• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగ‌రిక‌త

ప్రాచీన భారతదేశ చరిత్రలో విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది సింధు నాగ‌రిక‌త.. వేల సంవత్సరాల కిందటే అబ్బురపరిచే రీతిలో ఉన్న ఇక్కడి నాగరకత 1921 తర్వాతే బయటి ప్రపంచానికి తెలిసింది. పురాతత్వ తవ్వకాల్లో ఏకంగా రెండు పెద్ద పట్టణాలు బయటపడటంతో.. వాటి గురించి శాస్త్రవేత్తలు మరింత శోధించడంతో ఎన్నో విశేషాలు వెలుగు చూశాయి. నాటి నిర్మాణాలు, సంస్కృతి, జీవన విధానాలు ఎంత గొప్పగా ఉండేవన్నది తెలిసింది. భారతదేశ చరిత్ర అధ్యయనంలో సింధు నదీ నాగరకత గురించి తప్పక తెలుసుకోవాలి.
సింధు నది నాగ‌రిక‌త.5 వేల ఏళ్ల నాటిది.. 1921-22లో సింధు మైదానంలో జరిపిన తవ్వకాల్లో రెండు పురాతన మహా నగరాల శిథిలాలు బయల్పడ్డాయి. వాటిలో ఒకటి మొహంజొదారో, మరొకటి హరప్పా. ఈ రెండూ భారతదేశ మొదటి నగరాలు మాత్రమే కాదు.. ప్రపంచంలోని మొదటి నగరాలు కూడా. భూమి అడుగున పూడుకుపోయిన ఈ పురాతన నగరాల నాగ‌రిక‌త., సంస్కృతులు వెలుగులోకి రావడానికి మూలకారకులు కనింగ్‌హాం, సర్ జాన్ మార్షల్, ఆర్.డి.బెనర్జీ తదితరులు. ఈజిప్టు, బాబిలోనియా లాంటి ప్రాచీన నాగ‌రిక‌తలతో సమానంగా ఇది స్థానం పొందింది. అందుకే సర్ జాన్ మార్షల్ సింధు నాగ‌రిక‌త. భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిందని పేర్కొన్నాడు. హరప్పా సంస్కృతిలో తడిసిన నేల చాలా విశాలమైంది. దీని విస్తీర్ణం 12,99,600 చదరపు కిలోమీటర్లు. క్రీ.పూ. 2, 3 సహస్రాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా హరప్పా అంతటి విస్తృత సంస్కృతీ సీమ మరెక్కడా లేదు.

 

ఆ పేరెలా వచ్చింది?

పురావస్తు పరిశోధకుల తవ్వకాల్లో సింధు నది ఒడ్డున ఉన్న మొహంజొదారో, దానికి ఎగువన హరప్పా బయటపడటం వల్ల ఈ రెండు పురాతన నగరాల నాగ‌రిక‌తను సింధు నాగ‌రిక‌తగా వ్యవహరించారు. ఈ రెండు నగరాల్లోనే కాకుండా సింధు నదీ లోయలోని మరికొన్ని స్థలాల్లోనూ ఇలాంటి నాగ‌రికతే బయటపడటం వల్ల సింధునది నాగ‌రిక‌త అన్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు జరిపి సింధు నాగరకతను పోలిన మరికొన్ని నగరాలను కూడా కనుక్కున్నారు. ఈ అన్ని పట్టణాల్లో జీవన సరళి, సంస్కృతి హరప్పా నాగరకతను పోలి ఉండటం వల్ల సింధునాగ‌రిక‌తను హరప్పా నాగరకతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీన్ని నాగరకత అని పిలవడానికి కారణం.. అంతకు ముందున్న ఆదిమ యుగంలోని మానవుల కంటే సింధు నదీ లోయలో నివసించిన ప్రజలు ఎంతో నాగరిక జీవితం గడపడం.

 

సింధు నాగరకత విస్తృతి

ఇప్పటి ప్రాదేశిక సరిహద్దులను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు మొత్తం పంజాబ్ (భారత్, పాకిస్థాన్ దేశాల్లోని); హరియాణా; పశ్చిమ ఉత్తరప్రదేశ్; ఉత్తర రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు; సింధు; గుజరాత్; ఈశాన్య, దక్షిణ బెలూచిస్థాన్ ప్రాంతాల్లో సింధు నాగరకత విస్తరించింది. ఉప హిమాలయ పర్వత పాద ప్రాంతాలైన మాండా (జమ్మూ కశ్మీర్ లోనిది), రూపార్, చండీగఢ్ వరకు ఈ నాగరకత విస్తరించింది.
 

మౌలిక లక్షణాలు

హరప్పా, మొహంజొదారోల్లో సింధునాగ‌రిక‌త సంస్కృతిని ప్రతిబింబించే కొన్ని ఆనవాళ్లు లభించాయి. అవి..
* కుమ్మరి చక్రంతో తయారైన ప్రత్యేక కుండలు
* ముద్రలపై ప్రత్యేకంగా కనిపించే లిపి
* కాల్చిన ఇటుకలు (1:2:4 నిష్పత్తిలో)
* ప్రామాణికమైన తూనికలు (13.63 గ్రాముల బరువు)
* ప్రణాళికాబద్ధమైన నమూనా నగరాలు
* ఒకదానితో మరొకటి లంబకోణంలో కలిసే రోడ్లు
* మురుగు పారుదలపై ప్రత్యేక శ్రద్ధ
* తాపీ పనితో నిర్మించిన బావులు, చెరువులు
* పట్టణాల పక్కనే ప్రత్యేకంగా నిర్మించిన కోటలు
* మృతదేహాలను వెల్లికిలా ఉంచి ఊరు అవతల ఉన్న శ్మశానవాటికలో ఉత్తర, దక్షిణాలుగా పూడ్చడం
హరప్పా నాగ‌రిక‌త సువిశాల ప్రాంతంలో ఒకే సంస్కృతితో అభివృద్ధి చెందింది. నగర నాగరకత దీని విశిష్ట లక్షణం. వాణిజ్య వ్యవసాయ నాగరకత. ఇది కాంస్య పాషాణ యుగానికి చెందింది.

వ్యవసాయం - జీవనోపాధి

గణనీయమైన వ్యవసాయ ఉత్పత్తి ఉంటే తప్ప పట్టణ విప్లవం సాధ్యం కాదు. సింధు నాగ‌రిక‌త కాలంలో వ్యవసాయ సంబంధిత పరికరాలు అభివృద్ధి చెందాయి. బన్వాలీలో లభించిన టెర్రకోటతో తయారుచేసిన నాగలి బొమ్మ దీనికి నిదర్శనం. నదీ తీరాల వెంబడి పొలాలు బారులు తీరి ఉండేవి. నదీ వరదల ద్వారా కొట్టుకు వచ్చే ఒండ్రుమట్టి ఉన్న భూములు కాబట్టి సాగు సులభమైంది. తృణధాన్యాలు, గోధుమ, బార్లీ, బీన్స్, నూనెగింజలు, అవిసెలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి, ఆవాలు నాటి ముఖ్యమైన పంటలు.
ఎద్దులను అరక దున్నడానికి, బండి లాగడానికి వాడేవారు. ఆవులను పాలకు వినియోగించేవారు. ముద్రల్లో ఎక్కడా గుర్రం బొమ్మను చిత్రీకరించలేదు. గ్రామావసరాలకు మించి సింధు ప్రజలు ధాన్యం పండించారు. మిగులు ధాన్యాన్ని పట్టణాలకు సరఫరా చేశారు. ఈ అదనపు ధాన్యాన్ని నిల్వ చేయడానికి పట్టణాల్లో గరిసెలు, గిడ్డంగులు ఉండేవి. పట్టణ ప్రజల్లో వృత్తిపనివారు, వర్తకులు, చేతిపనివారు, దుస్తులు నేసేవారు, ఆభరణాలు తయారుచేసేవారు ఉండేవారు. వారు రాతి పరికరాలతో పాటు రాగి, కంచు సాధనాలను ఉపయోగించారు. సరకు రవాణాకు బండ్లను వినియోగించేవారు. వినిమయ వస్తు పరిశ్రమల్లో కుండల తయారీ విస్తారంగా కనిపించేది. సింధు పాత్రలను నిల్వకు, వంటకు, ఆహారం తీసుకోవడానికి ఉపయోగించేవారు. ఖరీదైన విలాస వస్తువులను తయారు చేసేవారు. బంగారం - వెండి ఆభరణాలు, పూసలు, బిళ్లల తయారీ వారికి తెలుసు. జేడ్, నీలం రంగు రాళ్లను ఉపయోగించారు.

 

నగరాలు - భవనాలు

మొహంజొదారో, హరప్పా నగరాలు రెండు ప్రధాన భాగాలుగా విభజన చెంది ఉండేవి. మెరక ప్రాంతంలో కోట, పల్లపు ప్రాంతంలో పౌర నివాసాలు ఉండేవి. ప్రభుత్వ కార్యాలయాలు, ధాన్యపు గిడ్డంగులు, ముఖ్య కర్మాగారాలు, ప్రార్థనా మందిరాలు మొదలైన కట్టడాలన్నీ కోట ఆవరణలోనే ఉండేవి. పౌర నివాసాలు ఉండే ప్రాంతం విశాలమైంది. వీధులకు రెండు వైపులా ఇళ్లు, దుకాణాలు ఉండేవి. కాల్చిన ఇటుకలతో పునాది కట్టి ఆపైన ఎండిన ఇటుకలతో నిర్మాణం చేసేవారు. మొహంజొదారోలో ఇళ్లు కట్టకముందే పౌర నగర ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం నిర్మాణానికి అనువుగా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా, ఉప వీధులు తూర్పు పడమరలుగా బారులు తీరినట్లు ఉంటాయి. చాలా ఇళ్లల్లో బావులు, బావుల సమీపంలో స్నానపు గదులు ఉన్నాయి. నగరాల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన మురుగునీటి కాల్వలు ఉన్నాయి. రహదారుల పక్కన మురుగు కాల్వలను నిర్మించారు. భూగర్భంలో ఇటుకలతో కట్టిన మురుగు నీటి కాలువను శుభ్రం చేయడానికి అక్కడక్కడా మనిషి దూరేందుకు రంధ్రాలున్నాయి.
          గృహాల్లో ఒకవైపు పడక గదులు మరోవైపు వంటగది ఉండేవి. వంటగదిలో పొయ్యి, ధాన్యం, నూనె పోసి పెట్టుకునే పెద్ద మట్టి జాడీలు ఉన్నాయి. ప్రతి ఇంటికి పెరడు, పెరట్లో రొట్టెలు కాల్చుకోవడానికి పొయ్యి ఉన్నాయి. వంటకాల్లోకి కావాల్సిన మసాలా నూరుకునే రోలు, బండ ఉన్నాయి. పౌరులందరూ ఇలాంటి సౌకర్యాలుండే లోగిళ్లలో నివసించలేదు. ధాన్యపు గిడ్డంగులు, బట్టీలలో పనిచేసే కూలీలు ఒంటి గది ఇళ్లల్లోనే కాలక్షేపం చేశారు. బహుశా వారు పేదరికంలో ఉండి ఉండవచ్చు.
            మొహంజొదారో కోట లోపలి భాగంలో 'మహా స్నానవాటిక' అనే కట్టడం ఉంది. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీని పొడవు 12 మీ., వెడల్పు 7 మీ., లోతు 2.4 మీ. దీని నిర్మాణంలో కాల్చిన ఇటుకలను వాడారు. ఎదురెదురుగా ఈ తొట్టెలోకి దిగడానికి మెట్లున్నాయి. ఈ తొట్టెకు ఉత్తరం, తూర్పు దిశల్లో అనేక గదులున్నాయి. తూర్పున ఒక గదిలో పెద్ద బావి ఉంది. ఈ బావి నుంచి మహాస్నానవాటికకు నీరు సరఫరా అవుతుంది. ఈ తొట్టెలోని నీటిని మార్చుకోవచ్చు. దక్షిణ మూలలో నీరు బయటకు పోయేందుకు మార్గం ఉంది.
హరప్పా కోటలో ధాన్యాగారాలు చూడచక్కగా కనిపించే భవనాలు. అవి దీర్ఘచతురస్రాకారపు కట్టడాలు. నదికి దగ్గరగా ఉండేవి. ధాన్యం పడవల ద్వారా నగరం చేరేది. వెంటనే ఒడ్డుకి దగ్గరగా ఉన్న గిడ్డంగులకి ధాన్యాన్ని తరలించేవారు. హరప్పా నాగరిక జీవనంలో ఇవి అతి ముఖ్యమైనవి.
మొహంజొదారో నగరంలోని మరో ప్రాంతంలో ఒక పెద్ద ఇల్లు నిర్మితమైంది. బహుశా ఇది దేవాలయం కావచ్చు లేదా ఇందులో అప్పటి ప్రభుత్వాధినేత నివసించి ఉండవచ్చు. ప్రజలకు ఒక రాజంటూ ఉండేవాడో లేదో పౌర సంఘం ఏదైనా పరిపాలన నిర్వహించేదో లేదో అంతగా తెలీదు.
 

ప్రజలు - సమాజం

ప్రజల ప్రధాన ఆహారం బార్లీ, గోధుమలు. వాటిని పిండి దంచి రొట్టెలు కాల్చుకుని తినేవారు. దానిమ్మ, అరటిపండ్లు అంటే వాళ్లకు చాలా ఇష్టం. చేపలు, మాంసం భుజించేవారు. లోథాల్‌లో మాత్రం క్రీ.పూ. 1800లో ప్రజలు వరి బియ్యం వాడిన దాఖలాలు కనిపించాయి. పత్తి పండించిన తొలి ప్రజలు సింధు వాసులే. సింధు నది ప్రాంతంలో పత్తి పండింది. కాబట్టి గ్రీకులు దీన్ని 'సిందన్' అనేవారు. పత్తి నుంచి నూలు వడకడం, దుస్తులు నేయడం సింధు ప్రజలకు తెలుసు. పురుషులు ధోవతీని, స్త్రీలు పొట్టి పరికిణీని ధరించేవారు. ఉన్ని దుస్తులు కూడా వాడారు. స్త్రీలకు కేశాలంకరణ తెలుసు. స్త్రీ, పురుషులకు ఆభరణాలపై మోజు ఉండేది. భాగ్యవంతులు బంగారం, వెండితో చేసిన ఆభరణాలను; పేదలు పూసలు, గుల్లలతో తయారుచేసిన నగలను ధరించే వారు. స్త్రీలు కంకణాలు, కడియాలు, హారాలను ధరించారు.
హరప్పా ప్రజల వినోద వ్యాసంగాలకు సంబంధించిన చంద్ర శిలలు, బంతులు, చదరంగం, పాచికలు, ఆట వస్తువులు లభించాయి. పిల్లలు అడుకునే మట్టితో చేసిన బొమ్మ బండ్లు దొరికాయి. అనేక భంగిమల్లో దారం కట్టి ఆడించే మృగాల బొమ్మలు దొరికాయి. కమ్మరులు ఈటెలు, కత్తులు, బాణపు మొనలు, గొడ్డళ్లు, చేపల గాలాలు, క్షురకుల పరికరాలను రాగి, కంచుతో తయారు చేసేవారు. మాతృదేవత విగ్రహాల ఆధారంగా మాతృస్వామ్య పద్ధతి ఉండి ఉంటుందని చెప్పవచ్చు. సింధు సమాజంలో తీవ్ర అంతరాలున్నాయి. బానిస విధానం గుర్తించదగ్గ స్థాయిలో ఉంది.
హరప్పా, మొహంజొదారో శిథిలాల్లో ముద్రికలు విశేషంగా దొరికాయి. ఇవి మట్టి, రాతితో తయారైన దీర్ఘచతురస్రాకార ముద్రికలు. అధిక సంఖ్యలో లభ్యమైన ముద్రలు వ్యక్తిగత ఆస్తి ఉనికిని గుర్తించడానికి మంచి సూచికలు. వ్యక్తిగత ఆస్తిపై యజమాని తన గుర్తును వేయడానికి ఈ ముద్రలు వినియోగించేవాడు. ఒంటి కొమ్ము ఎద్దు (యూనికార్న్) ముద్ర, ఇతర ముద్రలు పురోహితులకు చెందినవై ఉంటాయి. సింధు నాగరకత కాలంలో రైతులు, పశుపాలన చేసే దేశదిమ్మరులు, బానిసలు, పట్టణ పేదలు, చేతి వృత్తిదారులు, వ్యాపారులు, మతాధిపతులు, పాలకులు ఉండేవారు.

ప్రభుత్వం

    పట్టణాలను ప్రణాళికబద్ధంగా నిర్మించారు. భవంతులు రహదారులను ఆక్రమించకుండా నియంత్రించిన తీరు, మురుగు కాల్వల వ్యవస్థ సింధు, ఇతర పట్టణాల్లోని అధికార నిర్వహణను తెలియజేస్తోంది. ఒకే రకమైన వ్యవస్థాగత పద్ధతి కేంద్రీకృత నియంత్రణ ద్వారానే సాధ్యమవుతుంది. ప్రామాణిక సింధు లిపి, ఒకే రకమైన తూనికల పద్ధతి, విలక్షణమైన ముద్రల వాడకం, కుండల తయారీలో సార్వత్రిక శైలి, ప్రామాణిక బరువున్న కాల్చిన, ఎండబెట్టిన ఇటుకలు లాంటివి సామాన్య లక్షణాల్లో కొన్ని. సింధు నాగరకతకు ప్రభుత్వం ఉందంటే కచ్చితంగా రాజకీయ చరిత్ర ఉంటుంది. కానీ చక్రవర్తి లేదా ఇతర రాజుల పేరిట స్మారక భవనాలు, ప్రదేశాలు లేదా సమాధులను ఎక్కడా గుర్తించలేదు. కొద్ది మంది వ్యక్తుల సముదాయం ప్రభుత్వాన్ని (Oligarchy) నడిపిన అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. సింధు లిపిని అర్థం చేసుకోగలిగితేనే అక్కడి ప్రభుత్వం పట్ల మరిన్ని వివరాలు తెలుస్తాయి.
 

వర్తక వాణిజ్యాలు

విస్తృత స్థాయిలో ఉన్న సింధు వర్తక వ్యవస్థ ఆంతరంగిక విదేశీ వ్యాపారాన్ని సూచిస్తోంది. ఎద్దుల బండి, పడవలను రవాణాకు ఉపయోగించారు. సింధు నది రవాణాకు అత్యంత అనుకూలమైంది. స్థానిక, దూరప్రాంత వాణిజ్యం ఉంది. కొన్ని ముద్రలను సరకులకు టోకెన్లుగా వాడి ఉండవచ్చు. ఈ నాగరకత కాలంలో హరప్పాకు సుమేరియా, పర్షియన్ సింధు శాఖ తీర పట్టణాలతో సంబంధాలు ఉండేవి. మొహంజొదారోలో తయారైన ముద్రికలు, చేతిపనులు బాబిలోనియాలో దొరికాయి. సింధు నగరాల్లో తయారైన వస్తువులు లోథాల్ రేవు ద్వారా సముద్ర మార్గాన విదేశాలకు నౌకల్లో రవాణా అయ్యేవి. (లోథాల్‌లో జరిపిన తవ్వకాల్లో ఓడరేవు బయటపడింది) అలాగే విదేశాల నుంచి దిగుమతి అయిన సరకు లోథాల్ రేవులోనే దింపేవారు. వ్యాపార వాణిజ్యాల్లో కొలతలు, తూనికలు ముఖ్యపాత్ర పోషించినట్లు అక్కడ దొరికిన త్రాసులు, తూకపు రాళ్ల వల్ల స్పష్టమవుతోంది. అవి చాలా నిర్దిష్టంగా ఉన్నాయి.
 

రాత, కళలు, మతం

సింధు నాగరకత మరో గొప్ప ఆవిష్కరణ రాత. సింధు లిపి చిన్న కృతుల రూపంలో (సుమారు 4000 కృతులు) ఉంది. రాత కుడి నుంచి ఎడమకు ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో రెండో వరుస ఎడమ నుంచి కుడికి కూడా ఉంది. సింధు లిపిని అర్థం చేసుకోనంతవరకు అందులోని విషయంపై స్పష్టత రాదు. చేప గుర్తును తరచూ ఉపయోగించడం వల్ల ఈ లిపి ద్రవిడియన్ భాషల కుటుంబానికి చెంది ఉండవచ్చు. ఈ లిపి అర్థమైతేనే సింధు ప్రజల శాస్త్రీయ పరిజ్ఞాన స్థాయిని అంచనా వేయవచ్చు.
మొహంజొదారోలో రెండు విగ్రహాలు లభించాయి. ఒకటి మతాచార్య చక్రవర్తి రాతి విగ్రహం కాగా రెండోది నాట్యకారిణి కంచు విగ్రహం. వాస్తవికతను ప్రతిబింబించడంలో సింధు కళాకారులు సమర్థులు. వారు చిన్న కళాకృతులను సృష్టించడానికే కృషి చేశారు. పెద్ద విగ్రహాలు, స్మారక కళాఖండాలు లేవు.
తలకు గేదె కొమ్ములున్న మానవ రూపంతో కూడిన దేవతా ప్రతిమ మొహంజొదారోలో లభించింది. అమ్మతల్లి బొమ్మల లభ్యతను బట్టి సింధు ప్రజలు దేవీ ప్రతిమలను కొలిచి ఉండవచ్చు. రావి లాంటి కొన్ని చెట్లను వారు పవిత్రమైనవిగా భావించినట్లు స్పష్టమవుతోంది. 'నంది'ని పవిత్రమైందిగా వారు తలచారు. మాతృదేవత బొమ్మలు పురుష దేవతామూర్తుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. బహుశా సంతానం కోసం మాతృదేవతలను పూజించేవారని భావించవచ్చు.
 

అంత్యక్రియలు

చనిపోయిన వారిని సింధు ప్రజలు పూడ్చిపెట్టేవారు. కొన్ని మృతదేహాలను శవపేటికలో ఉంచి పూడ్చి పెట్టారు. మృతదేహాలు ఉత్తర-దక్షిణంగా తల ఉత్తరం వైపు ఉండేలా వెల్లకిలా ఉన్నాయి. సమాధుల్లో దొరికిన గృహోపకరణాలు, ఆభరణాలు, అద్దాల ఆధారంగా హరప్పా ప్రజలు పరలోక జీవితం ఉంటుందని విశ్వసించి ఉండాలి. ఆ లోకంలో ఈ వస్తువులతో వారికి అవసరం ఉంటుందని భావించి ఉంటారు.
 

పతనం

సింధు నాగరకత పతనానికి చాలా కారణాలున్నాయి. భూకంపం, వరదలు, అనావృష్టి వల్ల సింధు జనావాసాలు నాశనమై ఉండవచ్చు. భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలి జన వినాశనం జరిగి ఉండవచ్చు. వాతావరణం సమూలంగా మారిపోవడం వల్ల కూడా పచ్చగా కళకళలాడిన భూమి ఎడారిమయమై ఉండవచ్చు. లేదా సింధు నగరాలన్నీ శత్రువుల దండయాత్రలకు గురై స్వీయ రక్షణ చేసుకోలేక నశించి ఉండవచ్చు.
 

ఏది సంస్కృతి?

క్రోబర్, క్లుక్‌హాన్ లాంటి పాశ్చాత్య పండితులు 'సంస్కృతి' అనే మాటకు అనేక అర్థాలను వివరించారు. సంస్కృతి అంటే ఒక విధమైన జీవన విధానం, ఉత్తమ స్థాయి, సంస్కారం అనే మాటలు స్ఫురణకు వస్తాయి. నాగరకతను మానవ దేహ సుఖ ప్రమాణంగా, సంస్కృతిని మానవుడి సంస్కార ప్రమాణంగా విశ్లేషించవచ్చు. ఇవి పరస్పరం సంబంధం ఉండేవి.. పరస్పర ప్రభావితాలు. ఒక పరిమిత కాలంలో గానీ.. భౌగోళిక సరిహద్దులతో పరిమితమైన ఒక ప్రాంతంలో గానీ.. ఒకే భాషను మాట్లాడే ప్రజలు లేదా ఒకే మతాన్ని అనుసరించేవారు. చరిత్రగతిలో చేసిన ఆలోచనా పూర్వకమైన కృషి వల్ల నిత్యజీవన విధానంలోనూ, ఆధ్యాత్మిక విషయాల్లోనూ సాధించిన ప్రగతిదాయక మార్పులను సంస్కృతిగా విశ్లేషించవచ్చు. ఈ మార్పులు ఒక ప్రాంతం వల్ల లేదా ఒకే భాష మాట్లాడే ప్రజలు/ఒకే మతాన్ని అనుసరించేవారి వల్ల సంభవించవచ్చు.
 

నాగ‌రిక‌త అంటే..?

నాగ‌రిక‌త‌ను నిర్ణయించేది సామాజిక ఆర్థిక స్థితిగ‌తులు. కాల పురోగ‌తిలో చిన్న జ‌నావాసాలు పెద్దవ‌య్యాయి. పెద్ద గ్రామాలు క్రమేపీ ప‌ట్టణాలుగా అభివృద్ధి చెందాయి. న‌గ‌ర జీవితం ప్రారంభం కావ‌డంతో సాంకేతిక ప్రగ‌తి సాధ్యప‌డింది. అంటే ప‌రిక‌రాల త‌యారీలో, వ‌స్తూత్పత్తిలో..కొత్త ప్రక్రియ‌లు, ప‌ద్దతులు ప్రవేశించాయి. అంత‌క‌ముందు కంటే మెరుగైన నాగ‌రిక‌త పెరిగింది. మ‌నిషి కేవ‌లం త‌న భౌతిక అవ‌సార‌లు తీర‌డంతో సంతృప్తి ప‌డ‌కుండా అంత‌కు మించిన అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి అన్వేషించే ద‌శ‌ను 'నాగ‌రిక‌త' అన‌వ‌చ్చు.
"చ‌రిత్ర అధ్యయ‌నం అనేది గ‌తాన్ని గురించి తెలుసుకునే ఒక మార్గం. ఇ.హెచ్‌.కార్ అభిభాష‌న‌ ప్రకారం - ఒక త‌రం తాను సంపాదించిన కౌశ‌లాన్ని, నేర్పుని ముందు త‌రానికి అందివ్వడం వ‌ల్ల వ‌చ్చే ప్రగ‌తే చ‌రిత్ర.."

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌