• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాదుపై పోలీసు చర్యకు దారితీసిన పరిస్థితులు


దురాగతాలకు చరమగీతం!


భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి విముక్తి కలిగినా, హైదరాబాదు నిజాం కబంధ హస్తాల్లోనే మిగిలిపోయింది. తనది స్వతంత్ర రాజ్యమని నవాబు ప్రకటించుకున్నాడు. ఒక దశలో పాకిస్థాన్‌లో విలీనం చేసేస్తానని బెదిరించాడు. భారత్‌తో మంచిగా మెలగాలని తన మంత్రులు చెప్పిన మాటలను తలకెక్కించుకోలేదు. చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. అక్రమంగా ఆయుధాలను సేకరించుకొని భారత్‌పై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ప్రజలపై రజాకార్ల దురాగతాలను ఉపేక్షించాడు. ఎర్రకోటపై అసఫ్‌జాహీ జెండాను ఎగురవేస్తామనే రజ్వీ ప్రేలాపనలను నిలువరించలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో నిజాం దుర్మార్గాలకు భారత్‌ పోలీసు చర్యతో చరమగీతం పాడాల్సి వచ్చింది. 


భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాదు రాజ్యానికి ఆ అవకాశం దక్కలేదు. నిజాం తన రాజ్యం స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. అందులో భాగంగా ఆయన భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం చేసుకున్నాడు. కానీ ఒకవైపు ప్రజల స్వాతంత్య్రోద్యమం, మరోవైపు నిజాం యథాతథ ఒప్పంద ఉల్లంఘన, రజాకార్ల దురాగతాలతో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించింది. దాంతో హైదరాబాదుపై భారత యూనియన్‌ పోలీసు చర్య నిర్వహించింది. ఫలితంగా నిజాం సంస్థానం భారతదేశంలో కలిసింది.


భారత ప్రభుత్వంతో నిజాం ప్రభుత్వ చర్చలు: 1947, జూన్‌ 26న నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ ఒక ఫర్మానా జారీ చేస్తూ భారత రాజ్యాంగ పరిషత్తులో హైదరాబాదు సంస్థానం  భాగస్వామి కాదని, భారత యూనియన్‌లో చేరదని ప్రకటించాడు. రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నెలకొల్పి, భారత ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని హైదరాబాదు ప్రధానమంత్రి సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ చేసిన సూచన నిజాంకు రుచించలేదు. ఫలితంగా ఇస్మాయిల్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో చత్తారీ నవాబు ప్రధానిగా నియమితుడయ్యాడు. భారత ప్రభుత్వంతో ఒడంబడికకు నిజాం ప్రయత్నించాడు. తన పక్షాన మంతనాలు సాగించడానికి ప్రధాని చత్తారీ నవాబును, నవాబ్‌ అలీయావర్‌ జంగ్, సుల్తాన్‌ అహ్మద్, సర్‌ వాల్టర్‌ మాంక్‌టన్‌లను నియమించాడు. చర్చలు విఫలమైతే హైదరాబాదు రాజ్యాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేస్తానని అక్టోబరు 3న నిజాం బెదిరించాడు. చర్చల అనంతరం 1947, అక్టోబరు 18న ఒక ముసాయిదా ఒప్పందం కుదిరింది. నిజాం సంతకం తీసుకొని అక్టోబరు 27న ప్రతినిధి బృందం దిల్లీకి బయలుదేరే సమయంలో రజాకార్లు బలప్రయోగంతో వారిని ఆపేశారు. మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమన్‌ సంస్థ ఒత్తిడికి లొంగి ఆ ప్రతినిధి బృందాన్ని రద్దు చేసింది. మరో ప్రతినిధి వర్గాన్ని నియమించింది. దాంతో చత్తారీ నవాబు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో మహంది యార్‌ జంగ్‌ ప్రధాని అయ్యాడు. రజాకార్ల  అధ్యక్షుడైన కాశిం రజ్వీ ఆమోదంతో మొయిన్‌ నవాజ్‌ జంగ్, అబ్దుల్‌ రహీం, పింగళి వెంకట్రామారెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం మళ్లీ చర్చలు జరపడానికి దిల్లీ వెళ్లింది.హైదరాబాదుకు ఏ రూపంలోనూ పాకిస్థాన్‌ సహాయం చేయదని అధ్యక్షుడు జిన్నా స్పష్టం చేశాడు. 


యథాతథస్థితి ఒప్పందం: 1947, నవంబరు 29న భారత గవర్నమెంటుతో హైదరాబాదు ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని చేసుకుంది.


ఒడంబడికలోని ముఖ్యాంశాలు: 

1) భారతదేశంలో హైదరాబాదు రాజ్యం ఒక అనుబంధ ప్రాంతంగా ఉంటుంది.

2) భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం వస్తే హైదరాబాదు రాజ్యం తటస్థంగా వ్యవహరిస్తుంది.

3) హైదరాబాదు రాజ్యం పాకిస్థాన్‌లో విలీనం కాదు

4) ఒక సంవత్సరం లోపు హైదరాబాదు రాజ్యంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడుతుంది.

5) హైదరాబాదు సంస్థానంలో భారత కరెన్సీ చెల్లుతుంది.

6) హైదరాబాదు రాజ్య ప్రజలకు వాక్, సభా స్వాతంత్య్రాలు కల్పించాలి. ప్రజలపై ఎలాంటి దౌర్జన్యాలు చేయకూడదు. అరెస్ట్‌ అయిన నాయకులను విడుదల చేయాలి.

7) హైదరాబాదు సంస్థాన రక్షణ, విదేశీ వ్యవహారాల బాధ్యత భారత ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. భారత ప్రభుత్వ ప్రతినిధి హైదరాబాదులో ఉంటాడు. 


పాకిస్థాన్‌ అధ్యక్షుడు జిన్నా, కాశిం రజ్వీ ఒత్తిడి మేరకు నిజాం తన ప్రధానిగా లాయక్‌ అలీని 1947, డిసెంబరు 18న నియమించాడు. లాయక్‌ అలీ మంత్రి వర్గంలో ఉప ప్రధానిగా పింగళి వెంకట్రామారెడ్డి, నిమ్న జాతుల పక్షాన బి.ఎస్‌. వెంకట్రావు, లింగాయతుల ప్రతినిధులుగా మల్లికార్జునప్ప. జె.వి.జోషి తదితర హిందువులు ఉండేవారు. అంతకు ముందు బొంబాయి నుంచి పనిచేసిన సరిహద్దు కార్యాచరణ సమితి కార్యాలయాన్ని మద్రాసుకు మార్చారు. జైలు నుంచి విడుదలైన హైదరాబాదు కాంగ్రెసు నాయకుడు రామానంద తీర్థ మద్రాసుకు చేరుకుని బులుసు సాంబమూర్తి తదితర కాంగ్రెస్‌ నాయకులను కలుసుకొని తమ స్వాతంత్య్రోద్యమానికి వారి సహకారాన్ని కోరాడు. హైదరాబాదు సంస్థానానికి భారత ప్రభుత్వం తరఫున ఏజెంట్‌ జనరల్‌గా నియమితుడైన కె.ఎం.మున్షీని రామానంద తీర్థ కలుసుకున్నాడు. ఆయన సలహా మేరకు రామానంద తీర్థ  నిజాంకు ఒక ఉత్తరం రాశాడు. అందులో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాదును భారతదేశంలో విలీనం చేయాలని కోరాడు.


యథాతథ స్థితి ఒడంబడిక ఉల్లంఘన:  నిజాం ప్రభుత్వం భారతదేశంతో చేసుకున్న యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించి అనేక వ్యతిరేక చర్యలకు పాల్పడింది. భారత కరెన్సీ, బ్యాంకులు, బీమా సంస్థల కార్యకలాపాలు హైదరాబాదు రాజ్యంలో చెల్లవని ప్రకటించింది. పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి గులాం మహ్మద్‌ హైదరాబాదును సందర్శించి 3% వడ్డీతో రూ.20 కోట్ల రూపాయల రుణాన్ని పొందాడు. బంగారం ఎగుమతిని నిజాం నిషేధించాడు. భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధ సన్నాహాలు ప్రారంభించాడు. నిజాం సేనాధిపతి ‘ఇంద్రూస్‌’ (మేజర్‌ జనరల్‌ ఎల్‌డ్రూస్‌) సైనిక విమానాలను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్, చెకోస్లవేకియా దేశాలను సందర్శించాడు. బ్రిటిష్‌ ఏజెంట్ల ద్వారా పోర్చుగీసు వారి నుంచి గోవాను కొనుగోలు చేయడానికి నిజాం తరఫున లాయక్‌ అలీ చేసిన ప్రయత్నాలను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. హైదరాబాద్‌లో ఆయుధాల తయారీకి ప్రాగా మెషిన్‌ టూల్స్, ప్రాగా స్టీల్‌ ఫ్యాక్టరీ, నాంపల్లి దేబోనర్స్‌ వర్క్‌షాప్, కోవర్‌బాగ్, గోల్కొండ, మోతీమహల్, చాదర్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నెలకొల్పారు. సిడ్నీ కాటన్‌ అనే బ్రిటిష్‌ పౌరుడి ద్వారా హైదరాబాదుకు దొంగచాటుగా ఆయుధాలు తెప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని వందేమాతరం రామచంద్రరావు భారత ప్రభుత్వానికి తెలియజేశాడు. దాంతో భారత్‌ జోక్యంతో కాటన్‌ విమాన లైసెన్స్‌ను బ్రిటన్‌ రద్దు చేసింది. పత్రికలు, రేడియోల ద్వారా, భారత వ్యతిరేక ప్రచారాన్ని నిజాం ప్రభుత్వం ఉద్ధృతం చేసింది. పూర్తిస్థాయిలో యుద్ధ సామగ్రిని, ఆహార ధాన్యాలను నిల్వ చేసింది. హైదరాబాదులో స్థిరపడమని ఉత్తర భారతంలోని ముసిం్లలను నిజాం ప్రభుత్వం ఆహ్వానించింది. భారత ప్రభుత్వ ప్రతినిధి జనరల్‌ కె.ఎం.మున్షీ 1948, జనవరి 3న హైదరాబాదుకు చేరుకున్నాడు. ఆయన రాకకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిజాం ప్రభుత్వం ఈయనకు వసతి సౌకర్యం కల్పించలేదు. దీంతో ఆయన బొల్లారంలో ఉన్న భారత ప్రభుత్వ భవనంలో నివాసం ఏర్పరుచుకొని, దానికి ‘దక్షిణ సదన్‌’ అని పేరు పెట్టాడు. హైదరాబాదు సంస్థానంలో వెంటనే ప్లెబిసైట్‌ (ప్రజాభిప్రాయసేకరణ) జరగాలి. అది ఆలస్యమయ్యేట్లయితే, వెంటనే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రామానందతీర్థ పత్రికా ప్రకటనలో కోరాడు. దాంతో ఆయన హైదరాబాదులో సంచరించడానికి వీల్లేదని నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. హైదరాబాదులో పరిస్థితులను గమనించిన మున్షీ ఒక నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించాడు. 


భారత ప్రభుత్వం నిజాం దృష్టికి కొన్ని అంశాలను తీసుకొచ్చింది. అందులో యథాతథ ఒప్పందానికి వ్యతిరేకంగా హైదరాబాదు ప్రభుత్వం ఆయుధాలను సేకరించడం తగదని పేర్కొంది. రజాకార్ల సంస్థను నిషేధించాలని కోరింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయడం తగదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనికి హైదరాబాదు ప్రధాని లాయక్‌ అలీ తమది సర్వసత్తాక రాజ్యం కాబట్టి ఆయుధాలను సమకూర్చుకునే హక్కు తమకుందని చెప్పాడు. సంస్థానంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించాలని భారత ప్రభుత్వం 1948 ఏప్రిల్‌లో నిజాం ప్రభుత్వాన్ని అడిగింది. ఈ దశలో రజాకార్లు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. రైళ్లపై దాడి చేశారు. గ్రామాలపై పడి ప్రజలను లూటీ చేస్తూ, ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. జనాన్ని చంపేశారు. వీరికి, కమ్యూనిస్టులకు, ప్రజలకు మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. రజాకార్ల అధ్యక్షుడైన కాశిం రజ్వీ అనేక రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. త్వరలో అసఫియా (అసఫ్‌ జాహీ) జెండా దిల్లీలోని ఎర్రకోటపై ఎగురవేస్తామని ప్రకటించాడు. ఈయన ప్రసంగం భారత నాయకుల కోపానికి కారణమైంది. భారత ప్రభుత్వ విధానాన్ని పార్లమెంటులో కొందరు ప్రశ్నించారు. భారత భూభాగ సరిహద్దుల్లోని ప్రజలపై రజాకార్లు దాడులు సాగించారు. 1948, జులై 28న నానజ్‌ వద్ద భారత సైన్యాలపై రజాకార్లు, నిజాం పోలీసులు దాడి చేశారు. ఈ ఘర్షణలో భారత సైన్యం నానజ్‌ను ఆక్రమించింది.


మాదిరి ప్రశ్నలు


1. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌తో యథాతథ ఒప్పందాన్ని ఎప్పుడు చేసుకుంది?

1) 1947, నవంబరు 29    2) 1947, అక్టోబరు 18 

3) 1947, నవంబరు 27    4) 1947, అక్టోబరురు 29


2. సిడ్నీ కాటన్‌ అనే బ్రిటిష్‌ ఆయుధాల ఏజెంట్‌ గురించిన సమాచారాన్ని భారత ప్రభుత్వానికి తెల్పిందెవరు?

1) రామానంద తీర్థ    2) దిగంబరరావు బిందు 

3) బూర్గుల రామకృష్ణారావు  4) వందేమాతరం రామచంద్రరావు


3. హైదరాబాదు సంస్థానంలో భారత ప్రభుత్వ ఏజెంట్‌ జనరల్‌గా నియమితులైంది?

1) కె.ఎ.జైన్‌  2) కె.ఎం.మున్సీ   

3) కె.పి.మీనన్‌   4) ఆర్‌.పి. ఠాగూర్‌


4. భారత ఏజెంట్‌ జనరల్‌ హైదరాబాదులోని తన నివాసానికి పెట్టుకున్న పేరు?

1) రెసిడెన్సీ భవనం   2) హైదరాబాదు హౌజ్‌  

3) హైదరాబాదు సదన్‌   4) దక్షిణ సదన్‌


5. హైదరాబాదు నిజాం భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పంపిన ప్రతినిధి బృందంలో లేని సభ్యుడు ఎవరు?

1) మొయిన్‌ నవాజ్‌ జంగ్‌   2) అబ్దుల్‌ రహీం  

3) అలీయావర్‌ జంగ్‌  4) పింగళి రామారెడ్డి


6. హైదరాబాదును దర్శించిన పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి ఎవరు?

1) మహ్మద్‌ రఫీ   2) గులాం మహ్మద్‌  

3) బహదూర్‌ జంగ్‌   4) రసూల్‌ ఖాన్‌


7. భారత ప్రభుత్వ ఏజెంట్‌ జనరల్‌ హైదరాబాదును ఎప్పుడు దర్శించారు?

1) 1947, డిసెంబరు 18  2) 1947, డిసెంబరు 28 

3) 1948, జనవరి 3  4) 1948, జనవరి 18


8. నిజాం ప్రభుత్వం ఏ ప్రాంత కొనుగోలుకు ప్రయత్నించింది?

1) డామన్‌   2) గోవా  

3) అండమాన్‌   4) లక్షద్వీప్స్‌


9. సైనిక విమానాలు కొనుగోలు చేయడానికి విదేశాల్లో పర్యటించిన హైదరాబాదు సేనాపతి ఎవరు?

1) లాయక్‌ అలీ   2) వాంక్‌టన్‌   

3) ఇద్రూస్‌   4) అబ్దుల్‌ రహీం


సమాధానాలు: 1-1; 2-4; 3-2; 4-4; 5-3; 6-2; 7-3; 8-2; 9-3.


రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి
 

Posted Date : 31-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌