• facebook
  • whatsapp
  • telegram

   నిజాం వ్యతిరేక పోరాటం

 విముక్తికి ఉద్యమించి.. వీధుల్లో కదం తొక్కి!
 

 

స్వతంత్ర భారతదేశంలో కలవడానికి తిరస్కరించిన నిజాంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్షంగా, కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాతంగా ప్రజా ఉద్యమాలను తీవ్రం చేసి నవాబుపై ఒత్తిడి పెంచాయి. విద్యార్థులు, న్యాయవాదులు వీధుల్లో కదం తొక్కారు. నిజాం వ్యతిరేక నినాదాలతో వరంగల్‌ కోటను వణికించిన మొగిలయ్య ప్రాణాలు అర్పించాడు. తెలంగాణలో ఆందోళనలు, సత్యాగ్రహాలు మిన్నంటాయి. ఆంధ్ర ప్రాంత నాయకుల నుంచి సంపూర్ణ సహకారం లభించింది.  స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌ రాజ్యంలో స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాలు, ముఖ్యమైన ఘట్టాలు, కీలక వ్యక్తుల గురించి పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. 


భారతదేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్‌ సంస్థానం నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తి చెందలేదు. ఆ నవాబుల పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. 1947, జూన్‌ 12న నిజాం మాట్లాడుతూ తన హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర దేశంగా ఉంటుందని పేర్కొన్నాడు.

జయప్రకాశ్‌ నారాయణ్‌ హైదరాబాద్‌ పర్యటన: భారత సోషలిస్టు పార్టీ కార్యదర్శి జయప్రకాశ్‌ నారాయణ్‌ 1947, మే 2న మొదటిసారిగా హైదరాబాద్‌ వచ్చారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లోని కర్బలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ నిజాం నవాబును మీర్‌జాఫర్‌గా వర్ణించారు. ఇండియన్‌ యూనియన్‌లో చేరే విధంగా ఒత్తిడి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెంçనే నిజాం ప్రభుత్వం జయప్రకాశ్‌ నారాయణ్‌ను రాజ్యం నుంచి బహిష్కరించింది. దీనికి నిరసనగా బూర్గుల రామకృష్ణారావు నాయకత్వంలో సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. రామానంద తీర్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్‌ కాంగ్రెస్‌ ఉద్యమాలకు మహాదేవసింగ్, ఎన్‌.బి.గిరి వంటి సోషలిస్టు నాయకులు మద్దతిచ్చారు.


విద్యార్థుల పాత్ర: హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ సమావేశాల సందర్భంగా ‘స్వేచ్ఛ’ పేరుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సోషలిస్టు విద్యార్థి కార్యాచరణ సంఘం ఏర్పడింది. 1947, సెప్టెంబరు 2న విద్యార్థులు హైదరాబాద్‌ అంతటా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాలపై జెండా ఎగరేసిన తర్వాత దాదాపు 10 వేల మంది విద్యార్థులు త్రివర్ణ పతాక బ్యాడ్జీలను ధరించి సుల్తాన్‌బజార్, క్లాక్‌టవర్‌ల వైపు ఊరేగింపుగా వచ్చారు. 1947, సెప్టెంబరు 15న హైదరాబాద్‌ విద్యార్థి దినంగా పాటించారు. 1947, సెప్టెంబరు 18, 19 తేదీల్లో విజయవాడలో విద్యార్థి ప్రతినిధుల సమావేశం జరిగింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించారు.


న్యాయవాదుల ప్రతిఘటనలు: హైదరాబాద్‌ న్యాయవాదులు నిజాం వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. న్యాయవాదుల ప్రతినిధి బృందం అధ్యక్షుడు గణపతిలాల్‌ ఆధ్వర్యంలో 99 మంది న్యాయవాదుల సంతకాలతో 1948, ఫిబ్రవరి 25న నాటి ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. మూకుమ్మడిగా కోర్టులను బహిష్కరించారు. 1948, ఏప్రిల్‌ 6న న్యాయవాదుల ప్రతిఘటన సమితి న్యాయస్థానాలను బహిష్కరిస్తూ లేఖ రాసింది. 1948, సెప్టెంబరు 17 వరకు కోర్టులు పనిచేయలేదు.


కమ్యూనిస్టుల్లో రెండు వర్గాలు: కమ్యూనిస్టుల్లో రెండు వర్గాలు ఉండేవి. ఆరుట్ల సోదరులు మొదలైనవారు తెలంగాణలో నిజాం పాలననే కోరుకున్నారు. వీరు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. రెండో వర్గంలోని రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తదితరులు నిజాం పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌ భారతదేశంలో కలవడానికి కృషి చేశారు.

 

నిజాం హత్యకు కుట్ర: 1947, డిసెంబరు 4న సాయంత్రం నారాయణరావ్‌ పవార్, గండయ్య (గంగారాం), జగదీశ్వర్‌ ఆర్య (ఈశ్వరయ్య) నిజాంపై బాంబు వేసి చంపాలని ప్రయత్నించారు. నారాయణ రావ్‌ పవార్‌ వేసిన బాంబు నిజాం కారు ముందు అద్దానికి తగిలింది. నిజాం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తర్వాత నారాయణ రావ్‌ పవార్‌ నేరాన్ని అంగీకరించడంతో కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. పోలీసు చర్య తర్వాత ఆయన 1948, ఆగస్టు 10న చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

 

మొగిలయ్య బలిదానం: వరంగల్‌ కోటలో జాతీయ జెండా ఎగురవేయాలని ఆంధ్ర మహాసభ, వామపక్షాల కలయికతో ఏర్పడిన ఆంధ్ర జాతీయ పక్షం తీర్మానించి అమలుచేసింది. ఈ కార్యక్రమ వాలôటీర్లలో ఒకరైన మొగిలయ్య 1946, ఆగస్టు 9న ఉదయం 8 గంటలకే మహాత్మాగాంధీకి జై, కాంగ్రెస్‌కి జై, త్రివర్ణ పతాకానికి జై, భారత్‌ మాతాకి జై అంటూ బిగ్గరగా నినాదాలు చేశాడు. మిగిలిన వారంతా అతడిని అనుసరించడంతో కోటంతా మారుమోగింది. ఇంతలోనే 200 మంది సాయుధ దుండగులు వచ్చి, నినాదాలు చేస్తున్న మొగిలయ్యను బల్లెంతో పొడిచి చంపారు. దుండగుల గుంపు చేపట్టిన ఊరేగింపు అమీన్‌ పట్టణంలోకి రాగానే జిల్లా కలెక్టర్‌ ఎదురెళ్లి మొగిలయ్యను హత్య చేసిన షరీఫ్‌ మెడలో దండ వేశాడు. షరీఫ్‌ను ‘లక్డీ పహిల్వాన్‌’ అనేవారు. ఈ వార్త పత్రికలకు ఎక్కలేదు.

 

భారత యూనియన్‌ ఉద్యమం (1947-48): హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌పై నిషేధం ఎత్తేసిన వెంటనే ఆ సంస్థకు అధ్యక్షుడిగా రామానంద తీర్థ ఎన్నికయ్యారు. స్టేట్‌ కాంగ్రెస్‌లో రెండు వర్గాలు ఉండేవి. రామానంద తీర్థ వర్గంలో జమలాపురం కేశవరావు, కోదాటి నారాయణరావు, కొమరగిరి నారాయణ, కె.వి.నరసింగరావు, జి.ఎం.షరాఫ్, ప్రాణేశాచార్య, బాబాసాహెబ్‌ పరంజపే, కృష్ణమాచార్య జోషి తదితరులు ఉండేవారు. బూర్గుల రామకృష్ణారావు వర్గంలో కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నరసింగరావు, కాశీనాథ రావు వైద్య, జనార్ధన్‌ రావు దేశాయి మొదలైన వాళ్లు ఉండేవారు. అయినప్పటికీ 1947లో స్టేట్‌ కాంగ్రెస్‌ మహాసభలో రామానంద తీర్థను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో స్వాతంత్య్ర పోరాటం ప్రారంభించాలనే తీర్మానాన్ని దిగంబరరావు బిందు ప్రతిపాదించగా బూర్గుల రామకృష్ణారావు బలపరిచారు.

 

కాంగ్రెస్‌ పోరాటాలు: హైదరాబాద్‌ కాంగ్రెస్‌ నాయకులు రెండు రకాల పోరాటాలు చేశారు. మితవాదులు దౌర్జన్య రహితంగా, గాంధేయ పద్ధతుల్లో సత్యాగ్రహం చేశారు. తీవ్రవాద భావాలున్న యువకులు మాత్రం 1942లో జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో చేసినట్లే, అజ్ఞాతానికి వెళ్లి పోలీసుల కళ్లు కప్పి పోరాటం సాగించారు. తీవ్రవాద పద్ధతులు అనుసరించినవారిలో గోవింద దాస్‌ షరాఫ్, వైశంపాయన్, డి.వెంకట రామారావు, కె.వి.నరసింగరావు ముఖ్యులు. స్టేట్‌ కాంగ్రెస్‌ వర్గం ఏర్పడింది. దీనికి ప్రాణేశాచార్య కార్యదర్శి. పోరాటం నడపడానికి ఏర్పడిన కార్యాచరణ సమితికి అధ్యక్షుడు దిగంబరరావు, కార్యదర్శి మాడపాటి రామచంద్రరావు. స్టేట్‌ కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయం బొంబాయిలో, కర్ణాటక ప్రాంత మాండలిక కార్యాలయాన్ని గడగ్‌లో నెలకొల్పారు. తెలంగాణ ప్రాంత కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యత వి.బి.రాజుకు అప్పగించారు. ఈయనకు సహాయంగా బొమ్మకంటి సత్యనారాయణ, హయగ్రీవాచారి ఉండేవారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌ సంఘం హైదరాబాద్‌ పోరాటంలో తోడ్పడటానికి ఒక సబ్‌ కమిటీని నియమించింది.

 

సరిహద్దు శిబిరాలు: ఒకవైపు ప్రచారం నిర్వహించడానికి, మరోవైపు పోరాటం సాగించడానికి సరిహద్దుల్లో కార్యాచరణ సంఘం ఏర్పడింది. విజయవాడ శిబిరాన్ని హయగ్రీవాచారి, పరిటాలలో శిబిరాన్ని కోదాటి నారాయణరావు నిర్వహించేవారు. కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల శిబిరాలను పి.వి.నరసింహారావు, కె.వి.నరసింగరావులు చూసేవారు. పోరాటంలో పాల్గొనే ప్రజల్లో ధైర్యం, ఆత్మస్థైర్యం కల్పించడంలో వి.బి.రాజు, హయగ్రీవాచారి, బొమ్మకంటి సత్యనారాయణరావు కీలకపాత్ర పోషించారు. ఉద్యమ ఉద్దేశాలు, లక్ష్యాల గురించి కరపత్రాలతో ప్రచారం చేశారు. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో చేరాలని, రాజ్యాంగ పరిషత్తులో పాల్గొనాలని నిజాం ప్రభుత్వాన్ని స్వామి రామానంద తీర్థ హెచ్చరించారు. స్టేట్‌ కాంగ్రెస్‌ తొలి కార్యవర్గ సమావేశం షోలాపుర్‌లో జరిగింది. అందులో సమష్టి సత్యాగ్రహం చేయాలని నిర్ణయించారు. కొంతమంది నాయకులు సంస్థానానికి వెలుపల, మిగతా భారతదేశానికి తమ పోరాటం గురించి తెలియజేసి సానుభూతి పొందారు. ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకులైన టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆచార్య రంగా, ఓబుల్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌ కాంగ్రెస్‌కు అన్నివిధాలుగా సహకరించారు. హైదరాబాద్‌లో జరిగే పోరాటానికి సహాయంగా భారత సోషలిస్టు పార్టీ ఒక కార్యనిర్వాహక సమితిని ఏర్పాటుచేసింది. ఈ పార్టీకి చెందిన అరుణా ఆసిఫాలీ అంతకుముందే తెలంగాణ ప్రాంతంలో రహస్యంగా పర్యటించి రజాకార్ల దురాగతాలు, కమ్యూనిస్టుల చర్యల వల్ల ఏర్పడిన పరిస్థితిని సమగ్రంగా తెలుసుకున్నారు.

 

సత్యాగ్రహం: స్వామి రామానంద తీర్థ హైదరాబాద్‌ చేరుకుని 1947, ఆగస్టు 7న ‘భారత యూనియన్‌లో చేరవలె’ పేరుతో సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. కార్యకర్తల ఊరేగింపులు, సత్యాగ్రహాలు జరిగాయి. అంతకుముందు జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా రామానంద తీర్థకు అందజేసిన భారత జాతీయ పతాకాన్ని 1947, ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సుల్తాన్‌ బజారులో మోతీలాల్‌ మంత్రి ఎగురవేశారు. ఈ సందర్భంగా రామానంద తీర్థతో పాటు జి.ఎస్‌.మెల్కోటే, జమలాపురం కేశవరావు అరెస్టయ్యారు. ఈ ఉద్యమం బాగా ప్రజాదరణ పొందింది. 21 వేల మంది పాల్గొని అరెస్టయ్యారు. 1942 ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి అరెస్టు కాకుండా తప్పించుకోగలిగిన కొండా లక్ష్మణ బాపూజీ, 1947లో భారత యూనియన్‌ చేరిక ఉద్యమంలో పాల్గొని విప్లవకారుల పక్షాన పోరాటం సాగించారు. నిజాంపైకి చేతి బాంబు విసిరిన సంఘటనతో ఆయనకు సంబంధం ఉంది.

 

మాదిరి ప్రశ్నలు

1) నిజాం నవాబును మీర్‌ జాఫర్‌గా వర్ణించింది?

1) మహాదేవసింగ్‌   2) ఎన్‌.బి.గిరి    3) జయప్రకాశ్‌ నారాయణ   4) అరుణా ఆసఫ్‌ అలీ

 

2) నిజాం వ్యతిరేక పోరాటంలో న్యాయవాదుల బృందానికి అధ్యక్షత వహించిందెవరు?

1) శ్యాంలాల్‌    2) సురేష్‌ లాల్‌    3) హీరాలాల్‌    4) గణపతిలాల్‌

 

3) నిజాంను హత్య చేయడానికి బాంబు వేసిందెవరు?

1) నారాయణరావ్‌ పవార్‌   2) జగదీశ్‌ చంద్ర    3) కె.ఎం.నరసింగరావు    4) కృష్ణమాచార్య జోషి

 

4) హైదరాబాద్‌ సంలీనోద్యమంలో భాగంగా హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉండేది?

1) పూనా    2) విజయవాడ    3) బొంబాయి    4) కాకినాడ

 

5) జవహర్‌లాల్‌ నెహ్రూ ఇచ్చిన త్రివర్ణ పతాకాన్ని హైదరాబాద్‌లో ఎవరు ఎగురవేశారు?

1) కేశవరావు    2) మోతీలాల్‌ మంత్రి    3) జగదీష్‌ ఆర్య    4) రామానంద తీర్థ

 

6) హైదరాబాద్‌ కాంగ్రెస్‌కు చెందిన తొలి కార్యవర్గ సమావేశం ఈ కింది ప్రాంతంలో జరిగింది.

1) షోలాపుర్‌    2) గదగ్‌    3) బొంబాయి     4) విజయవాడ

 

సమాధానాలు: 1-3,    2-4,    3-1,    4-3,    5-2,    6-1.

 రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 12-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌