• facebook
  • whatsapp
  • telegram

కుతుబ్‌షాహీలు (క్రీ.శ.1512 - 1687)

గోల్కొండ రాజ్యం ఘన కీర్తి!

  పర్షియా నుంచి వచ్చి, పరాక్రమంతో గోల్కొండ రాజ్యాన్ని స్థాపించి, సమర్థ పాలనతో ప్రపంచస్థాయి ప్రఖ్యాతిని పొందారు కుతుబ్‌షాహీలు. మన భాగ్యనగరం హైదరాబాద్‌ను నిర్మించారు. వర్తక, వాణిజ్యాలను విస్తృతంగా నిర్వహించి సామ్రాజ్యాన్ని రెండో ఈజిప్టుగా మార్చారు. వజ్రాల విక్రయంలో విశ్వకీర్తిని మూటగట్టుకున్నారు. హైందవ, పర్షియన్‌ సంస్కృతులను కలిపి సరికొత్త దక్కన్‌ సంస్కృతికి ప్రాణం పోశారు.  

  కుతుబ్‌షాహీలు తెలంగాణను గోల్కొండ రాజధానిగా దాదాపు 175 సంవత్సరాలు పాలించారు. వీరు తెలంగాణను పాలించిన మొదటి ముస్లిం పాలకులు. అనేక నిర్మాణాలను చేపట్టడంతోపాటు హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించారు. తెలుగు భాషా సాహిత్యంతో పాటు అనేక భాషా కవులను పోషించారు. వీరి కాలంలో వజ్రాల వ్యాపారం విరివిగా సాగడంతో అనేక మంది విదేశీ వర్తకులు గోల్కొండను సందర్శించారు. వారిలో కొంత మంది ఇక్కడే స్థిర పడ్డారు. ఫలితంగా హైదరాబాద్‌ నగరంలో వివిధ దేశాలు, జాతుల ప్రజల సామూహిక జీవనంతో మిశ్రమ సంస్కృతి ఏర్పడి శాంతియుత సహజీవనం సాగింది. ఈ పాలకులు మతసహనం పాటించడంతో పాటు తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేశారు.

 

సుల్తాన్‌ కులీ (క్రీ.శ.1512 - 1543)

  కుతుబ్‌షాహీ రాజ్యాన్ని సుల్తాన్‌ కులీ క్రీ.శ.1512లో స్థాపించాడు. ఈయన పర్షియా, ట్రాన్స్‌ అక్సేనియాలోని హందమ్‌ రాజ వంశానికి చెందినవాడు. సుల్తాన్‌ కులీ కారాకుయున్‌ (నల్లగొర్రె) అనే తురుష్క తెగకు చెందినవాడు. కారాకుయున్‌లను స్థానికంగా ఉన్న అక్కూయిన్‌ (తెల్లగొర్రె) తెగకు చెందినవారు ఓడించారు. దీనితో వీరు అధికారం కోల్పోయారు. సుల్తాన్‌ కులీ అతడి చిన్నాన్న అల్లాకులీతో కలిసి భారతదేశానికి వచ్చి బహమనీ రాజైన మూడో మహ్మద్‌ షా వద్ద సాధారాణ సైనికుడిగా చేరాడు. అతడు అసాధారణ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి కురంగల్‌ (కొడంగల్‌) జాగీరుతో పాటు ఖవాస్‌ ఖాన్‌ బిరుదును పొందాడు. తర్వాత సుల్తాన్‌ ఇతడిని తెలంగాణ తరఫ్‌దారుగా నియమిస్తూ కుతుబ్‌ ఉల్‌ముల్క్‌ (రాజ్యానికి స్తంభం) అనే బిరుదు ఇచ్చాడు. ఈ బిరుదే వీరి వంశనామంగా మారింది. క్రీ.శ.1518లో మూడో మహ్మద్‌ షా మరణానంతరం గోల్కొండ రాజధానిగా సుల్తాన్‌ కులీ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. సుల్తాన్‌ కులీ గోల్కొండ దుర్గాన్ని శత్రుదుర్భేద్యమైన కోటగా చేసి మహ్మద్‌ నగరమని పేరు పెట్టాడు. ఇతడికి అమీరాల్‌ ఉమ్రా, బడేమాలిక్‌ (పెద్ద ప్రభువు) అనే బిరుదులు ఉన్నాయి. ఈయన సాహిత్యాభిమాని. పండిత పరిషత్తులను స్థాపించాడు. గోల్కొండ కోట వెలుపల జామా మసీదును నిర్మించాడు.

 

ఇబ్రహీం కుతుబ్‌షా (క్రీ.శ.1550 - 1580)

  ఈయన సుల్తాన్‌ కులీ కుమారుడు. గోల్కొండ సుల్తాన్‌లందరిలో ఇబ్రహీం కుతుబ్‌షా విశిష్టమైన వ్యక్తిత్వం, ఉన్నత భావాలు కలవాడు. ఈయన దారి దోపిడీ దొంగలను శిక్షించి శాంతిభద్రతలను కాపాడటంతో పాటు రక్షక భటాధికారులను నియమించాడు. న్యాయ రక్షకభట శాఖల పునర్‌ వ్యవస్థీకరణ జరిగింది. గోల్కొండ రాజ్యం టర్కీ, అరేబియా, పర్షియా రాజ్యాలతో వర్తక వ్యాపారాలు సాగించి రెండో ఈజిప్టుగా ఘనత సాధించింది. కుతుబ్‌షాహీ పాలకుల్లో మొదటిసారిగా నాణేలు వేసింది, షా బిరుదును ధరించింది ఇతడే. ఇబ్రహీం సారస్వత ప్రియుడు. తెలుగు, ఉర్దూ, పారశీక కవులను పోషించాడు. తెలుగు కవులు ఇతడిని మల్కీభరాముడిగా కీర్తించారు. ఈయన కాలంలోనే దక్కనీ ఉర్దూ అనే మాండలిక ఉర్దూ భాష ప్రారంభమైంది. అసిఖానా అనే కవితా గోష్టులను నిర్వహించేవాడు. ఇతడు గొప్ప నిర్మాత. గోల్కొండ దుర్గ ప్రాకారాలను బలపర్చాడు. బాలహిస్సార్‌ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. మూసీనదిపై పాత వంతెనను (పురానాపూల్‌), ఇబ్రహీం పట్టణ తటాకంతో పాటు హుస్సేన్‌సాగర్‌ను నిర్మించాడు. చరాసియా అనే నూతన ధర్మాన్ని ప్రవేశపెట్టాడు. ఇబ్రహీం బాగ్, పూల్‌బాగ్‌ అనే ఉద్యానవనాలు నిర్మించాడు. 

 

మ‌హ‌మ్మ‌ద్‌ కులీ కుతుబ్‌షా (క్రీ.శ.1580 - 1612)

  ఇతడు కుతుబ్‌షాహీ పాలకుల్లో గొప్పవాడు. ఈయన మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ రాయబారి అయిన వసూద్‌బేగ్‌ను గౌరవించి అమూల్యమైన బహుమానాలిచ్చి పంపించాడు. డచ్చి, బ్రిటిష్, ఫ్రెంచివారికి మచిలీపట్నం, కాకినాడలో వర్తకానికి అనుమతి ఇచ్చాడు. వర్తకాభివృద్ధికి వ్యాపార, పరపతి సంస్థలను ప్రోత్సహించాడు. దీనికోసం పర్షియా నుంచి అనేక కుటుంబాలను రప్పించి హైదరాబాద్, మచిలీపట్నంలో వారికి నివాసం కల్పించాడు. క్రీ.శ.1603లో ఇరాన్‌ చక్రవర్తి షాహ్‌ అబ్బాస్‌ అఘజ్లూ రాకుమారుడిని గోల్కొండకు రాయబారిగా పంపించినప్పుడు మ‌హ‌మ్మ‌ద్‌ కులీ అతడిని గౌరవించాడు. కులీ పారశీక భాషలో అనేక రచనలు చేశాడు. దక్కనీ ఉర్దూను ప్రోత్సహించాడు. ఇతడి కలం పేరు మాని. గజల్‌ రచన, వర్ణణాత్మకమైన కవిత్వంలో ఈయన నిష్ణాతుడు. ఇతడు రచించిన గీతాలను కులియత్‌ కులి అనే పేరుతో సంకలనం చేశారు. దక్కనీలో మొదటి దివాన్‌ రాశాడు. హిందువులను ఉన్నత ఉద్యోగాల్లో నియమించాడు. ఇతడి కాలంలో హైందవ మహమ్మదీయ సంస్కృతులు సమ్మేళనమై దక్కన్‌ సంస్కృతి రూపుదాల్చింది. ఈయన హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించాడు.

 

సుల్తాన్‌ మ‌హ‌మ్మ‌ద్‌ ​​ కుతుబ్‌షా (క్రీ.శ.1612 - 1626)

  ఇతడు మహమ్మద్‌ కులీ కుమార్తె హయత్‌ బక్షీబేగం భర్త. ఇతడు హైదరాబాద్‌ నగరానికి సుల్తాన్‌ నగరమని పేరు పెట్టాడు. పారశీక రాయబారి మీర్‌ జయినుల్‌ అబిదీన్, మొగల్‌ రాయబారి మీర్‌ మక్కీలను గౌరవించి సత్కరించాడు. ఇతడు మంచి విద్యావంతుడు, కవి. పారశీక భాషలో అనేక గ్రంథాలను రచించాడు. ఖైరతాబాద్‌ మాస్కును, నాలుగంతస్తుల అమ్మాన్‌ భవనాన్ని (న్యాయస్థానం) నిర్మించాడు. ఈయన మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించగా మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు దాన్ని పూర్తిచేశాడు. 

 

అబ్దుల్లా కుతుబ్‌షా (క్రీ.శ.1626 - 72)

  ఈయన కాలంలో కొల్లూరు గనుల్లో కోహినూర్‌ వజ్రం లభించింది. మహ్మద్‌ సయ్యద్‌ (మీర్‌ జుమ్లా) ఈ వజ్రాన్ని షాజహాన్‌కు ఇచ్చాడు. క్రీ.శ.1636లో అబ్దుల్లా ఆంగ్లేయులకు గోల్డెన్‌ ఫర్మానా ద్వారా వ్యాపార అనుమతిని ఇచ్చాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న క్షేత్రయ్య మొవ్వ పదాలను రచించాడు.

 

అబుల్‌ హసన్‌ (క్రీ.శ.1672 - 1687)

  అబ్దుల్లా కుతుబ్‌షా మూడో కూతురు బాద్‌షా బీబీ భర్త అబుల్‌ హసన్‌ (తానీషా). ఇతడు వరంగల్‌కు చెందిన అక్కన్న, మాదన్న సోదరులను తన ఆస్థానంలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించాడు. వీరి అల్లుడు కంచెర్ల గోపన్న (భక్త రామదాసు) పాల్వంచ పరగణా తహశీల్దార్‌గా నియమితుడయ్యాడు. క్రీ.శ.1687లో మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోట ముట్టడి ప్రారంభించాడు. అబ్దుల్లా పణి అనే గోల్కొండ సేనాపతికి లంచం ఇచ్చి కోట ప్రధాన ద్వారమైన ఫత్‌ దర్వాజ తలుపులను తెరిపించాడు. ఈ పోరాటంలో అబ్దుల్‌ రజాక్‌ లారీ అనే సేనాపతి శరీరమంతా గాయాలైనా పోరాడుతూ సొమ్మసిల్లాడు. అబుల్‌ హసన్‌ ఓడిపోయాడు. అతడిని దౌలతాబాద్‌ కోటలోని కలామహల్‌లో నిర్బంధించారు. క్రీ.శ.1700లో అక్కడే మరణించాడు.

 

పరిపాలన 

  కుతుబ్‌షాహీలు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని తరఫ్‌లుగా విభజించి వీటిపై తరఫ్‌దారు అనే అధికారులను నియమించారు. కుతుబ్‌షాహీ రాజ్యంలో ప్రభుత్వ ఆదాయం 5 కోట్ల హెన్నులు అని బ్రిటిష్‌ ఉద్యోగి మెథోల్డ్‌ పేర్కొన్నాడు. భూమి శిస్తు వసూలుకు వేలంపాట జరిగేది. ఈ వేలంపాట పాడేవారిని ముస్తజీర్లు అంటారు. గ్రామాల్లో చాలా మందికి మిరాశీ ఇనాములు ఉండేవి. మిరాస్‌ అంటే వంశపారంపర్య హక్కు. కుతుబ్‌షాహీల ఫర్మానాలు మిరాశీ హక్కులు గల 12 మంది ఆయగార్లను పేర్కొంటున్నాయి. వీరిని బలూతియాన్‌లు అనే వారు. ప్రభుత్వ అధికారులైన వతన్‌దారులు, మిరాశీదార్లు గ్రామ వ్యవహారాలను చూడటానికి గోత్సభగా ఏర్పడేవారు. గోల్కొండ రాజప్రాసాదానికి నీటిని అందించడానికి గోల్కొండకు 5 కి.మీ. దూరంలో కల్‌దుర్గ వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. కోటలోని పై అంతస్తులకు నీటిని అందించడానికి నాడు హైడ్రోలాజికల్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిని ఉపయోగించారు. పానగల్, ఉదయ సముద్రం జలాశయాలకు ఇబ్రహీం కుతుబ్‌షా మరమ్మతులు చేయించాడు. కానమ్‌ ఆగా హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంకును తవ్వించింది. 

  వేములవాడ, గుల్బర్గా, ఔరంగాబాద్, శ్రీశైలం ప్రసిద్ధ వర్తక కేంద్రాలుగా ఉండేవి. రాజ్యం వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. గోల్కొండ వజ్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కొల్లూరు, పరిటాల, గోల్కొండ, రామళ్లకోట, వజ్రకరూరు గనులు వజ్రాలకు ప్రసిద్ధి. తుపాకి మందుకు (సురేకారం) మచిలీపట్నం, వస్త్ర పరిశ్రమకు ఓరుగల్లు, కలంకారి పరిశ్రమకు మచిలీపట్నం; ఉక్కు, ఆయుధ పరిశ్రమకు నిర్మల్, ఇందల్‌వాయి; కొయ్య బొమ్మలకు కొండపల్లి, కలప పరిశ్రమకు నరసాపురం, నీలిరంగుకు నాగులవంచ ప్రఖ్యాతి పొందాయి. ఓడలు, పడవలు నరసాపురంలో తయారై విదేశాలకు ఎగుమ‌తి అయ్యేవి. బ్రిటిష్‌ నౌక గ్లోబ్‌ ఇక్కడే తయారైంది. 

  పోర్చుగీసు వారు భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టారు. ఈ కాలం నాటి బంగారు నాణెం హెన్ను. విదేశీయులు హెన్నును పగోడా అనేవారు. విదేశీ వాణిజ్యం బాగా సాగింది. పులికాట్, చెన్నపట్నం, నరసాపురం, నిజాంపట్నం, మచిలీపట్నం లాంటి ఓడరేవులు ఉండేవి. తూర్పున మలయా, అరకాన్‌; పశ్చిమాన టర్కీ, అరేబియా, పర్షియా, ఐరోపా దేశాలతో విదేశీ వాణిజ్యం సాగేది. రేవు ప్రధానాధికారిని షాబందర్‌ అనేవారు. రేవు పట్టణాల్లో ఈయన సుంకాలు వసూలు చేసేవాడు.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  శాతవాహనులు

 విష్ణుకుండినులు

 వేములవాడ చాళుక్యులు

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 21-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌