• facebook
  • whatsapp
  • telegram

ఇస్లాం మతం-వివాహం

బాధ్యతలతో ముడిపడే బంధం!


సామాజిక వ్యవస్థలో భాగమైన వివాహం ఒక్కో మతంలో ఒక్కోరకంగా ఉంది. ఇస్లాం మతంలో కొన్ని బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన బంధంగా పెళ్లిని భావిస్తారు. అందుకోసం సంప్రదాయబద్ధమైన నిబంధనలు పాటిస్తారు. దంపతులు విడిపోవాలనుకున్నప్పుడూ నిర్ణీత విధానాలను అనుసరిస్తారు. సమాజనిర్మాణం అధ్యయనంలో భాగంగా ఈ వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

ఇస్లాం మతం-వివాహం

ముస్లింలలో వివాహం ఒక ఒప్పంద రూపంలో ఉంటుంది. దీన్ని సునా అంటారు. పెళ్లి చేసుకోబోయే ఇరు పక్షాలు అమలు చేయాల్సిన బాధ్యతగా వివాహాన్ని పరిగణిస్తారు. మహ్మద్‌ప్రవక్త ప్రకారం సంతానాన్ని పొందడానికి, మానవ జాతిని కొనసాగించడానికి, స్త్రీ ప్రేమను స్వీకరించడానికి ఒక మార్గం వివాహం. దీన్ని నిఖా అంటారు. సంతానోత్పత్తి, సంతానాన్ని చట్టబద్ధం చేయడం వివాహ లక్ష్యాలుగా ముస్లింలు భావిస్తారు.

 

వివాహ వ్యవస్థ

ఇస్లాం మతంలో వివాహం కొన్ని నిబంధనలు కలిగి ఉంటుంది.

* ప్రతిపాదన, అంగీకారం ఒకేసారి జరగాలి.

* స్త్రీ, పురుషులిద్దరూ లైంగిక అర్హతను కలిగి ఉండాలి.

* ముస్లిం పురుషుడు పోషించగలిగితే కొన్ని నియమాలను అనుసరించి నాలుగు వివాహాలు చేసుకోవచ్చు. 

* వధూవరులు అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదు.

* ముస్లిం యువతి, ముస్లిం యువకుడిని మాత్రమే వివాహం చేసుకోవాలి. కానీ ముస్లిం యువకుడు భర్త చనిపోయిన యువతిని, క్రైస్తవ, పార్సీ స్త్రీలను కూడా వివాహం చేసుకోవచ్చు.

* తీర్థయాత్రల సమయంలో వివాహాలు నిర్వహించకూడదు.

* తండ్రి సోదరుడి కుమార్తెను, తల్లి సోదరుడి కుమార్తెను వివాహం చేసుకోవచ్చు.

* వధూవరులకు 15 సంవత్సరాలు నిండాలి. లేకపోతే సంరక్షుల అనుమతి తప్పనిసరిగా పొందాలి.

* వధూవరులిద్దరూ సక్రమమైన మానసికస్థితిని కలిగి ఉండాలి.

* మధ్యవర్తిగా ఒక వ్యక్తి వ్యవహరించాలి. అతడిని వలి అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో ఖలీఫా, సుల్తాన్‌ అని కూడా అంటారు. వలిగా వ్యవహరించే వ్యక్తి వారికి దగ్గరి బంధువై ఉండాలి. 

 

వలి లక్షణాలు: 

* ఇస్లాం మతస్థుడై, స్వతంత్ర వ్యక్తిగా ఉండాలి.

* మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.

* పురుషుడై ఉండాలి.

* సక్రమ ప్రవర్తనతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

* నిబంధనల ప్రకారం వయసు నిండి ఉండాలి.

 

వివాహం జరిగే విధానం

ముస్లిం వివాహం సాధారణంగా వధువు గృహంలో జరుగుతుంది. వరుడు బంధుమిత్ర సపరివారంగా వివాహం రోజున వధువు గృహానికి వెళతాడు. వధూవరుల కుటుంబ పెద్దలను పిలిచి ఇమామ్‌ వివాహపరమైన సాక్షి సంతకం చేయిస్తాడు. అనంతరం పెళ్లి ఒప్పంద నిబంధనలు తెలియజేసి అంగీకారం తీసుకుని ప్రార్థన చేస్తాడు. వివాహ వేడుకలో ఖురాన్‌లోని మొదటి అధ్యాయాన్ని చదువుతారు. సహజంగా వివాహానికి పూర్వం వధూవరులు ఒకరినొకరు చూసుకోరు.

 

వివాహం - రకాలు

బీనా వివాహం: మాతృస్వామిక సామాజిక కాలంలో అరబ్బు స్త్రీ తనకు నచ్చిన పురుషుడిని భర్తగా ఎన్నుకునే అర్హత కలిగి ఉండేది. భర్తను తన గృహంలో ఉంచుకోవచ్చు లేదా తోసిపుచ్చవచ్చు.

బాల్‌ వివాహం: పితృస్వామిక సమాజ కాలంలో ఉండేది. భార్య, భర్తతో భర్త గృహాంలోనే జీవించాలి. స్త్రీ అధికారాలన్నీ పురుషుడి అధీనంలో ఉంటాయి.

ముతా వివాహం: దీనిలో కాల ఒప్పందం ముఖ్యమైంది. ఇది ఒక రకమైన తాత్కాలిక వివాహం. వధూవరులు స్వచ్ఛందంగా కొంతకాలాన్ని నిర్ణయించుకొని వివాహం చేసుకుంటారు. ఈ నిర్ణీత కాలపరిమితి తీరిన తర్వాత వివాహం రద్దవుతుంది. ఒకవేళ ఇరువురికి అంగీకారమైతే కాలపరిమితిని పెంచుకోవచ్చు. కాలపరిమితి ఒకరోజు నుంచి అనేక సంవత్సరాలు ఉండవచ్చు. ఈ వివాహాన్ని సున్నీశాఖ ముస్లింలు అంగీకరించరు. షియా శాఖలో ఇది అమల్లో ఉంది.

నిఖా వివాహం: ఈ రకమైన వివాహంలో వధూవరులకు కొన్ని హక్కులు, నిబంధనలను కల్పించారు. ఈ వివాహం ప్రస్తుతం అధికశాతం అమల్లో ఉంది. 

మెహర్‌: ముస్లిం వివాహ వ్యవస్థలో ఇది ప్రాముఖ్యమైన అంశం. మెహర్‌ అంటే వివాహ సమయంలో  వరుడి నుంచి వధువు పొందే కట్నం వంటిది. దీన్ని కన్యాశుల్కంగా భావించకూడదు. తనను భర్తగా అంగీకరించినందుకు పురుషుడు స్త్రీపై చూపించే గౌరవంగా చూడాలి. 

 

మెహర్‌ను కింది విధంగా వర్గీకరిస్తారు.

నిర్ణయమైన మెహర్‌: ఈ రకమైన మెహర్‌ను వివాహానికి పూర్వమే నిర్ణయిస్తారు.

మెహర్‌ మోజ్‌ల్‌: ఇది వివాహానికి, వివాహం అనంతరం భార్య కోరికపై ఆధారపడి ఉంటుంది. 

యువజ్జల్‌ మెహర్‌: దీని ప్రకారం వివాహం జరిగిన వెంటనే నిర్ణయించి భార్యకు ఇస్తారు.

వివాహం రద్దయిన తర్వాత మెహర్‌: ఇది మరణం లేదా విడాకుల ద్వారా గానీ వివాహం రద్దవడంతో నిర్ణయించే మెహర్‌.

యుక్త వయసు పొందిన తర్వాత ఇచ్చే అవకాశం: ఖురాన్‌ (హిదయ) ప్రకారం బాలబాలికలకు యుక్త వయసు 12, 9 సంవత్సరాలు నిర్ణయించారు. ఈ వయసు వారికి వివాహం జరిపిస్తే, యుక్త వయసు వచ్చిన తర్వాత వారికి ఇష్టం లేకపోతే ఆ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఇద్దరికీ ఉంటుంది. దీన్నే ఆప్షన్‌ ఆఫ్‌ ప్యూబర్టీ అంటారు.

 

మహమ్మద్‌ ప్రవక్త 

మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించారు. క్రీ.శ.570 లో మక్కాలో జన్మించారు. ఈయన అల్‌అమీన్‌ (దేవుడితో సమానం) ఖురైషి వంశంలో జన్మించారు.  బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 25 ఏళ్ల వయసులో 40 ఏళ్లు నిండిన ఖదీజా అనే సంపన్న వితంతువును వివాహం చేసుకున్నారు. తనకు 40 ఏళ్లు వచ్చే వరకు సామాన్య గృహస్థ జీవనం గడిపిన తర్వాత ఉన్నత సత్యాలు, మత సమస్యల గురించి ధ్యానం చేశారు. దేవుడు ఒక్కడేనని, అతడే విశ్వసృష్టి కర్త అని బోధించారు. క్రీ.శ.612లో ఇస్లాం మతాన్ని స్థాపించారు. అయితే ఈయన స్థాపించిన ఇస్లాం ప్రభోదాలకు అప్పటి సమాజంలో వ్యతిరేకభావం పెరగడంతో ఎత్‌రిబ్‌కు వలస వెళ్లాడు. తర్వాత ఆ ప్రదేశానికి మదీనా అని పేరు పెట్టారు. మొదటి మసీదును ఇక్కడే నిర్మించారు. మహమ్మద్‌ ప్రవక్త వారసుడిని ‘ఖలీఫా’ అంటారు. ప్రవక్తకు కుమారులు లేరు. తన మామ కుమారుడు అలీని వారసుడిగా గుర్తించి కూతురు ఫాతిమాను ఇచ్చి వివాహం చేశారు. ప్రవక్త మిరాజ్‌ (స్వర్గం నుంచి పిలుపు) దశకు చేరేవరకు అలీలో ఖలీఫా అయ్యే లక్షణాలు కనిపించలేదు. దాంతో ప్రవక్త భార్య అయేషా తండ్రి అబుబాకర్‌ను ఖలీఫాగా ప్రకటించారు. దీని వల్ల ఇస్లాంలో చీలిక ఏర్పడింది. అబుబాకర్‌ ప్రవక్త ప్రవచనాలను సేకరించి పుస్తకంగా (ఖురాన్‌) మలిచాడు. 

* ఖురాన్‌లో 30 భాగాలు, 114 సూరాలున్నాయి. ఖురాన్‌ (అల్లావాణి), సున్నత్‌ (ఆచారం)ను కలిపి ముస్లిం చట్టం అంటారు. 

* క్రీ.శ.7వ శతాబ్దంలో ఆదిమ అరబ్బీ సమాజం నుంచి ఇస్లాం మతం ఉద్భవించింది. ఏకో భగవాన్, సర్వమానవ సమానత్వం, సహోదరత్వం ఈ మతానికి మూలాధారాలు.

 

మతం - సూత్రాలు

* అల్లా ఒక్కడే భగవంతుడు.

* ఈ లోకంలో మహమ్మద్‌ అల్లాహ్‌ పంపిన ప్రవక్త.

* ఖురాన్‌ పవిత్ర గ్రంథం.

* ప్రతిరోజు అయిదుసార్లు నమాజ్‌ చేయాలి.

- ఫజర్‌ - సూర్యోదయం ముందు (6:30)

- జుహర్‌ - మధ్యాహ్నం (12:30)

- అసర్‌ - సాయంత్రం (04:30)

- మఖరిబ్‌ - సూర్యాస్తమయం తర్వాత (06:30)

- ఇషా - రాత్రివేళ (08:00)

(ప్రాంతాన్ని బట్టి నమాజ్‌వేళల్లో మార్పు ఉంటుంది)

* రంజాన్‌లో నెలపాటు రోజా పాటిస్తారు.

* ప్రతి ముస్లిం తన జీవితకాలంలో మక్కాయాత్ర (హజ్‌) చేయాలి. కాబా అత్యంత పవిత్రమైంది. దీని చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు.

* ఆదాయంలో 1/40వ వంతు దానధర్మాలకు వినియోగించాలి.

 

ఇస్లాం మతం - శాఖలు

ఇస్లాం మతంలో శాఖలు ఏర్పడటానికి ప్రధాన కారణం ఖలీఫా పదవి. 

సున్నీలు: అబుబాకర్‌ను, అతడి వారసులను ఖలీఫాలుగా ఆమోదించిన వారిని సున్నీలు అంటారు. మహమ్మద్‌ మాటలు, చర్చలను అనుసరిస్తూ వచ్చిన ఆచారాన్నే సున్నీగా పిలుస్తారు. ప్రవక్త ప్రవచనాల్లో అంగీకార యోగ్యమైన వాటిని నిర్ణయించడాన్ని ఇజ్‌మా అంటారు. వీరు అరేబియా, జోర్డాన్, సిరియా, ఆసియా మైనర్, ఈజిప్టు, అఫ్గానిస్థాన్‌, భారత్, చైనా, ఆఫ్రికాలో ఉన్నారు. సున్నీల్లో సయ్యద్‌లు, షేక్‌లు, మొగలులు, పఠాన్‌లు ఉంటారు. ప్రపంచంలో సున్నీ శాఖవారే అత్యధికంగా ఉన్నారు. క్రైస్తవ మతం ప్రపంచంలో అతిపెద్ద మతం కాగా రెండోది ముస్లింలలోని సున్నీ శాఖ.

షియాలు: అబుబాకర్, అతడి వారసులను ఖలీఫాలుగా అంగీకరించని వారిని షియాలు అంటారు. అలీ వారసుడు ఇమామ్‌ ముస్లింలకు ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన నిర్ణయాలను పాటించాలని, ఆయనకు దైవ లక్షణాలు ఉన్నాయని షియాల నమ్మకం. షియాలు ఇజ్‌మాను నిరాకరించారు. ఇరాన్, భారత్‌లలో వీరు ఎక్కువగా ఉండి సూఫీ వాదాన్ని (మనసును పవిత్రం చేసుకోవడానికి కోరికలకు దూరంగా ఉండటం) పాటిస్తారు.

* మొహర్రం రోజున హైదరాబాదులోని ‘బీబికా ఆలం’ ప్రాంతంలో మాతం (రక్తతర్పణం) నిర్వహిస్తారు. 

ఖవంజు శాఖ: మత విశ్వాసంతో యోగ్యమైన జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే ఖలీఫా పదవికి అర్హుడని వీరు నమ్ముతారు. ఇవేకాకుండా ఖదరు, మర్జీ శాఖలు కూడా ఉన్నాయి. 

 

వివాహం - విడాకులు

ఒకే భార్యను కలిగి ఉండాలని ఖురాన్‌ తెలియజేసింది. కానీ తర్వాత కాలంలో బహు భార్యత్వాన్ని ఆమోదించింది. అయితే సమాజ సంక్షేమం దృష్ట్యా భార్యల సంఖ్యను నాలుగుకు పరిమితం చేసింది. ముస్లిం వివాహ వ్యవస్థలో స్త్రీ విడాకులు పొందడం చాలా కష్టం. పురుషుడు తేలికగా స్త్రీకి విడాకులు ఇవ్వగలడు. 

తలాక్‌ అహ్‌సాన్‌: ఈ విధానంలో భర్త, భార్యతో తలాక్‌ అని చెప్పిన మూడు నెలల వరకు ఇరువురి మధ్య లైంగిక సంబంధం లేకపోతే విడాకులు అమలైనట్లు భావిస్తారు. 

తలాక్‌ ఇహసాన్‌: ఇందులో బహిష్టు కాలసమయం లోపల భార్యతో భర్త మూడు సార్లు తలాక్‌ అనే పదాన్ని చెప్పి విడాకులు పొందవచ్చని పేర్కొన్నారు.

జీహార్‌: ఈ రకమైన విడాకుల్లో భార్యని తన తల్లిగా, సోదరిగా భావిస్తూ ఆమెతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడు. ఈ భావనను భర్త మార్చుకోలేనప్పుడు విడాకులు అమలు చేస్తారు. 

ఇలా: భర్త నాలుగు నెలల పాటు భార్యతో లైంగిక సంభోగం జరపనని ప్రమాణం చేసి దానికి కట్టుబడి ఉంటే వివాహం రద్దవుతుంది. 

లియాన్‌: భర్త లేదా భార్య ఒకరిపై ఒకరు వ్యభిచార నేరారోపణ చేసుకొని, వాటిని విరమించుకోకపోతే వారి వివాహం రద్దవుతుంది.

ఖులా:  భార్య తనను వివాహ బంధం నుంచి విముక్తిరాలిని చేయమని భర్తకు కొంత ధనం ఇస్తుంది. అందుకు అతడు అంగీకరిస్తే వివాహం రద్దవుతుంది. 

ముభారత్‌: భార్య, భర్త పరస్పర అవగాహన ద్వారా విడాకులు అమలు చేస్తారు. 

ముస్లిం వివాహచట్టం 1939 ప్రకారం ఇస్లాం కింది పరిస్థితుల్లో విడాకులు పొందే హక్కులను స్త్రీకి కల్పించింది.

* భర్త నాలుగేళ్లపాటు కనిపించకపోవడం.

* రెండేళ్లపాటు భార్యను భర్త పోషించలేనప్పుడు.

* భర్తకు ఏడేళ్ల కారాగార శిక్ష పడినప్పుడు.

* సరైన కారణం లేకుండా భార్యతో భర్త లైంగిక సంబంధాలను కలిగిలేనప్పుడు.

* భర్త లైంగిక సంపర్కానికి అనర్హుడిగా ఉన్నప్పుడు. మతిస్థిమితం సరిగా లేనప్పుడు.

* భర్త క్రూర ప్రవర్తన కలిగి, దీర్ఘకాలిక రోగాలు కలిగి ఉన్నప్పుడు.

 

బంధుత్వం - వారసత్వం

ముస్లిం సామాజిక వ్యవస్థలో పురుషుడు కుటుంబ పెద్దగా వ్యవహరిస్తాడు. కుటుంబ పోషణ బాధ్యతను అతడే స్వీకరించాలి. ఖురాన్‌ ప్రకారం కుటుంబసభ్యులు తమ అధికారాలను చెడు కోసం వాడకూడదు. కుటుంబ సభ్యుల అవసరాల్ని తీరుస్తూ ఇస్లాం మత ప్రభోదాన్ని సభ్యులకు తెలియజేయాలి.

వారసత్వం: తండ్రి ఆస్తిలో కుమార్తెకు 1/3వ వంతు ఆస్తి సంక్రమిస్తుంది. భర్త మరణించినప్పుడు భార్యకు సంతానం లేకపోతే 1/45వ వంతు, సంతానం ఉంటే 1/8వ వంతు ఆస్తిని పొందుతుంది. 

 

ఇస్లాం -  స్త్రీలు

ఇస్లాంలో స్త్రీ పురుషుడితో సమానంగా గౌరవించబడుతుంది. 

పర్ధా: ముస్లింలలో పర్ధా కట్టుబాటు మతపరమైంది. తమను తాము కాపాడుకోవడానికి వీలుగా ఎల్లప్పుడు ముసుగు ధరించాలని ఖురాన్‌ పేర్కొంది. మధ్యయుగ కాలంలో పర్ధా కట్టుబాటు ప్రభావం హిందూ స్త్రీలపై పడటం వల్ల వారూ ముసుగులు ధరించారు. 

* ముస్లిం స్త్రీలు కూడా విద్యనభ్యసించవచ్చు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చూడవచ్చు. 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ భారతీయ సమాజ నిర్మాణం

‣  కుటుంబం

‣ భారతీయ సమాజం

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 16-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌