• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాదుపై పోలీసు చర్య (నిజాం పాలన అంతం)

 ధిక్కారంపై ఉక్కుపాదం!

 


 


తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన ఆ ఘటన నిజాం ధిక్కారంపై భారత ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం. తరాల నిరంకుశ పాలనకు చరమగీతం. రజాకార్ల దారుణాలకు, దుర్మార్గాలకు అంతం. హైదరాబాద్‌ రాజ్య పౌరులు కోరుకున్న స్వేచ్ఛకు స్వాగతం. దేశంలో కలిసిపోవాలని ఉవ్విళ్లూరిన ప్రజాభీష్టానికి ప్రతిరూపం. పాలకుల ఆగడాలు, అణచివేతలు, అకృత్యాలపై తిరగబడిన జనచైతన్యం. అదే పోలీసు చర్య. దీని ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత్‌కు  వ్యతిరేకంగా కుట్రలు, కుంతంత్రాలకు పాల్పడిన నవాబు మెడలు వంచారు. సంస్థానాన్ని స్వతంత్ర భారతంలో విలీనం చేశారు. ఈ సంఘటన నేపథ్యాన్ని, ఆ సందర్భంగా సంభవించిన అనేక పరిణామాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 

భారతదేశం ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి విడుదలైనప్పటికీ, హైదరాబాదు రాజ్యానికి నిజాం పాలన నుంచి విముక్తి లభించలేదు. హైదరాబాదును భారత యూనియన్‌లో కలపాలనే డిమాండ్‌తో వివిధ రూపాల్లో స్వాతంత్య్ర ఉద్యమం సాగేది. ఒకవైపు నిజాం నిరంకుశ పాలన, మరోవైపు రజాకార్ల దుశ్చర్యలతో హైదరాబాదు రాజ్యంలో శాంతిభద్రతలు క్షీణించాయి. భారత ప్రభుత్వంతో జరిగిన యథాతథ ఒప్పందాన్ని నిజాం ప్రభుత్వం ఉల్లంఘించింది. దాంతో భారత ప్రభుత్వానికి హైదరాబాదుపై చర్య తీసుకోవడానికి మార్గం సుగమమైంది.


నిజాంకు ఏడుగురు ముస్లిం ప్రముఖుల విజ్జప్తి: నవాబ్‌ మంజూరు జంగ్, మహ్మద్‌ హుసేన్‌ జాఫరీ (విద్యాశాఖ డైరెక్టర్‌), ఫరీద్‌ మీర్జా, బాఖర్‌ అలీ మీర్జా, అహ్మద్‌ మీర్జా (మాజీ చీఫ్‌ ఇంజినీర్‌), ముల్లా అబ్దుల్‌ బాత్, హుస్సేన్‌ అబ్దుల్‌ మునీం (మాజీ అకౌంటెంట్‌ జనరల్‌) అనే జాతీయభావాలున్న ఏడుగురు ముస్లిం ప్రముఖులు 1948, ఆగస్టు 13న ‘పయాం’ పత్రిక ద్వారా నిజాంకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ‘‘నిజాం వెంటనే రజాకారు వ్యవస్థను రద్దు చేసి అన్నివర్గాల విశ్వాసాన్ని పొందగలిగే బాధ్యతాయుత ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా స్థాపించాలి. అవసరమైతే ప్రభుత్వం జనవాక్య సేకరణకు కూడా అంగీకరించాలి.’’ అని విజ్జప్తి చేశారు. నిజాం వీరిని పట్టించుకోలేదు.


మౌంట్‌ బాటెన్‌ రాయబారం: నిజాం, భారత ప్రభుత్వాల మధ్య సామరస్యానికి భారత చివరి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ ప్రయత్నించాడు. ఇందుకోసం 1948, మార్చి 15న తన ప్రతినిధి, పత్రికా కార్యదర్శి అయిన అలన్‌ కాంప్‌బెల్‌ జాన్‌సన్‌ను నిజాంతో చర్చలకు హైదరాబాదుకు పంపించాడు. అయితే ఈ రాయబారం విఫలమైంది. మూడు రోజుల పాటు వర్తక సంఘం తమ వ్యాపారాన్ని మూసివేసి నిరసన వ్యక్తం చేసింది. సంస్థానంలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని వాణిజ్య సంఘ ప్రతినిధులు నిజాంకు విన్నవించారు. 


షోయబుల్లా ఖాన్‌ హత్య: షోయబుల్లా ఖాన్‌ ‘ఇమ్రోజ్‌’ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు. ఆయన పత్రికలో రజాకార్ల దుశ్చర్యలను విమర్శించాడు. ఫలితంగా ముస్లిం ఖాన్‌ అనే వ్యక్తి నేతృత్వంలో రజాకార్లు 1948, ఆగస్టు 21న కాచిగూడలో షోయబుల్లా ఖాన్‌ను హత్య చేశారు.


ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు:  జఫరుల్లా ఖాన్‌ అనే పాకిస్థాన్‌ నాయకుడి సలహా మేరకు హైదరాబాదు ప్రధాని లాయక్‌ అలీ ఒక బృందాన్ని ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయడానికి పంపించాడు. ఈ బృందం నవాజ్‌ జంగ్‌ అధ్యక్షతన భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి 1948, సెప్టెంబరు 10న యూఎన్‌ఓకి వెళ్లింది.


భాగ్యనగర్‌ రేడియో కార్యకలాపాలు: స్టేట్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో, పాగ పుల్లారెడ్డి నాయకత్వంలో కర్నూలు శిబిరం వారు భాగ్యనగర్‌ రేడియో కేంద్రాన్ని నెలకొల్పారు. రోజూ సాయంత్రం పూట ప్రసారాలు చేసేవారు. నిజాం రేడియో అయిన దక్కన్‌ రేడియో ప్రసారాలతో పాటు భాగ్యనగర్‌ రేడియో ప్రసారాలు జరిగేవి. పాగ పుల్లారెడ్డి ఈ ప్రసారాల యంత్రాన్ని బొంబాయి నుంచి తెచ్చారు. సోషలిస్టు నాయకుడైన అచ్యుత పట్వర్ధన్‌ దానిని సమకూర్చారు. ఈ రేడియో సెట్‌ను వనపర్తి రఘునాథరెడ్డి, కోదండ రామిరెడ్డి, పల్లెపాడు గోవర్ధన్‌ రెడ్డి తదితరులు అమర్చారు. గడియారం రామకృష్ణ శర్మ, గొట్టెముక్కల కృష్ణమూర్తి ఈ రేడియో కేంద్రాన్ని నడిపే బాధ్యత నిర్వహించారు. భాగ్యనగర్‌ రేడియో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రసారాలు నిర్వహించేది. తెలుగు ప్రసారాలను రామకృష్ణ శర్మ, ఉర్దూ ప్రసారాలను టి.నాగప్ప వకీలు (గద్వాల), ఇంగ్లిష్‌ ప్రసారాలను కమతం వెంకటరెడ్డి, వార్తల రచనలను గొట్టెముక్కల కృష్ణమూర్తి చేసేవారు. రజాకార్లు, నిజాం పోలీసుల దురాగతాలపై ఈ రేడియో ప్రజల్లో అవగాహన పెంచింది. దీంతో స్టేట్‌ కాంగ్రెస్‌ నిర్వహించే ఉద్యమానికి మంచి ప్రచారం లభించింది. నిజాం రేడియో చెప్పే తప్పుడు వార్తలను ఖండించి అసలైన విషయాలను ప్రజలకు వివరించేది. ప్రజల్లో చైతన్యం పెంపొందించి నిజాం వ్యతిరేక పోరాటాన్ని ప్రోత్సహించింది. ఇదొక అజ్ఞాత రేడియో. దీని నిర్వహణను చివరివరకు అత్యంత రహస్యంగా ఉంచారు. భాగ్యనగర్‌ రేడియో ప్రసారాలను ప్రజలు వింటున్నారని భావించిన నిజాం ప్రభుత్వం పబ్లిక్‌ రేడియో ప్రసారాలను నిలిపివేసింది. అయినప్పటికీ రేడియో ప్రసారాలను ప్రజలు తమ ఇళ్లలో వినేవారు.


పోలీసు చర్య: హైదరాబాదు ప్రభుత్వానికి చివరి హెచ్చరికను 1948, సెప్టెంబరు 10న భారత ప్రభుత్వ సంస్థాన మంత్రిత్వ శాఖా కార్యదర్శి వి.పి.మీనన్‌ అందజేశారు. హైదరాబాదు, దాని సరిహద్దుల్లోని భారత యూనియన్‌ రాష్ట్రాల ప్రాంతాలను అరాచక పరిస్థితి నుంచి రక్షించడానికి భారత సైన్యాన్ని హైదరాబాదుకు పంపడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి 1948, సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం వచ్చింది. సెప్టెంబరు 13న భారత సైన్యం హైదరాబాదు సంస్థానాన్ని నాలుగు దిక్కుల్లో చుట్టుముట్టింది. భారత సైన్యానికి తెలంగాణ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సైనిక దళాలకు నాయకత్వం వహించింది మేజర్‌ జనరల్‌ జయంత్‌ నాథ్‌ చౌదరి (జె.ఎన్‌.చౌదరి). ఈ మిలిటరీ చర్యకే ‘పోలీసు చర్య’ అని పేరు. ఈ సైనిక చర్యకు ‘ఆపరేషన్‌ పోలో’ (క్యాటర్‌పిల్లర్‌) అని పేరు పెట్టారు. సెప్టెంబరు 13 నుంచి 17 మధ్య జరిగిన పోలీసు చర్యలో రజాకార్లు, నిజాం సైన్యం ఓడిపోయాయి. 1948, సెప్టెంబరు 17న నిజాం లొంగిపోతున్నట్లు రేడియో ప్రకటన చేశాడు. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఏజెంట్‌ జనరల్‌ కె.ఎమ్‌.మున్షీకి తెలియజేశాడు. నిజాం సైన్యాధిపతి ఎల్‌డ్రూస్‌ నేతృత్వంలోని నిజాం సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. అదే రోజు ఉదయం ప్రధాని లాయక్‌ అలీ రాజీనామా సమర్పించాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యుద్ధ విరమణకు, రజాకారుల దళాలను రద్దు చేయడానికి తాను ఆదేశాలిచ్చినట్లు మున్షీ ద్వారా భారత ప్రభుత్వానికి నిజాం తెలియజేశాడు. దీంతో నిజాం పాలన అంతమైంది. సెప్టెంబరు 18న ప్రజల ఆనందోత్సాహాలు, నినాదాల సందడిలో మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరి నాయకత్వంలో భారత సేనలు హైదరాబాదు నగరంలోకి ప్రవేశించాయి. హైదరాబాదు సంస్థాన మిలిటరీ గవర్నరుగా మేజర్‌ జె.ఎన్‌.చౌదరి ప్రమాణస్వీకారం చేశాడు. 1948, సెప్టెంబరు 23న నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ ఐక్యరాజ్య సమితికి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నాడు. 1948, సెప్టెంబరు 18న ప్రధానమంత్రి లాయక్‌ అలీ, సైన్యాధిపతి జనరల్‌ ఎల్‌డ్రూస్‌లను భారత సైన్యం గృహనిర్బంధం చేసింది. రజాకారు నాయకుడైన కాశిం రజ్వీని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించారు. భారత హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాట్లాడుతూ ‘‘భారతదేశ కడుపులో ఏర్పడిన పుండు తొలగిపోయింది, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం 1948, సెప్టెంబరు 17నే వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు. పోలీసు చర్య తర్వాత హైదరాబాదుకు వచ్చిన వల్లభాయ్‌ పటేల్‌కు బేగంపేట విమానాశ్రయం వద్ద నిజాం స్వాగతం పలికాడు. ఈ పరిణామంపై నిజాం ప్రధానమంత్రి లాయక్‌ అలీ ‘ది ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’ గ్రంథాన్ని, కె.ఎం.మున్షీ ‘ది ఎండ్‌ ఆఫ్‌ యాన్‌ ఇరా’ అనే గ్రంథాన్ని రచించారు.
 

మాదిరి ప్రశ్నలు

1. రజాకార్లు హత్య చేసిన షోయబుల్లా ఖాన్‌ ఏ పత్రిక సంపాదకుడు?

1) సియాత్‌      2) ఇమ్రోజ్‌    సి) రయ్యత్‌   4) రహబరే దక్కన్‌2. హైదరాబాదుపై జరిపిన పోలీసు చర్యకు మరో పేరు?

1) అపోలో     2) థండర్‌ బర్డ్‌     3) ఆపరేషన్‌ పోలో     4) ఆపరేషన్‌ హైదరాబాద్‌3. నిజాం ప్రభుత్వం భారత యూనియన్‌పై ఫిర్యాదు చేయడానికి ఐక్యరాజ్యసమితికి పంపిన బృందానికి అధ్యక్షుడు?

1) లాయక్‌ అలీ     2) ముస్లిం ఖాన్‌

3) అలీయవర్‌ జంగ్‌     4) నవాజ్‌ జంగ్‌


 

4. భాగ్యనగర్‌ రేడియో ఎవరి నాయకత్వంలో నడిచేది?

1) రావి నారాయణ రెడ్డి     2) పాగ పుల్లారెడ్డి 

3) రామకృష్ణ శర్మ  4) కమతం వెంకటరెడ్డి

 

5. ఆపరేషన్‌ పోలోకు నేతృత్వం వహించినవారు ఎవరు?

1) వెల్లోడి  2) కె.పి.సింగ్‌  3) కె.ఎన్‌.జైన్‌   4) జె.ఎన్‌.చౌదరి

 

6. నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయినట్లు ఎప్పుడు ప్రకటించాడు?

1) 1948, సెప్టెంబరు 14    2) 1948, సెప్టెంబరు 15

3) 1948, సెప్టెంబరు 17    4) 1948, సెప్టెంబరు 23


 

7. ‘ది ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’ గ్రంథ రచయిత ఎవరు?

1) లాయక్‌ అలీ   2) చత్తారీ నవాబు    3) నవాజ్‌ జంగ్‌    4) అలీయావర్‌ జంగ్‌

 

 

8. భాగ్యనగర్‌ రేడియో సెట్‌ను ఎవరు సమకూర్చారు?

1) అచ్యుత పటే వర్థన్‌     2) రఘునాథరెడ్డి    3) రామకృష్ణ శర్మ   4) కృష్ణశాస్త్రి

 

9. హైదరాబాదు, భారత ప్రభుత్వాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఏ బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ ప్రయత్నించారు?

1) వెల్లస్లీ    2) మౌంట్‌ బాటెన్‌     3) కారన్‌ వాలీస్‌    4) గిల్డర్‌ 

 

10. ఏ పాకిస్థాన్‌ నాయకుడి సలహాపై నిజాం భారత ప్రభుత్వంపై ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేశాడు?

1) నవాజ్‌ ఖాన్‌     2) జిన్నా  3) గులాం మహ్మద్‌   4) జఫరుల్లా ఖాన్‌

సమాధానాలు: 1-2, 2-3, 3-4, 4-2, 5-4, 6-3, 7-1, 8-1, 9-2, 10-4.

 రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి

Posted Date : 16-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌