• facebook
  • whatsapp
  • telegram

వేములవాడ చాళుక్యులు

వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండేవారు. వీరు తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ ప్రాంతాలను రెండు శతాబ్దాలకు పైగా పాలించారు. వీరి రాజధానులు పొదనపుర (బోధన్‌), గంగాధర, వేములవాడ. వీరు వేములవాడను రాజధానిగా చేసుకుని పాలించారు కాబట్టి వీరికి ఆ పేరు వచ్చింది. వేములవాడను పూర్వం లేంబులవాడ అని పిలిచేవారు. వేములవాడ చాళుక్యులు సూర్యవంశ రాజులని పర్భణి తామ్ర శాసనం పేర్కొంది. వీరి మొదటి రాజధాని పొదనపుర/ పొదన (బోధన్‌).

 

వినయాదిత్య యుద్ధమల్లుడు  (క్రీ.శ.750-780)

వేములవాడ చాళుక్య రాజ్యస్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు. ఇతడి రాజధాని నిజామాబాద్‌ జిల్లాలోని పొదనపుర. ఇతడు సపాదలక్ష దేశాన్ని పాలించాడు. సపాద లక్ష అంటే 1,25,000 బంగారు నాణేల ఆదాయం ఉన్న దేశమని అర్థం. 

 ప్రస్తుతం ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలను ఆ కాలంలో ‘సపాదలక్ష’ దేశంగా వ్యవహరించేవారు. 

 యద్ధమల్లుడు రాష్ట్రకూట రాజైన దంతి దుర్గుడి సేనాధిపతిగా ఉండి, అనేక యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించాడు. దీంతో దంతిదుర్గుడు పొదన ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇచ్చాడు. 

 ఇతడు పొదన పట్టణంలో ఇటుకలు, సున్నంతో పెద్ద స్నానకుండలాలను కట్టించి, వాటిని తైలంతో నింపాడు. తన దగ్గర ఉన్న 500 ఏనుగుల నిత్య స్నానానికి వీటిని ఏర్పాటు చేశాడు. ఇతడు చిత్రకూట దుర్గాన్ని ఆక్రమించాడు. ఈ విషయాలన్నీ పంప భారతంలో, వేములవాడ శాసనాల్లో ఉన్నాయి.

 

మొదటి అరికేసరి  (క్రీ.శ.780 - 800)

యుద్ధమల్లుడి కుమారుడు మొదటి అరికేసరి. ఇతడు రాష్ట్రకూట రాజైన ధ్రువుడి సామంతుడు. 

  ఏలేశ్వర మహాక్షేత్రంలో కాలాముఖ శైవమఠం ఉంది. అందులో సద్వోశివాచార్య, ముగ్ధ శివాచార్య అనే సన్యాసులు ఉండేవారు. వీరిద్దరూ గురుశిష్యులు. అరికేసరి ఈ మఠాన్ని సందర్శించి, బెల్మొగ గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చి, కొల్లిపర తామ్ర శాసనాన్ని వేయించాడు.

​​​​​​​  అరికేసరి సోదరుడి పేరు బీరగృహుడు అని జడ్చర్ల తాలుకాలోని కురవగట్టు శాసనంలో ఉంది.

​​​​​​​  కృష్ణా నది ఉపనది అయిన అహల్యా నదీ తీరంలో పెరూరు అ    నే గ్రామం ఉంది. అక్కడి సోమేశ్వరాలయం ప్రసిద్ధమైంది. ఆ ప్రాంతం నుంచి విదేశీ వ్యాపారం జరిగేది. 

​​​​​​​  అరికేసరికి సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజ త్రినేత్ర, సాహసరామ అనే బిరుదులు ఉండేవి.

 

ఒకటో బద్దెగడు  (క్రీ.శ.870 - 895)

 ఇతడు మొదటి అరికేసరి మనవడు. బద్దెగడు 42 యుద్ధాలు చేసి, ‘సొలదగండడు’ అనే బిరుదు పొందాడు. దీని అర్థం ‘పరాజయాన్ని ఎరుగని వీరుడు’. 

 ఇతడు పాండవ భీముడిలా మహాబల పరాక్రముడని పర్భణి శాసనం పేర్కొంది. 

 బద్దెగడు వేములవాడలో బద్దెగేశ్వరాలయాన్ని (భీమేశ్వరాలయం) నిర్మించాడు. ఇందులోని గర్భగృహ గోడల్లో నాలుగు స్తంభాలున్నాయి. దీని ముఖద్వారంపై గజలక్ష్మి ఉంది. ఇది తొలి చాళుక్యుల సంప్రదాయం.

 

రెండో అరికేసరి (క్రీ.శ.930-955)

ఇతడు వేములవాడ శిలాశాసనం వేయించాడు. ఇతడి సైన్యాధిపతి అయిన పెద్దన వేములవాడలో ఆదిత్యాలయాన్ని నిర్మించాడు. అరికేసరి 100 నివర్తనాల భూమిని ఈ దేవాలయానికి దానంగా ఇచ్చాడు. 

 రెండో అరికేసరి కవి-పండిత పోషకుడు. కన్నడ భాషలో ఆదికవిగా ప్రసిద్ధి చెందిన ‘పంప’ ఇతడి ఆస్థాన కవి. ఈయన రెండో అరికేసరిని మహాభారతంలోని అర్జునుడితో పోలుస్తూ ‘విక్రమార్జున విజయం’ అనే కన్నడ భాషా గ్రంథాన్ని రాచించి, రాజుకు అంకితం ఇచ్చాడు. అరికేసరి పంప కవికి ధర్మపురం (ధర్మపురి, కరీంనగర్‌ జిల్లా)ను అగ్రహారంగా ఇచ్చాడు.

 రెండో అరికేసరి తర్వాత వాగరాజు రాజ్యపాలన చేశాడు. ఇతడు గంగాధర పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు. 

 మరో ముఖ్య పాలకుడైన మూడో అరికేసరి తన రాజధానిని గంగాధర నుంచి వేములవాడకు మార్చాడు. ఇతడే వేములవాడ చాళుక్యులలో చివరి రాజు.

 

మత పరిస్థితులు

వీరి కాలంలో జైన, వైదిక మతాలు ఉండేవి. ఎంతో మంది రాజులు జైన మతాన్ని అనుసరించి, అనేక జినాలయాలను - జైన బసదులను నిర్మించారు. జైనులు ఇతర మతాల వారిని తమవైపు ఆకర్షించడానికి వర్ణ వ్యవస్థను అంగీకరించారు. 

 వేములవాడ గొప్ప జైన క్షేత్రంగా ఉండేది. 

 జైన మతాన్ని అనుసరించిన రాజులు, ఇతరులు జిన విగ్రహాలను, కూష్మాండినీ దేవి విగ్రహాలను చెక్కించారు. 

 రాజులు, ఉద్యోగులు, అంతఃపుర స్త్రీలు, వర్తకులు, ధనికులు మొదలైనవారు సన్యాసులకు జైన బసదులను, మఠాలకు భూమిని దానం చేసేవారు. 

 రెండో అరికేసరి శైవ మతాన్ని అనుసరించారు. వేములవాడ చాళుక్యులు అన్ని మతాలను సమానంగా ఆదరించారు.

 

రెండో నరసింహకుడు  (క్రీ.శ.910-930)

ఇతడు బద్దెగడి మనవడు. రాష్ట్రకూట రాజైన మూడో ఇంద్ర వల్లభుడి సామంతుడిగా ఉన్నాడు. 

​​​​​​​ ఇతడు రాష్ట్రకూట సైన్యానికి సారథ్యం వహించి, ఉత్తర భారతంలోని గంగా తీరం వరకు అనేక రాజ్యాలను జయించాడు. ఇతడు తన ఖడ్గాన్ని యమునా నది తీరంలో ఉన్న కాళప్రియం (ప్రస్తుత కాల్పి) వద్ద కడిగి, అక్కడ ఒక జయస్తంభాన్ని, శాసనాన్ని వేయించినట్లు వేములవాడ శాసనం పేర్కొంది.

 

సాంఘిక పరిస్థితులు

వీరి కాలంలో వర్ణ వ్యవస్థ స్థిర రూపంలో ఉండేది. దీంతో సంఘంలో అనేక కట్టుబాట్లు ఉండేవి. బ్రాహ్మణులు వేదాధ్యయనంతో పాటు రాజుల దగ్గర ముఖ్య ఉద్యోగాలలో ఉండేవారు. క్షత్రియులు రాజ ధర్మాన్ని నిర్వహించేవారు. 

​​​​​​​ వైశ్యులు వర్తక వ్యాపారాలు చేసేవారు. వీరిని కోమట్లు అనేవారు. ప్రాచీన జైన ఆధ్యాత్మికవేత్త అయిన గోమటేశ్వరుడి పేరు మీదుగా కోమటి అనే పదం వచ్చింది. ఒకప్పుడు బోధన్‌ గోమటేశ్వర ఆరాధనకు కేంద్రంగా ఉండేది. అక్కడి గోమటేశ్వర విగ్రహం నమూనా ఆధారంగానే శ్రావణ బెళగొళ విగ్రహం చెక్కారనే వాదన ఉంది. కోమట్లు జైన మతాన్ని బాగా ఆదరించారు. శూద్రులు వ్యవసాయాది వృత్తులు చేసేవారు.

 విశ్వకర్మ కులానికి చెందినవారు శిల్పకారులుగా, రాజ శాసనాలను చెక్కేవారిగా ప్రసిద్ధి చెందారు. వీరికి సమాజంలో విశేష గౌరవం ఉండేది. వీరు తొలుత జైన మతాన్ని ఆచరించారు. తర్వాతి కాలంలో శైవ మతాన్ని స్వీకరించారు.

 

విష్ణుకుండినులు

విద్య - సాహిత్యం

 విష్ణుకుండినుల రాజభాష సంస్కృతం. వీరు ఘటికలను స్థాపించి వేద విద్యను ప్రోత్సహించారు. తెలంగాణలో ఘటికలను మొట్టమొదట వీరే ఏర్పాటు చేశారు. ఇవి అమరావతి, వేంగిలో ఉన్నాయి. వీటిలో చతుర్దశ విద్యలను బోధించేవారు. ఘటికను ఎలా స్థాపించాలో ఉదంకుడు సామవేదంలో తెలిపినట్లు ఒక శాసనంలో ఉంది. 

 భగవంతుడు, త్రయంబకుడు అయిన సోమగిరీశ్వర నాథునికి రెండో విక్రమేంద్ర వర్మ రెగొన్ట గ్రామాన్ని దానం చేశాడు.

 విష్ణుకుండినుల శాసనాల్లో తెలుగు పదాలు గమనించవచ్చు. చిక్కుళ్ల తామ్ర శాసనంలో ‘విజయరాజ్య సంత్సరంబుళ్‌’ అనే తెలుగు పదం కనిపిస్తుంది. కీసరగుట్టపై ఉన్న ఒక రాయిపై ‘తొలచువాండ్లు’ అనే అచ్చ తెలుగు పదం ఉంది. 

 భవశర్మ వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేశాడని తాండవాడ శాసనంలో పేర్కొన్నారు. 

 దగుపల్లి దుగ్గెన ‘నచికేతోపాఖ్యానం’ రచించాడు. 

 మాధవ వర్మ కాలంలో గుణస్వామి ‘జనాశ్రయచ్చందో విచ్ఛిత్తి’ అనే పురాతన సంస్కృత ఛందస్సు గ్రంథాన్ని రాశాడు.

 

నిర్మాణాలు

 వీరు అనేక బౌద్ధ స్థావరాలు నిర్మించారు. నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం, నాగారం, ఏలేశ్వరంలో; హైదరాబాద్‌ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న గోవిందరాజు విహారంలో వీటిని చూడొచ్చు.

 వీరి కాలంలోనే మొట్టమొదటిసారి బండరాయిని తొలిచి, స్తూపాలుగా మలిచారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఖమ్మం జిల్లా కారుకొండ వద్ద లభించాయి. 

 తెలంగాణలోని అమ్రాబాద్, ఇంద్రపాలనగరం, కీసరగుట్టల్లో వీరి కాలంనాటి కోటలున్నాయి. భువనగిరి కోటను విష్ణుకుండినులే నిర్మించారు. కోట గోడలపై రాజచిహ్నం, లంఘిస్తున్న సింహం శిల్పాలు ఉన్నాయి.

 ఫణిగిరిలో ప్రభుత్వం చేపట్టిన తవ్వకాల్లో బౌద్ధ జాతక కథలతో చెక్కిన శిల్పాలు, బుద్ధుడి పాదుకలు, చైత్యాలు, స్తూపాలు, సన్యాసుల ఆరామ విహారాలు, మండపాలు బయటపడ్డాయి.

 నేలకొండపల్లిలో అతిపెద్ద బౌద్ధస్తూపం లభించింది. దాన్ని విరాట్‌ స్తూపమని పిలిచేవారు. తర్వాతి కాలంలో విరాట రాజు గద్దెగా పేరొందింది. ఇక్కడి తవ్వకాల్లో బుద్ధుడి పాలరాతి శిల్పాలు, లోహ విగ్రహాలు లభించాయి.

 అమరపురానికి సమీపంలో ఉన్న ఉమామహేశ్వరం, సలేశ్వరం గుహలు, అలంపురం శైవశక్తి ఆలయాలుగా పేరొందాయి. వీరి నాణేలపై శ్రీపర్వత అనే పదం ఉండేది. ఉమామహేశ్వరం తర్వాతి కాలంలో శ్రీశైలానికి ఉత్తర ద్వార క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ పల్లవులు చెక్కించిన శివలింగం, విష్ణుకుండినులు చేయించిన నగారా భేరి ఇప్పటికీ ఉన్నాయి. 

 సలేశ్వరంలోని రెండు గుహాలయాల్లో ఒక ఆలయ గోడపై ‘విశ్వేశకక్కలస’ అని రాసి ఉన్న బ్రహ్మీ శాసనం ఉంది. 

 అలంపురంలో ప్రసిద్ధ బ్రహ్మేశ్వర, జోగులాంబ ఆలయాలు ఉన్నాయి. 

 ఆ కాలంలో వాస్తుశిల్పులకు సంఘం ఉండేది. కీసరగుట్టలో రాయిపై దొరికిన ‘తొలచువాండ్లు’ అనే తెలుగు పదం దీనికి ఆధారం.

 విష్ణుకుండినులు దక్షిణ భారతంలో మొదటిసారిగా హిందూ గుహాలయాలను నిర్మించారు. ఉండవల్లి గుహాలయ స్తంభాలపై పంజా ఎత్తిన సింహం ప్రతిమ ఉంది. బొజ్జన్నకొండ, మొగల్రాజపురం, విజయవాడ, ఉండవల్లి, భైరవుడి కొండ గుహాలయాలను విష్ణుకుండినులు నిర్మించారు. 

 బొజ్జన్నకొండ బౌద్ధ క్షేత్రం. ఇక్కడ గుప్త రాజుల నాణేలు లభించాయి. బుద్ధుడు భూమిని తాకుతున్నట్లు ఉన్న ముద్రతో విగ్రహాలు లభించాయి. ఈ క్షేత్రంలో వజ్రయాన గుర్తులు ఉన్నాయి. ఈ కొండకు దగ్గర్లో లింగాలమెట్ట ఉంది. దీన్ని భక్తులు ఉద్దేశిక స్తూపాలుగా ఏర్పాటు చేశారు. 

 మొగల్రాజపురం గుహల్లోని దుర్గ గుహల్లో వెనక గోడపై ఉన్న అర్ధనారీశ్వరమూర్తి విగ్రహం; శివతాండవ గుహ ముఖంపై ఉన్న నటరాజు విగ్రహం, దేవీసహిత త్రిమూర్తి ప్రతిమలు ముఖ్యమైనవి. 

 విజయవాడ కనకదుర్గ కొండ కింద ఉన్న అక్కన్న-మాదన్న గుహలు వీరి కాలం నాటివే. ఉండవల్లిలోని మూడు గుహల్లో అనంత పద్మనాభస్వామి విగ్రహం ఉన్న గుహ ముఖ్యమైంది. 

 ఉండవల్లి గుహ ముఖంపై క్రీ.శ.6వ శతాబ్ది లిపిలో ‘ఉత్పత్తి పిడుగు’ అనే లేఖనం ఉంది. ఇది గుహలు తవ్విన శిల్పుల శ్రేణి పేరని చరిత్రకారుల అభిప్రాయం. 

 భైరవుడి కొండలో ఎనిమిది గుహలను శివుడికి అంకితమిచ్చారు. ఇందులో కుంభ శీర్షాలతో ఉన్న సింహ పాద స్తంభాలు ముఖ్యమైనవి. 

 విష్ణుకుండినుల శిల్పాల్లో నాగార్జునకొండ రీతి కన్పిస్తుంది.

రచయిత

డా. ఎం. జితేందర్‌ రెడ్డి

విషయ నిపుణులు 

 

Posted Date : 22-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌