• facebook
  • whatsapp
  • telegram

కంపెనీ పాలనపై తిరుగుబాట్లు

వలస దోపిడీలపై వీరపోరాటాలు!

భారతదేశ ఆర్థిక వనరులను కొల్లగొట్టడమే లక్ష్యంగా ప్రారంభమైన ఆంగ్లేయుల అరాచక పాలనపై అంతటా తీవ్ర అసంతృప్తి చెలరేగింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల స్థానిక సమస్యలు ప్రాతిపదికగా ఎందరో బ్రిటిషర్లను ఎదిరించారు. సాఫీగా సాగుతున్న తమ జీవితాలు చిన్నాభిన్నం కావడంతో సంస్థానాధీశులు మొదలు, అడవి బిడ్డల వరకు అందరూ వలస దోపిడీలపై వీర పోరాటాలు చేసి తెల్లవారిని వణికించారు.

 

  క్రీ.శ.1857 నాటికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారతదేశంలో బ్రిటిష్‌ ఇండియా మహా సామ్రాజ్యాన్ని స్థాపించింది. తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగి పాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. బ్రిటన్‌కు భారతదేశం వలస రాజ్యమైంది. ఇక్కడి ప్రజలను దోపిడీ చేయడమే దాని లక్ష్యంగా మారింది. కంపెనీ అవలంబించిన వివక్షాపూరిత వాణిజ్య, రెవెన్యూ, వ్యవసాయ విధానాలు భారతదేశ సంప్రదాయ, ఆర్థిక వ్యవస్థ క్షీణతకు దారితీశాయి. వ్యవసాయ రంగంలో వాణిజ్య పోకడలు ప్రారంభమయ్యాయి. సమాజంలో వడ్డీ వ్యాపారుల ప్రాబల్యం పెరిగింది. అనాదిగా ఆదరణ పొందుతున్న చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు క్షీణించాయి. నగరం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస ప్రారంభమైంది. వ్యవసాయంపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాలు పేదరికాన్ని పెంచి ప్రజలను దురవస్థల పాలుచేశాయి. ఆంగ్లేయుల వలస పాలన పట్ల భారతీయుల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఆ అసంతృప్తి తిరుగుబాట్ల రూపంలో బయటపడింది. 

 

సివిల్‌ తిరుగుబాట్లకు కారణాలు

 

* భారతీయ సంస్థానాలను బలవంతంగా బ్రిటిష్‌ ఆధిపత్యం కిందికి తీసుకురావడం. 

 

* వెల్లస్లీ సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన సంస్థానాధీశుల మీద ఆర్థిక భారం పెరగడం. 

 

* డల్హౌసీ రాజ్య సంక్రమణ విధాన పరిణామాలు. 

 

* సంస్థానాధీశుల కొలువులో బ్రిటిష్‌ రెసిడెంట్‌ అధికారుల మితిమీరిన జోక్యం. 

 

* ప్రజలపై అధిక భారం మోపుతున్న బ్రిటిష్‌ పన్నుల వ్యవస్థ పట్ల నిరసన. 

 

* పన్నులు కట్టలేని వారిని జమీందారీలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడం. 

 

* తీవ్ర కరవు కాటకాల పరిస్థితుల్లో కంపెనీ నిర్లిప్తత. 

 

కొన్ని ముఖ్య తిరుగుబాట్లు

 

వీరపాండ్య కట్టబొమ్మన: 1792 - 99 మధ్య తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంత పాంచాలన్‌ కురుచ్చి పాలకుడు వీరపాండ్య కట్టబొమ్మన ఆంగ్లేయ కంపెనీ ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. వారి అణిచివేత విధానాలు, పన్నుల వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఉరికొయ్యను ఆనందంగా ఆహ్వానించి వీరమరణం పొందాడు.

 

1763 - 1800 మధ్య సన్యాసీల తిరుగుబాటు: బెంగాల్‌లో 1769 - 71 మధ్య తీవ్ర క్షామం నెలకొంది. వేలాది మంది ప్రజలు ఆకలితో అలమటించి మరణిస్తున్నారు. అప్పటికే బెంగాల్‌లో అధికారం చెలాయిస్తున్న ఆంగ్లేయ కంపెనీ ఈ పరిస్థితులకు చలించలేదు. ఈ ధోరణిని సహించలేక సన్యాసీలు తిరగబడ్డారు. ప్రభుత్వ గిడ్డంగులు, జమీందార్లపై దాడి చేసి ధాన్యాన్ని అన్నార్తులకు పంచారు. ఈ దయనీయ సంఘటనలను సుప్రసిద్ధ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ ‘ఆనంద్‌మఠ్‌’ అనే నవలలో రాశాడు.

 

ఖుర్దా ప్రాంత పాయిక్‌లు: 1804లో బ్రిటిష్‌ కంపెనీ ఖుర్దా ప్రాంతాన్ని (ఒరిస్సా) ఆక్రమించింది. అప్పుడు పాయిక్‌లు అని పిలిచే ఖుర్దా ప్రాంతపు సైనికులు కంపెనీ భూమిశిస్తు విధానాన్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. వీరి నాయకుడు జగబంధు విద్యాధర మహాపాత్రో పూరి వరకు ఆక్రమించాడు. అయినా బ్రిటిషర్లు తిరుగుబాటును అణిచివేశారు. దీంతో పాయిక్‌లు లొంగిపోయారు.

 

ట్రావెన్‌కోర్‌ సంస్థానం: వెల్లస్లీ సైన్యసహకార పద్ధతిని చాలా మంది సంస్థానాధీశులు బలవంతంగా అంగీకరించారు. ట్రావెన్‌కోర్‌ సంస్థానం ఆ బాధితుల్లో ఉంది.ఈ సంస్థానంపై అధిక ఆర్థిక భారం పడింది. దాని దివాను వేలు తంపి కంపెనీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. కంపెనీ 1809లో ఈ తిరుగుబాటును అణిచివేసి ట్రావెన్‌కోర్‌ను ఆక్రమించింది.

 

రామోసిల తిరుగుబాటు: 1818 నాటికి మరాఠాల వైభవం క్షీణించింది. 1822 - 29 మధ్య మహారాష్ట్రలోని సతారా కేంద్రంగా రామోసిలు తిరుగుబాటు చేశారు. రామోసిలు మరాఠా సర్దారుల వద్ద సైనికులుగా ఉండేవారు. వీరు సైనిక వృత్తిని వదిలి వ్యవసాయం మీద ఆధారపడి జీవించారు. కంపెనీ రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.

 

కిత్తూరు రాణి చెన్నమ్మ: కర్ణాటకలోని ధార్వార్‌ ప్రాంత కిత్తూరు సంస్థానాధీశుడు శివలింగ రుద్ర మరణించడంతొ కంపెనీ ఆ రాజ్యాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. నాటి పాలకురాలు రాణి చెన్నమ్మ కంపెనీ ప్రభుత్వంపై 1824లో తిరుగుబాటు చేసింది. ఆ ప్రయత్నంలో రాణి చెన్నమ్మ, ఆమె సహాయకుడు రాయప్ప మరణించారు. రాజ్యం కంపెనీ వశమైంది.  

 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి: 1846 - 47 మధ్య పాలెగార్లను  తొలగించడంతో వారు తిరుగుబాట్లు చేశారు. కర్నూలు ప్రాంతంలో  పాలెగారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు చేయగా కంపెనీ దాన్ని అణిచివేసి ఆయనను ఉరితీసింది.

 

గిరిజన తిరుగుబాట్లు  

  అనాదిగా భారతీయ సామాజిక వ్యవస్థలో గిరిజనులు అంతర్భాగమై ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కంపెనీ పాలనా కాలం నాటికి ధింసా, హాజోంగ్, గారోస్, ఖాసిస్‌ (అస్సాం), భిల్స్‌ (రాజస్థాన్‌); గోండ్, పరిహాయ, సంతాల్‌ (బిహార్‌); భిల్, దోడియా (గుజరాత్‌), కోల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), చక్మా (మేఘాలయ), అంగమి (నాగాలాండ్‌), సవరలు (ఆంధ్రప్రదేశ్‌), తోడాలు (తమిళనాడు), భిల్‌ (కర్ణాటక) లాంటి అనేక గిరిజన తెగలు తమ విలక్షణ సంస్కృతిని కాపాడుకుంటూ కొండ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మైదానం నుంచి వచ్చిన వారు గిరిజనులపై దాష్టీకాలు చేస్తూ, వారి భూములను ఆక్రమించి, దోపిడీ చేస్తూ పెత్తనం చెలాయించడం వారిలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఆ పెత్తనాలకు కంపెనీ పాలనలో బ్రిటిష్‌ అధికారులు తోడయ్యారు. దీంతో బ్రిటిషర్ల వలసవాద విధానాలు, దోపిడీ గిరిజన ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. అటవీ చట్టాలు, భూమి శిస్తు చట్టాలు, ఇతర ఆంక్షలతో గిరిజనుల సంప్రదాయ జీవన విధానం ఛిద్రమైంది. దాంతో వారి జీవితాలో పేదరికం తీవ్రమైపోయింది. వలస ప్రభుత్వ పాలనలో తమ జీవితాల్లో వచ్చిన మార్పులకు నిరసనగా గిరిజనులు తిరుగుబాట్లు చేశారు.

 

కొన్ని ముఖ్య తిరుగుబాట్లు: 

* 1784 - 85 మధ్య మహారాష్ట్ర ప్రాంతంలోని కోలి తెగ కంపెనీ దాష్టీకాలు భరించలేక ఆంగ్లేయ అధికారులపై తిరుగుబాటు చేసింది. 

 

* 1789లో చోటానాగపూర్‌ ప్రాంతానికి చెందిన తమల్‌ తెగ కంపెనీ రెగ్యులేషన్స్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. 

 

* 1814లో చోటానాగపూర్‌ ప్రాంతపు చేరా తెగ గిరిజనులు కంపెనీ అధికారులపై తిరుగుబాటు చేశారు.

 

* 1817 - 19 మధ్య కంపెనీ వేధింపులు భరించలేక మహారాష్ట్ర అడవుల్లో భిల్‌ తెగ గిరిజనులు తిరుగుబాటు చేశారు.

 

* 1822లో రామోసి గిరిజన తెగ కంపెనీపై తిరుగుబాటు చేసింది. 

 

* 1823 - 32 మధ్య మేఘాలయ ప్రాంతపు కాళీ తెగ గిరిజనులు తిరుగుబాటు చేశారు.

 

* 1831 - 32లో బిహార్‌లోని కోల్‌ గిరిజన తెగ కంపెనీపై తిరుగుబాటు చేసింది. తమ తండాలను కోల్‌ తెగ నాయకుల నుంచి సిక్కులు, ముస్లింలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ తిరుగుబాటు జరిగింది. 

 

1854 - 55 సంతాల్‌ల తిరుగుబాటు: సంతాల్‌లు చోటానాగపూర్‌ ప్రాంతంలో, తాజ్‌మహల్‌ కొండల వద్ద జీవనం సాగించేవారు. వీరు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిలలాడారు. దీనికి తోడు బ్రిటిష్‌ కంపెనీ అధికారుల దోపిడీ, అణిచివేత, అమానుష చర్యలు తిరుగుబాటుకు కారణమయ్యాయి. 1856 నాటికి కంపెనీ సంతాల్‌ల తిరుగుబాటును అణిచివేసింది.

 

తిరుగుబాట్ల స్వభావం

ఇవి స్థానిక సమస్యల ప్రాతిపదికగా స్థానికులు నిర్వహించిన తిరుగుబాట్లు. కొన్ని కారణాల వల్ల ఈ తిరుగుబాట్లు ప్రజల మద్దతును కూడగట్టలేకపోయాయి. తిరుగుబాటుదారుల్లో ఆధునిక దృక్పథం లోపించింది. వీరు పూర్వ ఫ్యూడల్‌ వ్యవస్థకే మొగ్గు చూపారు. వారి మధ్య ఐక్యత లేదు. విదేశీ శక్తులకు వ్యతిరేకంగా తలెత్తిన ఈ తిరుగుబాట్లను ముందుకు తీసుకువెళ్లే నాయకులు, సరైన కార్యాచరణ పథకం, వ్యూహం, ఆయుధ సంపత్తి కూడా కరవయ్యాయి. అయినప్పటికీ భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్య శక్తులను ఎదిరించి వీరోచితంగా పోరాడిన ఈ అద్భుత ఘట్టాలు ఆధునిక భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమయ్యాయి. తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి.

 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 ఐరోపావారి రాక

  కంపెనీ పాలనలో భూమి శిస్తు విధానం

 సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 04-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌