• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ సాయుధ పోరాటం

 

అరాచకాలపై బిగిసిన పిడికిలి!

 

ప్రజలను హీనంగా చూసే పాలకులు, చేతికి అందివచ్చిన పంటను గద్దల్లా తన్నుకెళ్లే పెత్తందారులు, అప్పుల పేరుతో జీవితకాలం ఊడిగం చేయించుకునే భూస్వాములపై తెలంగాణ శ్రమజీవులు అసాధారణ రీతిలో తిరుగుబాటు చేశారు. కమ్యూనిస్టులు రగిలించిన పోరాటస్ఫూర్తితో అప్పటి అరాచకాలపై పిడికిలి బిగించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం చరిత్రలో చెరిగిపోని విధంగా  రైతులు, ప్రజలు జరిపిన ఆ సాయుధ పోరాట వివరాలను, నేపథ్యాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.  

 

తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోరాటాల్లో ఒకటి. ఇక్కడి రైతులు, ప్రజలు నిజాం రాజ్యంలోని నిరంకుశ, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం.

 

కారణాలు

నిజాం నిరంకుశత్వం: నిజాం సంస్థానంలోని జనాభాలో అధిక శాతం ప్రజలు తెలుగు మాట్లాడే వారున్నప్పటికీ వారి భాషకు ఎలాంటి గౌరవం లేదు. ఉర్దూను అధికార భాషగా ప్రజల మీద రుద్దారు. తెలుగు పాఠశాలల నిర్వహణకు నిజాం అనుమతి ఇచ్చేవాడు కాదు. జనాభాలో 12% ఉన్న ముస్లింలే ఉన్నతోద్యోగాలన్నీ దక్కించుకున్నారు. వీరు నిరంకుశాధికారులుగా ఉండేవారు. ముస్లింలు పాలకవర్గమనీ, వారికి సంస్థానంలోని మిగతా ప్రజలపై ఆధిక్యత ఉందనే భావాన్ని పెంపొందించేందుకు ముస్లిం ముల్లాలు ప్రయత్నించేవారు. పాలకులు మతమార్పిడిని ప్రోత్సహించారు.

 

భూస్వామ్య వ్యవస్థ: నిజాం రాజ్యంలో మధ్యయుగం నాటి భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేది. ప్రజలపై అణచివేత కొనసాగేది. నిజాం సంస్థానంలో మొత్తం వ్యవసాయ భూమి 5 కోట్ల 30 లక్షల ఎకరాలు. ఈ భూమి మూడు రకాల యాజమాన్యాల కింద ఉండేది.

 

దివానీ లేదా ఖల్సా: ఈ రకమైన భూమి 60% నిజాం ప్రత్యక్ష పాలనలో ఉండేది. ఈ భూమి నుంచి ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసేది.

 

గైర్‌ ఖల్సా: దీని కింద మూడో వంతు భూమి ఉండేది. ఈ భూమి సంస్థానాధీశులు, జాగీర్దారులు, ఖజానాదారులు, మక్తేదారులు మొదలైనవారి ఆధీనంలో ఉండేది. గద్వాల్, వనపర్తి, జటప్రోలు, అమరచింత, పాల్వంచ, పాపన్నపేట, దోమకొండ, ఆత్మకూరు తదితర సంస్థానాలుండేవి.

 

జాగీర్లు: మొత్తం నాలుగు రకాల జాగీర్లుండేవి. సర్ఫ్‌-ఎ-ఖాస్‌ అంటే నిజాం సొంత జాగీరు. ఇది 8100 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేది. ఈ భూములను నిజాం సొంతంగా సాగు చేయించి, దానిపై వచ్చే ఆదాయం పొందేవాడు. ఈ భూమి ఎక్కువగా ఆత్రాఫ్‌ బల్దా (హైదరాబాదు) జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండేది. పాయోగాలు అంటే నిజాం రాజబంధువులకు చెందిన జాగీర్లు. ఇంకా ముస్తనా జాగీర్లు, సాధారణ జాగీర్లు ఉండేవి.

 

దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేల అరాచకాలు: వీరి భవనాలను గడీలు అనేవారు. విసునూరు దేశ్‌ముఖ్‌కు 40 వేల ఎకరాలు, సూర్యాపేట దేశ్‌ముఖ్‌కు 20 వేల ఎకరాలు, ఎర్రపాడు దేశ్‌ముఖ్‌ (జన్నారెడ్డి ప్రతాపరెడ్డి)కి లక్షా యాభైవేల ఎకరాలు (20 గ్రామాల్లో), బాబా సాహెబ్‌పేట (మిర్యాలగూడ) దేశ్‌ముఖ్‌కు 10 వేల ఎకరాలు, కల్లూరు (ఖమ్మం జిల్లా) దేశ్‌ముఖ్‌కు లక్ష ఎకరాల భూమి ఉండేది. ఇంకా 5 వేల ఎకరాలకు పైగా భూమి కలిగిన 550 మంది భూస్వాములుండేవారు. ఈ భూస్వాముల నిరంకుశత్వం కింద ప్రజలు దుర్భర జీవితం గడిపేవారు.

 

వెట్టిచాకిరి: తెలంగాణ గ్రామాల్లో వెట్టిచాకిరి ఉండేది. దేశ్‌ముఖ్‌లు ప్రజలకు వడ్డీలకు అప్పులిచ్చేవారు. ఈ అప్పులపై నాగు వడ్డీ ఉండేది. నాగు వడ్డీ అంటే తీసుకున్న అప్పు ఒక సంవత్సరంలో రెట్టింపు అవుతుంది. ఎంత కాలం పనిచేసినా అప్పు తీరేది కాదు. అప్పు తీసుకున్న వ్యక్తి, అతడి కుటుంబం ఆ భూస్వామికి తరతరాలుగా వెట్టిచాకిరీ చేసేవారు. ఈ వెట్టిచాకిరీనే బగేల పద్ధతి అనేవారు. తెలంగాణ గ్రామాల్లో ఈ విధానం సర్వసాధారణంగా మారిపోయింది. భూస్వాములు, ప్రభుత్వాధికార్లు గ్రామంలోని వివిధ వృత్తులవారితో ఉచితంగా సేవ చేయించుకునేవారు.

 

లెవీ ధాన్యం (1943): రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఏర్పడిన ఆహార కొరతను తీర్చడానికి నిజాం ప్రభుత్వం రైతులపై లెవీ విధిస్తూ ఫర్మానా జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించాలి. ఈ లెవీ నుంచి భూస్వాములు తప్పించుకునేవారు. చిన్న, మధ్యతరగతి రైతుల నుంచి ప్రభుత్వం కచ్చితంగా వసూలు చేసేది. చిన్న రైతుల ధాన్యాన్ని తూకం వేయడంలో, డబ్బులు ఇవ్వడంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. ఈ దోపిడీ తెలంగాణ రైతులను సాయుధ పోరాటాల వైపు నడిపించింది. 

 

ఆంధ్ర మహాసభ: భువనగిరిలో 1944లో జరిగిన 11వ ఆంధ్ర మహాసభ కాలం నాటికి కమ్యూనిస్టులు బలపడ్డారు. ఆంధ్ర మహాసభ వారి స్వాధీనమైంది. నల్గొండ, వరంగల్‌ జిల్లా గ్రామాల్లో దాని శాఖలు ఏర్పడ్డాయి. ఆంధ్ర మహాసభ అనే సంస్థను కమ్యూనిస్టులు తమ పార్టీకి పర్యాయపదంగా మార్చుకున్నారు. ఈ మహాసభ తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రజలను సిద్ధం చేసింది.

 

కమ్యూనిస్టు పార్టీ: కమ్యూనిస్టు పార్టీ తొలి రూపం 1939లో స్థాపించిన ‘కామ్రేడ్స్‌ అసోసియేషన్‌’. 1940లో కమ్యూనిస్టులు కిసాన్‌ సభను స్థాపించగా, ప్రభుత్వం నిషేధించింది. హైదరాబాదు కమ్యూనిస్టు పార్టీలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పి.హనుమయ్య, ముగ్దుం మొయినుద్దీన్, రాజబహదూర్‌ గౌర్, వట్టికోట ఆళ్వారుస్వామి, హేమాద్రి, హెచ్‌.దేశాయ్‌లు ప్రముఖ నాయకులు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, హనుమయ్యలు 1939లో కంకిపాడు (కృష్ణా జిల్లా) రాజకీయ పాఠశాలలో శిక్షణ పొందారు. జగిత్యాల రాజకీయ పాఠశాలలో చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, వట్టికోట ఆళ్వారు స్వామి శిక్షణ పొందారు. 1940లో హైదరాబాదులో కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు.

 

మొదటి దశ పోరాటం

1941లో చిలుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కాలం నాటికి ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల సంఖ్యాబలం పెరిగింది. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభలో 10 వేల మంది కమ్యూనిస్టులు పాల్గొనడంతో పాటు ఆంధ్ర కమ్యూనిస్టు నాయకుడైన చండ్ర రాజేశ్వరరావు హాజరయ్యారు. రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించిన ఈ ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల స్వాధీనమైంది. ఆంధ్ర మహాసభ శాఖలు వివిధ గ్రామాల్లో వెలిసి ప్రజలను చైతన్యవంతులను చేశాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో రైతుల నుంచి అధిక లెవీని ప్రభుత్వం వసూలు చేయడాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకించి ప్రజల్లో పలుకుబడి సంపాదించుకున్నారు. ప్రజా నాట్యమండలి అనే సంస్థను కమ్యూనిస్టులు స్థాపించారు. ఈ సంస్థ తొలిసారిగా ‘మాభూమి’ అనే నాటకాన్ని ప్రదర్శించింది. బుర్రకథల వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించింది.

 

భూస్వాములపై దాడులు

ధర్మాపురం: నల్లగొండ జిల్లా, జనగామ తాలుకా ధర్మాపురం జమీందారు పుసుకూరు రాఘవరావు భూముల ఆక్రమణ కోసం లంబాడి తండా పైకి గూండాలను పంపాడు. జాఠోతు వాము నాయకత్వంలో లంబాడీలంతా కలిసి గూండాలను తరిమికొట్టి తమ భూములను కాపాడుకున్నారు.

 

ముండ్రాయి: జనగామ తాలుకాలోని ముండ్రాయి భూస్వామి కడారి నరసింహారావు. ఈయన స్థానిక లంబాడీల భూములను ఆక్రమించాడు. తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి 300 మంది లంబాడీలు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ప్రయత్నించారు. భూస్వామి మందీమార్బలం, పోలీసులతో వచ్చాడు. పోలీసు అధికారి గురుదయాళ్‌ సింగ్‌ ఆదేశంతో పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఆంధ్ర మహాసభ సభ్యుల సలహాతో ప్రజలు వెనక్కు తగ్గారు. అనేకమందిని అరెస్ట్‌ చేశారు.

 

ఎర్రపాడు: నల్గొండ జిల్లా, సూర్యాపేట తాలుకా ఎర్రపాడు భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి. ఈయన తన ఆధీనంలోని చిల్వకుంట, ఎడవెల్లి, నూతనకల్లు గ్రామాల్లో రైతుల పొలాలు ఆక్రమించాడు. ఎడవల్లిలో గాజుల రామచంద్రయ్య నాయకత్వంలో ప్రజలు తిరగబడి గూండాలను తరిమి తమ భూములను కాపాడుకున్నారు.

 

బందగి మరణం: షేక్‌ బందగి పేద ముస్లిం రైతు. ఈయనది జనగాం తాలుకా కామారెడ్డిగూడెం. ఈయన అన్న అబ్బాస్‌ అలీ విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి దగ్గర పనిచేసేవాడు. బందగి భూమిని అతడి అన్నకు ఇప్పించడానికి దేశ్‌ముఖ్‌ ప్రయత్నించడంతో, బందగి ఎదురుతిరిగి కోర్టుకు వెళ్లి తనకు అనుకూలమైన తీర్పు పొందాడు. దాంతో బందగిని తన గూండాలతో హత్య భూస్వామి చేయించాడు. 1940, జులై 27న కామారెడ్డిగూడెంలో బందగి సమాధికి నివాళులర్పించే దృశ్యంతోనే ‘మాభూమి’ నాటకం ప్రారంభమైంది.

 

మేళ్ళచెరువు: ఇది పేరుకు రైత్వారీ గ్రామం. కానీ గ్రామంలోని సగభాగం భూమి భూస్వామి చెన్నూరు వీరభద్రరావు ఆధీనంలో ఉండేది. మిగిలిన భూములనూ ఆక్రమించడానికి ప్రయత్నించాడు. ప్రజలు సంఘటితమై భూస్వామి తండ్రిని హతమార్చారు. భూస్వామి భయపడి ఆ భూములపై రైతులకు శాశ్వత కౌలు హక్కులు కల్పించాడు. పాత సూర్యాపేట గ్రామ దేశ్‌ముఖ్‌ కుందూరు లక్ష్మీకాంతరావు సాగిస్తున్న అన్యాయాలను ప్రజలు ఎదిరించారు.

 

అల్లీపురం, తిమ్మాపురం: ఇవి వరంగల్‌ జిల్లాలో అన్వర్‌పాషా జాగీరు గ్రామాలు. ఈ జాగీరులోని భూములన్నీ అన్వర్‌ పాషా జాగీర్దారు ఆధీనంలో ఉండేవి. రైతులు కౌలుకు భూములు సాగు చేసేవారు. కౌలు రేట్లు తగ్గించాలని, శాశ్వత పట్టాలివ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తూ సామూహికంగా జాగీర్దారు ఇంటిపై దాడి చేశారు. జాగీర్దార్‌ పారిపోయాడు. పోలీసులు 20 మందిపై కేసులు పెట్టారు.

 

ములకలగూడెం: ఇక్కడి భూస్వామి పింగళి రంగారెడ్డి ఆధీనంలో వేల ఎకరాల భూములుండేవి. పాత బాకీలు తీర్చలేదనే సాకుతో ఈ గ్రామానికి చెందిన సత్తయ్య భూములను పంట చేతికొచ్చే సమయానికి ఆక్రమించాడు. గ్రామంలోని ప్రజలు సామూహికంగా భూస్వామి మనుషులపై దాడి చేసి ఆ భూమిని, పంటను స్వాధీనం చేసుకున్నారు.

 

నాసికల్లు: ఈ గ్రామ భూస్వామి వెంగల్‌ నరసింహారెడ్డి. ఈయన వెయ్యి ఎకరాల భూమి నుంచి రైతులను తరిమేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గుండాల కొండయ్య అనే రైతు భూమిని గూండాల సహాయంతో ఆక్రమించాడు. ప్రజలు సామూహికంగా ఎదురుతిరిగి దాడి చేయడంతో భూస్వామి సహా అంతా పారిపోయారు.

 

బేతవోలు: హుజూర్‌నగర్‌ తాలూకా బేతవోలు భూస్వామి తకమళ్ల సీతారామచంద్రరావుకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి భూములు పంచుకున్నారు.

 

బక్కవంతులగూడెం: బక్కవంతులగూడెం భూస్వామి భోగా వీరారెడ్డి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చాడు. తిరిగి చెల్లించలేదనే నెపంతో భూములు ఆక్రమించుకున్నాడు. తనకు రక్షణగా పోలీసులను, గూండాలను వినియోగించుకునేవాడు. ప్రజలకు సహాయం చేస్తున్న సంఘ సభ్యులను పోలీసుల ద్వారా అణచివేయడానికి ప్రయత్నించాడు. పాత బకాయిలు, అప్పులు చూపి రైతుల భూములను ఆక్రమించాలని చూశాడు. ప్రజలు సామూహికంగా భూస్వామిపై పోరాడి విముక్తి పొందారు. జనగామ తాలూకా ప్రజలు ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో నాగు రుణాలు చెల్లించేందుకు నిరాకరించారు. భూస్వాములపై తిరుగుబాటు చేశారు.

 

పాలకుర్తి సంఘటన: చాకలి ఐలమ్మది జనగామ తాలుకా పాలకుర్తి గ్రామం. ఆమె ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసేది. విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి కోతకు వచ్చిన ఐలమ్మ పంటను తీసుకురమ్మని తన గూండాలను పంపించాడు. బి.ఎన్‌.రెడ్డి, ధర్మభిక్షంతో సహా 20 మంది సభ్యులున్న సూర్యాపేట దళం వచ్చి ఐలమ్మకు అండగా నిలిచి ధాన్యాన్ని ఆమె ఇంటికి తరలించింది. వీరికి అండగా పాలకుర్తి, దేవరుప్పల ప్రజలు వచ్చారు. దేశ్‌ముఖ్‌ గూండాలు పారిపోయారు. ఇది తెలంగాణ ప్రజా విప్లవ ప్రథమ విజయం (1945).

 

రెండో దశ సాయుధ పోరాటం 1946-1947లో సాగింది. అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. పోరాటం మూడో దశ 1947-1948లో జరిగింది. ఇది రజాకారుల దాడుల నుంచి ప్రజలను రక్షించడానికి సాగింది. సాయుధ పోరాట నాలుగో దశ 1948 నుంచి 1951 వరకు సాగింది.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి
 

Posted Date : 13-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌