• facebook
  • whatsapp
  • telegram

రజాకార్ల వ్యవస్థ

నిజాం రాజ్యంలో ముష్కరమూక!

 


  హైదరాబాదు రాజ్యంలో సాంస్కృతిక అంశాల కోసం ప్రారంభమైన ఒక సంస్థ, తర్వాత ముస్లింల ప్రత్యేక హక్కుల పరిరక్షణ పోరాటం పేరుతో పెరిగిపోయి నిజాం నవాబును శాసించే స్థాయికి చేరింది. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకొని బీభత్సాలు సృష్టించింది. రజాకార్ల దళంగా మారి రాక్షస కృత్యాలతో చెలరేగిపోయింది. రైళ్లపై దాడులు, రైల్వే స్టేషన్ల దహనాలు, గ్రామాల లూటీలకు  తెగబడింది. ఎదిరించిన ఎందరినో నిలబెట్టి కాల్చి చంపేసింది. హత్యలు చేయడం, దోచుకోవడం, మహిళలపై అఘాయిత్యాలు అత్యంత పాశవికంగా కొనసాగించింది. ఆఖరికి భారత సైన్యం జోక్యంతో ఆ ముష్కర మూక అకృత్యాలకు అడ్డుకట్ట పడింది. 

 


  నిజాం సంస్థానంలో అంతర్భాగమైన తెలంగాణ అప్పట్లో దాదాపు అన్ని రంగాల్లో వెనుకబడింది. ఒక వైపు నిజాం నిరంకుశ పాలన, మరోవైపు రజాకార్ల హింసాయుత చర్యలతో ప్రజలు అల్లాడిపోయారు. రజాకారు వ్యవస్థకు ఒక ప్రత్యేక నిర్మాణం ఉండేది. అది జనం ధన, మాన, ప్రాణాలతో అత్యంత ప్రమాదకరంగా వ్యవహరించేది.

 


ఇత్తెహాద్‌-ఉల్‌-ముస్లిమీన్‌: హైదరాబాద్‌ ప్రభుత్వ మత శాఖకు డైరెక్టర్‌గా ఉన్న నవాబ్‌ సదర్‌ యార్‌ జంగ్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తోహెద్‌ మంజిల్‌లో ఒక సమావేశం జరిగింది. అందులో చేసిన తీర్మానాన్ని అనుసరించి ‘ఇత్తెహాదుల్‌ జైనుల్‌ ముస్లిమీన్‌’ సంస్థ/పార్టీని 1927, నవంబరు 9న స్థాపించారు. 1929లో జైనుల్‌ అనే పదాన్ని తొలగించి మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌గా మార్చారు. దీనికి మొదటి అధ్యక్షుడు నవాబ్‌ సదర్‌ యార్‌ జంగ్‌. ఈ సంస్థ మొదట్లో సాంస్కృతిక అంశాలకే పరిమితమై ఉండేది. 1938 వరకు నామమాత్రంగా పనిచేసింది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయం మత శాఖాధిపతి అయిన ప్రొఫెసర్‌ అబ్దుల్‌ ఖాదర్‌ సిద్ధిఖ్‌ ఈ సంస్థకు రెండో అధ్యక్షుడైన తర్వాత పరిస్థితి మారింది. ముస్లింల ప్రత్యేక హక్కుల పరిరక్షణ కోసం పని చేయడం ప్రారంభించింది. 1939లో నవాబ్‌ బహదూర్‌ యార్‌ జంగ్‌ అధ్యక్షుడు కావడంతో సంస్థ మరింత బలపడింది. ప్రతి ముస్లిం స్వయంగా ఒక రాజు అనే ‘ఆనల్‌ మాలిక్‌ (నేనే రాజు)’ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. బహదూర్‌ యార్‌ జంగ్‌ ఈ సిద్ధాంతాన్ని అబ్దుల్‌ ఖాదర్‌ సిద్దిఖ్‌ 1938లో ఇచ్చిన ఉపన్యాసం నుంచి గ్రహించాడు. బహదూర్‌ యార్‌ జంగ్‌కు ఇస్లాం మత సిద్ధాంతాలపై బాగా పట్టుండేది. నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ ఇతడి ప్రతిభను గుర్తించి ‘యార్‌ జంగ్‌’ అనే బిరుదు ఇచ్చాడు. బహదూర్‌ యార్‌ జంగ్‌ అధ్యక్షుడైన అనంతరం ఈ సంస్థ నిజాంను శాసించే స్థాయికి చేరింది. హైదరాబాద్‌ రాజ్య కాంగ్రెసు ఏర్పాటును కూడా వ్యతిరేకించింది.

 


* మజ్లిస్‌ సంస్థ ముస్లింలందరికీ ప్రాతినిధ్యం వహిస్తుందని బహదూర్‌ యార్‌ జంగ్‌ ప్రకటించాడు. దీనికి నిజాం కూడా పరోక్షంగా సహాయ సహకారాలను అందించాడు. 1940లో సయ్యద్‌ మహ్మద్‌ హసన్‌ సలహా మేరకు ఒక వాలంటీరు దళాన్ని ఏర్పాటు చేశారు. వీరినే రజాకార్లు అంటారు. 1940, సెప్టెంబరులో నవాబ్‌ సదర్‌ యార్‌ జంగ్‌ రజాకారుల దళాన్ని ప్రారంభించాడు. రజాకార్లు అంటే ఉర్దూలో స్వచ్ఛంద సేవకులని అర్థం.

 


రజాకారు దళం:  ప్రతి 30 మంది రజాకార్లకు సాలార్‌ నాయకుడు. తాలూకా స్థాయి రజాకార్ల దళానికి అధిపతి సాలార్‌-ఇ-సగీర్‌. జిల్లా అధిపతి సాలార్‌-ఇ-కబీర్‌. రజాకార్ల కేంద్ర సంఘానికి అధ్యక్షుడిగా అఫ్సర్‌-ఎ-అలా ఉండేవాడు. రజాకార్లకు సైనిక శిక్షణ ఇవ్వడానికి ‘మీర్‌ కాజ్‌’ అనే అధికారి ఉండేవాడు. ఈయన వారిని క్రమశిక్షణలో ఉంచేవాడు. రజాకార్లు ఖాకీ సైనిక షర్టు, ఖాకీ ప్యాంటు ధరించి బెల్టు పెట్టుకోవాలి. కత్తి బాకు ధరించాలి. నల్ల ఫెజ్‌ టోపీ పెట్టుకోవాలి. 1943లో వరంగల్‌లో జరిగిన మజ్లిస్‌ వార్షికోత్సవ సభలో బహదూర్‌ యార్‌ జంగ్‌ ప్రసంగిస్తూ ‘ఈ రాజ్యం నిజాం సొత్తు కాదు. ముస్లిం ప్రజలందరి ఆస్తి. ఇది నా అభిప్రాయమే కాదు. మజ్లిస్‌ పార్టీ అభిప్రాయం కూడా’ అన్నాడు. దీంతో నిజాం ప్రభుత్వం బహదూర్‌ యార్‌ జంగ్‌ ఉపన్యాసాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఇందుకు నిరసనగా బహదూర్‌ తనకు నిజాం ఇచ్చిన బిరుదును త్యజించాడు. 1944లో అతడు మరణించాడు. మజ్లిస్‌ సంస్థకు అబుల్‌ హసన్‌ సయ్యద్‌ అలీ కొంత కాలం, మజహర్‌ అలీ ఖోమేని మరికొంతకాలం అధ్యక్షులుగా ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లా, డిచ్‌పల్లి గ్రామంలోని మిషన్‌ హాస్పిటల్‌ ప్రాంగణంలో ముస్లింలు నమాజ్‌ కోసం వేసుకున్న పాకను తొలగించడంపై తలెత్తిన వివాదం రజాకార్ల విజృంభణకు నాంది పలికింది.

 


  నాటి ప్రధాని చత్తారి నవాబు అధికార నివాస భవనం షామంజిల్‌పై రజాకార్లు దాడి చేశారు. లాతూర్‌లో న్యాయవాదిగా పనిచేసే కాశిం రజ్వీ 1946లో మజ్లిస్‌ సంస్థకు అధ్యక్షుడయ్యాడు. ఈయన ఆధ్వర్యంలో సంస్థ తీవ్ర రూపం దాల్చింది. 1948 నాటికి నిజాం అధికారాన్ని రజ్వీ తన హస్తగతం చేసుకుని, హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్‌ రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ప్రయత్నించాడు. ఇదే లక్ష్యంతో 50 వేల మంది రజాకార్లను తయారు చేశాడు. వీరి సంఖ్య 5 లక్షలకు పెంచుతానని ప్రతిన పూనాడు. నిజాం నిరంకుశ పాలనను నిరశిస్తూ హైదరాబాద్‌లో తలెత్తిన స్వాతంత్య్రోద్యమానికి వ్యతిరేకంగా రజాకార్లు అనేక పాశవిక చర్యలకు పాల్పడ్డారు. కాశిం రజ్వీ నిజాం రాజ్యంలో రజాకార్ల కోసం 52 సైనిక కేంద్రాలు ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌ రక్షణ నియమాల్లోని 57, 58లకు విరుద్ధంగా రజాకార్లతో నగర వీధుల్లో పరేడ్‌ జరిపించాడు. మహిళా రజాకార్ల వ్యవస్థ ఏర్పాటుకూ ప్రయత్నాలు జరిగాయి. 

 


  1948, మార్చి 31న ఇత్తెహాద్‌-ఉల్‌-ముస్లిమీన్‌ పార్టీ హైదరాబాద్‌ ఆయుధ సప్తాహాన్ని దారుస్సలామ్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా కాశిం రజ్వీ ప్రసంగిస్తూ ‘హిందువులకు తమను తాము పాలించుకోవడం చేతకాదు. అసఫియా (ఆసఫ్‌జాహి) జెండాను దిల్లీలోని ఎర్రకోటపై త్వరలో ఎగురవేస్తాం’ అని ప్రకటించాడు. రజ్వీ రెచ్చగొట్టే ప్రసంగంపై భారత జాతీయ నాయకులు ఆగ్రహించారు. పార్లమెంటులో భారత ప్రభుత్వ విధానాన్ని కొందరు ప్రశ్నించారు. ఇంతలో రజాకార్లు రైళ్లపై దాడులు ప్రారంభించారు. 1948, మే 22న మద్రాసు నుంచి బొంబాయి వెళ్లే రైలుపై గంగాపుర్‌ స్టేషన్‌ వద్ద దాడి చేశారు. పుణె రైలుపైనా దాడి చేశారు. రజాకార్లు, పోలీసులతో, కమ్యూనిస్టులకు ఘర్షణలు జరిగాయి. అంతకుముందు 1948, జనవరి 10న కూడా రజాకార్లు బీబీనగర్‌ రైల్వేస్టేషన్‌ను దహనం చేశారు. ఆ గ్రామాన్ని లూటీ చేసి చాలామందిని తీవ్రంగా గాయపరిచారు. మోటుకొండూరు, మజ్రా సికిందర్‌ నగర్, చందనపల్లి, సోమవరం, వర్ధమానుకోట, పల్లెపహడ్, సూర్యాపేట ప్రాంతాల్లో రజాకార్లు ఇవే తరహా దాడులకు తెగబడ్డారు. 1948, జనవరిలో కరీంనగర్‌ జిల్లా మందాపురం కొండల్లో రజాకార్లతో జరిగిన పోరాటంలో ఆంధ్ర మహాసభ సభ్యులు భూపతిరెడ్డి, పి.ప్రభాకర్‌రెడ్డితో సహా ఎనిమిది మంది మరణించారు. ఖమ్మం జిల్లా మీనబోలు వద్ద 1948, జనవరి 15న రజాకార్లకు, కిసాన్‌ దళ సభ్యులకు జరిగిన పోరాటంలో ఆరుగురు గ్రామ రక్షక యువకులు మరణించారు. నల్గొండ జిల్లా, భువనగిరి తాలూకా రేణిగుంట గ్రామం వద్ద 1948, మార్చి 4న రేణిగుంట రామిరెడ్డి నాయకత్వంలో రజాకార్లను ఎదిరించి 12 గంటల సాయుధ పోరాటం చేశారు. ఈ పోరులో 26 మంది మరణించారు. గుండ్రాంపల్లిలో 1948, జులై 19న రజాకార్లు 21 మందిని వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. పాతర్ల పహాడ్, బెహ్‌రాం పల్లి, కూటిగల్లులోనూ రజాకార్లు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. ప్రజలను చంపడం, దోచుకోవడం, మహిళలపై అఘాయిత్యాలు, గృహదహనాలు నిత్యకృత్యాలయ్యాయి. నిజాం సంస్థానానికి చెందిన పరిటాల గ్రామం (విజయవాడ సమీపంలోనిది) భారత యూనియన్‌లో చేరినట్లు ప్రకటించగా, రజాకార్లు ఆ గ్రామ సరిహద్దుల్లో భారత భూభాగ ప్రజలపై దాడులు సాగించారు. 1948, జులై 28న నానజ్‌ వద్ద భారత సైన్యాలపై రజాకార్లు, నిజాం పోలీసులు దాడి చేయడంతో, భారత సైన్యం నానజ్‌ను ఆక్రమించింది. 1948, సెప్టెంబరులో భారత యూనియన్‌ హైదరాబాద్‌ సంస్థానంపై పోలీసు చర్య అనంతరం కాశిం రజ్వీ అరెస్టయ్యాడు. 1957లో జైలు నుంచి విడుదలై పాకిస్థాన్‌కు పారిపోయాడు. రజాకార్ల దుశ్చర్యలను వివిధ పత్రికలు ఖండించాయి. తాళ్లూరి రామానుజ స్వామి ఆధ్వర్యంలో నడిచిన హైదరాబాద్‌ వారపత్రిక, షోయబ్‌ ఉల్లాఖాన్‌ సంపాదకత్వంలో నడిచే ఇమ్రోజ్‌ పత్రిక, తెలుగుదేశం పత్రికలు ఇందులో ఉన్నాయి. అలియావర్‌ జంగ్‌ రచించిన ‘హైదరాబాద్‌ - ఇన్‌ట్రాస్పెక్ట్‌’ గ్రంథంలో రజాకార్ల వ్యవస్థను, వారి విధానాలను విమర్శించాడు.

 


మాదిరి ప్రశ్నలు


1. ఇత్తెహాదుల్‌ జైనుల్‌ ముస్లిమీన్‌ పార్టీ ఎప్పుడు ఏర్పడింది?

1) 1927, సెప్టెంబరు 2    2) 1927, అక్టోబరు 29

3) 1927, నవంబరు 29    4) 1927, డిసెంబరు 29 

 


2. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ పార్టీ ప్రథమ అధ్యక్షుడు ఎవరు?

1) సదర్‌ యార్‌ జంగ్‌      2) దిలావర్‌ జంగ్‌

3) ఇక్తియార్‌ జంగ్‌        4) కాశీం రజ్వీ

 


3. ‘ఆనల్‌ మాలిక్‌’ అంటే ఏమిటి?

1) నేనే దేవుడు 2) నేనే రాజు 3) మానవతావాది 4) దేవుడి ప్రతినిధి

 


4. కిందివారిలో ‘యార్‌ జంగ్‌’ బిరుదు ఎవరిది?

1) బహదూర్‌ యార్‌ 2) సదర్‌ యార్‌ 3) ఇక్తి యార్‌ 4) దిలావర్‌

 


5. రజాకారు దళం ఎప్పుడు ప్రారంభమైంది?

1) 1940, జులై    2) 1940, ఆగస్టు    3) 1940, సెప్టెంబరు    4) 1940, నవంబరు

 


6. రజాకార్లకు ఏ అధికారి శిక్షణ ఇచ్చేవాడు?

1) అఫ్సర్‌  2) సాలార్‌ 3) సాలార్‌ కబీర్‌  4) మీర్‌ కాజ్‌

 


7. ‘ఈ రాజ్యం నిజాం సొత్తు కాదు, ముస్లిం ప్రజలందరి ఆస్తి’ అని వ్యాఖ్యానించిన వారు?

1) బహదూర్‌ యార్‌ జంగ్‌  2) దిలావర్‌ జంగ్‌  3) సదర్‌ యార్‌ జంగ్‌ 4) సఫ్దర్‌ యార్‌ జంగ్‌

 


8. కింది ఏ ప్రాంతంలో జరిగిన సంఘటన రజాకార్ల విజృంభణకు నాంది పలికింది?

1) వరంగల్‌  2) సూర్యాపేట 3) కరీంనగర్‌ 4) డిచ్‌పల్లి 

 


9. కాశీం రజ్వీ రజాకార సంస్థకు ఎప్పుడు అధ్యక్షుడయ్యాడు?

1) 1940  2) 1944  3) 1946  4) 1948

 


10. హైదరాబాద్‌ ఇన్‌ట్రాస్పెక్ట్‌ గ్రంథ రచయిత ఎవరు?

1) అలియావర్‌ జంగ్‌ 2) ఆసఫ్‌ ఖాన్‌ 3) సహ్రియార్‌ 4) దిలావర్‌ జంగ్‌ 

 


సమాధానాలు

1-3, 2-1, 3-2, 4-1, 5-3, 6-4, 7-1, 8-4, 9-3, 10-1.

 


రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి
 

Posted Date : 26-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌