• facebook
  • whatsapp
  • telegram

అసఫ్‌జాహీల పాలన - అభివృద్ధి

హైదరాబాద్‌లో ఆధునిక ప్రగతి!

అసఫ్‌జాహీల కాలంలో హైదరాబాద్‌ అన్ని విధాలుగా ఆధునిక యుగ అభివృద్ధిని సాధించింది. రాజ్యం సుబాలు, జిల్లాలుగా మారి సమర్థపాలనలో సాగింది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నాణేల ముద్రణ, భూమిశిస్తు పద్ధతులు అమలయ్యాయి. నిజాంల వైభవ ప్రతీకలుగా అనేక చారిత్రక నిర్మాణాలు వెలిశాయి. వరద నివారణ, తాగునీటి కోసం రిజర్వాయర్లు ఏర్పడ్డాయి. రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలు, తంతి-తపాలా సౌకర్యాలు సమకూరాయి. పారిశ్రామికంగా గుర్తించదగినంత ప్రగతి జరిగింది. 

 

  అసఫ్‌జాహీల పాలనలో హైదరాబాద్‌ సంస్థానం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా చివరి పాలకుడైన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కాలంలో అనేక నిర్మాణాలు, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రజోపయోగ కార్యక్రమాలు జరిగాయి.

  మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (1911-48): ఈయన  మహబూబ్‌ అలీఖాన్‌ కుమారుడు. ఏడో అసఫ్‌జా బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు.చివరి అసఫ్‌జాహీ పాలకుడు. ఈయన కాలంలో హైదరాబాద్‌ అన్ని రంగాల్లో ప్రగతిని సాధించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు మద్దతుగా నిలిచిన నిజాం వారికి భారీస్థాయిలో ధన సహాయం చేశాడు. యుద్ధానంతరం  నిజాంకు ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రిటన్‌ రాజు వర్తమానం పంపాడు. ఉస్మాన్‌ అలీఖాన్‌కు అంతకుముందున్న ‘హిజ్‌ హైనెస్‌ ద నిజాం’ బిరుదును బ్రిటిషర్లు 1918, జనవరి 14న ‘హిజ్‌ ఎగ్జాల్టెడ్‌ హైనెస్‌’గా మార్చి అతడి హోదాను పెంచారు. 1912లో ఆంగ్లేయులు నిజాంను ‘నైట్‌ గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ అనే బిరుదుతో సత్కరించారు. 1918లో ఉర్దూ బోధనాభాషగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. భారతదేశ భాష బోధనాంశంగా ఏర్పడిన మొదటి విశ్వవిద్యాలయమిదే. నిజాం 1922లో తన పరిపాలనాశాఖ నుంచి న్యాయశాఖను వేరు చేశాడు.

  అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిజాం 1923లో చౌమొహల్లా ప్యాలెస్‌లో ఉత్సవాన్ని నిర్వహించాడు. 1931, నవంబరు 12న టర్కీ మాజీ సుల్తాన్‌ అబ్దుల్‌ మజీద్‌ఖాన్‌ కుమార్తె దుర్దానాను, మేనకోడలు నీలోఫర్‌ను నిజాం కుమారులకు ఇచ్చి ఫ్రాన్స్‌లోని నైస్‌లో వివాహాలు జరిపించారు. 1933, మే 14న హైదరాబాద్‌ రెసిడెంట్‌ హంప్రీకీస్, రెసిడెన్సీ బజారును నిజాంకు స్వాధీనం చేయగా ఆయన దానికి సుల్తాన్‌బజార్‌ అని పేరుపెట్టాడు. నిజాం తన పాలనాకాలం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1937, ఫిబ్రవరి 13న సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు జరిపించాడు. ఈ సందర్భంగా జూబ్లీహాల్‌ను నిర్మించాడు. నగరంలో మూసీనది పొడవునా కరకట్టల నిర్మాణాలను చేపట్టాడు. మూసీనది వరద నివారణ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహాయంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ రిజర్వాయర్‌లను నిర్మించాడు. 1931లో నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించాడు. నిజాం 1914లో పురావస్తు శాఖను నెలకొల్పాడు. ఔరంగాబాద్‌ సమీపంలోని అజంతా, ఎల్లోరాలోని గుహాలయాలు, చిత్రాలను పరిరక్షించాడు. ఈ చిత్రాలు, గుహల పరిశోధన కోసం రూ.30 లక్షలు ఖర్చుచేసి ప్రొఫెసర్‌ సెక్కొని, కౌంట్‌ ఓర్సి అనే ఇద్దరు నిపుణులను ఇటలీ నుంచి రప్పించాడు. వీరు వివిధ గుహాలయాలు, చిత్రాలను వెలుగులోకి తెచ్చారు.  పబ్లిక్‌ గార్డెన్‌ (1864లో ఏర్పాటైంది)లో 1930లో స్టేట్‌ మ్యూజియాన్ని నిర్మించాడు. అజంతా చిత్రాల ప్రతిరూపాలున్న మ్యూజియం దేశంలో ఇదొక్కటే. ఇంకా పురావస్తుశాఖ వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం లాంటి వాటిని పరిరక్షించింది. తవ్వకాలు చేపట్టి బహమనీ, కుతుబ్‌షాహీల నాణేలను వెలుగులోకి తెచ్చింది. నిజాం 1926లో ఉస్మానియా మెడికల్‌ కళాశాల, 1929లో ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల, 1936లో సెకండరీ విద్యాబోర్డులను ప్రారంభించాడు. 

 

రవాణా సౌకర్యాలు

1938లో వాయు మార్గ రవాణా ప్రారంభమైంది. 1940 నాటికి వాయు మార్గ రవాణా వ్యవస్థ బేగంపేట కేంద్రంగా పైలట్‌లకు శిక్షణ ఇచ్చేది. బేగంపేటతోపాటు హకీంపేట, వరంగల్, ఔరంగాబాద్, బీదర్‌లలో విమానాశ్రయాలు ఉండేవి. 1945లో ప్రారంభించిన దక్కన్‌ ఎయిర్‌వేస్‌ సంస్థను నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్‌వేస్‌ కలసి నిర్వహించేవి. 1946 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. 1879లో నిజాం స్టేట్ రైల్వేశాఖ ఏర్పడింది. 1930లో నిజాం ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేసే వరకు నిజాం గ్యారెంటీడ్‌ స్టేట్‌ రైల్వే అనే పేరుతో బ్రిటిష్‌ ప్రైవేటు కంపెనీ నిర్వహించేది. ఖాజీపేట బలార్షాల మధ్య రైల్వే లైను వేయడంతో హైదరాబాదు, దిల్లీల మధ్య దూరం తగ్గింది. బ్రిటిష్‌ ప్రభుత్వం 1864, ఫిబ్రవరి 29న బొంబాయి నుంచి మద్రాస్‌ వెళ్లే రైలు మార్గాన్ని ప్రారంభించింది. ఈ రైలు మార్గం హైదరాబాదు రాష్ట్రంలోని వాడి ద్వారా వెళ్లేది. 1874, అక్టోబరు 8న హైదరాబాదు నుంచి ‘వాడికి’ వెళ్లే రైలు మార్గాన్ని హైదరాబాదు ప్రభుత్వం ప్రారంభించింది. 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. దీన్నే హైదరాబాదు ‘దక్కన్‌ రైల్వే స్టేషన్‌’ అని కూడా పిలుస్తారు. దీన్ని ముఖ్యంగా వస్తువులను రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు. 1921లో మొదటి ప్యాసింజర్‌ రైలు ఈ స్టేషన్‌ నుంచి ప్రారంభమైంది. ఉర్దూ భాషలో నామ్‌ అంటే తడి తడిగా ఉన్న భూభాగం ‘పల్లి’ అంటే ప్రాంతం. కాచిగూడ రైల్వేస్టేషన్‌ 1916లో నిర్మితమై, 1950 వరకు నిజాం రాజ్య గ్యారంటీడ్‌ రైల్వేస్టేషన్‌ హెడ్‌క్వార్టర్‌గా కొనసాగింది. 1916 వరకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ హెడ్‌క్వార్టర్‌గా ఉండేది. ఈ స్టేషన్‌ సెంట్రల్, సైడ్‌ డోమ్‌లతోపాటు మినరేట్స్‌ను కలిగి ఉంది. గోథిక్‌ ఆర్కిటెక్చర్‌తో అందంగా నిర్మించారు. 1899లో హైదరాబాద్‌ నుంచి మన్మాడ్‌ వరకు రైలు మార్గం ప్రారంభమైంది. డోర్నకల్‌ జంక్షన్‌ నుంచి సింగరేణి కాలరీస్‌ రైలు మార్గం 1888లో ప్రారంభమైంది. 1889లో బలార్షా-కాజీపేట రైలు మార్గం ప్రారంభమైంది. నిజాం రాజ్యంలో రైల్వే లైన్ల నిర్మాణం 1930 వరకు ప్రైవేటు బ్రిటిష్‌ కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగేది. కానీ, 1930లో దీన్ని నిజాం రాజ్య స్టేట్ రైల్వే బోర్డు ఆధ్వర్యంలోకి తెచ్చాడు. ఆ తర్వాత మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాలన అంతమయ్యే వరకు అంటే 1948 వరకు నిజాం ప్రభుత్వ అధీÅనంలోనే కొనసాగింది. 1932లో దేశంలోనే మొదటిది అయిన నిజాం రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. నిజాం ప్రభుత్వం బస్సు డిపోలను ప్రారంభించింది. బ్రిటిష్‌ కంపెనీలు బస్సు ఇంజిన్లను సరఫరా చేయగా, ఆల్విన్‌ కంపెనీ బస్సులను నిర్మించేది. 1871లో తంతి, తపాలా శాఖ ఏర్పడింది. ఇదే సంవత్సరం నవాబు షాసావర్‌ జంగ్‌ను ప్రథమ తపాల శాఖాధికారిగా/ పోస్టు మాస్టర్‌ జనరల్‌గా నియమించారు. 1885లో హైదరాబాదు నగరంలో మొదటి టెలిఫోన్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. సింగరేణి బొగ్గు గనులను 1876లో జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన డా.విల్‌ఫ్రిడ్‌ కింగ్‌ కనుక్కున్నారు.

 

సంస్కరణలు

నిజాంలు: ఖానూన్‌ ఇన్సిదాదె ముఖన్నిషాన్‌ పేరున ఏడో నిజాం ఒక ఆర్డినెన్స్‌ (ఫర్మానా)ను జారీ చేశాడు. దీని ప్రకారం విపరీతంగా పెరిగిపోతున్న నిస్వార్థ హిజ్రాల శ్రేణుల్లోకి కొత్త వారికి ఆకర్షించడాన్ని ఆపివేశాడు. ఎద్దుల పోటీలు, కోడిపందాలు, నవాబులు పాచికలను విసిరి తమ ప్రాంతాలను పాలించే సంప్రదాయన్ని, దేవదాసీ వ్యవస్థను నిషేధించాడు. ప్రభుత్వ ఉద్యోగులు గానా బజానాలు, నాట్యం లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నియంత్రించాడు. కోర్టు గదుల్లో పొగ తాగడాన్ని నిషేధించాడు, 1922లో మరణ శిక్షను రద్దు చేశాడు. ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాడు. 

 

సాలార్‌ జంగ్‌ (క్రీ.శ.1853-1883): సాలార్‌జంగ్‌ 1853లో నాసిరుద్దౌలా కాలంలో దివాను(ప్రధాని)గా నియమితుడయ్యాడు. ఈయన అసలు పేరు నవాబు తురబ్‌ అలీఖాన్‌. ఇతడు ముగ్గురు నిజాం పాలకుల దగ్గర పనిచేశాడు. దివాను కాకముందు ఆంగ్లేయాధికారి డైటన్‌ వద్ద పరిపాలన అనుభవాన్ని గడించాడు. దివాను అయ్యేనాటికి హైదరాబాదు రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. సాలార్‌ జంగ్‌ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాదు రాజ్యంలో ప్రగతి సాధించాడు. ఇతడు పరిపాలన, ఆర్థిక, న్యాయ, విద్యా సంస్కరణలు చేశాడు.

 

పరిపాలనా సంస్కరణలు: సాలార్‌జంగ్‌ 1865లో జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి రాజ్యాన్ని 17 జిల్లాలుగా, 5 సుబాలుగా విభంజించాడు. సుబాకు అధికారి సుబేదార్‌. తాలుకాదారు జిల్లా అధికారి. ఇతడినే తహసీల్దార్‌ అనేవారు. తాలుకాదారుల పనిని పర్యవేక్షించేందుకు మజ్లిస్‌-ఇ-మల్‌-గుజరి అనే పాలనా సంస్థను 1865లో ఏర్పాటు చేశాడు. ‘‘1868 లో సదర్‌ ఉల్‌ మహమ్‌’’ అనే పేరుతో నలుగురు మంత్రులను నియమించి పోలీసు, న్యాయ, రెవెన్యూ శాఖలు నాలుగో మంత్రికి ప్రజాసంక్షేమం, విద్య, ఆరోగ్య స్థానిక సంస్థలు అప్పగించాడు.

 

ఆర్థిక సంస్కరణలు: 1860లో  బ్రిటిషర్లు  తమ ఆక్రమణలో ఉన్న ధార శివ, రాయ్‌ దుర్గ్, నవ దుర్గ్‌ జిల్లాలను నిజాంకు ఇచ్చారు. సాలార్‌జంగ్‌ రైతులను ఇజరా(కౌలుకు)లిచ్చి వాణిజ్య పంటలను ప్రోత్సాహించాడు. కేంద్ర ఖజానాను ఏర్పాటు చేసి ద్రవ్య విధానాన్ని సంస్కరించాడు. హాలీసిక్కా అనే కొత్త రూపాయిని ప్రవేశపెట్టాడు. నాణేల ముద్రణ కోసం కేంద్ర ముద్రణాలయాన్ని హైదరాబాదులో, ప్రాంతీయ ముద్రణాలయాలను గద్వాల, నారాయణపేటల్లో ఏర్పాటు చేశాడు. వాణిజ్య సుంకాలు, క్రయ విక్రయాలు, రహదారులు, అడవులు, అబ్కారీ లాంటి వాటిని క్రమబద్దం చేశాడు. ఆంగ్లేయులకు నిజాం ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయల రుణాన్ని రద్దు చేయించాడు. దీంతో రాజ్య ఆదాయం బాగా పెరిగింది. 1875లో ‘రెవెన్యూ సెటిల్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను’ ఏర్పాటు చేశాడు. ఇనాం భూములు రద్దు చేశాడు. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 

 

పోలీసు సంస్కరణలు: 1865కు ముందు హైదరాబాదు రాజ్యంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థ లేదు. సాలార్‌జంగ్‌ ‘మహ్‌-కామా-ఇ-కోత్వాలి’ అనే పోలీసు శాఖను ఏర్పాటు చేశాడు. ‘నిజామత్‌’’ పేరుతో పోలీసు దళాన్ని ఏర్పాటు చేశాడు. పోలీసు సూపరింటెండెంట్‌ను ‘మహతామీన్‌’ అని, ఇన్‌స్పెక్టర్‌ను ‘అమీన్‌’ అని పిలిచేవారు. పోలీసు స్టేషన్‌లను చౌకీలనేవారు.

 

న్యాయ సంస్కరణలు: సుప్రీంకోర్టును మజ్లిస్‌ - ఇ - మురఫా, ప్రధాన న్యాయమూర్తిని నాజిమ్, హైకోర్టును ‘మహ్‌-కామా-ఇ-సదర్‌’ అని వ్యవహరించేవారు. ముస్లిం చట్టాల అమలుకు దారుల్‌కాజీ కోర్టు, మత సంబంధ విరాళాల విచారణకు మహ్‌- కామా-ఇ-సదారత్‌ అనే కోర్టులుండేవి. హైదరాబాదులో బుజంగ్‌ దివానీ అదాలత్, కుర్దు దివానీ అదాలత్‌ అనే సివిల్‌ కోర్టులు, ఫౌజుదారీ అదాలత్‌ అనే క్రిమినల్‌ కోర్టులుండేవి. మున్సిఫ్, మీర్‌ అదిల్‌ అనే జిల్లా న్యాయాధికారులు ఉండేవారు. జిల్లా తాలుకాల్లో సివిల్, క్రిమినల్‌ కోర్టులు, గ్రామాల్లో పటేల్, పట్వారీలు నేర విచారణ చేసేవారు. మరణ శిక్ష, కాళ్లు, చేతులు నరకడం, సతీసహగమనం లాంటి వాటిని సాలార్‌ జంగ్‌ రద్దు చేశాడు. బ్రిటిష్‌ ఇండియాలోని న్యాయ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాడు. అరాచకం సృష్టిస్తున్న రోహిల్లా, పఠాన్, అరబ్‌లను శిక్షించడానికి నగరంలో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు. 1862లో దివాను పర్యవేక్షణలో న్యాయ సంబంధిత సెక్రటేరియట్‌ ఏర్పడింది. 

 

విద్యా సంస్కరణలు: 1855లో దారుల్‌-ఉల్మ్‌ ఉన్నత పాఠశాల, 1870లో సిటీ హైస్కూల్, ఇంజినీరింగ్‌ కాలేజీ, 1872లో చాదర్‌ఘాట్‌ హైస్కూల్‌ను ఏర్పాటు చేశాడు. 1873లో మదర్సా-ఎ-అలియా (ప్రభువుల పిల్లల కోసం), 1878లో మదర్సా -ఎ-ఐజా (రాజుల సంతానం కోసం ) విద్యా సంస్థలను ఏర్పాటు చేశాడు. సాలార్‌జంగ్‌ అలీఘర్‌లో విద్యా సంస్థల ఏర్పాటుకు సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌కు ఆర్థిక సహాయం చేశాడు. చాదర్‌ఘాట్‌ హైస్కూల్‌లోని ఇంటర్మీడియట్‌ తరగతులను మద్రాస - ఎ - అలియాలో విలీనం చేసి దాన్ని 1887లో నిజాం కళాశాలగా ఏర్పాటు చేశారు. దీనికి మొదటి ప్రిన్సిపల్‌ అఘోరనాథ చటోపాధ్యాయ. 

 

రాకపోకల సౌకర్యాలు: 1856 - 57లో హైదరాబాదు నుంచి బొంబాయికి టెలిగ్రాఫ్‌ లైను వేయించాడు. 1871లో తంతి, తపాలా శాఖ ఏర్పడింది. 1868లో హైదరాబాదు - షోలాపూరు రోడ్డు, బొంబాయి-మద్రాస్‌ రైల్వే లైను పూర్తయింది. ఈ రైల్వే లైను నిజాం రాజ్యంలోని గుల్బర్గా, వాడిల ద్వారా వెళ్లేది. 

 

ఇతర సంస్కరణలు: హైదరాబాదులోని బ్రిటిష్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ స్మిత్‌ 1856లో పారిశ్రామిక వస్తు ప్రదర్శనను నిర్వహించాడు. సాలార్‌ జంగ్‌ మూసీనదిపై చాదర్‌ఘాట్‌ వంతెనను నిర్మించాడు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన అనేక మందిని ఉత్తర భారతదేశం నుంచి పిలిపించి వారికి వివిధ ఉద్యోగులను ఇచ్చాడు. దీంతో తరువాత కాలంలో ముల్కీ (లోకల్‌), నాన్‌ముల్కీ(నాన్‌లోకల్‌)ల వివాదాలు తలెత్తాయి. ముల్కీ ఉద్యమానికి నాందిగా మారింది. సాలార్‌జంగ్‌ బీరారు విషయంలో ఇంగ్లండుకు వెళ్లి విక్టోరియా మహారాణితో చర్చలు జరిపాడు. క్రీ.శ.1883లో కలరా వ్యాధి సోకి సాలార్‌జంగ్‌ మరణించాడు.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

 

Posted Date : 26-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌