• facebook
  • whatsapp
  • telegram

రాజపుత్రులు

హర్షవర్ధనుడి మరణానంతరం క్రీ.శ. 7వ శతాబ్ది ద్వితీయార్ధం నుంచి 12వ శతాబ్దం ముగిసే వరకు సుమారు 550 ఏళ్లు రాజపుత్రులు ఉత్తర భారతదేశాన్ని పాలించారు. వీరు ధైర్యసాహసాలకు పేరుగాంచిన యుద్ధ ప్రియులు. ఉత్తర భారతదేశంలో అనేక చిన్న రాజ్యాలు స్థాపించి, దేశ చరిత్రలో అతి క్లిష్టమైన సమయంలో పరిపాలన సాగించారు. దేశంపై దండెత్తి వచ్చిన తురుష్కులతో పోరాడి, ఓడిపోయారు. పరస్పర పోరాటాల్లో నిమగ్నులైనప్పటికీ గుప్త-హర్షయుగ సాంస్కృతిక సంప్రదాయాలకు మెరుగులు దిద్దారు. వీరి చరిత్రకు అనేక ఆధారాలు ఉన్నాయి. వీటిలో చాంద్‌ బర్దాయ్‌ రచించిన పృథ్వీరాజ్‌ రాసో, కల్నల్‌ టాడ్‌ రచించిన రాజస్థాన్‌ కథావళి (The Annals of Rajasthan), కల్హణుడు రచించిన రాజతరంగిణి ముఖ్యమైనవి.

ప్రతీహారులు

రాజపుత్రుల్లో ప్రథములు ప్రతీహారులు. వీరిది ఝూర్జర జాతి. మధ్య ఆసియాకు చెందిన వారు. వీరు 5వ శతాబ్దంలో భారతదేశంపై దండెత్తి, మొదట ఆరావళి పర్వతాలకు పశ్చిమ భాగాన ఉన్న రాజస్థాన్‌లో స్థిరపడ్డారు. ఈ ప్రాంతానికి ఝార్జర రాష్ట్రం అనే పేరుంది. వీరి మొదటి రాజధాని జోధ్‌పూర్‌లోని భీమ్‌మల్‌. తర్వాత కనోజ్‌ను రాజధానిగా చేసుకుని పాలించారు. 

ఈ వంశ స్థాపకుడు హరిశ్చంద్రుడు. ఇతడి తర్వాత వత్సరాజు రాజ్యపాలన చేశాడు. 

ఈ వంశంలో మరో ప్రసిద్ధ రాజు మిహిర భోజుడు. అరబ్బు బాటసారి సులేమాన్‌ క్రీ.శ.851లో భోజుడి ఆస్థానాన్ని సందర్శించాడు. సులేమాన్‌ తన రచనల్లో భోజుడి రాజ్య వైభవాన్ని వర్ణించాడు.

గహద్వాల వంశం 

(క్రీ.శ.1085 - 1202)

గహద్వాలులు క్రీ.శ.1085లో కనోజ్‌ను ఆక్రమించి పరిపాలించారు. వీరి రాజధాని కనోజ్‌. ఈ వంశానికి మూలపురుషుడు చంద్రదేవుడు. ఇతడు ప్రజల నుంచి ‘తురక దండ’ అనే పన్నును వసూలు చేశాడు. ఆ సొమ్ముతో సైన్యాన్ని పెంపొందించి ముస్లింలను ఎదిరించాడు. 

ఈ వంశంలో జయచంద్రుడు సుప్రసిద్ధుడు. ఇతడు క్రీ.శ. 1192లో రెండో తరైన్‌ యుద్ధంలో మహమ్మద్‌ ఘోరీకి సహాయం చేశాడు. పృథిÅ్వరాజ్‌కు వ్యతిరేకంగా జయచంద్రుడు ఘోరీకి సాయం అందించాడు. క్రీ.శ.1194లో చందావార్‌ యుద్ధంలో ఘోరీ జయచంద్రుడ్ని ఓడించాడు. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ వంశంలో చివరి పాలకుడు జయచంద్రుడి కుమారుడు హరిశ్చంద్రుడు.

చౌహాన్‌లు

ఈ వంశానికి మూలపురుషుడు సింహరాజు. ఇతడికి మహారాజాధిరాజు అనే బిరుదు ఉంది.

♦ అజయరాజు (అజయమేరు) అజ్మీర్‌ నగరాన్ని నిర్మించాడు.

♦ మరో పాలకుడైన విశాలదేవుడు ఢిల్లీ రాజులైన తోమారులను ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు. ఇతడు స్వయంగా కవి. హర్షకేళి అనే గ్రంథాన్ని రచించాడు. విశాలదేవుడి ఆస్థాన కవి సోమదేవ మహాకవి. ఈయన విశాలదేవుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ, ‘లలితా విగ్రహరాజు’ అనే గ్రంథాన్ని రచించాడు. విశాలదేవుడు అజ్మీర్‌లో ఒక విద్యాపీఠాన్ని నిర్మించాడు.

♦ ఈ వంశంలో మరో గొప్ప పాలకుడు పృథ్వీరాజ్‌. ఇతడు ముస్లిం దండయాత్రలను తిప్పికొట్టి సోలంకి, చందేల, గహద్వాల రాజులను ఓడించాడు. క్రీ.శ.1191లో జరిగిన మొదటి తరైన్‌ యుద్ధంలో పృథ్వీరాజ్‌ చేతిలో మహమ్మద్‌ ఘోరీ ఓడిపోయాడు. రెండో తరైన్‌ యుద్ధంలో పృథ్వీరాజ్‌ను ఘోరీ ఓడించి, సంహరించి ఢిల్లీ, అజ్మీర్‌లను ఆక్రమించాడు.

♦ చాంద్‌ బర్దాయ్‌ ‘పృథ్వీరాజ్‌ రాసో’ అనే గ్రంథంలో పృథ్వీరాజ్‌ గొప్పతనం గురించి వివరించారు.


చందేలులు 

(క్రీ.శ.950 - 1202)

వీరు మధ్య భారతదేశంలోని బుందేల్‌ఖండ్‌లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. వీరి రాజధాని ఖజురహో. 

* క్రీ.శ.950లో యశోవర్మ చందేల రాజ్యాన్ని నెలకొల్పాడు. 

* ఈ వంశ మూలపురుషుడు జయశక్తి.

* వీరిలో గొప్పవాడు విద్యాధరుడు. ఇతడి కాలంలోనే గజనీ మహమ్మద్‌ చందేల రాజ్యంపై దండెత్తాడు. దీన్ని విద్యాధరుడు సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈ వంశంలో చివరి రాజు పెరుమాళ్‌.

కాలచూర్యులు

ఈ వంశ రాజ్య స్థాపకుడు కొక్కళుడు. గాంగేయదేవుడు కాలచూర్య రాజ్యాన్ని విస్తరించాడు. మరో పాలకుడైన కర్మదేవుడి కాలంలో ఈ రాజ్యం మహోన్నత దశకు చేరింది. ఈ వంశంలో చివరి పాలకుడు విజయసింహుడు.

పాలరాజులు

ఈ వంశానికి మూలపురుషుడు గోపాలుడు. వీరి రాజధాని ఉద్ధండపురి. వీరి కాలంలో బౌద్ధమతానికి రాజాదరణ లభించింది. 

* మరో రాజైన ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. 

* పాలరాజుల కాలంలోనే ఉద్ధండపుర, జగద్దల విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. 

* ఈ వంశంలో చివరి పాలకుడు మహిపాలుడు.

సేన వంశస్థులు

ఈ వంశానికి మూల పురుషుడు సామంత సేనుడు. 

* ఈ పాలకుల్లో లక్ష్మణసేనుడు గొప్పవాడు. ఇతడు స్వయంగా కవి, పండిత పోషకుడు. ఇతడి ఆస్థానంలో పంచరత్నాలు అనే కవులు ఉండేవారు. 

* గీతగోవిందం రాసిన జయదేవుడు లక్ష్మణసేనుడి ఆస్థాన కవి. 

* లక్ష్మణసేనుడి పేరున స్థాపించిన కొత్త శకం, నేటికీ మిథిల ప్రాంతంలో వాడుకలో ఉంది. 

* సేన వంశీయుల కాలంలో బిహార్, బెంగాల్‌ ప్రాంతాల్లో హిందూ ధర్మ శాస్త్రానుగుణంగా సాంఘిక పునర్నిర్మాణం జరిగింది. 

* బ్రాహ్మణ - క్షత్రియ వర్ణాల్లో వారి వారి వంశ గౌరవం ఆధారంగా తరగతులు ఏర్పడ్డాయి.

సోలంకిలు

సోలంకి రాజ్యాన్ని క్రీ.శ.945లో మూలరాజు స్థాపించాడు. వీరి రాజధాని అన్విల్‌వాడ్‌. క్రీ.శ.1026లో మొదటి భీమరాజు కాలంలో గజినీ మహమ్మద్‌ సోలంకి రాజ్యంపై దండెత్తి ప్రసిద్ధ సోమనాథ దేవాలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేసి, దోచుకున్నాడు. 

* ఈ వంశంలో గొప్పవాడు జయసింహుడు. ఇతడి మంత్రి హేమచంద్రుడు. ఈయన గొప్ప జైన పండితుడు. 

* వారసత్వ గొడవల కారణంగా సోలంకి వంశం అంతరించింది.

సాహిత్యం

రాజపుత్ర రాజుల కాలంలో కావ్య, నాటక, ప్రక్రియలకు; అలంకార, నిఘంటు గ్రంథాల రచనలకు విశేష ఆదరణ లభించింది. 

* వీరి సమయంలోనే మాఘుడు - శిశుపాలవధ కావ్యాన్ని; క్షేమేంద్రుడు - బృహత్కథాకోశాన్ని; జయదేవుడు - గీతగోవిందం గేయాన్ని; భవభూతి - ఉత్తర రామచరితం, మాలతీ మాధవాన్ని; కృష్ణమిశ్రుడు - ప్రభోచంద్రోదయాన్ని; రాజశేఖరుడు - ప్రాకృత కర్పూర మంజరి నాటకాన్ని; ఆనంద వర్ధనుడు - ధ్వన్యాలోకం అలంకార గ్రంథాన్ని రచించారు. 

* హేమచంద్రుడు రచించిన కుమారపాల చరితం (సంస్కృత-ప్రాకృత రచన), అభిదాన చింతామణి నిఘంటు గ్రంథ రచనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

* రాజపుత్ర రాజులు స్వయంగా అనేక రచనలు చేశారు. వీరిలో పరమార ముంజ, భోజ రాజులు సోలంకీ మహిపాలుడు, లక్ష్మణసేనుడు ముఖ్యులు. 

భోజుడు అనేక విజ్ఞాన శాఖల మీద ప్రామాణికమైన గ్రంథాలు రాశాడు. ఇతడు చంపూ శైలిలో రాసిన రామాయణం ప్రథమ కావ్యమై, తర్వాతి కవులకు మార్గదర్శకమైంది. సరస్వతీ కంఠాభరణం, యుక్తికల్పతరువు (రాజనీతి గ్రంథం), సమరాంగణ సూత్రధార (వాస్తు విద్యపై), తత్త్వప్రకాశం అనే శైవతత్వ పరమైన గ్రంథం మొదలైనవన్నీ ఇతడి రచనలే.

* చారిత్రక రచన అవతరణ వీరి కాలంలోనే ప్రారంభమైంది. క్షేమేంద్రుడు రచించిన నృపావళి మొదటి చారిత్రక రచన. 

* పద్మగుప్తుడి నవసాహసాంక చరితం, బిల్హణుడి కర్ణసుందరి, విక్రమాంక చరితం మొదలైనవి తర్వాతి కాలంలో వచ్చాయి. 

* చారిత్రక రచనలు చేసిన వారిలో కల్హణ కవిని గొప్పవాడిగా చరిత్రకారులు పేర్కొంటారు. ఇతడి రాజతరంగిణి (కశ్మీర్‌ రాజ వంశాల చరిత్ర)ఎంతో ప్రఖ్యాతి పొందింది. 

* రాజపుత్రుల కాలంలో దేశవ్యాప్తంగా సంస్కృతం రాజభాషగా గుర్తిపు పొందింది.

నిర్మాణాలు

రాజపుత్రులు వాస్తు-శిల్ప కళలను ఆదరించారు. వీరు శత్రుదుర్భేద్యాలైన గిరి దుర్గాలను, అందులో అందమైన రాజప్రాసాదాలను, అనేక దేవాలయాలను నిర్మించారు. 

* వీరు నగరాలను దుర్గాలు, కొండలు, అడవులు, సరోవరాల మధ్య నిర్మించారు. ఇవి ప్రకృతి సౌందర్యంతో ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. 

* రాజపుత్రులు కలంజర్, అజ్మీర్, గ్వాలియర్, చిత్తోడ్, జయపూర్, జోధ్‌పూర్‌ మొదలైన చోట్ల దుర్గాలు, ప్రాసాదాలను కట్టారు. అవి ఆయా ప్రాంతాల్లో నేటికీ శిథిల రూపంలో దర్శనమిస్తూ, అప్పటి ప్రాచీన ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.

* వీరు నాగర శైలిని ఎక్కువగా వినియోగించారు.

* ఒడిశాలోని కోణార్క్‌ సూర్యదేవాలయం, పూరీలోని జగన్నాథ దేవాలయం, భువనేశ్వర్‌లోని లింగరాజు, రాణా ఆలయాలు వీరి కళా నైపుణ్యానికి నిదర్శనాలు. 

* 12వ శతాబ్దంలో తూర్పు గాంగ రాజైన అనంతవర్మ చోడ గాంగ రాజు లింగరాజు ఆలయాన్ని, జగన్నాథ ఆలయాన్ని నిర్మించాడు. 

* ఖజురహోలోని దేవాలయాలను చందేలులు నిర్మించారు. 

* అబూ శిఖరంపై మాణిక్‌ సోదరులు వృషభనాథ, నేమినాథ దేవాలయాలు నిర్మించారు. ఇవి జైన సంప్రదాయాన్ని తెలియజేస్తున్నాయి. 

* అనంతవర్మ కాలంలో లలితాదిత్యుడు మార్తాండ్‌లో సూర్యదేవాలయాన్ని నిర్మించాడు.

పరమారులు

పరమార వంశ స్థాపకుడు ఉపేంద్రుడు. ఇతడు క్రీ.శ.820లో మాల్వాలో పరమార రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని ధారానగరం. ఈ వంశంలో ఏడో రాజు ముంజరాజు. ఈయన కవి, పండిత పోషకుడు. ఇతడి ఆస్థానంలో ధనుంజయ, హాలాయుధ, పద్మగుప్త అనే కవులు ఉండేవారు. 

* ఇతడు అనేక దేవాలయాలు నిర్మించాడు. వ్యవసాయాభివృద్ధికి చెరువులు తవ్వించాడు. ముంజేశ్వర తటాకం ఇతడు ఏర్పాటు చేసిందే.

ఈ వంశంలో మరో గొప్ప పాలకుడు భోజరాజు. ఇతడు భోజపురం అనే నగరాన్ని నిర్మించాడు. అక్కడ ఒక సంస్కృత కళాశాలను, భోజ సరస్సును ఏర్పాటు చేశాడు. 

సాంస్కృతిక సేవలు

రాజపుత్రుల కాలంలో ఎన్నో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు సంభవించాయి. ప్రధానంగా భూస్వాములు పుట్టుకొచ్చారు. హిందూమత ప్రాబల్యం ఎక్కువైంది. ఎన్నో కులాలు ఏర్పడ్డాయి. సమాజంలో స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది. భారతదేశ చరిత్రలో రాజపుత్ర యుగం విశిష్టమైంది. దేశభక్తి, ధైర్య సాహసాలకు పేరుపొందిన రాజపుత్రులు సమర్థ పాలనను అందించారు. వీరి కాలంలోనే భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. హిందూమతంతో పాటు ఇస్లాం మతాన్నీ ఆదరించారు. భాషా, సాహిత్యాల అభివృద్ధికి; వాస్తు కళారంగాల విస్తరణకు కృషి చేశారు.

పరిపాలనా విధానం

రాజపుత్రుల రాజకీయ వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రధానమైంది. రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం భుక్తులు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. రాజు సర్వాధికారి. అతడి సార్వభౌమాధికారం దైవదత్తాధికార, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల మిశ్రమంగా ఉండేది. రాజుకు పాలనలో యువరాజు, పట్టమహిషి, మంత్రి మండలి సహాయపడేవారు. ప్రధాన రాజపురోహితుడు, జ్యోతిష్కుడు మంత్రి మండలిలో సభ్యులుగా ఉండేవారు. భుక్తి లేదా రాష్ట్ర ప్రతినిధులను రాజ ప్రతినిధులుగా పిలిచేవారు. విషయాలకు విషయపతి, గ్రామాలకు గ్రామపతి పాలకులుగా ఉండేవారు. ఉత్తర భారతదేశంలో భూస్వామ్య ప్రభువుల జోక్యం వల్ల గ్రామ స్వపరిపాలన కుంటుపడింది. కానీ ఇదే సమయంలో దక్షిణాదిన చోళుల పాలనలో గ్రామ స్వపరిపాలన చక్కగా సాగింది. రాజు సొంత సైన్యంతో పాటు భూస్వాముల సైన్యమూ రాజ్య విస్తరణలో సహాయపడేది. సైనిక సర్వీసు కేవలం రాజపుత్రులకే పరిమితమై ఉండేది. సైనిక వ్యయం అధికంగా ఉండటం వల్ల ప్రజలపై పన్ను భారం ఎక్కువగా ఉండేది. న్యాయపాలనలోనూ రాజే సర్వాధికారి. భుక్తుల్లో దండనాయకుడు న్యాయాన్ని నిర్ణయించేవాడు. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఉండేది. భూమిశిస్తు నిర్ణయించి, వసూలు చేసే బాధ్యత వీరిదే.

సామాజిక వ్యవస్థ

రాజపుత్ర యుగం నాటి సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ జటిలమయ్యాయి. కుమ్మరి, చేనేత, కంసాలి, మంగలి, జాలరి, మేళగాడు లాంటి కులాలు, ఉపకులాలతో పాటు రాజపుత్రులనే కొత్త కులం ఆవిర్భవించింది. కాయస్థ కులం ఈ కాలంలో ఉండేది. అధికంగా శ్రమించే కులాలను అస్పృశ్యులు, అంటరానివారుగా పరిగణించేవారు. భూస్వామ్య ప్రభువులుగా వ్యవహరించే రాణాలు, సామంతులు శక్తిమంతమైన వర్గంగా ఎదిగారు. ఓడిపోయిన రాజులు, స్థానిక అధిపతులు, యుద్ధ నిపుణులు, తెగ నాయకులు ప్రత్యేక భూస్వామ్య వర్గాలుగా ఆవిర్భవించారు. రాజు వీరికి దానం చేసిన భూములను భోగ లేదా జమీ భూములు అనేవారు. ప్రభుత్వ పదవులను వంశ పారంపర్యంగా అనుభవించేవారు. ఆడపిల్ల పుట్టగానే చంపే ఆచారం ఈ యుగంలోనే ప్రారంభమైంది. బహు భార్యత్వం, పరదా పద్ధతి, జౌహార్‌, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాల వల్ల స్త్రీల పరిస్థితి దయనీయంగా మారింది. స్త్రీలకు భూమి హక్కు ఉండేది కానీ విద్యావకాశాలు చాలా తక్కువ.

మత పరిస్థితులు

రాజపుత్ర యుగంలో జైన, బౌద్ధ మతాలు క్షీణించి హిందూమతం అభివృద్ధి చెందింది. శైవ, వైష్ణవ మతాలకు ఆదరణ పెరిగింది. భక్తి ఉద్యమాల ప్రభావంతో త్రిమూర్తుల ఆరాధన ప్రాధాన్యం పొందింది. ఉత్తర భారతదేశంలో శక్తి ఆరాధన (స్త్రీ దేవతల ఆరాధన) మరింత పెరిగింది. హిందువులు స్త్రీ మూర్తిని దుర్గ, కాళీ రూపాల్లో శివుడి అర్ధభాగంగా భావించి పూజించేవారు. అనేక దేవాలయాల నిర్మాణాలు రాజపుత్ర యుగంలో హిందూమతానికి దక్కిన ఆదరణకు సాక్ష్యాలుగా నిలిచాయి.

ఆర్థిక పరిస్థితులు

రాజపుత్ర యుగం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా భూస్వామ్య వ్యవస్థపై ఆధారపడింది. వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, వ్యవసాయం ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని వారసత్వ హక్కుగా అనుభవించే ఆర్థిక వ్యవస్థనే భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజంగా పేర్కొంటారు. ఈ యుగంలో అదనంగా పంటలు పండించి వాణిజ్యం చేసే ప్రయత్నాలు చేయలేదు. భూస్వామ్య ప్రభువుల ఒత్తిడి వల్ల రైతులు కనీస పంటలు పండించడమే మేలని భావించేవారు. వాణిజ్యం, నాణేల చెలామణి తగ్గిపోయాయి. రోమన్‌, ససానిడ్‌ రాజ్యాలు దెబ్బతినడంతో విదేశాల్లో భారతీయ వస్తువులకు గిరాకీ తగ్గి విదేశీ వాణిజ్యం క్షీణించింది. కోస్తా, బెంగాల్‌ ప్రాంతాల్లోని పట్టణాలు పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సంబంధాలను కొనసాగించాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వృత్తి పనివారి సంఘాలకు (శ్రేణులు) ప్రాముఖ్యం తగ్గిపోయింది. భూమి ఇచ్చిన రాజు, సేద్యం చేసే రైతు ఇద్దరూ బలహీనపడి భూస్వామ్య ప్రభువులు బలపడ్డారు. భూమిశిస్తు కంటే అధికంగా పన్నులు చెల్లించడం వల్ల రైతులు ఆర్థికమాంద్యంలో కూరుకుపోయారు. దేవాలయ అధికారులూ రైతుల నుంచి పన్నులు వసూలు చేసేవారు. రాజులు, సామంతులు సైనిక వ్యయంతోపాటు దేవాలయాలు, కోటల నిర్మాణానికి, వాటి అలంకరణకు అధికంగా ఖర్చు చేసేవారు. ఈ విధానాలే అనంతర కాలంలో విదేశీయులు మనపై దాడిచేసి, దోపిడీ చేయడానికి కారణమయ్యాయి.

Posted Date : 14-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌