• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో గిరిజన పోరాటాలు

మా గూడెం.. మా రాజ్యం!

  గిరిజనుల గుండెలు మండిపోయాయి. అణచివేతలను, ఆపై పన్నుల మోతలను తట్టుకోలేక తిరగబడ్డారు. అడవిలో తమ అస్తిత్వానికే ముప్పు తెచ్చిన పాలకులపై  విరుచుకుపడ్డారు. వీరోచితంగా పోరాడి నిజాం సైన్యాలను బెంబేలెత్తించారు. చరిత్రలో విప్లవ వీరులుగా నిలిచిపోయారు. తెలంగాణలో బ్రిటిష్, నిజాం నవాబుల పాలనలో అడవిబిడ్డల బతుకులు ఎలా ఆగమయ్యాయి? ఈ క్రమంలో వారు చేసిన పోరాటాలను, ముందుండి నడిపించిన ధీరోదాత్తులైన నాయకుల వివరాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

  తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండేది. అక్కడ గిరిజనుల స్వపరిపాలన, జీవన విధానాలు, అస్తిత్వానికి బ్రిటిష్, నిజాం ప్రభుత్వాలు ఆంటకాలు కలిగించాయి. దాంతో ఆదివాసీలు అనేక పోరాటాలు చేశారు. తమ వ్యవహారాల్లో బయటి ప్రజలు, అధికారుల అనవసర ప్రమేయాన్ని, ఆధిపత్యాన్ని వారు వ్యతిరేకించారు. తమ నివాస ప్రాంతాలపై సార్వభౌమత్వానికి అడ్డు వచ్చిన వారిని ఎదిరించారు.

  హైదరాబాద్‌ నిజాం క్రీ.శ.1798లో ఆంగ్లేయులతో సైన్యసహకార ఒప్పందం చేసుకొని వారికి సామంతుడిగా మారిపోయాడు. ఆ కాలంలోనే బ్రిటిషర్లు భూమి సర్వే ఒప్పందాలను ప్రవేశపెట్టారు. ముడిసరకుల కోసం గిరిజన గ్రామాల్లోకి వెళ్లారు. భూమి పన్ను వసూలు చేశారు. వారితో వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఈ చర్యలు అడవి బిడ్డల్లో అసంతృప్తికి కారణమైంది. క్రీ.శ.18వ శతాబ్దపు మలిభాగంలో ప్రభుత్వం గిరిజనుల భూములను గిరిజనేతరులకు కౌలుకు ఇవ్వడం మొదలుపెట్టింది. దాంతో భూస్వాముల ప్రమేయం పెరిగింది. వారు అధిక వడ్డీలకు గిరిజనులకు అప్పులు ఇవ్వడం ప్రారంభించారు. ఆ అప్పులు తీర్చలేకపోయిన గిరిజనుల భూములను ఆక్రమించేవారు.ఆ దశలోనే హైదరాబాద్‌ దివాన్‌ (ప్రధానమంత్రి) సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణల వల్ల రెవెన్యూ పరిపాలనలో దేశ్‌ముఖ్, మొఖాసీలు, దేశ్‌పాండే మొదలైన అధికారులు నియమితులయ్యారు. ఈ అధికారుల జోక్యం, పెత్తనం కూడా ఎక్కువై గిరిజనుల స్వయంపాలనాధికారం దెబ్బతింది. గోండు, గిరిజనుల సంస్కృతి ప్రకారం గ్రామంలోని ప్రకృతి వనరులు ముఖ్యంగా నీరు, భూమి, అడవి గ్రామం ఆస్తిగా ఉండేవి. వీటి నిర్వహణ, అధికారం, బాధ్యత గ్రామ కుల పంచాయతీదే. అయితే నిజాం రెవెన్యూ పరిపాలన వచ్చిన తర్వాత భూమిపై అజమాయిషీ అంతా నిజాం ప్రభుత్వం నియమించిన గ్రామాధికారి, వారి పైఅధికారులదే అయ్యింది. గిరిజనుల ఆస్తి ప్రభుత్వ నిర్వహణలోకి వెళ్లింది. గోండు రాజులు రెవెన్యూ అధికారులకు సహాయకులు, బానిసలుగా మారిపోయారు. ఈ పరిణామాలు అడవి బిడ్డల ఆత్మగౌరవానికి భంగంగా మారాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో  పలు గిరిజనోద్యమాలు జరిగాయి. ఇందులో రాంజీ గోండు, కొమురం భీమ్‌ పోరాటాలు ముఖ్యమైనవి.

 

తొలి తిరుగుబాటు

రాంజీ గోండు: సిపాయిల తిరుగుబాటు కాలంలో గోండ్వానా ప్రాంతంలోని ఆదిలాబాద్‌ జిల్లాలో రాంజీ గోండు ఆధ్వర్యంలో రోహిల్లా (1836-60) తిరుగుబాటు జరిగింది. ఇది దేశంలోనే తొలి ఆదివాసీ చారిత్రక పోరాటంగా నిలిచింది.  క్రీ.శ.1240 - 1750 సమయంలో మధ్య భారతదేశంలో (ప్రస్తుత మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో) నివసించే అనేకమంది గిరిజనులతో కూడిన గోండు రాజ్యం ఉనికిలో ఉండేది. ఆంగ్లేయుల పాలనా కాలంలో ఈ ప్రాంత గిరిజనులు అనేక కష్టనష్టాలకు గురయ్యారు.  వారిని బానిసలుగా మార్చి బ్రిటిషర్లు వెట్టి చాకిరి చేయించుకునేవారు. విపరీతంగా పన్నులు వసూలు చేసేవారు. ఆ దుర్భర పరిస్థితుల వల్ల బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది. దీనికి నాయకత్వం వహించింది మార్సికొల్లా రాంజీ గోండు. ఆయన జనగాం (ఆసిఫాబాదు)ను కేంద్రంగా చేసుకొని క్రీ.శ.1836-60 మధ్యకాలంలో తెల్లవారిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు నాయకుడైన తాంతియాతోపే అనుచరులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌ నుంచి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వారికి రాంజీ గోండు సాయం అందించాడు. రోహిల్లాల నాయకుడు హాజీ, గోండులకు నాయకుడైన రాంజీ గోండు కలిసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ రెండు పక్షాలు నిర్మల్‌కు కొన్ని మైళ్ల దూరంలోని ఒక గుట్టపై స్థావరం ఏర్పాటు చేసుకున్నాయి. వీరికి తాంతియాతోపే నుంచి సహాయం, ప్రోత్సాహం లభించింది. బ్రిటిష్‌ సైన్యం ఆదిలాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వరకు ఎటు కదిలినా వీరు దెబ్బతీసేవారు. ఆ తిరుగుబాట్లను అణచివేసేందుకు హింగోళి ప్రాంతంలోని బ్రిటిష్‌ సేనాని కల్నల్‌ రాబర్ట్‌ ఆధ్వర్యంలో 47వ రెజిమెంట్, బళ్లారి సైనిక పటాలాలు వచ్చినప్పటికీ విఫలమయ్యాయి. చివరికి రోహిల్లా, గోండు వీరులకు, కలెక్టర్‌ బలగాలకు మధ్య 1860లో నిర్మల్‌లో యుద్ధం జరిగింది. ఆంగ్లేయుల అధునాతన ఆయుధాలకు తట్టుకోలేక ఆదివాసీలు చెదిరిపోయారు. అప్పుడు తప్పించుకొని పారిపోయిన రాంజీ గోండు కొంతకాలానికి పట్టుబడ్డాడు. ప్రభుత్వ ఆదేశాలతో రాంజీ గోండు, మరో వెయ్యి మంది తిరుగుబాటుదారులను 1860, ఏప్రిల్‌ 9న నిర్మల్‌ నడిబొడ్డున ఉన్న ఊడల మర్రిచెట్టుకు ఉరితీశారు. తర్వాత కాలంలో ఆ మర్రిచెట్టు వెయ్యి ఉరిల మర్రిచెట్టుగా, ఉరులమర్రిగా పేరుగాంచింది.

 

నిజాం నవాబుకు సింహస్వప్నం

కుమురం భీమ్‌ (1901 - 1940): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సంకేపల్లిలో గోండు ఆదివాసీ కుటుంబంలో 1901, అక్టోబరు 22న కుమురం భీమ్‌ జన్మించాడు. ఈయన ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ ప్రాంత అడవుల్లోని జోడెఘాట్‌ దగ్గరున్న 12 గ్రామాల్లో గిరిజనుల రాజ్యాధికారాన్ని నెలకొల్పేందుకు గెరిల్లా పద్ధతిలో పోరాటం చేశాడు. నిజాం నవాబు పాలనలో సాగిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నించాడు. జల్‌ (నీరు) - జంగల్‌ (అడవి) - జమీన్‌ (భూమి) అనేది ఇతడి పోరాట నినాదం. అడవుల్లోని వనరులపై పూర్తి అధికారం అడవి బిడ్డలదే అని ఈ నినాదం అర్థం. అల్లూరి సీతారామరాజు పోరాటం చూసి భీమ్‌ ప్రభావితుడయ్యాడు. అడవిలో గిరిజనుల హక్కుల కోసం ‘మా గూడెంలో మా రాజ్యం’ పేరుతో పోరాటం చేశాడు. పశువుల కాపర్లపై నిజాం విధించిన సుంకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గిరిజనులను ఏకం చేసి నడిపించాడు. సిద్ధిక్‌ అనే భూస్వామిని అంతం చేశాడు. స్థానిక తాలుకాదారైన సత్తార్‌పై తిరుగుబాటు చేశాడు. 1928 నుంచి 1940 వరకు పోరాటాలు చేసిన కుమురం, నిజాం నవాబుకు సింహస్వప్నంగా మారాడు. కుర్దు పటేల్‌ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో భీమ్‌ స్థావరాన్ని పోలీసుల బలగం, సైన్యం ముట్టడించాయి. ఇరుపక్షాలకు బాభిఝురి కొండల్లో జరిగిన పోరాటంలో కుమురం 1940, సెప్టెంబరు 1న అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వయుజ శుద్ధపౌర్ణమి రోజున వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఆయన వర్ధంతి చేసుకోవడం ఆదివాసీలకు ఆనవాయితీగా మారింది. గోండులకు అండగా నిలిచిన కమ్యూనిస్టు నాయకుడైన బద్దం ఎల్లారెడ్డికి సిరిసిల్ల మున్సిఫ్‌ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.200 జరిమానా విధించింది. గోండుల సమస్యపై బద్దం ఎల్లారెడ్డి సమగ్ర పరిశీలనతో తయారుచేసిన నివేదికను గోల్కొండ పత్రిక ప్రచురించింది. ‘సిరాజుల్‌ హసన్‌ తిర్మయిజీ’ అనే పత్రికా సంపాదకుడు కుమురం భీమ్‌ పోరాటానికి మద్దతిచ్చాడు. 2009, డిసెంబరు 17న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కుమురం భీమ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని నిర్ణయించింది.

 

పరిష్కారం దిశగా

హైమన్‌డార్ఫ్‌: కుమురం భీమ్‌ పోరాటంతో నిజాం ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గోండు ప్రజల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారం కోసం సూచనలు చేయడానికి నిజాం కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైమన్‌డార్ఫ్‌ను నియమించింది. ఇందుకోసం ఆయన తన భార్య బ్రెట్టీ ఎలిజబెత్‌తో కలిసి 1941లో మార్లవాయి అనే గోండు పల్లెలో అడుగుపెట్టాడు. 1941 నుంచి 1943 వరకు విస్తృతంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాడు. గిరిజనులకు విద్య, భూమి లేకపోవడమే వారి సమస్యకు మూలకారణమని తన నివేదికలో పేర్కొన్నాడు. దీంతో గిరిజనులకు హైదరాబాద్‌ సంస్థానం దాదాపు లక్ష ఎకరాల రిజర్వ్‌డ్‌ అటవీ భూములను పంచింది. 1943లో గోండు భాషలో విద్యాబోధన ప్రారంభమైంది. గోండు ఉపాధ్యాయులు, ఉద్యోగులను తయారుచేయడానికి దాదాపు వంద పాఠశాలలను, ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైమన్‌డార్ఫ్‌ పరిశోధనా వివరాలు ఆయన రచించిన ‘ట్రైబల్‌ హైదరాబాద్‌’ అనే గ్రంథంలో ఉన్నాయి.

 

కోయల కోపాగ్ని

  పాల్వంచ తాలుకాలోని 20 గ్రామాల కోయ ప్రజలు భూస్వాముల దోపిడీలు, నిజాం పోలీసుల అణచివేతలకు గురయ్యారు. దీంతో రగిలిపోయిన 120 మంది యువకులు గెరిల్లా దళ సభ్యులై పోరాటం చేసి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.వెయ్యి మంది నిజాం సైనికులు అధునాతన ఆయుధాలతో వచ్చి వీరిని అణచివేశారు. కోయ దళ నాయకుడు ముత్యాలు మరణించడంతో పోరాటం ముగిసింది.

 

రచయిత: జితేందర్‌ రెడ్డి

Posted Date : 28-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌