• facebook
  • whatsapp
  • telegram

సంస్థానాలు

స్వతంత్రంగా.. సంస్కృతులకు సంరక్షణగా!

  తెలంగాణ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతల్లో ప్రధానంగా పేర్కొనదగినవి సంస్థానాలు. కుతుబ్‌షాహీలు, దిల్లీ సుల్తానులు, అసఫ్‌జాహీల పాలనకు ముందు నుంచే అవి పాలన సాగిస్తున్నాయి. నిజాంల రాజ్యాంలో భాగమైనప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించాయి. స్వభాషా సంస్కృతులు చెక్కుచెదరకుండా కాపాడాయి. సంస్థానాధీశులు కొందరు ప్రజలకు అనుకూలమైన పాలన సాగించి చరిత్రలో నిలిచిపోయారు. కవులను విశేషంగా పోషించారు. భాషాభివృద్ధికి దోహదపడ్డారు. తెలంగాణ చరిత్ర అధ్యయనంలో భాగంగా ఆ వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  హైదరాబాద్‌ రాజ్యంలో అనేక సంస్థానాలు ఉన్నాయి. అందులో 14 తెలంగాణలో ఉన్నాయి. వాటిలోని కొన్ని కాకతీయుల కాలంలో, మరికొన్ని కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో ఆవిర్భవించాయి. ఈ సంస్థానాల హోదా జాగీర్ల కంటే ఎక్కువ. ఎందుకంటే జాగీర్లు నిజాం నవాబులు ఇచ్చినవి. కానీ సంస్థానాలు అసఫ్‌జాహీలు రాజ్యాధికారానికి రాక పూర్వం నుంచే ఉన్నాయి. అయితే అసఫ్‌జాహీలు వారి స్వతంత్ర ప్రతిపత్తిని ఒప్పుకొని తమ రాజ్యంలో భాగంగా ఉండమని కోరిన మేరకు ఒప్పందం జరిగింది. వాటిలో కొన్ని పాలనాధికారం ఉన్న పెద్ద సంస్థానాలుగా ఉండేవి.

 

గద్వాల 

రాయచూరు జిల్లా నుంచి విడిపోయి మొదట ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేరి ఇప్పుడు జోగులాంబ-గద్వాల జిల్లాలో ఉన్న గద్వాల సంస్థానం అతి ప్రాచీనమైంది. ఈ సంస్థానంలో అప్పట్లో 360 గ్రామాలుండేవి. గద, వాలు ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించినవారు నిర్మించిన నగరానికి గదవాలు నగరమని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా గద్వాలగా మారింది. ఈ సంస్థానానికి తూర్పున అలంపురం తాలుకా, పడమర రాయచూరు జిల్లా, ఉత్తర, దక్షిణాలుగా కృష్ణా, తుంగభద్ర నదులు సరిహద్దులుగా ఉండేవి. గద్వాల సంస్థానానికి మూలపురుషుడు పొలనిరెడ్డి. ఆయనకు మరోపేరు బుద్దారెడ్డి. కాకతీయ పాలకుడైన ప్రతాపరుద్రుడు 1290లో ఇతడిని పాలకుడిగా నియమించాడు. కర్నూలు నవాబు గద్వాల సంస్థానానికి కప్పం కట్టేవాడు. ఈ పాలకులకు ‘నాడగౌడ’ ‘సర్‌ నాడగౌడ’ అనే బిరుదులుండేవి. మొదట్లో వీరి రాజధాని పూడూరు. కులదైవం చెన్నకేశవస్వామి.

రాజాసోమనాద్రి: ఈయననే సోమభూపాలుడు అని కూడా అంటారు. గద్వాల సంస్థానానికి ఆద్యుడు. ఐజ గ్రామంలో కోటను, గద్వాల కోటను నిర్మించాడు. ఇతడి కాలం నుంచే పాలకులు ఐజనాడ గౌడులనే పేరు పొందారు. సోమనాద్రి అనంతరం పాలించిన అతడి భార్య లింగమ్మ బీచుపల్లి వద్ద కృష్ణానది మధ్య ఉన్న ఎత్తయిన కొండపై దుర్గ దేవాలయ నిర్మాణం ప్రారంభించింది. అది తిరుమలరావు కాలంలో పూర్తయింది. అది తర్వాత నిజాం కోటగా ప్రసిద్ధి చెందింది. ఈమె సంగాల, తాండ్రపాటి చెరువులను నిర్మించారు. సోమనాద్రి స్వయంగా కవి. ఆయన జయదేవుడు రాసిన గీతగోవిందాన్ని తెలుగు భాషలోకి అనువదించాడు. సోమనాద్రి మనవడు చిన సోమభూపాలుడు కూడా కవే. అనేకమంది కవులను పోషించాడు. ఈయన అష్ట పదులను యక్షగానంగా రూపొందించాడు. ఇతడికి అభినవ భోజుడు అనే బిరుదుండేది. ఇతడి ఆస్థాన కవి పెద్దమందడి వెంకటకృష్ణ ‘నిర్వచన భక్తివిజయం’, ‘మారుతి విలాసం’, ‘గద్వాల సంస్థాన చరిత్ర’, ‘రెడ్డికుల నిర్ణయ చంద్రిక’, ‘కేశవ విలాసం’ గ్రంథాలను రచించాడు. చేట్లూరి నారాయణాచార్యులు అనే కవి ‘ప్రతాపరుద్రీయసారము’ గ్రంథాన్ని రచించాడు. వాడాల శేషాచార్యులు ‘మైథిలీ పరిణయం’ అనే పద్య కావ్యాన్ని, పూలగుమ్మి వెంకటాచార్యులు ‘అంకారావళి’, ‘ఆంధ్ర వ్యాకరణ సూత్రావళి’ అనే గ్రంథాలను రచించారు. గద్వాల సంస్థానం చివరి పాలకురాలు ఆదిలక్ష్మీదేవమ్మ. 1949, సెప్టెంబరు 17న ఈ సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో కలిసిపోయింది.

 

వనపర్తి 

  ఈ సంస్థానం ప్రస్తుత వనపర్తి జిల్లాలో ఉంది. దీని వైశాల్యం 450 చదరపు మైళ్లు. ఇందులో నాడు 124 గ్రామాలు ఉండేవి. ఈ సంస్థానాధీశుల ఇంటిపేరు జనులపల్లి వారు. మూల పురుషుడు వీర కృష్ణారెడ్డి. ఈయన నూగూరును రాజధానిగా చేసుకుని పాలించడంతో వీరిని నూగూరు సంస్థానాధీశులుగా వ్యవహరించేవారు. ఈ వంశంలో నాలుగో తరం వాడైన వేముడి వెంకటరెడ్డి గొప్ప వీరుడు. ఇతడు గోల్కొండ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్‌షాకు క్రీ.శ.1633లో నెల్లూరు, ఉదయగిరి దండయాత్రల్లో సహాయపడి అతడి మెప్పు పొంది మరికొన్ని గ్రామాలను తన సంస్థానంలోకి తెచ్చుకున్నాడు. వెంకటరెడ్డి కుమారుడైన గోపాలరాయలు ఈ సంస్థానాధీశుల్లో ‘బహిరీ’ పొందిన తొలి వ్యక్తి. ఇతడికి అష్టభాషా కవి అనే బిరుదు ఉండేది. ఈయనను అష్టభాషా గోపాలరాయ అని చరిత్రకారులు వ్యవహరించేవారు. శృంగార మంజరీ బాణం (సంస్కృత) గ్రంథాన్ని, రామచంద్రోదయం అనే కావ్యాన్ని రచించాడు. ఈయన దత్తపుత్రుడు మూడో వెంకటరెడ్డి కూడా సుప్రసిద్ధుడే. ఇతడు దిల్లీ సుల్తానుల నుంచి ‘సవై’ బిరుదు పొందాడు. తన దత్తత తండ్రి పేరున గోపాలపేట సంస్థానాన్ని స్థాపించాడు. నూగూరు సంస్థానంలోని 12 గ్రామాలు అందులోకి చేర్చి దానికి తన సోదరుడు రంగారెడ్డిని పాలకుడిగా నియమించాడు. మొగలుల అస్తవ్యస్త పరిస్థితిని ఆసరాగా చేసుకుని పన్ను చెల్లించడం ఆపేశాడు. దాంతో సుల్తాన్‌ చేసిన దాడిలో ఓడిపోయాడు. ఆ అవమానంతో 1711లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి కాలంలో ముద్రించిన నాణేలు నూగూరి సిక్కాలు. ఇవి సంస్థానానికి గొప్ప పేరు తెచ్చాయి. 

  ఈ వంశంలో మొదటి రామకృష్ణారావు కూడా ప్రసిద్ధుడు. ఇతడు 1817లో నిజాం నుంచి ‘రాజ బహద్దూర్‌’ బిరుదు పొందాడు. ఈయన రాజధానిని నూగూరు నుంచి వనపర్తికి మార్చాడు. రామకృష్ణారావు దత్తపుత్రుడు ఒకటో రాజా రామేశ్వరరావు అందరికంటే గొప్పవాడు. ఇతడు ఆధునిక భావాలు ఉన్న పాలకుడు. దళితులతో సహపంక్తి భోజనాలు చేసేవాడు. 1802లో బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన రెవెన్యూ సెటిల్‌మెంట్‌ను అమలుచేసి రైతులకు పట్టాలు ఇచ్చాడు. ఆ విధంగా తెలంగాణలో రైతులకు పట్టాలిచ్చిన తొలి సంస్థానం వనపర్తిగా నిలిచింది. సాలార్‌జంగ్‌ కంటే ముందే ఇక్కడ సంస్కరణలు అమలయ్యాయి. తన మేనల్లుడికి విలియం వహాబ్‌ అనే ఇంగ్లిషు, ఉర్దూ మిశ్రమ నామం పెట్టి సామరస్యాన్ని ప్రోత్సహించాడు. నిజాం సర్వ సైన్యాధ్యక్ష పదవిని, ఆంగ్లేయుల నుంచి ‘హిజ్‌ హైనెస్‌’ (ఘనత వహించిన) అనే బిరుదును పొందాడు. అనేక సంఘ సంస్కరణలను ప్రోత్సహించాడు. కందుకూరి వీరేశలింగం కంటే ముందే రామేశ్వరరావు ప్రథమాంధ్ర సంఘ సంస్కర్త అని సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నాడు. 

  మరో ముఖ్య పాలకుడు రెండో రాజా రామేశ్వరరావు. ఈయన వ్యవసాయాభివృద్ధికి చెరువులను తవ్వించాడు. గొప్ప భాషా పోషకుడు. 1870లో బ్రహ్మవిద్యా విలాస ముద్రాక్షరశాల అనే ప్రింటింగ్‌ ప్రెస్‌ను ఏర్పాటుచేసి అనేక గ్రంథాలను అచ్చు వేయించాడు. ఈయన పెద్దకుమారుడైన శ్రీకృష్ణదేవరాయలు మునగాల సంస్థానాదీశుడి కుమార్తె అయిన సరళాదేవిని వివాహం చేసుకొని, ఆమె పేరు మీద సరళాసాగర్‌ తటాకాన్ని నిర్మించాడు. మూడో రామేశ్వరరావు కాలంలో వనపర్తి సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైంది. వీరు అనేకమంది కవులను పోషించారు. పెన్గలూరి వెంకటాద్రి కవి రఘునాయక శతకం, రామోదాహరణం, చెన్నకేశవ శతకం, భువన మోహినీ విలాసం, గంగాపురి లాంటి రచనలు చేశాడు. వీరరాఘవార్యులు వీర రాఘవీయ వ్యాఖ్య; విక్రాల నరసింహా చార్యులు కల్యాణి, భారతీస్తుతి; అక్షింతల సుబ్బాశాస్త్రి భాష్యార్థ రత్నమాల రచించారు. అర్చకం అయ్యమాచార్యులు గద్వాల చెన్నకేశవ శతకం, పెద్దమందడి చెన్నకేశవ విలాసం, రామేశ్వర విజయం అనే గ్రంథాలను రచించాడు. హోసదుర్గం కృష్ణమాచార్యులు రామేశ్వర విజయచంపు, అలంకార మణిహారం, ఉన్మత్త పాండవం, కేశవోత్సవ మాలిక, ప్రసన్నానందలహరి, రఘునాథ విజయం, శ్రీకృష్ణ పంచ రత్నమాల, శ్రీనివాస విలాసం, శ్రీరామాయణ వైభవం గ్రంథాలను రచించాడు. రాజమన్నారు కవి రాజవంశ రత్నావళి, నెమలూరి వెంకటశాస్త్రి వనపర్తి సంస్థాన చరిత్ర; మానపల్లి రామకృష్ణ కవి నీతిసార ముక్తావళి, కుమార సంభవం, సకలనీతి సమ్మతం లాంటి గ్రంథాలు రచించాడు. 

 

జటప్రోలు 

  జటప్రోలు (కొల్లాపూర్‌) సంస్థానం ప్రస్తుత నాగర్‌ కర్నూలు జిల్లాలో ఉంది. అప్పట్లో ఈ సంస్థానం వైశాల్యం 191 చదరపు మైళ్లు. దీనిలో 89 గ్రామాలు ఉండేవి. ఈ సంస్థాన పాలకులు పద్మనాయకులు. ఈ వంశానికి మూలపురుషుడు చెవ్విరెడ్డి (భేతాళ నాయకుడు). ఈయనకు 13వ తరం వాడైన మాదానాయుడు జటప్రోలు సంస్థానానికి మూలపురుషుడు. ఈ సంస్థానం క్రీ.శ.1508లో ప్రారంభమైంది. వీరి ఇంటిపేరు సురభి. ఈ వంశంలో 14వ తరం వాడైన ముల్లానాయకుడు (సురభి మాధవరాయలు) క్రీ.శ.1527లో విజయనగర అలియరామరాయలు నుంచి జటప్రోలు సంస్థానాన్ని కానుకగా పొందాడు. తర్వాత ఈ ప్రాంతం కుతుబ్‌ షాహీల కిందకు వెళ్లింది. మళ్లీ సురభి మాధవరాయల కుమారులు గోల్కొండ సుల్తాన్‌ అబ్దుల్లా కుతుబ్‌షా నుంచి క్రీ.శ.1650లో సనదు రూపంలో జటప్రోలు సంస్థానాన్ని పొందారు. సురభి లక్ష్మణరాయలు తన రాజధానిని క్రీ.శ.1840లో జటప్రోలు నుంచి కొల్లాపూర్‌కు మార్చాడు. నాటి నుంచి ఈ వంశీయులు కొల్లాపూర్‌ ప్రభువులుగా కీర్తి పొందారు. రాజలక్ష్మణ రావు కుమారుడు రాజా లక్ష్మీజగన్నాథరావు (1851 - 1854)కు నిజాం ప్రభువు రాజా బహద్దూర్, నిజాం నవాజ్‌వంత్‌ బిరుదులిచ్చి సత్కరించాడు. ఈ సంస్థాన చివరి పాలకుడు వెంకట జగన్నాథరావు. ఈయన కాలంలోనే కొల్లాపూర్‌ సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైంది. ఈ పాలకులు అనేకమంది కవులను పోషించారు. వెల్లాల సదాశివ శాస్త్రి చంద్రికా పరిణయం (ప్రబంధం), కావ్యాలంకార సంగ్రహ విమర్శనం, ఆంధ్ర దశ రూపక విమర్శనం, వీరభద్రీయ ఖండనం, వెలగోటి వారి వంశ చరిత్రం, సురభి వంశ చరిత్రం, కంఠీరవ చరిత్రం, రామచంద్ర చరిత్రం, నామిరెడ్డి చరిత్రం, యతినిందా నిరాకరణం, రామానుజ గోపాల విజయం లాంటి  గ్రంథాలను రచించాడు. శ్రీధర కృష్ణశాస్త్రి శ్రీరామ మందహాసం (కావ్యం), హోసదుర్గం కృష్ణమాచార్యులు లక్ష్మీ విలాస చంపువు, మదన గోపాల మహత్మ్యం; రాజవేంకట లక్ష్మీరాయ బహదూర్‌ చంద్రికా పరిణయం (నాటకం), సురభి వంశ చరిత్ర అనే గ్రంథాలు రచించారు. యుణయపల్లి కృష్ణమాచార్యులు అష్టప్రాస రామశతకం, నిరోష్ఠ్య కృష్ణ శతకం, జాతక చంద్రిక వ్యాఖ్య, రసజ్ఞానానందం, శ్రీకృష్ణ చంపువు గ్రంథాలు రచించాడు. అక్షింతల సింగర శాస్త్రి అన్నపూర్ణాష్టకం, ద్వాదశ మంజరి, భాస్కర ఖండం అనే గ్రంథాలను రచించాడు.

 

దోమకొండ 

  దోమకొండ సంస్థానం  ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఉంది. బిక్కనవోలు (నేటి బిక్కనూరు) దానికి అప్పట్లో రాజధానిగా ఉండేది. దోమకొండ సంస్థానానికి మూలపురుషుడు కామినేని కాచారెడ్డి. ఈయన బహమనీ సుల్తాన్‌ అహ్మద్‌షా కాలంలో పాలకుడయ్యాడు. కాచారెడ్డి బిక్కనవోలు నగరాన్ని నిర్మించాడు. క్రీ.శ.1784లో రాజన్న చౌదరి ఈ సంస్థాన పాలకుడై తన రాజధానిని బిక్కవోలు నుంచి కామారెడ్డి పేటకు మార్చాడు. ఈయన కుమారుడు  రాజేశ్వరరావు తన రాజధానిని దోమకొండకు మార్చాడు. కామినేడు ఈ వంశానికి ఆద్యుడు కాబట్టి ఆయన పేరున వీరిని కామినేని వంశీయులు అన్నారు. కామినేడు కామిరెడ్డిగా పేరొందారు. ఇతడి పేరుమీదే కామారెడ్డి పట్టణం నిర్మితమైంది. వీరి పేర్ల మీద ఎల్లారెడ్డి, మాచారెడ్డి, జంగంపల్లి, కాచారెడ్డి అనే గ్రామాలు నిర్మితమయ్యాయి. ఈ సంస్థాన పాలకుడు రాజా సోమేశ్వరరావు నిజాం మహబూబ్‌ అలీఖాన్‌ నుంచి ‘బల్వంత్‌’ అనే బిరుదు పొందాడు. ఈ సంస్థానం చివరి పాలకుడు రాజాసోమేశ్వర రావు. ఇతడి కాలంలోనే  సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైంది. వీరి పోషణలో కామినేని మల్లారెడ్డి అనే కవి శివధర్మోత్తరం, షట్చక్రవర్తి చరిత్రం, పద్మపురాణం అనే గ్రంథాలు రచించాడు. ఎల్లారెడ్డి అనే కవి భద్రాయురభ్యుదయం, ఉమాపతి అభ్యుదయం అనే గ్రంథాలు రచించాడు. సోమయాజి అనే కవి సూతసంహిత గ్రంథాన్ని రచించాడు. శేషాద్రి రమణ కవులు, పెద్దయందగి వెంకటకృష్ణ కవి సంయుక్తంగా ‘రెడ్డికుల నిర్ణయ చంద్రిక’ గ్రంథాన్ని రచించారు.

 

పాల్వంచ 

  పాల్వంచ సంస్థానం ప్రస్తుతం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఇది అప్పట్లో ఆరు తాలూకాల పరిధిలో 800 చదరపు మైళ్ల్ల వైశాల్యంతో విస్తరించి ఉండేది. 1927 నాటికి ఈ సంస్థానం జనాభా 40 వేలు. వీరు పద్మనాయకులు. ఈ సంస్థానాధీశులు అశ్వారావులు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి దగ్గర ఉన్న ఒక అశ్వాన్ని లొంగదీసినందుకు వీరికి అశ్వారావు అని బిరుదు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు పాల్వంచ, భద్రాచలం, అశ్వారావుపేట రాజధానులుగా పాలించారు. దిల్లీ పాలకులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత క్రీ.శ.1324లో అప్పన్న అశ్వారావుకు ఈ సంస్థానాన్ని ఇచ్చారు. వీరు దీన్ని క్రీ.శ.1698 వరకు పాలించారు. ఈ వంశీయులు ముసునూరి, పద్మనాయక, బహమనీ, గోల్కొండ సుల్తాన్‌లకు సామంతులుగా పాలించారు. క్రీ.శ.1798లో అసఫ్‌జాహీ పాలకుడైన నిజాం అలీఖాన్, వెంకట్రామ అశ్వారావుకు రాజబహద్దూర్, సవై అనే బిరుదులిచ్చి సనదు ఇచ్చాడు. ఆ తర్వాత పాలించిన పార్థసారథి అప్పారావు హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయ గ్రంథాలయ స్థాపకుల్లో ఒకరు. చివరి పాలకుడు విజయ అప్పారావు. పోలీసు చర్య తర్వాత పాల్వంచ సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైంది. వీరి ఆస్థాన కవి శ్రీనాథుని వెంకటరామయ్య (1700) పాల్వంచ సంస్థాన చరిత్రను అశ్వరాయ చరిత్ర లేదా శ్రీరామపట్టాభిషేకం పేరుతో కావ్యంగా రచించాడు.

 

పాపన్నపేట 

  నిజాం రాష్ట్రంలోని ప్రాచీన సంస్థానాల్లో పాపన్నపేట ఒకటి. ఇప్పుడు మెదక్‌ జిల్లాలో ఉంది. ఫిరోజ్‌షా తుగ్లక్‌ దిల్లీ సుల్తాన్‌గా ఉన్న రోజుల్లో ఈ సంస్థానం ఏర్పడింది. మెతుకుసీమ మొత్తం పాపన్నపేట సంస్థానంలో ఉండేది. ఈ సంస్థాన పాలకుల్లో 12వ తరానికి చెందిన రాణి శంకరమ్మ గొప్ప వీరవనిత. భర్త రాజావెంకట నరసింహారెడ్డి అనంతరం ఈమె సంస్థాన బాధ్యతలు చేపట్టింది. నిజాం రాజ్యభాగాలపై దాడులు చేస్తున్న మహారాష్ట్రులను ధైర్యసాహసాలతో ఎదిరించి అనేకసార్లు జయించి నిజాం ప్రభువు మన్ననలు పొందింది. రాణి శంకరమ్మకు ‘రాయబగన్‌’ బిరుదునిచ్చి సత్కరించి రాజలాంఛనాన్ని నిజాం అందజేశాడు. రాయబగన్‌ అంటే ఆడసింహం వంటి రాణి అని అర్థం. ఈమె వ్యవసాయాభివృద్ధికి చెరువులు, పంట కాల్వలు తవ్వించింది. ఈ సంస్థనాధీశులు సంగారెడ్డి, వెలమకన్నె, రామాయమ్మపేట ప్రాంతాల్లో కోటలు నిర్మించారు. సంగారెడ్డి అనే పాలకుడు పొట్ల చెరువు సంస్థానాన్ని పాలించాడు. రాజరామ చంద్రారెడ్డి చివరి పాలకుడు. 1948 తర్వాత ఈ సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో కలిసిపోయింది. వీరి పోషణలో చిదిరె లక్ష్మణ శాస్త్రి మెదక్‌ సంస్థానాధీశ్వర చరిత్ర రచించాడు.

 

అమరచింత

  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆత్మకూరు సంస్థానం అమరచింత సంస్థానంగా వర్ధిల్లింది.అది ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఉంది. దీని వైశాల్యం అప్పట్లో 190 చదరపు మైళ్లు. పూర్వం ఈ సంస్థానం అమరచింత, వడ్డెమాను (వర్ధమాను) పరగణాలుగా ఉండేది. తొలి రాజధాని తివుడంపల్లి. ఆ తర్వాత వీరు ఆత్మకూరు కేంద్రంగా పాలించారు. ఈ సంస్థానానికి మూలపురుషుడు గోపాలరెడ్డి. ఈయన తిరుపతి ప్రాంతంలోని చంద్రగిరి పట్టణ వాస్తవ్యుడు. ప్రముఖ కవి గోన బుద్దారెడ్డి తిరుపతి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు గోపాలరెడ్డి ఆయనకు సేవలు చేశాడు. దీనికి సంతోషించిన గోన బుద్దారెడ్డి క్రీ.శ.1292లో గోపాలరెడ్డిని వర్ధమానపురానికి పిలిపించి గౌరవించి ఆ ప్రాంతానికి పాలకుడిగా నియమించాడు. మరో ముఖ్య పాలకుడైన చంద్రారెడ్డి గొప్ప దైవభక్తుడు. ఈయన కురుమూర్తి దేవాలయాన్ని నిర్మించాడు. చివరి పాలకురాలు భాగ్యలక్ష్మమ్మ. తర్వాత ఈ సంస్థానం హైదరాబాద్‌ రాష్ట్రంలో కలిసిపోయింది.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

 

Posted Date : 17-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌