• facebook
  • whatsapp
  • telegram

అసఫ్‌జాహీల కాలం- సాంఘిక పరిస్థితులు

నిర్బంధ చాకిరి.. నిరంకుశ దోపిడీ!

  నిజాంల కాలంలో భూస్వాములు ఆర్థికంగా, సామాజికంగా సామాన్యులను అష్టకష్టాల పాలు చేశారు. అధికారులు సహా పాలనలో భాగస్వాములైన వారందరూ వివిధ వృత్తులవారితో వెట్టిచాకిరి చేయించుకున్నారు. దారుణ పరిస్థితుల్లోనూ పన్నుల పేరుతో దోచుకున్నారు. బాలికలు బానిసత్వంలో మగ్గిపోయారు. గ్రామీణ మహిళలపై అఘాయిత్యాలకు అడ్డులేకుండా పోయింది. మూఢ నమ్మకాలు ప్రజల జీవనస్థితిగతులను దిగజార్చాయి. ఈ సాంఘిక పరిస్థితులపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

  తెలంగాణలోని భూములన్నీ భూస్వాముల కింద ఉండేవి. వారు ప్రజల నుంచి బలవంతపు వసూళ్లు చేసేవారు. నిర్బంధ చాకిరి చేయించుకునేవారు. వెట్టి విధానం సమాజమంతటా కనిపించేది. స్త్రీల పరిస్థితి దయనీయంగా ఉండేది. వీరు బానిసత్వంలో మగ్గిపోయారు. జనంలో అనేక మూఢ నమ్మకాలుండేవి.

 

వెట్టి విధానం

సాధారణంగా వెట్టి విధానం (నిర్బంధ చాకిరి) ఆటవిక తెగల ప్రాంతాలకు, బాగా వెనుకబడిన కొన్ని సాంఘిక తెగలకు మాత్రమే పరిమితమైందిగా భావిస్తారు. కానీ తెలంగాణలో వెట్టి విధానం సమాజమంతటా ఉండేది. అన్నివర్గాల వారికి వారి వారి స్థాయుల్లో ఇది వర్తించేది. వెట్టిచాకిరి చేయడం కోసం ఒకరిని తప్పనిసరిగా కేటాయించాల్సిన పరిస్థితి దళిత కుటుంలాల్లో కనిపించేది. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక మనిషిని పంపేవారు.

 

నాడు వెట్టి చాకిరి రెండు విధాలా అమలయ్యేది..

1) అధికారులకు చేసే వెట్టిచాకిరి

2) గ్రామంలోని దొరలు, పటేలు, పట్వారీలకు చేసే వెట్టి చాకిరి

 

ప్రభుత్వాధికారులు వస్తే గ్రామంలోని వివిధ వృత్తుల వారు వెట్టిచాకిరి చేసి వారికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు. పటేల్, పట్వారీ, మాలిపటేల్‌ ఇళ్లలో పనులు చేయడం, పోలీసు తాలుకా ఆఫీసులకు రిపోర్టులు మోసుకుపోవడం, గ్రామచావిడికి, బందెలదొడ్డికి కాపలా కాయడం రోజువారి పనిలో భాగంగా ఉండేది. దొరలు, దేశ్‌ముఖ్‌ల ఇళ్లలో వివిధ వృత్తులవారు వంతుల వారీగా వెట్టి చేయాల్సి వచ్చేది. భూస్వాములకు, ప్రభుత్వాధికారులకు గ్రామంలోని వివిధ వృత్తులవారు ఉచితంగా వృత్తిపరమైన సేవలు అందించేవారు. కల్లుగీత కార్మికులు భూస్వాములకు ఉచితంగా కల్లు సరఫరా చేయాలి. వడ్రంగులు, కమ్మర్లు వ్యవసాయ పరికరాలను సరఫరా చేయాలి. చర్మకారులు చెప్పులు కుట్టివ్వాలి. చేనేతలు భూస్వాముల ఇళ్లలో పనిచేసే నౌకర్లకు దుస్తులు ఇవ్వాలి. రజకులు ఉచితంగా దుస్తులు ఉతకాలి, అంట్లు తోమాలి. గ్రామంలో మకాం వేసిన అధికారుల కోసం మంచాలు, పరుపులు మోసుకెళ్లాలి. వంట సామగ్రిని సరఫరా చేయాలి. దేశ్‌ముఖ్‌ల ఇళ్లలో పసుపు, కారం కొట్టాలి. కుమ్మరులు కుండలివ్వాలి. మంగలి వారు దేశ్‌ముఖ్‌ల ఇళ్లలో సేవ చేయాలి. రాత్రివేళ భూస్వామి పాదాలు ఒత్తాలి. శరీర మర్దన చేయాలి.

 

స్త్రీల పరిస్థితి

  ఈ కాలంలో మహిళల పరిస్థితి మరింత దయనీయం. వీరికి స్వేచ్ఛ ఉండేదికాదు. ముస్లిం స్త్రీలలో పరదా పద్ధతి ఉండేది. నిజాం పాలనలోనూ, జమీందారీ వ్యవస్థలోనూ గ్రామీణ పేదవర్గాల స్త్రీలు అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం. దళిత స్త్రీలు బానిసత్వంలో మగ్గిపోయారు. వారి శ్రమకు విలువ ఉండేది కాదు. ఎలాంటి వ్యక్తిగత స్వేచ్ఛకు అవకాశం లేదు. సరైన దుస్తులు ధరించే పరిస్థితి లేదు. దొరల బిడ్డలకు శ్రామిక స్త్రీలు పాలిచ్చి పెంచేవారు. వీరిపై అత్యాచారాలు సర్వసాధారణం. పేద మహిళలను భూస్వాములు, రజాకార్లు అనేక చిత్రహింసలకు గురిచేసేవారు. రజాకార్లు గ్రామాల్లోకి చొరబడి స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. నాటి సమాజంలోని స్త్రీలు దేవదాసీలు, జోగినిలు, బసివిరాండ్రుగా సాంఘిక మూఢాచారాలకు బలయ్యారు.

  బానిసలుగా బాలికలు: పేద బాలికలను భూస్వాముల ఇళ్లలో పనిచేయడానికి బానిసలుగా పంపించేవారు. అంతేకాకుండా భూస్వాములు తమ కూతుళ్ల అత్త వారింటికి కూడా ఈ బాలికలను పనిచేయడానికి పంపించేవారు. నిరంకుశంగా శ్రమ దోపిడీ చేసేవారు. భూస్వాములు యువతులను ఉంపుడుగత్తెలుగా ఉపయోగించుకునేవారు. దీన్నే ‘ఆడపాపల విధానం’ అని అంటారు. 

 దీన స్థితిలో ఉన్న రైతుల నుంచి ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా భూస్వాములు పన్నులు వసూలు చేసేవారు. ఈ మధ్యయుగపు భూస్వామ్యానికి మతోన్మాదం కూడా తోడవ్వడంతో నిజాం రాజ్య ప్రజాజీవనం నరకప్రాయమైంది. 1923, మార్చి 20న తన జన్మదినం సందర్భంగా నిజాం రాజు వెట్టి చాకిరిని నిషేధిస్తూ ఫర్మానా జారీ చేశాడు.

 

మతాలు

నిజాం రాజ్యంలో హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, జైనులు, బౌద్ధులుండేవారు. వర్ణవ్యవస్థలు బలపడి, అనేక ఉపకులాలుగా స్థిరపడ్డాయి. బ్రాహ్మణులు జాగీర్దార్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. వైశ్యులు వ్యాపారం, వ్యవసాయం చేసేవారు. రాజ్యంలో శైవులు ఎక్కువగా ఉండేవారు. వందలకొద్దీ శివాలయాలు నిర్మితమయ్యాయి. జంగాలు, వీరముష్టివారు, తంబళులు, స్మార్త బ్రాహ్మణులు శివాలయాల్లో పూజారులుగా ఉండేవారు. వారికి ప్రభుత్వం దేవల్‌ ఇనాము, ఖిద్మతి ఇనాము పేరుతో భూములిచ్చేది. ప్రజలు ఆలయ జాతర్లలో ఎక్కువగా పాల్గొనేవారు.

 

మూఢ నమ్మకాలు: బాల్యవివాహాలు, కులం వెలి, మంత్రతంత్రాలు, జంతుబలులు, అంటరానితనం, బానిసత్వం, బహుభార్యత్వం, జ్యోతిషం, శకునాలపై నమ్మకం; దేవదాసీ, జోగినీ పద్ధతులు ఉండేవి. గ్రామాల్లో క్షుద్ర దేవతలను ఆరాధించేవారు. పోతరాజు, కట్టమైసమ్మ, మారెమ్మ, కోటమైసమ్మ, ముత్యాలమ్మ అనే దేవతలను ఆరాధించారు. ఈ దేవతలకు బోనాలు పెట్టడం, జంతుబలులు ఇవ్వడం ఆచారాలుగా ఉండేవి.

  రాజ్యంలోని ప్రజల్లో అధిక సంఖ్యాకులు హిందువులు. నిజాం ముస్లిం కావడంతో పరిపాలనా యంత్రాంగంలో ఆ వర్గం ఆధిపత్యం ఉండేది. మొత్తం జనాభాలో 11% ఉన్న ముస్లింలు పరిపాలనా యంత్రాంగంలో, ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో అత్యధికంగా 90% వరకు ఉండేవారు. నిరంకుశులుగా వ్యవహరించేవారు. ముస్లింలు పాలకవర్గమని, వారికి సంస్థానంలోని మిగతా ప్రజలపై ఆధిక్యం ఉందనే భావనను పెంపొందించడం కోసం నిజాం ముల్లాలు (మతాధికారులు) ప్రయత్నించేవారు. అయినా రాజ్యంలో అన్నిమతాలవారు కలిసి ఉండేవారు. కుతుబ్‌షాహీల నుంచి అసఫ్‌జాహీల కాలం వరకు హైదరాబాద్‌ నగరం భిన్నప్రజలకు కేంద్రంగా ఉండేది. హిందూ ముస్లింలు పండగలను కలిసి చేసుకునేవారు. రంజాన్‌కు ముందు ముస్లింల  వేడుక షబేబారత్‌ దీపావళిని పోలి ఉండేది. నిజాం తన దర్బారులో ఈద్, దుస్సేరాత్, దీపావళి, హోళీ, వసంత పంచమి పండగలను నిర్వహించేవాడు. నిజాం రాజ్య కోశాగారంలో ప్రభుత్వ ఖర్చుతో లక్ష్మీ పూజ జరిపించేవారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు దానధర్మాలు చేసేవారు.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 19-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌