• facebook
  • whatsapp
  • telegram

గుప్త యుగం

         భారతదేశ చరిత్రలో తొలి స్వర్ణయుగంగా పేరుగాంచింది గుప్తుల పరిపాలనా కాలం. గుప్త చక్రవర్తులు సమర్థవంతమైన పాలనను అందించడంతో పాటు ఆర్థిక ప్రగతి, భాషా సాహిత్యాల వికాసం, వాస్తు కళారంగాల అభివృద్ధికి కృషి చేశారు. వీరికాలంలో హిందూ మత పునరుద్ధరణ జరిగింది. సముద్ర గుప్తుడు, రెండో చంద్రగుప్తుడు లాంటి పాలకులు అనేక పరిపాలనా సంస్కరణలను అమలు చేశారు.
గుప్త యుగానికి ఆధారాలను రెండు రకాలుగా పేర్కొంటారు. అవి:
    1. పురావస్తు ఆధారాలైన శాసనాలు, నాణేలు, కట్టడాలు, మృణ్మయ పాత్రలు.
    2. సాహిత్య ఆధారాలు.

 

శాసనాలు
మంకువార్ బౌద్ధ శాసనం మొదటి కుమారగుప్తుడిని 'మహారాజ' బిరుదుతో పేర్కొంది. స్కంధగుప్తుడి భిలారి శాసనం హూణులు, పుష్యమిత్ర వంశస్థులు గుప్త సామ్రాజ్యంపై జరిపిన దాడులను వివరిస్తుంది. సముద్రగుప్తుడి విజయాలను వివరించే అలహాబాద్ శాసనాన్ని అతడి సేనాని (సంధి విగ్రాహి) హరిసేనుడు వేయించాడు.
* ఎరాన్ శాసనం గుప్తుల కాలంనాటి సాంఘిక పరిస్థితులను వివరిస్తుంది. సతీ సహగమనం గురించి ఎరాన్ శాసనం తెలుపుతుంది. ఉదయగిరి శాసనం, మెహరౌలీ (దిల్లీ) ఉక్కు స్తంభ శాసనాలు రెండో చంద్రగుప్తుడి గురించి పేర్కొంటున్నాయి.
* గుప్త యుగానికి సంబంధించి సుమారు 42 శాసనాలు లభిస్తున్నాయి. అందులో 27 శిలాశాసనాలే. మొత్తం 42 శాసనాల్లో 23 శాసనాలు ప్రత్యేక వ్యక్తుల రికార్డులైతే, మిగిలిన 19 శాసనాలు ప్రభుత్వ అధికార సంబంధ శాసనాలు.

 

సాహిత్యం
       మొదటి చంద్రగుప్తుడి కాలంనాటి రాజనీతి గ్రంథమైన నీతిసారాన్ని కామందకుడు రాశాడు. గుప్తుల కాలంనాటి రాజనీతి, పరిపాలనా విషయాలను ఈ గ్రంథం తెలుపుతుంది. క్రీ.శ. నాలుగో శతాబ్దంలో రాసిన 'నారదస్మృతి', 'బృహస్పతి స్మృతి' లాంటి రచనలు గుప్తుల చరిత్రను పేర్కొంటున్నాయి. విశాఖదత్తుడు రచించిన 'దేవీ చంద్రగుప్తం' నాటకం రామగుప్తుడు శక రాజైన బసన చేతిలో పొందిన ఓటమిని తెలుపుతుంది. మొదటి చంద్రగుప్తుడి విజయాలను వజ్జికుడు రచించిన 'కౌముదీ మహోత్సవం' గ్రంథం వివరిస్తుంది. గుప్తయుగం నాటి పట్టణ ప్రజల జీవిత విధానాలను, చారుదత్త, వసంతసేనల మధ్య ఉన్న ప్రేమాయణం గురించి పేర్కొంటుంది. వాయు పురాణంలో గుప్తుల చరిత్రను ఎక్కువగా వివరించారు. ఆర్య మంజుశ్రీ రాసిన 'మూలకల్ప' గ్రంథంలో గుప్తరాజుల ప్రస్తావనను అనేక శ్లోకాల్లో పేర్కొన్నారు. క్రీ.శ.672లో భారతదేశానికి వచ్చిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు చీ-లి-కిటో (శ్రీగుప్తుడు) అనే రాజు నలందా బౌద్ధ విహారంలో కొన్ని గ్రామాలను చైనా వారికి దానం చేసినట్లు తన రచనల్లో పేర్కొన్నాడు. యతి వృషభుడు అనే బౌద్ధ సన్యాసి రాసిన 'తిలస్య పన్నాటి' అనే గ్రంథం గుప్తుల కాలం నాటి బౌద్ధ మత ప్రాచుర్యాన్ని తెలుపుతుంది. రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్ నాటి పరిస్థితులను తన ఫో-కువో-కి గ్రంథంలో వివరించాడు.

 

రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 375 - 415)
     ఇతడి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. 'శకారి', 'సాహసాంక', 'విక్రమాదిత్య' లాంటి బిరుదులు పొందాడు. అన్న రామగుప్తుడిని చంపి, వదిన ధ్రువాదేవిని వివాహం చేసుకుని రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది. ఇతడి కాలంలో ఫాహియాన్ అనే చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. ఫాహియాన్ పాటలీపుత్రంలో మూడు సంవత్సరాలు, తామ్రలిప్తిలో రెండు సంవత్సరాలు నివసించాడు. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో 'నవ రత్నాలు' అనే కవులు ఉండేవారు. వారిలో కాళిదాసు సుప్రసిద్ధుడు. రెండో చంద్రగుప్తుడు సింహం బొమ్మతో నాణేలను ముద్రించాడు. ఉజ్జయిని బొమ్మతో నాణేలను ముద్రించి, ఉజ్జయినిని రెండో రాజధానిగా చేసుకుని పాలించాడు. వాకాటక రాజైన రెండో ధ్రువసేనుడికి తన కుమార్తె ప్రభావతీ గుప్తను ఇచ్చి వివాహం జరిపించాడు. రెండో ధ్రువసేనుడి సహాయంతో చివరి శకరాజు రుద్రసింహుడిని చంపి, 'శకారి' అనే బిరుదు పొందాడు. రెండో చంద్రగుప్తుడి సేనానియైన అమరకర దేవుడు బౌద్ధ మతాభిమాని. మంత్రి శబర వీరసేనుడు శైవ మతాభిమాని. దిల్లీలోని మెహరౌలీ ఉక్కు స్తంభాన్ని చేయించింది రెండో చంద్రగుప్తుడే. వెండి నాణేలను ముద్రించిన తొలి గుప్తరాజు ఇతడే.

 

చివరి గుప్త చక్రవర్తులు
     మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. ఇతడి కాలంలోనే యువరాజైన స్కంధగుప్తుడు హూణుల దండయాత్రను తిప్పికొట్టాడు. కానీ స్కంధగుప్తుడు రాజైన తర్వాత హూణులు గుప్త రాజ్యంపై నిరంతరం దాడులు చేయడం వల్ల కోశాగారం ఖాళీ అయ్యింది. ఇతడు హూణుల చేతిలో పరాజయం పాలయ్యాడు. అనంతరం పురుగుప్తుడు, రెండో కుమారగుప్తుడు, బుధగుప్తుడు లాంటి రాజులు పాలించారు. చివరికి విష్ణుగుప్తుడితో గుప్త వంశం అంతమైంది.

 

పాలనా విశేషాలు     

గుప్తుల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని భుక్తులు - విషయాలు - గ్రామాలుగా విభజించారు. వీరు కేంద్ర పాలన నుంచి గ్రామస్థాయి వరకు సమర్థవంతమైన పరిపాలనను అందించారు. కేంద్రంలో చక్రవర్తి సర్వాధికారి. రాజును దైవాంశ సంభూతుడిగా భావించేవారు. హరిసేనుడు వేయించిన అలహాబాద్‌ శాసనం సముద్రగుప్తుడిని దేవుడిగా పేర్కొంది. చక్రవర్తికి పాలనలో సాయం చేయడానికి మంత్రిమండలి, గవర్నర్లు, ఇతర పౌర, సైనిక అధికారులు ఉండేవారు. పరిపాలనా సౌలభ్యం కోసం మంత్రులు లేదా ‘సచివులను’ నియమించినట్లు శాసన, సాహిత్య ఆధారాలు పేర్కొంటున్నాయి. సర్వాధ్యక్షుడు, మహాసేనాపతి, మహా దండనాయక, ప్రధాన న్యాయమూర్తి, మహా సంధివిగ్రాహి, భండాగారికుడు లాంటి అనేకమంది మంత్రులు నాటి కేంద్రపాలనలో చక్రవర్తికి సాయం చేసేవారు. చక్రవర్తి తర్వాత ‘మంత్రి ముఖ్యుడు’ పరిపాలనలో ప్రధాన పాత్ర పోషించేవాడు. నైతిక, ధార్మిక వ్యవహారాల్లో పురోహితుడు కీలకపాత్ర పోషించేవాడు. మహా సంధివిగ్రాహకుడు విదేశీ వ్యవహారాలను నిర్వహించేవాడు. ప్రధాన న్యాయమూర్తిని మహాదండనాయక అనేవారు. వీళ్లే కాకుండా, ప్రతీహార, రాజ సన్యాసులు, కుమారామాత్యులు, కంచుక లాంటి మంత్రులు, అధికారులు కేంద్ర పాలనలో తోడ్పడేవారు. కేంద్రంలో కేంద్రీకృత పాలనా విధానం అమల్లో ఉండేది.


    గుప్తుల కాలం నాటి రాష్ట్రాలను ‘భుక్తులు’ అనేవారు. ‘భుక్తి’ పరిపాలన అధిపతిని ఉపరిక లేదా గోస్త్రీ అనేవారు. ముఖ్యంగా రాజ కుటుంబీకులు లేదా యువరాజులను ఉపరికులుగా నియమించేవారు. వారినే కుమారామాత్యులుగా పేర్కొనేవారు. ఉపరికులు కేంద్ర ప్రభుత్వానికి, ప్రాంతీయ పాలనకు మధ్య వారధులుగా ఉండేవారు. 


    ప్రాంతీయ, స్థానిక పాలనలో వికేంద్రీకృత విధానాలు అమల్లో ఉండేవి. గుప్తుల కాలంలో పితృస్వామిక, ఉద్యోగస్వామ్య పాలనా విధానాలు కొనసాగేవి. ప్రభుత్వం పాలనాపరంగా వికేంద్రీకృతమైందని, చాలా వరకు ప్రాంతీయ స్థాయిలో పాలకులకు విధులు బదిలీ అయ్యాయని ఎ.ఎస్‌.ఆల్టేకర్‌ అనే పండితుడు పేర్కొన్నాడు. గుప్తుల కాలం నాటి స్థానిక పాలనను గ్రామీణ పాలన,  మున్సిపల్‌ పాలన అనే రెండు విధాలుగా పేర్కొవచ్చు. గ్రామ పెద్దను గ్రామేయక/ గ్రామైక అని పిలిచేవారు. గ్రామికుడు గ్రామంలోని రక్షణ, శాంతి భద్రతల నిర్వహణ బాధ్యత వహించేవాడు. పాలనలో అతడికి సాయపడేందుకు పంచమండల మహాసభ ఉండేది. పట్టణాలు/ నగరాల పరిపాలనకు పురపాలికుడు/ నాగరికుడిని నియమించేవారు. అప్పటి ప్రధాన నగరాలైన పాటలీపుత్ర, తక్షశిల, మందసోర్, ఉజ్జయిని లాంటి పట్టణాల్లో ఆదర్శవంతమైన మున్సిపల్‌ పాలన అమల్లో ఉండేదని సాహిత్య ఆధారాలు పేర్కొంటున్నాయి.

 

 

రెవెన్యూ పాలన
     గుప్తుల కాలంలో భూములను సర్వే చేయించి, కొలిపించి, విభజించేవారు. పంటలో 1/6 వంతు భూమి శిస్తును వసూలు చేసేవారు. ఇదే ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరు. పన్నులను ధనరూపంలో చెల్లించేవారు. ఫాహియాన్‌ తన రచనల్లో రాజరిక భూముల  గురించి వివరించాడు. సైన్యం సరిహద్దు గ్రామాల్లో ఉన్నప్పుడు ప్రజలు అనేక ప్రత్యేక పన్నులు, చెల్లింపులు చేసేవారు. వృత్తి సంఘాలు, వ్యాపార శ్రేణులు, బ్యాంకర్లు కూడా ప్రత్యేక పన్నులు చెల్లించేవారు. అత్యవసర సమయాల్లో చక్రవర్తి విరివిగా నాణేలను ముద్రించి ద్రవ్య చలామణి విధానాన్ని అదుపు చేసేవారు.

 

సైనిక పాలన 
    గుప్త యుగం నాటి సైనిక విధానాలు, అధికారాలు, మంత్రులు, సేనాధిపతులు వారి విధులు, సైనిక ఆయుధాల గురించి అనేక శాసన సాహిత్య ఆధారాలు లభించాయి. విశాల సామాజ్యాన్ని స్థాపించాలంటే సమర్థవంతమైన సైనిక శక్తి అవసరమనే విషయాన్ని గుప్త చక్రవర్తులు గుర్తించారు. సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు అనేక దండయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరించారు. వారు అవలంబించిన సైనిక విధానాలే దీనికి ప్రధాన కారణం. 

    అప్పటి సైనిక వ్యవస్థలో చతురంగ బలాలకు ప్రాధాన్యం ఉండేది. పదాతిదళం, అశ్వికదళం, గజదళం, ధనుష్క దళం లాంటివి ప్రధాన సైనిక దళాలు. మహాసేనాధిపతి, రణభాండారిక లాంటి అధికారులు, మంత్రులు సైనిక వ్యవహారాలను నిర్వహించేవారు. హరిసేనుడు వేయించిన అలహాబాద్‌ శాసనంలో అనేక రకాల యుద్ధ ఆయుధాల వివరణ ఉంది. రథాలు, ఒంటెలను సైనిక వ్యవస్థలో ఉపయోగించేవారు. పర్షియా, అరేబియా, ఆఫ్గనిస్థాన్‌ లాంటి విదేశాల నుంచి మేలుజాతి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు.

 

న్యాయపాలన
    గుప్తుల కాలంనాటి న్యాయపాలనలో చక్రవర్తి సర్వాధికారి. గతంతో పోలిస్తే వీరి కాలంలో సివిల్, క్రిమినల్‌ నేరాల మధ్య తేడాలను గుర్తించారు. ప్రజలు తమకు న్యాయం జరగలేదని భావిస్తే అప్పిలేట్‌ కోర్టుకు వెళ్లి ఫిర్యాదులు చేసుకోవడానికి అనుమతించారు. ఇందుకోసం ప్రత్యేక అప్పిలేట్‌ న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో చెప్పిన తీర్పులపై కూడా అప్పిలేట్‌ న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం కల్పించారు. గుప్తుల కాలం నాటి ప్రధాన న్యాయమూర్తిని ‘మహా దండనాయకుడు’ అనేవారు. 

    ఫాహియాన్‌ తన రచనల్లో గుప్తుల కాలంనాటి న్యాయ విధానాలు, శిక్షల గురించి స్పష్టంగా వివరించాడు. న్యాయ విధానాలు, చట్టాలు చాలా సరళంగా ఉన్నాయని, సాధారణ శిక్షలు మాత్రమే విధించేవారని ఈయన పేర్కొన్నాడు. పురోహితుడికి న్యాయ సమీక్ష అధికారం ఉండేది.

 

ఆర్థిక విషయాలు
    గుప్తుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు సమానంగా అభివృద్ధి చెందాయి. నాటి వ్యవసాయ భూముల సర్వే విధానం గురించి ప్రభావతి గుప్త వేయించిన పూనా శాసన ఫలకాలు వివరిస్తున్నాయి. భూముల కొలతలు, సరిహద్దు రాళ్లు వేయడం గురించి 'పహాడ్‌పూర్' శాసనం పేర్కొంటుంది. పుస్తపాల అనే అధికారి జిల్లాలో జరిగే భూ లావాదేవీలను రికార్డు చేసేవాడు. భూదానాలు అధికంగా చేయడంతో గుప్తుల కాలంలో భూస్వామ్య వ్యవస్థకు పునాది పడింది. ఏ విధమైన పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను, గ్రామాలను (అగ్రహారాలు) దానం చేసేవారు. సముద్రగుప్తుడు వేయించిన నలందా, గయ శాసనాల్లో అగ్రహారాల ప్రస్తావన ఉంది. నాటి ప్రధాన భూస్వామ్య ప్రభువులను 'ఉక్కకల్ప' మహారాజులుగా పిలిచేవారు. దేవాలయాలు, కవులు, వ్యాపారులకు దానం చేసే గ్రామాలను 'దేవాగ్రహారాలు' అనేవారు. ఉక్కకల్ప మహారాజులు పుళిందభట్టు అనే గిరిజన తెగ నాయకుడికి కూడా రెండు గ్రామాలను దానం చేసినట్లు శాసన ఆధారాలు లభించాయి.
రోమ్ దేశంతో ఎక్కువ విదేశీ వాణిజ్యం జరిపేవారు. తూర్పున తామ్రలిప్తి, పశ్చిమాన బరుకచ్ఛ ప్రధాన ఓడరేవులుగా ఉండేవి. సార్థవాహులు అనే సంచార వ్యాపారులు నగరాల్లో వ్యాపారం చేసేవారు. అరేబియా, పర్షియా, ఆఫ్గానిస్థాన్ దేశాల నుంచి గుర్రాలను దిగుమతి చేసుకునేవారు. ఉప్పును ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేసేది.

 

సాంఘిక, మత పరిస్థితులు
      వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేవి. ఛండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాసీ ఆచారం ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం/ హిందూమతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు 'పరమ భాగవత' అనే బిరుదు ధరించాడు. సముద్రగుప్తుడు రాజ చిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. స్కంధగుప్తుడి జునాగఢ్ శాసనంలో బలి చక్రవర్తి, వామనుల కథనాన్ని వివరించారు. మౌఖరీ వంశస్థుడైన అనంతవర్మబారాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడి నరసింహ అవతారం గురించి అలీనదాన శాసనం వివరిస్తుంది. ఎరాన్‌లో వరాహ విగ్రహం కనిపిస్తుంది. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు.

 

భాషా సాహిత్యాల వికాసం
    గుప్తుల కాలంలో భాషా సాహిత్యాల వికాసం, విద్యా సారస్వతాల అభివృద్ధి బహుముఖంగా జరిగింది. గుప్త చక్రవర్తులు అనేకమంది కవి పండితులను పోషించి సాహిత్య సృష్టికి తోడ్పడ్డారు. నలందా లాంటి విశ్వవిద్యాలయాలు స్థాపించి విద్య, సారస్వతాల అభివృద్ధికి కృషిచేశారు. 
    గుప్తుల కాలంలో సంస్కృతం రాజభాషగా ఉండేది. సముద్రగుప్తుడు తన ఆస్థానంలో వసుబంధు అనే గొప్ప కవిని ఆదరించాడు. రెండో చంద్రగుప్తుడు నవరత్నాలు అనే కవిపండితులను పోషించాడు. నవరత్నాల్లో కాళిదాసు గొప్పవాడు. అతడు సంస్కృత భాషలో అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, రఘువంశం, మేఘ సందేశం, కుమార సంభవం లాంటి నాటకాలను, కావ్యాలను రచించి ఇండియన్‌ షేక్‌స్పియర్‌గా పేరొందాడు. 
    వాగ్భటుడు అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని రాశాడు. కామందకుడి నీతిశాస్త్రం, వజ్జిక రాసిన కౌముదీ మహోత్సవం గొప్ప గ్రంథాలుగా పేరొందాయి. వీరి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు ఫాహియాన్‌ ఫో- కువో - కి అనే గ్రంథంలో అప్పటి పరిస్థితులను వివరించాడు. 
    గుప్తుల కాలాన్ని సంస్కృత భాషకు స్వర్ణయుగంగా పేర్కొంటారు. కవి పండితులను పోషించిన సముద్రగుప్తుడు ‘కవిరాజు’గా పేరొందాడు. హరిసేనుడు సంస్కృత భాషలో వేయించిన అలహాబాద్‌ ప్రశస్తి గొప్ప కావ్యంగా పేరొందింది. ఈ కాలంలోనే విశాఖదత్తుడు ముద్రారాక్షసం, దేవీ చంద్రగుప్తం లాంటి గ్రంథాలు రాశాడు. అమరసింహుడు అమరకోశం అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. చంద్రవ్యాకరణం అనే గ్రంథాన్ని బెంగాల్‌ ప్రాంతానికి చెందిన చంద్రగోమయ రాశాడు. పాణిని రాసిన అష్టాధ్యాయి, పతంజలి రాసిన మహాభాష్యం కూడా గొప్ప గ్రంథాలుగా పేరుపొందాయి.
    సంస్కృత భాషతో పాటు, ప్రాకృతం, అర్ధమగధి లాంటి దేశీయ భాషలు కూడా వృద్ధి చెందాయి. మొదటి కుమారగుప్తుడు నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి విద్యా సారస్వతాల అభివృద్ధికి ఎంతో కృషిచేశాడు. అనేక శాస్త్ర గ్రంథాలు కూడా ఈ కాలంలో వెలువడ్డాయి.

 

శాస్త్ర విజ్ఞానం
 
   ఈ యుగంలో శాస్త్ర విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందింది. గణిత, ఖగోళ శాస్త్రాల్లో గొప్ప గొప్ప మేధావులు అనేక నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఆర్యభట్టు ఈ యుగంలోనే ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం లాంటి గ్రంథాలను రచించాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందనే విషయాన్ని గుప్త యుగంలోనే తెలియజేసిన బ్రహ్మగుప్తుడు ఇండియన్‌ న్యూటన్‌గా ప్రసిద్ధి చెందాడు. పాలకవ్యుడు అనే వ్యక్తి హస్తాయుర్వేదం అనే పశు వైద్యశాస్త్ర గ్రంథాన్ని రాశాడు.

 

రాజకీయ చరిత్ర
    గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీ గుప్తుడిని చిలికిత (చీ-లీ-కిటో) మహారాజుగా ప్రస్తావించాడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోద్గజ గుప్తుడు 'మహారాజు' బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. ఇతడు లిచ్ఛవీ గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. 'రాజాధిరాజ' బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీ.శ.335 - 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. కచ అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి, సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది.
     హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. దాని ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యావర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యావర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి, వారిని సామంతులుగా చేసుకున్నాడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగి రాజు హస్తివర్మ (శాలంకాయన రాజు), కంచి పాలకుడు విష్ణుగోపుడు (పల్లవ రాజు) ముఖ్యమైనవారు.
     ఆంగ్ల చరిత్రకారుడైన వి.ఎ.స్మిత్ సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని కీర్తించాడు. 'కవిరాజు', 'అశ్వమేధ యోగి' లాంటి బిరుదులను పొందాడు. మొదటి ఆర్యావర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యావర్తన దండయాత్రలో గణపతినాగ, అచ్యుతనాగ, లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుడిని ఓడించి, అశ్వమేధ యాగం చేసి 'అశ్వమేధ యోగి' బిరుదు పొందాడు. ఇంకా అయిదు సరిహద్దు రాజ్యాలను, తొమ్మిది ఆటవిక రాజ్యాలను ఓడించాడు. సింహళరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు, శక రాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు, రెండో చంద్రగుప్తుడు బసనను, రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు 'దేవీచంద్రగుప్తం' నాటకం పేర్కొంటుంది.

 

ఆర్థిక అంశాలు
    గుప్త యుగం నాటి ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠమైంది. వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థ కొనసాగింది. గుప్త రాజులు వ్యవసాయంతో పాటు వాణిజ్య, పరిశ్రమ రంగాలను అభివృద్ధి చేశారు. అప్పటి ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన మార్పు ‘భూస్వామ్య విధానాలు’ ప్రారంభం కావడం. గుప్త చక్రవర్తులు విరివిగా భూదానాలు చేయడం, సేద్యపు బానిసలు కొనసాగడం లాంటి అంశాల వల్ల భూస్వామ్య వ్యవస్థ అభివృద్ధి చెందింది. వాస్తవానికి భారతదేశంలో తొలిసారిగా భూదానాలు చేసింది శాతవాహనులు. అయితే గుప్త యుగంలో ఈ భూదానాలు అధికం కావడమే మన దేశంలో భూస్వామ్య వ్యవస్థ ప్రారంభానికి దారితీసింది. బుధగుప్తుడి పహార్‌పూర్‌ శాసనం మాత్రం భూములపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక యాజమాన్య హక్కును వివరిస్తుంది. వీరి కాలంలో వ్యవసాయ యోగ్యమైన భూమిని ‘క్షేత్రం’గా; బంజరు భూమిని ‘ఖిలం’గా; అటవీ భూములను ‘అప్రహత’గా; నివాస యోగ్య భూములను ‘వస్తి’గా పేర్కొంటే, పచ్చిక బయళ్లను ‘గపధసార’ అనేవారు. భూమి అమ్మకం, కొనుగోలు వ్యవహారాలు చూసే జిల్లా ప్రధాన అధికారిని ‘పుస్తపాల’గా పిలిచేవారు.

    గుప్తుల కాలం నాటి దేశీయ, విదేశీ వాణిజ్యం గురించి అనేక ఆధారాలు లభిస్తున్నాయి. వీరికాలంలో రోమ్‌ దేశంతో అధికంగా విదేశీ వాణిజ్యం జరిగేది. ముజరిస్, కావేరి, అరికమేడు లాంటి రేవు పట్టణాలు విదేశీ వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషించేవి. దేశీయ వాణిజ్యంతో సార్ధవాహులు అనే సంచార వ్యాపారులకు ప్రాధాన్యం లభించింది. వృత్తివర్గాలు, వ్యాపార శ్రేణులు వాణిజ్య విస్తరణలో తోడ్పడ్డారు. వాస్తవానికి మౌర్య యుగం కంటే గుప్త యుగంలో ఈ వర్గాల వారికి ప్రాధాన్యం తగ్గింది. బైజాంటియన్‌ సామ్రాజ్యం చైనా నుంచి పట్టుపురుగులు దిగుమతి చేసుకోవడంతో భారతదేశ విదేశీ వాణిజ్యం క్షీణించింది. ఇస్లాం మతవ్యాప్తి కోసం అరబ్బులు బైజాంటియన్‌ సామ్రాజ్యంలోకి రావడం సైతం భారత విదేశీ వాణిజ్యం క్షీణించడానికి కారణమైంది. గుప్త యుగంలో రాజులు అధిక మొత్తంలో బంగారు నాణేలు ముద్రించినా అవి సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. దేశీయ వాణిజ్యం కూడా పతనం కావడంతో గంగా మైదాన ప్రాంతాల్లోని పట్టణాలు తమ ఆధిక్యాన్ని కోల్పోయాయి. దేశీయంగా పాలకులు చేనేత, చిన్నతరహా కుటీర పరిశ్రమల అభివృద్ధికి కృషిచేయడం వల్ల ప్రజలకు ఉపాధి లభించింది. వీరికాలం నాటి ఆర్థిక వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రారంభం కావడం, తర్వాత వ్యాపారం కొంత మేర క్షీణించినా ఆర్థిక ప్రగతి జరిగిందని చెప్పొచ్చు.

 

నాణేలు
     గుప్తుల కాలంలో అధికంగా బంగారు నాణేలను ముద్రించారు. వీరు కుషాణుల నాణేలను పోలిన నాణేలను విడుదల చేశారు. సముద్ర గుప్తుడు వీణ బొమ్మతో బంగారు నాణేలను ముద్రించాడు. అశ్వమేధ యాగం చేసి, 'అశ్వమేధ యోగి' బిరుదుతో కూడా సముద్రగుప్తుడు బంగారు నాణేలను ముద్రించాడు. మొదటి చంద్రగుప్తుడు శ్రీ చంద్రగుప్త కుమారదేవి పేరుతో నాణేలను ముద్రించాడు. గుప్తుల కాలం నాటి బంగారు నాణేలను 'దీనార్', 'కారా', 'సువర్ణ' అని పిలిచేవారు. సముద్రగుప్తుడి నాణేల్లో ఎక్కువగా వెనుక భాగంలో లక్ష్మీదేవి బొమ్మను ముద్రించేవారు. రెండో చంద్రగుప్తుడి నాణేలపై 'మహా రాజాధిరాజ శ్రీచంద్రగుప్త' అనే బిరుదును ముద్రించారు. గుప్తుల్లో రాగి నాణేలను ముద్రించిన తొలి చక్రవర్తిగా రెండో చంద్రగుప్తుడిని పేర్కొంటారు. ఉజ్జయిని ముద్రతో నాణేలను ముద్రించింది రెండో చంద్రగుప్తుడే. రెండో చంద్రగుప్తుడు వెండి నాణేలపై ఒకవైపు పరమభాగవత, మహారాజాధిరాజు బిరుదులను, మరో వైపు గరుడి (గద్ద) బొమ్మను ముద్రింపజేసేవాడు. ఏనుగు, నెమలి, అశ్వికుడు లాంటి బొమ్మలతో కుమారగుప్తుడు నాణేలను ముద్రించాడు.

Posted Date : 22-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు