిపై పన్ను) లాంటి వృత్తి పన్నులు ఉండేవి. మానెవన (ఇంటిపన్ను), దండాదాయం (జరిమానాలు), తుదిమెయసుంకం (పెళ్లిపన్ను) లాంటి పన్నులు కూడా ఉండేవి. పన్నుల భారం కొంచెం ఎక్కువగా ఉండేది. 

* భూమి కొలతలు ఉండేవి. నివర్తనాలు, ఖండ్రికలు, మరుతుర్లు లాంటి పేర్లతో కొలతలు వేసేవారు. 

* చాళుక్యుల కాలంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఉండేవి.



చాళుక్యుల పరిపాలనా విధానం

కేంద్రపాలన 

* పాలనలో రాజే సర్వాధికారి. చక్రవర్తికి వివిధ బిరుదులు ఉండేవి. బిరుదులు ధరించడాన్ని ఒక ఆచారంగా భావించేవారు.

* రాజుకు పాలనలో సహాయం చేసేందుకు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అనేక మంది ఉద్యోగులు ఉండేవారు. యువరాజు, మంత్రి, పురోహితుడు, సేనాని, దండనాయక, సంధివిగ్రహ లాంటి ఉద్యోగులు కేంద్ర పాలనలో సహాయపడేవారు. పాలనా అవసరాన్ని బట్టి ఉద్యోగులు మారుతుండేవారు.

* ‘లేఖ పద్ధతి’ అనే గ్రంథంలో చాళుక్యుల కాలంలో 32 మంది శాఖాధ్యక్షులు ఉన్నట్లు పేర్కొనగా, కల్యాణి చాళుక్యుల కాలంలో ‘నియోగములు’ అనే 72 మంది అధికారులు ఉండేవారని వివిధ శాసనాల్లో ఉంది.

* రాజ్యరక్షణ, ప్రజాసంక్షేమం రాజు ప్రధాన విధులు. 


రెవెన్యూ పాలన 

* ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. స్వదేశీ, విదేశీ వాణిజ్యాలపై సుంకాలు ఉండేవి. అనేక రకాల పన్నులు వసూలు చేసేవారు. 

* ఈ ఆదాయాన్ని యుద్ధాల నిర్వహణకు; దుర్గాలు, కోటల నిర్మాణానికి; కవి, పండిత, సాహిత్య పోషణకు; ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసేవారు. రాజులు దానధర్మాలు చేసేవారు. 

* తూర్పు చాళుక్యుల కాలంలో నకళ్లు (రికార్డులు) రాసేవారిని ‘కవల్లభులు’ అనేవారు.


న్యాయపాలన 

* రాజే సర్వోన్నత న్యాయాధికారి. శృతి, స్మృతి, ఆచారాలు, ధర్మశాస్త్రాలు న్యాయపాలనలో ప్రధానమైనవి. రాష్ట్ర, పట్టణ, నగర, గ్రామస్థాయుల్లో న్యాయాధికారులు వివిధ రకాల కేసులు పరిష్కరించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి.


సైనిక పాలన 

* రాజే సర్వసైన్యాధ్యక్షుడు. సిద్ధసైన్యం, సాధ్యసైన్యం అనే రకాలు ఉండేవి. సామంతరాజులు, మాండలీకులు వేతనాలిచ్చి సైన్యాన్ని సమీకరించేవారు. అశ్వ, పదాతి దళాలు; గజ, రథబలాలు ఉండేవి.

Posted Date : 12-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌