• facebook
  • whatsapp
  • telegram

చాళుక్యులు

* చాళుక్యుల్లో మూడు రాజవంశాలు ప్రధానమైనవి. అవి: 

1. పశ్చిమ చాళుక్యులు (క్రీ.శ. 500-755) 

2. వేంగి చాళుక్యులు (క్రీ.శ. 624-1076)

3. కల్యాణి చాళుక్యులు (క్రీ.శ. 973-1200) 

వీరు దక్షిణ భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, మత, సాహిత్య, వాస్తు, శిల్పకళా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారు.

వీరేకాక వేములవాడ, ఎలమంచిలి, నిడదవోలు, అన్హిల్వాడా చాళుక్యులు కూడా వివిధ ప్రాంతాల్లో పరిపాలించారు. 


బాదామి లేదా పశ్చిమ చాళుక్యులు

వీరు క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు రాజ్యపాలన చేశారు. కర్ణాటకలోని బీజాపూర్‌ జిల్లాలో ఉన్న వాతాపి లేదా బాదామి వీరి రాజధాని.

వీరిని ‘బాదామి’ చాళుక్యులు అని కూడా పిలుస్తారు. 

ఉత్తరాన కనౌజ్, దక్షిణాన పల్లవులతో వీరికి శత్రుత్వం ఉండేది.

వీరితో నిరంతరం పోరాటాలు చేయడంవల్ల పశ్చిమ చాళుక్య వంశం పతనమైంది.


బాదామి చాళుక్య పాలకులు జయసింహ వల్లభుడు

పశ్చిమ చాళుక్య స్థాపకుడు, తొలి పాలకుడు.

ఇతడు మొదట్లో వాకాటకులకు సామంతుడిగా ఉన్నాడు. ‘వాతాపి’ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.


రణరాగుడు

ఇతడికి ‘మహారాజ’ అనే బిరుదు ఉంది. రణరాగుడి కాలంలో రాజ్యం ప్రస్తుత బీజాపూర్‌ జిల్లాలోని బాదామి వరకు విస్తరించింది.


మొదటి పులకేశి 

క్రీ.శ. 535566 వరకు రాజ్యపాలన చేశాడు. బాదామి చాళుక్య రాజవంశంలో మొదటి సార్వభౌమ చక్రవర్తి. చాళుక్య రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేశాడు. అశ్వమేధ యాగాన్ని చేశాడు. బాదామిని రాజధానిగా చేసుకుని పాలించాడు. 

బాదామిలో లభించిన క్రీ.శ. 543 నాటి శాసనంలో మొదటి పులకేశి దండయాత్రలు, విజయాల గురించి ఉంది. క్రీ.శ. 543 - 544 కాలంలో ఇతడు ‘వాతాపి కోట’ నిర్మాణం ప్రారంభించాడు. ఇతడు చాళుక్య రాజ్యాన్ని కర్ణాటక వరకు విస్తరింపజేశాడు.


మొదటి కీర్తివర్మ  

క్రీ.శ. 566598 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడ్ని‘The First and Finest Maker of Vatapi’ గా పేర్కొంటారు. 

ఇతడు నలవాడ (బళ్లారి, కర్నూలు) పాలకుడైన నలరాజుని; బనవాసి పాలకుడైన కదంబుడిని; కొంకణ మౌర్యులను ఓడించి రాజ్యాన్ని విస్తరింపజేశాడు.


మంగళేశుడు 

కీర్తివర్మ మరణించేనాటికి అతడి కొడుకు రెండో పులకేశి బాలుడు. దీంతో తమ్ముడైన మంగళేశుడు రాజ్యపాలన చేశాడు. క్రీ.శ. 598-609 వరకు రాజుగా ఉన్నాడు.

ఇతడు గుజరాత్‌ను పాలించిన ‘కాలచూరులను’ ఓడించి రేవతీద్వీపాన్ని (గోవా) ఆక్రమించాడు. ఇతడికి ‘పరమభాగవత’ అనే బిరుదు ఉంది. 

మంగళేశుడు తన కుమారుడ్ని రాజుగా చేయాలనుకున్నాడు. దీంతో క్రీ.శ. 609లో రెండో పులకేశితో వారసత్వ యుద్ధం జరిగింది. ఇందులో మంగళేశుడ్ని రెండో పులకేశి వధించి, రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు.


మొదటి విక్రమాదిత్యుడు 

*  క్రీ.శ. 642680 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కూడా పల్లవులతో పోరాటాన్ని కొనసాగించాడు. 

 ఇతడు పల్లవరాజు రెండో మహేంద్రవర్మను ఓడించాడు. కానీ తర్వాత జరిగిన ‘పెరువళనల్లూరు’ యుద్ధంలో విక్రమాదిత్యుడు ఓడిపోయాడు. 

 మహేంద్రవర్మ తర్వాత పరమేశ్వరవర్మ పల్లవ పాలకుడయ్యాడు. విక్రమాదిత్యుడు ఇతడ్ని ఓడించి ‘కంచి’ని ఆక్రమించాడు. 

ఇదేకాలంలో తన తమ్ముడు జయసింహుడ్ని లాట, గుజరాత్‌ ప్రాంతాలకు గవర్నర్‌గా నియమించాడు. ఇది క్రమంగా లాటచాళుక్య వంశ ఏర్పాటుకు కారణమైంది.

వినయాదిత్యుడు 

 క్రీ.శ. 680696 వరకు రాజ్యన్ని పాలించాడు. ఇతడి కాలంలో ఎలాంటి యుద్ధాలు లేవు. ‘అలంపూర్‌’ వద్ద ఆలయ నిర్మాణం ఇతడి కాలంలోనే జరిగింది. 

విజయాదిత్యుడు 

 క్రీ.శ. 696-733 వరకు రాజ్యాన్ని పాలించాడు. ఇతడు పట్టడకల్‌ లేదా కీసువల్‌ను సుందరంగా తీర్చిదిద్దాడు. పల్లవ రాజ్యంపై దండెత్తి అపార సంపద కొల్లగొట్టాడు.

 పల్లవ రాజు పరమేశ్వరవర్మతో మిళింద యుద్ధం చేశాడు. ఇందులో గాంగరాజు పరమేశ్వర వర్మకు సాయం చేసి, విజయాదిత్యుడ్ని చంపాడు.

 


రెండో విక్రమాదిత్యుడు

 క్రీ.శ. 733744 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలంలో అరబ్బులు రాజ్యంపైకి దండెత్తారు. వీరిని లాటరాజైన జయసింహవర్మ కుమారుడు పులకేశి ఓడించాడు. 

​​​​​​్ర రెండో విక్రమాదిత్యుడు పులకేశికి ‘అవనీజనాశ్రయ’ అనే బిరుదు ఇచ్చాడు. 

 రెండో విక్రమాదిత్యుడు పల్లవరాజు నందివర్మను ఓడించి, కాంచీపురాన్ని దోచుకున్నాడు. 

 చేర, చోళ, పాండ్య, కలభ్రులను ఓడించి, చాళుక్యుల అధికారాన్ని కన్యాకుమారి వరకు వ్యాపింపజేశాడు.

రెండో కీర్తివర్మ 

 క్రీ.శ. 744757 వరకు రాజ్యపాలన చేశాడు. బాదామి చాళుక్యుల్లో చివరివాడు. ఇతడి కాలంలో చాళుక్యులకు సామంతుడిగా ఉన్న రాష్ట్రకూట రాజు ‘దంతిదుర్గుడు’  స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. 

దంతిదుర్గుడి కుమారుడు మొదటి కృష్ణుడు కీర్తివర్మను ఓడించి చాళుక్యరాజ్యాన్ని ఆక్రమించడంతో బాదామి చాళుక్య రాజవంశం పతనమైంది. 

రెండో పులకేశి (క్రీ.శ. 609-642) 

బాదామి చాళుక్యుల్లో గొప్పవాడు. అనేక దండయాత్రలు చేసి, చాళుక్య రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతడు ‘దక్షిణాపథ చక్రవర్తి’గా పేరుగాంచాడు.

రెండో పులకేశి దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో ఉత్తర భారతదేశాన్ని హర్షవర్ధనుడు పాలించాడు.


దండయాత్రలు: రెండో పులకేశి అనేక దండయాత్రలు చేశాడు. ముఖ్యంగా వారసత్వ యుద్ధ సమయంలో అతడిపై చాళుక్య సామంతుడు ‘అప్పాయిక’ తిరుగుబాటు చేశాడు. అందులో అప్పాయిక ఓడిపోయాడు.

దీని తర్వాత కదంబులను, కొంకణ ప్రాంత మౌర్యులను, గాంగరాజులను, లాటపాలకులు, ఘర్జరులను ఓడించాడు. వీరంతా రెండో పులకేశికి సామంతులుగా మారారు.

గాంగరాజైన దుర్వినేతను ఓడించి, అతడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు.

ఈ యుద్ధాల ఫలితంగా రెండో పులకేశి రాజ్యం ఉత్తర సరిహద్దు ‘మహీనది’ వరకు విస్తరించింది. కళింగ రాజధాని పిఠాపురాన్ని ఆక్రమించి, తన సోదరుడైన ‘విష్ణువర్ధనుడికి’ అప్పగించాడు. 

రెండో పులకేశి పుల్లలూరు యుద్ధంలో పల్లవ రాజైన మహేంద్రవర్మను ఓడించి, వధించాడు.

వేంగి పాలకుడైన ‘మూడో మాధవవర్మ’ను కునాల యుద్ధంలో ఓడించాడు.

ఉత్తర భారతదేశాన్ని పాలిస్తున్న హర్షవర్ధనుడు దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం కోసం రెండో పులకేశిపై దండెత్తాడు. వీరిద్దరి మధ్య నర్మదా నది తీరాన యుద్ధం జరిగింది. ఐహోల్‌ శాసనం ప్రకారం, ఈ పోరులో రెండో పులకేశి విజయం సాధించి, ‘పరమేశ్వర’ అనే బిరుదు పొందాడు. యుద్ధం తర్వాత నర్మదానది రెండు రాజ్యాల మధ్య సరిహద్దుగా మారింది. 

ఈ యుద్ధం వల్ల చాళుక్యుల అధికారం మహారాష్ట్ర, మైసూరు ప్రాంతాలకు విస్తరించింది. చోళ, చేర, పాండ్యులతో పాటు దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని చిన్న రాజ్యాల పాలకులు కూడా రెండో పులకేశికి సామంతులుగా మారారు. 

క్రీ.శ. 641 లో పులకేశి రెండోసారి పల్లవరాజ్యంపై దండెత్తాడు. ఆ సమయంలో మొదటి మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ పల్లవ రాజుగా ఉన్నాడు. అతడు ‘మణి మంగళయుద్ధం’లో పులకేశిని ఓడించాడు. దీనికి ప్రతిగా రెండో పులకేశి రాయలసీమలోని పల్లవ సామంతులైన బాణులను ఓడించి, కంచిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. 

క్రీ.శ. 642 లో మొదటి నరసింహవర్మ పులకేశిపై దండెత్తి, అతడ్ని ఓడించి, వధించాడు. ఈ ఓటమి నుంచి కోలుకోవడానికి పశ్చిమ చాళుక్యులకు 12 ఏళ్లు పట్టింది. చాళుక్య, పల్లవుల మధ్య యుద్ధం సుదీర్ఘ కాలం జరగడంవల్ల ఈ రెండు రాజ్యాలు ఆర్థికంగా నష్టపోయాయి. 

రెండో పులకేశి సామ్రాజ్యం ఉత్తరాన నర్మదానది నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు విస్తరించింది. 


ఇతర విషయాలు: పర్షియా చక్రవర్తి ‘రెండో ఖుస్రూ’ పులకేశి ఆస్థానానికి రాయబారిని పంపినట్లు పర్షియన్‌ చరిత్రకారుడు ‘తబారి’ పేర్కొన్నాడు. పర్షియా రాయబారి ఇతడి ఆస్థానానికి వచ్చినట్లు ఉండే వర్ణచిత్రం ‘అజంతా గుహ’లో ఉంది. 

చైనా యాత్రికుడు హుయాన్‌ త్సాంగ్‌ క్రీ.శ. 640-41లో రెండో పులకేశి ఆస్థానానికి వెళ్లాడు. ‘‘చాళుక్య రాజ్యం విశాలమైంది, రెండో పులకేశికి శత్రువులంటే భయంలేదు, ప్రజలు యుద్ధప్రియులు, కష్టజీవులు’’ అని అతడు సి-యూ-కి గ్రంథంలో పేర్కొన్నాడు. 

 పుట్టుపూర్వోత్తరాలు

బాదామి చాళుక్య రాజవంశ పుట్టుపూర్వోత్తరాల గురించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

 

ప్రముఖుల అభిప్రాయాలు:

 బిల్హణుడి ‘విక్రమాంకదేవ చరిత్ర’ ప్రకారం, చాళుక్యులు బ్రహ్మచాళకం వంశం నుంచి ఆవిర్భవించారు. అందుకే వీరిని ‘చాళుక్యులు’గా పేర్కొన్నారు. ఈ వంశం అనేక శాఖలుగా విడిపోయి, వివిధ ప్రాంతాలను పరిపాలించాయి. ఆయా ప్రాంతాల పేరు మీదుగా వీరికి గుర్తింపు వచ్చింది. ఉదాహరణకు వేంగి, కల్యాణి, బాదామి చాళుక్యులు. 

 ‘‘చలిక, నలుకి, సతికి, చల్కి అనేవి చాళుక్య పదానికి పర్యాయపదాలు’’ - మల్లంపల్లి సోమశేఖరశర్మ

 ‘‘బాదామి చాళుక్యులు మధ్య ఆసియా నుంచి వచ్చిన ఘార్జరులు అనే శాఖకు చెందినవారు’’ - డాక్టర్‌ వి.ఎ.స్మిత్‌.

 ‘‘వీరు మధ్య ఆసియాకు చెందిన సెల్యుకస్‌ వంశానికి చెందినవారు’’ - జాన్‌ప్లీట్, రైస్‌.

‘‘చాళుక్యులు కన్నడ కుటుంబానికి చెందినవారు’’ - డి.సి.సర్కార్‌ 


శాసన ఆధారాలు:

 బాదామిలో లభించిన శాసనాల్లో ‘చాళక, చాళక్య’ పదాలు విరివిగా ఉన్నాయి. 

 వివిధ శాసనాల్లో వీరిని వానవ్యసగోత్రులు, హరిపుత్రులని పేర్కొన్నారు. 

 కొన్ని శాసనాల్లో చాళుక్యులు చంద్రవంశ క్షత్రియులని ఉంది. 

 నాగార్జునకొండ శాసనంలో ఇక్ష్వాకు చక్రవర్తుల కింద ఉన్న హిరణ్య రాష్ట్ర (కడప) పాలకుడు ‘చలికి రెమ్మణుకుడు’ చాళుక్యవంశ మూలపురుషుడు అని ఉంది. 

 చాళుక్యులు మొదట శూద్రులు, తర్వాత క్షత్రియులుగా మారారు అని వివిధ చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.


రచయిత

డాక్టర్‌ వి. రాజ్‌మహ్మద్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 11-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌