• facebook
  • whatsapp
  • telegram

మౌర్య సామ్రాజ్యం

భారతదేశ చరిత్రలో మౌర్య సామ్రాజ్యం తొలి ఏకీకృత సామ్రాజ్యంగా పేరొందింది. ఈ వంశానికి చెందిన అశోకుడు తొలి జాతీయ చక్రవర్తిగా పేరు పొందాడు. మౌర్యులు సుమారు 500 సంవత్సరాల పాటు భారత దేశాన్ని సమర్థవంతంగా పాలించారు. దేశ చరిత్ర, సంస్కృతికి ఎనలేని సేవలు చేశారు. అప్పటి రాజులు చేసిన పరిపాలనా విధానాలు నేటికీ కొనసాగుతున్నాయంటే వారి పాలన ఎంత గొప్పదో తెలుస్తుంది. మౌర్యుల పరిపాలనా విధానాలు, రాజకీయ చరిత్ర, సాంఘిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులు మొదలైన అంశాలపై పోటీపరీక్షార్థులకు అవగాహన అవసరం.


రాజకీయ చరిత్ర

    మౌర్య సామ్రాజ్యాన్ని క్రీ.పూ.321లో చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. ఆయన అనంతరం బిందుసారుడు, అశోకుడు మొదలైన రాజులు పాలించారు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రధుడ్ని క్రీ.పూ.184లో పుష్యమిత్ర శుంగుడు ఓడించాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం అస్తమించి శుంగవంశ పాలన ప్రారంభమైంది. 


చంద్రగుప్త మౌర్యుడు 

    మౌర్యవంశ సామ్రాజ్య స్థాపకుడిగా చంద్రగుప్త మౌర్యుడిని చరిత్రకారులు పేర్కొంటారు. ఈయన క్రీ.పూ.321 నుంచి 297 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి ప్రాభవం, పరిపాలనా, వంశ స్థాపన గురించి అప్పటి బౌద్ధ సాహిత్యంలో ఎక్కువ వివరాలు ఉన్నాయి. చంద్రగుప్తుడు ‘ముర’ అనే స్త్రీకి జన్మించాడని, అందువల్లే ఇతడి వంశానికి ‘మౌర్యవంశం’ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు వివరించారు. విశాఖదత్తుడు రచించిన ‘ముద్రా రాక్షసం’ గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు తక్కువ కులానికి చెందినవాడని ఉంది. పాటలీపుత్ర వీధుల్లో రాసక్రీడ ఆడుతున్న చంద్రగుప్తుడిని చూసిన కౌటిల్యుడు అతడ్ని గొప్ప యోధుడిగా భావించాడు. కౌటిల్యుడి సహాయంతోనే చంద్రగుప్తుడు మౌర్యరాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు అనేక దండయాత్రలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 

రెండు ప్రధాన విజయాలు: ఖి. చివరి నందవంశపు రాజైన ధననందుడ్ని ఓడించి మగధను ఆక్రమించాడు. ఖిఖి. గ్రీకు పాలకుడైన సెల్యూకస్‌ నికేటర్‌ను ఓడించి వాయవ్య భారతదేశంపై ఆధిపత్యం సాధించాడు. సెల్యూకస్‌ నికేటర్‌ తన కుమార్తె హెలీనాను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.

    మెగస్తనీస్‌ను గ్రీకు రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి సెల్యూకస్‌ నికేటర్‌ పంపాడు. మెగస్తనీస్‌ రచించిన ఇండికా గ్రంథం అప్పటి చరిత్రకు ఆధారంగా ఉంది. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి పాలనా కాలంలో జైనమతాన్ని స్వీకరించి కర్ణాటకలోనిశ్రావణ బెలగోళ వద్ద సల్లేఖనవ్రతం ఆచరించి మరణించాడు. గుజరాత్‌లోని కథియవాడ్‌ ప్రాంతంలో పుష్యగుప్తుడి ఆధ్వర్యంలో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు.


బిందుసారుడు

    చంద్రగుప్త మౌర్యుడి తర్వాత అతడి కుమారుడైన బిందుసారుడు రాజ్యాన్ని పాలించాడు. ఇతడికి అమిత్రఘాత/ అమిత్రో ఖేటస్‌ అనే బిరుదులు ఉన్నాయి. బిందుసారుడు రెండు సముద్రాల మధ్య ఉన్న భూభాగాన్నంతా జయించాడని టిబెట్‌ చరిత్రకారుడైన తారానాథ్‌ పేర్కొన్నాడు. ఇతడి సామ్రాజ్యం దక్షిణ మైసూర్‌ వరకు విస్తరించి ఉంది. ఇతడి కాలంలో సిరియా రాయబారి డెమాకస్‌ భారతదేశాన్ని సందర్శించాడు. తన రాజ్యానికి తియ్యటి మద్యం, ఎండిన అత్తిపళ్లు, ఒక తర్కవాదిని పంపమని సిరియా రాజైన మొదటి ఆంటియోకస్‌ను బిందుసారుడు కోరాడు. ఈయన అజీవక మతశాఖను ప్రోత్సహించాడు. ఈ మతానికి చెందిన పింగళి వత్సలుడు బిందుసారుడి ఆస్థానంలో జ్యోతిష్యుడిగా ఉన్నాడు. ఇతడు అశోకుడు గొప్ప చక్రవర్తి అవుతాడు అని చెప్పాడు.


అశోకుడు 

    బిందుసారుడి తర్వాత అతడి కుమారుడైన అశోకుడు రాజయ్యాడు. ఇతడు క్రీ.పూ.273 లోనే రాజయినప్పటికీ, పట్టాభిషేకం క్రీ.పూ. 268లో జరిగింది. అశోకుడు క్రీ.పూ. 273 నుంచి క్రీ.పూ. 232 వరకు పాలించాడు. ఈయన దేవానాంప్రియ, ప్రియదర్శి లాంటి బిరుదులతో ప్రసిద్ధి చెందాడు. 1915లో బయటపడిన మస్కి శాసనంలో రాణ్య అశోక్‌ అనే పేరు ఉంది. మస్కి శాసనాన్నే కనగనహళ్లి శాసనంగా కూడా పేర్కొంటారు. బిందుసారుడు రాజుగా ఉన్న సమయంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు గవర్నర్‌గా పనిచేశాడు. ఆ సమయంలోనే అతడు తక్షశిలలో జరిగిన ప్రజా తిరుగుబాటును అణిచివేశాడు. 

    అశోకుడు క్రీ.పూ. 261లో కళింగ యద్ధాన్ని చేశాడు. అప్పటి కళింగ పాలకుడైన అనంత పద్మనాభుడ్ని ఓడించి కళింగను ఆక్రమించాడు. అశోకుడి 13వ శిలాశాసనం (ధౌళి/ జౌగాడ శాసనం) కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది. దీని తర్వాతే అశోకుడు ఇకపై యుద్ధం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచంలో యుద్ధంలో గెలిచి, యుద్ధాన్ని పరిత్యజించిన ఏకైక పాలకుడు అశోకుడే అని చరిత్రకారులు వ్యాఖ్యానించారు.


బౌద్ధమత సేవ

    కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈయన గురువుగా ఉపగుప్తుడిని పేర్కొంటారు. ఈయన బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు బబ్రూ శాసనంలో ఉంది. బౌద్ధమత ప్రచారం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. తన కుమారుడు మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్రలను సింహళ (శ్రీలంక)కు పంపి మత ప్రచారం చేయించాడు. సోనా, ఉత్తర అనేవారిని బర్మాకు పంపాడు. 

    అశోకుడు బౌద్ధమత వ్యాప్తికి క్రీ.పూ. 250లో మొగలిపుతతిస్స అధ్యక్షతన పాటలీపుత్రలో మూడో బౌద్ధసంగీతిని నిర్వహించాడు. ఈ సమావేశంలోనే త్రిపీటకాల్లో ఒకటైన అభిదమ్మ పీటకాన్ని సంకలనం చేశారు. రాజ్యమంతా సుమారు 84వేల బౌద్ధ స్తూపాలు వేయించాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న సాంచీస్తూపం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సారనాథ్‌ స్తూపాలను అశోకుడు వేయించాడు. భారత జాతీయ చిహ్నం అయిన సింహతలాటం సారనాథ్‌ స్తూపంనుంచే స్వీకరించారు.


ధమ్మ సిద్ధాంతం

    అశోకుడు ప్రచారం చేసిన నైతిక నియమాలను ధమ్మ సిద్ధాంతంగా పేర్కొంటారు. ఇది ఒక కొత్త జీవన విధానంగా ప్రచారం చేశాడు. ధమ్మ సిద్ధాంతాల ప్రచారం కోసం అశోకుడు ధర్మమహామాత్రులు అనే ప్రత్యేక ఉద్యోగులను నియమించినట్లు అయిదవ ప్రధాన శిలాశాసనం పేర్కొంటుంది. ఇందులోని అంశాలు ఎంతో విశాలమైనవి, మానవీయమైనవి. ప్రజాజీవనంలో శాంతి భద్రతలు, చట్టాలను గౌరవించడానికి ఈ విధానం ఎంతో తోడ్పడింది. జంతు బలులు, జాతరలను నిషేధించాడు ్బ1వ ప్రధాన శిలాశాసనం). సామాజిక సంక్షేమం అందించాలని; బ్రాహ్మణులు, శ్రామికుల పట్ల ఉదారత చూపాలని; అహింసను పాటించాలని; సేవకులు, బందీలను మానవతా దృక్పథంతో చూడాలని అశోకుడు తన ధమ్మ సిద్ధాంతంలో పేర్కొన్నాడు. 

    అశోకుడు బౌద్ధమతాన్ని రాజ్యమతంగా చేసినప్పటికీ పరమత సహన విధానాన్ని అనుసరించాడు. అజీవక మతస్థులకు అనేక దానధర్మాలు చేశాడు. కేంద్రీయపాలనను సుస్థిరంగా కొనసాగించడానికి, రాజకీయ ఐక్యతను కాపాడుకోవడానికి, అన్ని మత శాఖల మద్దతును పొందడానికి అశోకుడు ఈ ధమ్మ సిద్ధాంతాన్ని అవలంబించాడని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. 

    అశోకుడి ధమ్మ సిద్ధాంతం ఒక విశ్వమతం అని ఆర్‌ఎస్‌ త్రిపాఠి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు. ఆర్‌జీ భండార్కర్‌ అనే భారతీయ చరిత్రకారుడు అశోకుడి ధమ్మవిధానం ఒక లౌకిక బౌద్ధ మతం అని పేర్కొన్నాడు. అందువల్లే ధమ్మవిధానం ఒక నూతన సిద్ధాంతంలా కాకుండా ఒక జీవన విధానంగా పేరొందింది.


ఇతర అంశాలు

    అశోకుడు గొప్ప పరిపాలనాదక్షుడు, భవననిర్మాతగా పేరొందాడు. అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాడు. రాజ్యమంతా రహదారులు వేయించి, రెండువైపులా చెట్లు నాటించాడు. బావులు తవ్వించి, సత్రాలను కట్టించాడు. విదేశీయులతో కూడా స్నేహపూర్వక ఒప్పందాలు చేసుకున్నాడు. సిరియా, ఈజిప్ట్, సింహళం (శ్రీలంక) లాంటి విదేశీ దేశాలు తమ రాయబారులను అశోకుడి ఆస్థానానికి పంపారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌ను అశోకుడే నిర్మించినట్లు కల్హణుడి రాజతరంగణి గ్రంథం పేర్కొంది.


మౌర్య సామ్రాజ్య పతనం - కారణాలు

    అశోకుడి తర్వాత అతడి వారసులైన కునాలుడు, జలౌకుడు, దశరథుడు మౌర్య సామ్రాజ్యాన్ని పాలించారు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రధుడ్ని అతడి మంత్రి పుష్యమిత్ర శుంగుడు ఓడించి శుంగ వంశాన్ని స్థాపించాడు. దీంతో మౌర్యసామ్రాజ్యం పతనమైంది.

    అశోకుడి అనంతరం బలహీన పాలకులు రాజులు కావడం వల్ల సామ్రాజ్యం పతనమైంది. ముఖ్యంగా అశోకుడి విధానాలే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం అని ఆధునిక చరిత్రకారులు వ్యాఖ్యానించారు. జంతుబలులు నిషేధించడం, బ్రాహ్మణుల ప్రత్యేక హక్కులను నిలిపివేయడం, బౌద్ధమతాన్ని రాజ్యమతంగా చేయడం లాంటి కారణాలతో బ్రాహ్మణులు ఎదురుతిరిగారని, కాబట్టి బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శుంగుడు తర్వాతికాలంలో మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం అయ్యాడని చరిత్రకారులు భావించారు. అది పూర్తిగా సత్యంకాదు. ఎందుకంటే అశోకుడు తన ధమ్మ విధానంలో బ్రాహ్మణుల పట్ల ప్రత్యేక ఆదరణ చూపాలని, గౌరవించాలని పేర్కొన్నాడు. అశోకుని అనంతరం వచ్చిన పాలకుల బలహీనతే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ బలహీనమైంది. దీంతో సామంత పాలకులు స్వతంత్రులయ్యారు. సామ్రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్ల బలహీనపడింది. దీంతో వాయవ్యం నుంచి గ్రీకులు; దక్షిణం నుంచి శాతవాహనులు దండయాత్ర చేశారు. అశోకుడు నియమించిన ధర్మమహామాత్రులు అనంతర కాలంలో సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్ల మౌర్య సామ్రాజ్యం పతనం చెందింది. రాజ ప్రతినిధుల్ని, స్థానిక అధికారుల్ని నియమించడంలో సరైన విధానాలు పాటించక పోవడం కూడా పతనానికి కారణం అయ్యింది.

 

మౌర్యయుగ విశేషాలు
భారతదేశ చరిత్రలో తొలి విశాల సామ్రాజ్య నిర్మాతలుగా మౌర్యులు పేరుపొందారు. వీరు సమర్థవంతమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. మౌర్యుల కాలంలో అనుసరించిన పాలనా విధానాలే నేటికీ కొనసాగడం విశేషం. వీరు ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక నూతన విధానాలను అమలు చేశారు. ముఖ్యంగా భారతదేశ వాస్తు, కళారంగాల అభివృద్ధికి నాంది పలికారు. అప్పటి సమకాలీన సాహిత్యం, శాసనాల్లో మౌర్యులు చేసిన విశేష సేవలకు సంబంధించిన వివరణ ఉంది.


పరిపాలనా సంస్కరణలు
    మౌర్యులు కేంద్రంలో ఉన్నతస్థాయి కేంద్రీకృత విధానాలను అనుసరించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలు - విషయాలు - గ్రామాలుగా విభజించారు. కేంద్ర పాలనలో చక్రవర్తి సర్వాధికారి. నిరంకుశ పాలన, కేంద్రీకృత విధానాలను అమలు చేసినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం వీరు ప్రాజ్ఞ నిరంకుశ పాలన కొనసాగించారు. చక్రవర్తికి పరిపాలనలో సహాయం కోసం వివిధ స్థాయుల్లో ఉన్న మంత్రులు లేదా తీర్థులు ఉండేవారిని కౌటిల్యుడి అర్థశాస్త్రం వివరిస్తుంది. సన్నిదాత, సమాహర్త, దండపాల, అక్ష పటలిక లాంటి అనేక మంది మంత్రుల పేర్లు అప్పటి శాసన, సాహిత్యాలకు సంబంధించిన ఆధారాల్లో లభ్యమయ్యాయి. 

*  మౌర్య సామ్రాజ్యంలో అనేక పరిపాలనా శాఖలు ఉండేవని, ప్రతి శాఖకు సంబంధిత అధికారులు నిర్దిష్టమైన అధికారాలను చెలాయించేవారని వి.ఎ.స్మిత్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు.
* మౌర్యులు కేంద్ర పాలనతో పాటు రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. అప్పట్లో రాష్ట్రాలను ఆహారాలు లేదా ప్రాంతాలుగా పిలిచేవారు. రాజ వంశీయులు లేదా యువరాజులు రాష్ట్ర పాలకులుగా నియమితులయ్యేవారు. వారిని ఆర్యపుత్రులు లేదా గవర్నర్‌లుగా పేర్కొన్నారు.
* బిందుసారుడి పాలనాకాలంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తరువాత తక్షశిలకు పాలకుడి (గవర్నర్‌/ ఆర్యపుత్ర)గా నియమితుడయ్యాడు. సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాలకు కుమారామాత్యులు అనే అధికారులను నియమించారు. సమర్థులు, మంచివారినే రాష్ట్రాల పాలకులుగా నియమించేవారు. కేంద్ర, రాష్ట్ర పాలనలో సమాచారాన్ని అందించడానికి గూఢచారి వ్యవస్థ ఉండేది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మౌర్యుల కాలం నాటి గూఢచారుల గురించి ప్రస్తావించాడు. 
* మౌర్యులు స్థానిక, నగర పాలనలో అనేక పరిపాలనా మార్పులు తీసుకొచ్చారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో స్థానిక పాలన బాగా వృద్ధి చెందింది. పాటలీపుత్ర లాంటి నగరాల్లో మున్సిపల్‌ పాలనా వ్యవస్థ ఉండేది. నగర పాలనకు ‘నాగరికుడు/ నగరాధ్యక్షుడు’ అనే అధికారి ఉండేవాడు. 
* కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్‌ ఇండికా గ్రంథాల్లో అప్పటి నగర పాలన గురించి అనేక విశేషాలు ఉన్నాయి. నగర పాలనకు 30 మంది సభ్యులతో కూడిన సంఘం పనిచేసేది. వారు ఆరు ప్రధాన శాఖలుగా ఏర్పడి నగర పాలనలో ఆయా విధులను నిర్వర్తించేవారు. ప్రతి జిల్లాను నాలుగు భాగాలుగా చేసి ‘స్థానికుడు’ అనే అధికారిని నియమించేవారని కౌటిల్యుడు తెలిపాడు. 
* పాలనలో చివరి భాగం గ్రామం. గ్రామాధికారిగా ‘గ్రామణి’ ఉండేవాడు. పది గ్రామాలకు కలిపి ‘గోపుడు’ అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా మౌర్యుల కాలంలో స్థానిక పాలన సమర్థవంతంగా సాగింది.


న్యాయపాలన
* కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్‌ ఇండికా గ్రంథాల్లో అప్పటి న్యాయపాలన గురించిన అంశాలు ఉన్నాయి. రాజే రాజ్యంలో అత్యున్నత న్యాయాధికారి. న్యాయపాలనలో మహామాత్రులు అనే న్యాయమూర్తులు సహాయపడేవారు. 
* జిల్లా స్థాయిలో న్యాయపాలన కోసం ‘రజ్జుక’లను నియమించేవారు. గ్రామస్థాయిలో గ్రామపెద్దలు తీర్పులు ఇచ్చేవారు. మౌర్యులకాలంలో సివిల్, క్రిమినల్‌ వివాదాలను పరిష్కరించేందుకు వేర్వేరు న్యాయస్థానాలు ఉండేవి. సివిల్‌ న్యాయస్థానాలను ‘ధర్మస్థీయ’, క్రిమినల్‌ న్యాయ స్థానాలను ‘కంఠక శోధన’ అని పిలిచేవారు. సివిల్‌ న్యాయమూర్తులను వ్యవహారిక, క్రిమినల్‌ న్యాయమూర్తులను ‘ప్రదేష్ట’ అనేవారు. మౌర్యుల కాలంలో శిక్షాస్మృతి కఠినంగా ఉండేదని వి.ఎ.స్మిత్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నారు.


సైనిక పాలన
*  మౌర్యుల కాలం నాటి సైనిక వ్యవస్థ గురించి సాహిత్య ఆధారాలు పేర్కొన్నాయి. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో అప్పటి సాయుధ దళాలను మూడు ప్రధాన వర్గాలుగా విభజించాడు. మొదటిది వారసత్వ దళాలు, రెండోది వేతన దళాలు, మూడోది కార్పొరేషన్ల దళాలు. 
*  సైనిక విషయాలను చూడటానికి 30 మంది సభ్యులతో కూడిన 6 కమిటీలు పనిచేసేవని మెగస్తనీస్‌ పేర్కొన్నాడు. కేంద్రస్థాయిలో సైనిక వ్యవహారాల పరిశీలనకు మహాసేనాని ఉండేవాడు. చతురంగ బలాలైన పదాతి, అశ్విక, గజ, రథ దళాలు యుద్ధంలో ప్రధానపాత్ర పోషించేవి. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఆరు లక్షల కాల్బలం, ముప్పైవేల అశ్విక దళం, తొమ్మిదివేల గజదళం, ఎనిమిది వేల రథబలం ఉన్నట్లు గ్రీకు రచనలు పేర్కొన్నాయి.
* మౌర్యులు గూఢచారి వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం అప్పటి గూఢచారి వ్యవస్థలో సంతక్, సంచార అనే రెండు విభాగాలుండేవి. ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండే గూఢచారులను సంతక్‌ (సంజరంతకులు) అని, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రహస్యంగా సమాచారం సేకరించే వారిని ‘సంచార’ అని పిలిచేవారు. వీరే కాకుండా ప్రజాభిప్రాయాన్ని రాజుకు నివేదికల రూపంలో అందించడానికి పులిసానులు, పతివేదకులు అనే ఉద్యోగులు ఉండేవారు.


సాంస్కృతిక వికాసం
* మౌర్యులు భాషా, సాహిత్యం, వాస్తుకళా రంగాలను ఎంతో అభివృద్ధి చేశారు. వీరి కాలంలో సంస్కృతం రాజభాషగా ఉండేది. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని సంస్కృత భాషలోనే రాశాడు. 
* అశోకుడి శాసనాల్లో ప్రాకృత భాషను ఎక్కువగా వాడారు. అశోకుడి శాసనాల్లోని బ్రాహ్మీ లిపిని జేమ్స్‌ ప్రిన్సిప్‌ అధ్యయనం చేశాడు. దేశీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ సాహిత్యాన్ని రచించారు. మౌర్యుల కాలంలో మెగస్తనీస్‌ గ్రీకు భాషలో రాసిన ఇండికా గ్రంథం వారి చరిత్రకు ప్రధాన ఆధారంగా ఉంది. తక్షశిల ప్రధాన విశ్వవిద్యాలయంగా ప్రఖ్యాతి చెందింది. మౌర్యుల కాలంలో విద్యా, సారస్వతాలు అభివృద్ధి చెందాయి. అశోక స్తంభాలు, రాతి ఫలకాలు, పాటలీపుత్ర లాంటి నగరాలను పరిశీలిస్తే అప్పటి వాస్తు, కళారంగాల అభివృద్ధి తెలుస్తుంది. 
* మధుర, చూనార్‌ ప్రాంతాల్లో లభించే ఇసుకరాయితో అశోక స్తంభాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. భారతదేశంలో తొలి రాతి కట్టడాలు మౌర్యుల కాలానికి చెందినవే. 
* పాటలీపుత్ర నగర నిర్మాణం, కోటగోడల నిర్మాణ కౌశలం గురించి మెగస్తనీస్‌ ఇండికాలో; సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరంలో ఎన్నో వివరాలు ఉన్నాయి. అశోక స్తంభాల్లోని శిల్ప, కళా నైపుణ్యం, ఫలకం, పద్మం, ధర్మచక్రం, పూర్ణకుంభం లాంటి ఆకృతులు ఎంతో ప్రఖ్యాతి చెందాయి. 
* సాంచీ, సారనాథ్‌ స్తూపాలు అశోకుడి కాలంలోనే వేశారు. సారనాథ్‌ స్తంభం నుంచే భారత జాతీయ చిహ్నమైన లయన్‌ కేపిటల్‌ (సింహతలాటం)ను స్వీకరించారు. అప్పటి శిల్పకళ ఎంతో మహోన్నతమైందిగా కీర్తిపొందింది.


సాంఘిక పరిస్థితులు
మెగస్తనీస్‌ రచించిన ఇండికా గ్రంథంలో అప్పటి సాంఘిక పరిస్థితులను వివరించారు. అప్పటి  సమాజంలో ఏడు ప్రధాన కులాలు/ వర్గాలు ఉండేవి. తత్వవేత్తలు, వ్యవసాయదారులు, సైనికులు, పశు పాలకులు, వృత్తి కళాకారులు, న్యాయాధిపతులు, సలహాదారులు అనే 7 ప్రధాన కులాలు/ వర్గాలను ఇండికా గ్రంథం పేర్కొంది. సమాజంలో బ్రాహ్మణ కులానికి చెందిన తత్వవేత్తలకు అధిక ప్రాధాన్యం ఉండేది. వీరి తర్వాత వృత్తి కళాకారులకు ఎక్కువ హోదా ఉండేంది. బ్రాహ్మణులు, క్షత్రియులను ద్విజులుగా భావించేవారు. బానిస వ్యవస్థపై పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయి. అప్పటి సమాజంలో బానిసలు లేరని మెగస్తనీస్‌ పేర్కొన్నారు. బౌద్ధ సాహిత్యం మాత్రం మూడు రకాల బానిసలు ఉండేవారని తెలిపింది. కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ బానిస వ్యవస్థ ప్రస్తావన ఉంది. అప్పటి సమాజంలో స్త్రీలకు తగినంత గుర్తింపు లేదు. బహు భార్యత్వం ఎక్కువగా ఉండేంది. దీంతో పాటు బాల్య వివాహాలు, వరకట్నం లాంటి సాంఘిక దురాచారాలు ఉండేవి.


ఆర్థిక పరిస్థితులు
మౌర్యుల కాలంలోనూ వ్యవసాయమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. దీంతో పాటు వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి మౌర్య పాలకులు కృషి చేశారు. భూములను సర్వే చేయించి, పంటలో 1/4 నుంచి 1/6 వంతు శిస్తు విధించారు. ప్రాంతాలను బట్టి శిస్తు రేటు మారుతూ ఉండేది. వ్యవసాయానికి సాగునీటి సౌకర్యాలు కల్పించారు. చంద్రగుప్త మౌర్యుడు తన పాలనా కాలంలో సౌరాష్ట్రలో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు. అప్పటి పాలకులు పరిశ్రమల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టారు. లోహ, వస్త్ర, కొయ్య పరిశ్రమలను అభివృద్ధి చేశారు. చేనేత, చిన్నతరహా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. ఆయుధాలు, ఓడల తయారీ, గనుల తవ్వకం లాంటి రంగాల్లో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేది. అనేక రకాల పారిశ్రామిక వృత్తుల వారు సంఘాలుగా ఏర్పడ్డారు. వీటినే ‘శ్రేణులు’గా వ్యవహరించేవారు. లోహ పరిశ్రమతో పాటు రాతి వస్తువుల తయారీ ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. అశోకుడి కాలంలో తయారు చేసిన రాతి స్తంభాలను పరిశీలిస్తే అప్పటి¨ రాతి ఫలకల నిర్మాణ నిపుణుల నైపుణ్యం తెలుస్తుంది. తక్షశిలలో ఈ రాతి ఫలకాల నిర్మాణ నిపుణులు శిక్షణ పొందేవారు. మధుర, కాశీ, వంగ లాంటి రాజ్యాల్లో నూలు వస్త్ర తయారీ ఎంతో అభివృద్ధి చెందింది. కుండల తయారీ మరో ప్రధాన వృత్తి పరిశ్రమగా రూపొందింది. నాటి కుమ్మరం పనిని నార్తరన్‌ బ్లాక్‌ పాలిష్‌డ్‌ వేర్‌గా పేర్కొన్నారు.

    వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వర్తక, వాణిజ్యాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. దేశీయ వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ వ్యాపారం విరివిగా సాగింది. బర్మా, గ్రీకు లాంటి దేశాలతో విదేశీ వాణిజ్యం అధికంగా జరిగేది. సుగంధద్రవ్యాలు, వజ్రాలు, ముత్యాలు, నూలు వస్త్రాలు, దంతపు వస్తువులు ప్రధాన ఎగుమతులుగా ఉండేవి. గుర్రాలు, ఎరుపు పగడాలు, గాజు, నార మొదలైనవి ప్రధాన దిగుమతులు. రాజ్యంలో దేశీయ వాణిజ్యం అభివృద్ధికి రహదారులను బాగా అభివృద్ధి చేశారు. రహదారులు నిర్మించడానికి అగ్రనోమోయి అనే ప్రత్యేక అధికారులు ఉండేవారని మెగస్తనీస్‌ తను ఇండికా గ్రంథంలో వివరించాడు. 
* మౌర్యులు విధించిన సుంకాల గురించి కూడా ఇదే గ్రంథంలో వివరణ ఉంది. అమ్మకం పన్ను 1/5 వంతు ఉండేది. స్థానిక వస్తు విక్రయాల వల్ల 5%; విదేశి వస్తు విక్రయాల వల్ల 10% లాభాలు ఉండేవి.

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌