• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగ‌రిక‌త ముఖ్యాంశాలు

* 1921-22ల్లో జరిపిన తవ్వకాల్లో హరప్పా, మొహంజొదారో నగరాలు మొదట బయటపడ్డాయి.
* ఈ నాగరికతను మొదట సింధు నాగరికత అని పిలిచారు. కానీ తర్వాత కాలాల్లో జరిగిన తవ్వకాల్లో ఇది సింధులోయను దాటి వ్యాపించిందని తెలియడంతో దీన్ని ప్రస్తుతం హరప్పా నాగరికతగా పేర్కొంటున్నారు. ఎందుకంటే మొదట బయటపడిన నగరం హరప్పా. అందుకే ఈ పేరుతోనే ఈ నాగరికతను పిలుస్తున్నారు.
* సింధు నాగరికత లోహశిలాయుగ నాగరికత.
* సింధు రాష్ట్రంలోని (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది) లర్కానా జిల్లాలోని మొహంజొదారో వద్ద, పశ్చిమ పంజాబ్ లోని మాంట్ గోమరీ జిల్లాలోని హరప్పా వద్ద  ముందుగా ఈ నాగరికత అవశేషాలు కనిపించాయి.
* వాయవ్యంలో హిందూకుష్ పర్వతాల దగ్గర క్వెట్టా లోయ నుంచి, తూర్పున గంగా-యమునా అంతర్వేది వరకు, ఉత్తరాన సట్లేజ్ నది సమీపంలోని రూపార్ నుంచి దక్షిణంలోని నర్మదా నదీ తీరంలోని భగత్రావ్ వరకు సింధు నాగరికత విస్తరించి ఉంది.
* తూర్పు పడమరలుగా 1900 కిలో మీటర్లు, ఉత్తర దక్షిణాలు 1100 కిలోమీటర్లు, దాదాపు 84,000 చదరపు మైళ్లలో సింధు నాగరికత విస్తరించి ఉంది.
* ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న కోట్ దిజి, పంజాబ్ లోని రూపార్, హర్యానా లోని రాకీగరి, మిటాతల్, బన్వాలీ, రాజస్థాన్ లోని కాలీబంగన్, గుజరాత్ లోని లోథాల్, ధోలవీర, సుర్కోటడా తదితర ప్రాంతాల్లో హరప్పా నాగరికత విలసిల్లింది.
* మెహర్ గర్, సుక్తజెందార్, మొహంజొదారో, ఆమ్రి, చాన్హుదారో, దేశల్పూర్, లోథాల్, రంగపూర్, రోజ్డి, భగత్రావ్, కాలీబంగన్, హరప్పా, రూపార్, అలంగీర్పూర్ ఈ నాగరికత ప్రధాన కేంద్రాలు.
* ప్రసిద్ధ చరిత్రకారులు రొమిల్లా థాపర్ హరప్పా నాగరికత కాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. 1) హరప్పా పూర్వదశ (క్రీస్తు పూర్వం 4000 నుంచి క్రీ.పూ. 2600), 2) హరప్పా నాగరికత ఉచ్ఛదశ (క్రీ.పూ. 2600 నుంచి క్రీ.పూ. 1900 వరకు), 3) హరప్పా చివరి దశ (క్రీ.పూ. 1900 నుంచి క్రీ.పూ. 1750).
* హిస్టరీ ఆఫ్ ఇండియా అనే కేంబ్రిడ్జి ప్రచురణల్లోని ఒకటో సంపుటంలో సింధునాగరికత విస్తృతికాలాన్ని క్రీ.పూ. 2750-1500 గా రాప్సన్ పేర్కొన్నట్లు ఉంది.
* హరప్పా ప్రజలు ఉపయోగించిన లిపిని చిత్ర లిపి లేదా సర్పలేఖనం అంటారు. దీన్ని ఇంత వరకు ఎవరూ పరిష్కరించలేకపోయారు. దీనితో ఆ కాలం నాటి చాలా విశేషాలు ఊహలకే పరిమితమయ్యాయి.
* హరప్పా లిపి కుడి నుంచి ఎడమకు ఉంటుంది. కొన్ని ముద్రికలపై ఎడమ నుంచి కుడికి ఉండటం కూడా గమనించారు. హరప్పా లిపి ముద్రించిన మట్టిపాత్రలు మెసపొటేమియాలో దొరికాయి.
* హరప్పా ముద్రలపై వృషభం, ఏనుగు, ఒకే కొమ్ము ఉన్న జంతువు (ఖడ్గమృగం) బొమ్మలు ఉన్నాయి. మరికొన్నింటిపై పులి కూడా కనిపిస్తుంది. కానీ ఎక్కడా గుర్రం ప్రస్తావన లేదు. అందుకే హరప్పా ప్రజలకు గుర్రం తెలియదని చరిత్రకారులు భావిస్తున్నారు.
* సుర్కొటడా అనే ప్రాంతంలో గుర్రం ఎముకలు కనిపించాయని కొందరు పరిశోధకులు చెప్పారు. కానీ మరికొందరు అవి కంచర గాడిద ఎముకలని పేర్కొంటున్నారు.
* హరప్పా ప్రజల భాష సంస్కృతం అని ఆచార్య మధుసూదన మిశ్రా చెప్పారు. కానీ మూలద్రావిడం హరప్పా భాష అని ఆచార్య మహదేవన్ పేర్కొంటున్నారు. ఏదన్నది ఇంతవరకు తేలలేదు.
* మొహంజొదారో అంటే మృతుల దిబ్బ  అని అర్థం.
* హరప్పా, చాన్హుదారో, లోథాల్ తదితర నగరాలు భారత దేశంలో జరిగిన తొలి నగరీకరణ ప్రాంతాలని రొమిల్లా థాపర్ పేర్కొంటున్నారు.
* హరప్పా నగరం పంజాబ్ లోని రావి నదీ తీరంలో ఉంది.  మొహంజొదారో సింధునది ఒడ్డున ఉంది. దాదాపు 950 మైళ్ల పరిధిలో ఉత్తర, దక్షిణాలుగా హరప్పా సంస్కృతి విస్తరించి ఉంది.
* ఈ నగరాలన్నింటిలోనూ ఒకే పరిమాణంలో ఉన్న కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. నగరాలన్నింటిలోనూ ఒకే విధమైన నిర్మాణ పద్ధతి కనిపిస్తుంది.
* ధోలవీరలో జరిగిన నిర్మాణాల్లో మాత్రం రాతిని వినియోగించారు.
* చక్కటి గాలి, పరిశుభ్రతలను దృష్టిలో ఉంచుకొని హరప్పా నగరాల్లోని ప్రధాన వీధులను ఉత్తర-దక్షిణాలుగా, తూర్పు-పడమరలుగా నిర్మించారు. వీధులను ఒకదానికొకటి లంబకోణంలో ఏర్పాటు చేశారు.
* మురుగు కాల్వల నిర్మాణం కూడా ఒక క్రమంలో జరిగింది. ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీరు వీధిలో ఉన్న మురుగునీటి కాల్వల్లోకి ప్రవహించే విధంగా చేశారు.  చిన్న వీధులు 9 అడుగుల వెడల్పు ఉంటే పెద్ద వీధులు 34 అడుగుల వెడల్పులో ఉన్నాయి.
* నిర్మాణాలను ఇటుకలతో కట్టడానికి మట్టి అడుసు ఉపయోగించారు. ఎక్కువ అంతస్తులు ఉన్న ఇళ్ల నుంచి మురుగు నీరు నిలువు గొట్టాల ద్వారా వెళ్లే విధంగా నిర్మించారు.
* మొహంజొదారోలోని స్నానవాటిక పొడవు 180 అడుగులు, వెడల్పు 108 అడుగులు.  ఇందులో స్నాన సరస్సు 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో ఉంటుంది. స్నాన సరస్సు నీరు ఇంకి పోకుండా అడుగుభాగంలో జిప్సమ్ – బిటూమెన్ పదార్థాలను వినియోగించారు. ఈ సరస్సును వేడి నీటితో నింపడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీని బట్టి హరప్పా ప్రజలకు వేడి నీటి స్నానం కూడా తెలుసని అర్థమవుతోంది.
* హరప్పాలో నగర – రాజ్య పద్ధతి ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. తెగల నాయకులు సంకీర్ణ వ్యవస్థగా ఏర్పడి పాలనా పరమైన విధులను నెరవేర్చారని భావిస్తున్నారు.
* సింధు ప్రజల్లో ప్రోటో ఆస్ట్రలాయిడ్, మెడిటరేనియన్, మంగోలాడ్, ఆల్పినాడ్ లని నాలుగు రకాల జాతులు ఉండేవి. ఆచార్య భాష్యం ఈ భావనను ఆమోదించారు.
* సింధు ప్రజలు ముఖ్య వృత్తులు వ్యవసాయం, వాణిజ్యం.
* వీరు గోధుమ, బార్లీ, తృణధాన్యాలు, జొన్నలు, నువ్వులు పండిచేవారు.  కానీ సింధు ప్రజలకు వరిసాగు తెలియదని ఆచార్య భాష్యం అన్నారు. కానీ కొన్ని ప్రదేశాల్లో వరి సాగు చేసి ఉండవచ్చని రొమిల్లా థాపర్ అభిప్రాయం. పత్తిని పండించి నూలు దుస్తులు ధరించేవారు.
* సింధు ప్రజలకు కాలువల ద్వారా నీటిపారుదల చేసే విధానం తెలిసినప్పటికీ దాన్ని అనుసరించలేదు.
* సింధు ప్రజలు కొత్త పద్ధతులను అనుసరించడానికి విముఖంగా ఉంటారని ప్రముఖ చరిత్రకారులు కోశంబి అన్నారు. ఎందుకంటే ఈ నాగరికతకు సమకాలీనమైన మెసపటోమియా నాగరికతలో పన్నెండు ప్రముఖ నగరాలు ఉంటే, సింధు నాగరికతలో కేవలం ప్రసిద్ధ నగరాలు రెండు మాత్రమే కనిపిస్తాయి. అవి హరప్పా, మొహంజొదారోలు.
* సింధు ప్రజలు ఇంత వ్యవసాయం చేసినా ఎక్కడా నాగలి గుర్తులు లేవు. గొర్రు వంటి తేలికపాటి పరికరంతో నేలను దున్నారు.
* వీరు మహిషం, మేక, గొర్రె,  గాడిద, పంది వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. కోళ్లను పెంచారు. వీరికి గుర్రం తెలియదు.
* సింధు ప్రజలు మెసపటోమియన్లతో వాణిజ్యం నిర్వహించారు. క్రీ.పూ. 2300 – 2000 మధ్య కాలంలో మెసమటేమిన్ ప్రాంతాల్లో సింధు నాగరికతకు చెందిన ముద్రికలు లభించాయి.
* పత్తి, కలప, అమూల్య శిలలు, రాగి, లోహం, దంతం, దంతంతో చేసిన దువ్వెనలు తదితర వస్తువులను మెసపటోమియాకు సింధు ప్రజలు ఎగుమతి చేశారు. వీటితో పాటు కోతులు, నెమళ్లు, ముత్యాలు కూడా ఎగుమతుల్లో ఉండేవి.
* మెసపటోమియా నుంచి ముఖ్యంగా వెండిని సింధు ప్రజలు దిగుమతి చేసుకునేవారు.
* సింధు ప్రజల ముఖ్య వాణిజ్య రేవు గుజరాత్ లోని లోథాల్. ఇక్కడ నుంచి ఓడలు సుమేర్, ఎలామ్ వంటి ప్రాంతాలకు వెళ్లేవి.
* సింధు నగరాల్లో త్రాసులు, తూనిక రాళ్లు, కొలత బద్దలు కనిపించాయి. ఈ తూనికల్లో ఎక్కువగా కనిపించే బరువు 13.64 గ్రాములు.
* సింధు ప్రజల్లో అంతగా కళాదృష్టి కనిపించదు. వారి కళా రూపాల్లో ఉపయోగితా తత్వం కనిపిస్తుంది. టెర్రాకోట బొమ్మలు, ముద్రికలు, మృణ్మయ పాత్రలు వారి నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి.
* శిల్పాల సంఖ్య కూడా పెద్దగా లేదు. కంచుతో చేసిన నాట్యగత్తె విగ్రహం, నడుం వరకు ఉన్న పురుషుల విగ్రహాలు పేర్కొనదగినవిగా కనిపిస్తాయి.
* చెక్కిన కళారూపాలు ఉన్న ముద్రికలు దాదాపు రెండు వేలకు పైగా దొరికాయి.
* ఒక ముద్రికలో మూడు ముఖాలతో ఉన్న మూర్తి వేదికపై ఉన్నాడు.  ఆ వేదిక చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, మహిషం ఉన్నాయి. ఆ మూర్తి తల నుంచి వృక్షం ఆవిర్భవిస్తున్నట్లు కనిపిస్తుంది. దీన్ని శివుడి తొలి రూపంగా సర్ జాన్ మార్షల్ వర్ణించారు.
* ముద్రికలపై ఎక్కడా గోవు మాత్రం కనిపించదు.
* రావిచెట్టు, కొమ్ముల శిరోవేష్టం ఉన్న మూర్తి, కొమ్ముల శిరోవేష్టం ఉన్న ఆరాధకుడు, మనిషి శిరస్సు ఉన్న మేక, ఏడుగురు స్త్రీలు ఒక ముద్రికపై ఉన్నారు.
* పులులతో ఒక వీరుడు పోరాడుతున్న చిత్రం మరో ముద్రికపై ఉంది. ఆ వీరుడి శిరస్సు సూర్యుడిని పోలి ఉంటుంది. ఇక్కడ పులిని చీకటి శక్తుల సంకేతంగా భావిస్తున్నారు. మెసపటోమియన్ గిల్గమేష్ వీరగాథ ఈ ముద్రికపై చెక్కారు.
* రత్నాలు, అత్యంత విలువైన శిలలు, బంగారంతో చేసిన వస్తు, ఆభరణాలను సింధు ప్రజలు ఉపయోగించారు. వీరు బంగారాన్ని కోలార్, అనంతపురం ప్రాంతాల నుంచి తరలించేవారు. రాజస్థాన్, బెలూచిస్థాన్ ల నుంచి రాగి లభించేది.
* ఇత్తడి, కంచు వంటి మిశ్రమ లోహాల తయారీ గురించి సింధు ప్రజలకు తెలుసు.
* సింధు ప్రజలకు గాజు పరిశ్రమ తెలియదు. కానీ మట్టి పాత్రలకు మెరుగుపెట్టడం ద్వారా గాజు స్థితికి తెచ్చేవారు.
* ముద్రికలను బంకమట్టి, దంతం, స్టియటైట్ లతో చేసేవారు.
* కొన్ని చోట్ల లభించిన కండెలు, కదుళ్లు వీరి నేత పని గురించి తెలియజేస్తున్నాయి. వస్త్ర పరిశ్రమతో కూడా వీరికి అనుబంధం ఉంది.
* సింధు నాగరికతలో దేవతా విగ్రహాలు, పూజకు వినియోగించే వస్తువుల వంటివి ఎక్కడా కనిపించలేదు. దేవాలయాలు లేదా ఆరాధన స్థలాల వంటివి కూడా లేవు. కానీ సింధు ప్రజలకు మత వ్యవస్థ ఉంది. వారు తయారు చేసిన టెర్రాకోట బొమ్మల్లో, వారు ఉపయోగించిన ముద్రికల్లో మతానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి.
* టెర్రాకోట బొమ్మల్లో మాతృదేవత బొమ్మ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ బొమ్మల్లో కొన్ని పొగ చూరినట్లు ఉండటం గమనిస్తే పూజలు జరిగినట్లు తెలుస్తుంది.
* ఒక ముద్రికలో పద్మాసనంలో ఉన్న త్రిముఖ పశుపతిని మహాయోగిగా, శివుడిగా భావిస్తున్నారు.
* పానపట్టంపై ప్రతిష్ఠించి ఉన్న లింగాలు కూడా ఈ నాగరికతలో బయటపడ్డాయి.
* మనిషి శరీరంపై వృషభం తల, కొమ్ములున్న పులి (దీనిని సుమేరియన్ గాథల్లో ఎంకిడు అంటున్నారు), కొమ్ములున్న పులితో పోరాడుతున్న యోధుడు (సుమేరియన్ కథల్లో గిల్గమేష్) వంటివి కూడా ముద్రికలపై ఉన్నయి. 
* ప్రకృతి శక్తులైన చెట్లు, అగ్ని, నీరు కూడా ముద్రికలపై కనిపిస్తాయి.
* సింధు ప్రజలు నాగపూజ చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
* వీరు చనిపోయిన వారిని ఖననం చేసేవారు. మృత శరీరాలను పక్షులకు ఆహారంగా వదిలేవారు. మిగిలిన ఎముకలను సమాధి చేసేవారు. ఎవరు చనిపోయినా, వారికి ఇష్టమైన వస్తువులను వారి సమాధిలో ఉంచేవారు.
* ఆర్యులు ఆరాధించే ఇంద్రుడు అనార్యుల్లో తమ శత్రువులైన  శంబర, పిప్రు, ఆర్షశాన, సూష్ణ తదితరులను అంతం చేసి, వారి స్థావరాలను నేలమట్టం చేశాడని రుగ్వేదంలో ఉంది. ఈ దండయాత్రలే సింధునాగరికత పతనానికి కారణమని రుగ్వేదం ఆధారంగా కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
* అభ్యావర్తి ఛాయమాన వైపున నిలబడిన ఇంద్రుడు వరశిలను హరియూపీయం (హరప్పా) వద్ద ఓడించినట్లు రుగ్వేదంలోని మరో ప్రస్తావనలో ఉంది.
* ఇంకో ప్రస్తావనలో ఇంద్రుడు జలదేవతను విడిపించడానికి వృత్రాసురుడిని చంపాడని ఉంటుంది. దీన్ని సింధు ప్రజలు నిర్మించిన ఆనకట్టలను ధ్వంసం చేసి వరదనీటిని వదలడంగా చరిత్రకారులు చెబుతున్నారు. సంస్కృతంలో ‘వృత్ర’ అనే పదానికి అవరోధం, అడ్డు అని అర్థం ఉంది.
* రుగ్వేదంలో పేర్కొన్న ‘నార్మిని’ నగరాన్ని మొహంజొదారోగా భావిస్తున్నారు.
* మొహంజొదారోలో గుట్టలుగా పడి ఉన్న అస్థిపంజరాలను పరిశీలిస్తే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల, వ్యాధులు రావడం వల్ల ఆ మరణాలు జరిగినట్లు తెలుస్తోంది.
* మార్టిమర్ వీలర్, గార్డన్ చైల్డ్ లు ఆర్యుల దండయాత్ర వల్లే సింధు నాగరికత పతనమైందని పేర్కొన్నారు.
* తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరాలను పరిశీలిస్తే వాటిలో ప్రోటో ఆస్ట్రలాయిడ్, మెడిటరేనియన్ జాతుల లక్షణాలు కనిస్తున్నాయి. ఇవి దక్షిణ భారతంలోని ద్రావిడుల్లో కూడా ఉంటాయి. అందుకే ద్రావిడులే సింధునాగరికత నిర్మాతలని కొందరు పేర్కొంటున్నారు.
* ద్రావిడుల మతాచారాలకు, సింధు ప్రజల ఆచారాలకు దగ్గర పోలికలు ఉన్నాయి. అందుకే సింధునాగరికత నిర్మాతలు ద్రావిడులే అని నమ్మతున్నారు.
* సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు – ఏలామైట్, సుమేర్, మెసపటోమియా.

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌