• facebook
  • whatsapp
  • telegram

సాలార్‌జంగ్‌

అసఫ్‌జాహీ పాలకుల వద్ద దివాన్‌గా (ప్రధానమంత్రి) పనిచేసిన సాలార్‌జంగ్‌ అనేక సంస్కరణలు తీసుకువచ్చి, హైదరాబాద్‌ రాజ్యాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడు. ఇతడు క్రీ.శ.1853లో అసఫ్‌జాహీ పాలకుడైన నాసిరుద్దౌలా కాలంలో దివాన్‌గా నియమితుడె,ౖ తర్వాతి పాలకులైన అఫ్జలుద్దౌలా, మీర్‌ మహబూబ్‌ల కాలం వరకు కొనసాగాడు. సాలార్‌జంగ్‌ అసలు పేరు నవాబు తురబ్‌ అలీఖాన్‌. ఇతడు దివాన్‌ కాకముందు ఆంగ్లేయాధికారి అయిన డైటన్‌ వద్ద పరిపాలనానుభవాన్ని గడించాడు. ఈయన దివాన్‌ అయ్యే నాటికి హైదరాబాద్‌ రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. ఈయన పరిపాలన, ఆర్థిక, న్యాయ, విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టి రాజ్యాన్ని ప్రగతిపథంలో నడిపించాడు. 

పరిపాలనా సంస్కరణలు
సాలార్‌జంగ్‌ 1865లో జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి రాజ్యాన్ని 17 జిల్లాలు, 5 సుబాలుగా విభజించాడు. సుబాకు అధికారి సుబేదారు. జిల్లా అధికారి తాలుకాదారు, తాలుకా అధికారిని తహసీల్‌దారు అనేవారు. తాలుకాదారుల పనిని పర్యవేక్షించడానికి  మజ్లిస్‌-ఇ-మల్‌-గుజారి అనే పాలనా సంస్థను 1865లో ఏర్పాటు చేశాడు. 1868లో ‘సదర్‌ ఉల్‌ మహమ్‌’ అనే పేరుతో నలుగురు మంత్రులను నియమించాడు. ముగ్గురికి పోలీసు, న్యాయ, రెవెన్యూ శాఖలు, నాలుగో మంత్రికి ప్రజా సంక్షేమం, విద్య, ఆరోగ్య స్థానిక సంస్థలు అప్పగించాడు.

ఆర్థిక రంగం
బ్రిటిష్‌వారు క్రీ.శ.1860లో తమ ఆక్రమణలో ఉన్న ధారశివ, రాయచూరు, నవదుర్గు జిల్లాలను నిజాంకు అప్పగించారు. సాలార్‌జంగ్‌ కేంద్ర ఖజానాను ఏర్పాటుచేసి ద్రవ్య విధానాన్ని సంస్కరించాడు. హాలి సిక్కా అనే నూతన రూపాయిని ప్రవేశపెట్టాడు. నాణేల ముద్రణ కోసం కేంద్ర ముద్రణాలయాన్ని హైదరాబాద్‌లో, ప్రాంతీయ ముద్రణాలయాలను గద్వాల, నారాయణపేటల్లో ఏర్పాటుచేశాడు. రైతులకు ఇజరా (కౌలు) ఇచ్చి వాణిజ్య పంటలను ప్రోత్సహించాడు. నిజాం బ్రిటిష్‌వారికి ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయల రుణాన్ని రద్దు చేయించాడు. క్రీ.శ.1875లో రెవెన్యూ సెటిల్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశాడు. ఇనాం భూములను రద్దు చేశాడు. ప్రతి 30 సంవత్సరాలకొకసారి భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టాడు.

పోలీస్‌ వ్యవస్థ
క్రీశ.1865కు ముందు హైదరాబాద్‌ రాజ్యంలో సక్రమమైన పోలీస్‌ వ్యవస్థ లేదు. సాలార్‌జంగ్‌ ‘మహ్‌కామా-ఇ-కొత్వాలి’ అనే పోలీస్‌ శాఖను ఏర్పాటు చేశాడు. నిజామత్‌ పేరుతో పోలీస్‌ దళాన్ని ఏర్పాటు చేశాడు. పోలీస్‌ సూపరింటెండెంట్‌ను ‘మహతామీన్‌’, ఇన్‌స్పెక్టర్‌ను అమీన్, పోలీస్‌ స్టేషన్లను చౌకీలని పిలిచేవారు.

న్యాయ వ్యవస్థలో..
సాలార్‌జంగ్‌ అనేక కోర్టులను ఏర్పాటు చేశాడు. సుప్రీంకోర్టును మజ్లిస్‌-ఇ-మురఫా, హైకోర్టును మహ్‌కాయ్‌-ఇ-సదర్, ప్రధాన న్యాయమూర్తిని నాజిమ్‌ అని వ్యవహరించేవారు. ముస్లిం చట్టాల అమలుకు దారుల్‌కాజీ అనే కోర్టు, మత సంబంధమైన విరాళాల విచారణ కోసం మహ్‌కామా-ఇ-సదారత్‌ అనే కోర్టులు ఉండేవి.
హైదరాబాద్‌లో బుజుంగ్‌ దివానీ అదాలత్, కుర్దు దివానీ అదాలత్‌ అనే సివిల్‌ కోర్టులు, ఫౌజుదారీ అదాలత్‌ అనే క్రిమినల్‌ కోర్టు ఉండేవి. మున్సిఫ్, మీర్‌ అదిల్‌ అనే జిల్లా న్యాయాధికారులుండేవారు. మరణ శిక్ష, కాళ్లు - చేతులు నరకడం, సతీసహగమనం మొదలైన వాటిని సాలార్‌జంగ్‌ రద్దు చేశాడు. 1862లో దివాన్‌ పర్యవేక్షణలో న్యాయ సంబంధిత సెక్రటేరియట్‌ ఏర్పడింది.

విద్యా రంగం
నిజాం రాజ్యం విద్యా రంగంలో బాగా వెనుకబడి ఉండేది. సాలార్‌జంగ్‌ విద్యా రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఈయన 1855లో దారుల్‌-ఉల్మ్‌ ఉన్నత పాఠశాలను, 1870లో సిటీ హైస్కూల్, ఇంజినీరింగ్‌ కళాశాలను, 1872లో చాదర్‌ఘాట్‌ హైస్కూలును ఏర్పాటు చేశాడు. 1873లో మదరసా-ఎ-అలియా (ప్రభువుల పిల్లల కోసం), 1878లో మదరసా-ఎ-ఐజా (రాజ కుటుంబ పిల్లల కోసం) ఏర్పాటు చేశాడు. అలీఘర్‌లో విద్యా సంస్థల ఏర్పాటు కోసం సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌కు సాలార్‌జంగ్‌ ఆర్థిక సహాయం చేశాడు. సాలార్‌జంగ్‌ అనంతరం చాదర్‌ఘాట్‌ హైస్కూల్‌లోని ఇంటర్మీడియట్‌ తరగతులను మద్రాస్‌-ఎ-అలియాలో విలీనం చేసి దాన్ని క్రీ.శ.1887లో నిజాం కళాశాలగా ఏర్పాటుచేశారు. ఈ కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్‌ అఘోరనాథ్‌ చటోపాధ్యాయ. 

రవాణా సౌకర్యాలు
సాలార్‌జంగ్‌ 1856-57లో హైదరాబాద్‌ నుంచి బొంబాయికి టెలిగ్రాఫ్‌ లైన్‌ వేయించాడు. 1881లో తంతి, తపాలాశాఖ ఏర్పడింది. ప్రధాన పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ నియామకం జరిగింది. 1868లో హైదరాబాద్‌ నుంచి షోలాపూర్‌ రోడ్డు, బొంబాయి - మద్రాసు రైల్వేలైన్‌ పూర్తయ్యాయి. ఈ రైల్వే లైన్‌ నిజాం రాజ్యంలోని గుల్బర్గా, వాడిల నుంచి వెళ్లేది. 1878లో వాడి రైలు మార్గం, 1886లో సికింద్రాబాద్‌ - విజయవాడ రైలు మార్గం పూర్తయ్యాయి.

హైదరాబాద్‌ రాజ్యంలో 1857 తిరుగుబాటు
బ్రిటిష్‌వారు వివిధ యుద్ధాలు చేసి భారతదేశాన్ని ఆక్రమించి, తమ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారి విధానాలు, పద్ధతుల పట్ల భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. వారి అసంతృప్తి 1857 తిరుగుబాటు రూపంలో బహిర్గతమైంది. 1857 తిరుగుబాటు మీరట్‌లో ప్రారంభమై భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించింది. హైదరాబాద్‌ రాజ్యానికి కూడా విస్తరించింది. హైదరాబాద్‌ నగరంలోని మసీదు గోడలపై, రచ్చల్లో వెలసిన ప్రకటనలు, పోస్టర్లు  బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రబోధించాయి. మౌల్వీ ఇబ్రహీం బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు చేయమని ప్రజలను రెచ్చగొట్టాడు. అక్బర్‌ మౌల్వీ మక్కా మసీదులో సమావేశమైన ముస్లింలందరినీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ప్రేరేపించాడు.

ఔరంగాబాద్‌లో తిరుగుబాటు
దివాన్‌ సాలార్‌జంగ్‌ బ్రిటిష్‌వారి సహాయార్థం హైదరాబాద్‌ కాంటెంజెంటుకు చెందిన రెండు దళాలను ఉత్తర భారతదేశానికి పంపించాడు. జమేదారు అమీర్‌ఖాన్, డఫేదారు మీర్‌పైదా అలీల నాయకత్వంలో ఈ రెండు దళాలు ఔరంగాబాద్‌ సమీపంలో ఎదురుతిరిగి తిరుగుబాటు చేశాయి. మీర్‌పైదా అలీ కెప్టెన్‌ అబ్బాట్‌ అనే బ్రిటిష్‌ సైనికాధికారిని కాల్చి చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. మీర్‌పైదా అలీని బ్రిటిష్‌వారు ఉరి తీశారు. జమేదారు చీదాఖాన్‌ నాయకత్వంలో కౌండు అశ్వికులు ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. చీదాఖాన్‌ హైదరాబాద్‌లో అలజడి రేపాలనే ఉద్దేశంతో నగరానికి చేరుకోగా, సాలార్‌జంగ్‌ అతడిని బంధించి బ్రిటిష్‌ రెసిడెంట్‌కు అప్పగించాడు. వెంటనే మక్కా మసీదులో పెద్ద సభ నిర్వహించారు. అందులో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ఉపన్యసించారు.

బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి
రోహిల్లా జమేదార్‌ అయిన తుర్రెబాజ్‌ ఖాన్, మౌల్వీ అల్లా ఉద్దీన్‌లు కలిసి చీదాఖాన్‌ను విడుదల చేయాలని, లేకపోతే బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి చేస్తామని సాలార్‌జంగ్‌కు వర్తమానం పంపారు. తుర్రెబాజ్‌ ఖాన్, మౌల్వీ అల్లా ఉద్దీన్‌ 500 మంది రోహిల్లాలను తీసుకుని 1857, జులై 17న హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీకి చేరుకుని, దానిపై కాల్పులు ప్రారంభించారు. రెసిడెన్సీ రక్షణ బాధ్యతను కల్నల్‌ డేవిడ్‌సన్‌ తీసుకున్నాడు. రెసిడెన్సీ నుంచి ఎదురు కాల్పులు జరిపించాడు. తెల్లవారుజామున కొందరు రోహిల్లా వీరులు మరణించారు. తుర్రెబాజ్‌ ఖాన్‌ను తూఫ్రాన్‌ వద్ద అరెస్ట్‌ చేసి, కాల్చి చంపారు. బెంగుళూరుకు పారిపోయిన మౌల్వీ అల్లా ఉద్దీన్‌ను మంగళపల్లి వద్ద అరెస్ట్‌ చేసి, 1859, జూన్‌ 28న ద్వీపాంతర శిక్ష విధించి అండమాన్‌ జైలుకు పంపించారు. అతడు అక్కడే 1884లో మరణించాడు. బ్రిటిష్‌ వారు 1857 తిరుగుబాటును అణచివేశారు.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌