• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రోద్యమం - ఆంధ్ర జనసంఘ స్థాపన

భాషను బతికించి.. జాతిని నడిపించి!

నిజాం రాజ్యంలో అవమానాల మధ్య ఆవిర్భవించిన ఆంధ్ర జనసంఘం అనతి కాలంలోనే తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటడంతోపాటు స్త్రీ విద్యకు, మహిళాభ్యుదయానికి కృషి చేసింది. తెలంగాణ చరిత్రను శోధించి భావితరాలకు అందించింది. చైతన్యపూరిత రచనలతో సమాజాన్ని జాగృతం చేసింది. వెట్టిచాకిరి, దేవదాసీ వంటి సాంఘిక దురాచారాలపై పోరాడింది. అనంతరం ఆంధ్రమహాసభగా మారి రాజకీయ కార్యకలపాలను చేపట్టింది. అక్కడి నుంచే అనేకమంది నేతలు పుట్టుకొచ్చారు. మాతృభాషను బతికించి, తెలుగు జాతిని నడిపించిన ఆ సంస్థ పుట్టుక, కార్యకలాపాలు, సాధించిన విజయాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి.

హైదరాబాద్‌ సంస్థానం మొత్తం వైశాల్యంలో దాదాపు 50 శాతం తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణ ఉండేది. తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారి మాతృభాష తెలుగుకు ఏ మాత్రం గుర్తింపు ఉండేది కాదు. 


సంఘం ఏర్పాటు   

1921, నవంబరు 11, 12 తేదీల్లో మహర్షి కార్వే అధ్యక్షతన హైదరాబాద్‌లోని వివేకవర్ధిని థియేటర్‌లో నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల సభ జరిగింది. ఈ సమావేశంలో వక్తలు ఇంగ్లిష్, ఉర్దూ, మరాఠీ భాషల్లో మాట్లాడారు. నవంబరు 12న జరిగిన సమావేశానికి సరళాదేవి చౌదురాణి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది అల్లంపల్లి వెంకట రామారావు ఒక తీర్మానంపై తెలుగులో ఉపన్యాసం ప్రారంభించగానే మహారాష్ట్ర యువకులు అవహేళన చేసి అల్లరి ప్రారంభించారు. చివరకు వేదిక వైపు వెన్ను తిప్పి కూర్చున్నారు. ఫలితంగా వెంకట రామారావు తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సంఘటనను సమావేశంలో పాల్గొన్న తెలుగువారు పెద్ద అవమానంగా భావించారు. వివేకవర్ధిని థియేటర్‌ వెనుకనే ఉన్న ట్రూప్‌బజార్‌లోని టేకుమాల రంగారావు ఇంటిలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచించారు. ఫలితంగా 1921, నవంబరు 12వ తేదీ రాత్రి 11 మంది ప్రముఖులు ఆంధ్ర జనసంఘం అనే రాజకీయేతర సంస్థను ఏర్పాటు చేశారు. 1922, ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఈ సంఘం ప్రథమ సమావేశం కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. దీని కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఈ సమావేశంలో ఆంధ్ర జనసంఘం పేరును నిజాం సంస్థాన ఆంధ్ర జనసంఘంగా మార్చారు.

 

నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం

ఆంధ్ర జనసంఘం ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో అనేక తెలుగు సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలను ఐక్యం చేసే లక్ష్యంతో 1923, ఏప్రిల్‌ 1న హనుమకొండలో సమావేశమైన వివిధ సంస్థల ప్రతినిధులు ఆంధ్ర జన కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడు రాజగోపాలరెడ్డి (బారిస్టర్‌), కార్యదర్శి మాడపాటి హనుమంతరావు.


నిజాం రాజ్య జన కేంద్ర సంఘం కార్యక్రమాలు: 

* తెలుగు గ్రంథాలయాలు, ప్రైవేటు పాఠశాలలను ఏర్పాటు చేయడం.

* ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యల గురించి వివరణ పత్రాలు, కరపత్రాలు ప్రచురించి వారిలో చైతన్యం కలిగించడం.

* తెలుగు పండితులకు ప్రోత్సాహం కల్పించడం.

* తెలుగు ప్రజల శాసనాలను సేకరించడం.

* పై ఆశయాలను ప్రజల్లో వ్యాప్తి చేయడానికి సంచార కార్యకర్తలను ఏర్పాటు చేయడం.

 

ఆంధ్ర పరిశోధక సంఘం

ఆంధ్ర జన కేంద్ర సంఘానికి అనుబంధంగా 1922, ఫిబ్రవరి 27న ఆంధ్ర పరిశోధక సంఘం ఏర్పాటైంది. తెలంగాణ ప్రజల చరిత్ర సాధనాలను సేకరించడం ఆంధ్ర పరిశోధక సంఘ ముఖ్య ఉద్దేశం. శ్రీ శేషాద్రి రమణ కవులు తెలంగాణలో పర్యటించి అనేక శాసనాల ప్రతిచిత్రాలు, తాళపత్ర గ్రంథాలను సేకరించారు. 123 శాసనాల నుంచి శుద్ధ ప్రతులను రాయించి ‘తెలంగాణ శాసనాలు’ పేరుతో ఒక సంపుటాన్ని ప్రచురించారు. ఈ సంఘానికి మునగాల రాజా నాయని వెంకట రంగారావు అధ్యక్షులుగా ఉండి, నెలకు రూ.వెయ్యి ఆర్థిక సహాయం చేశారు. 1931, ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి ఈ సంస్థ కొమర్రాజు లక్ష్మణరావు పేరుతో ‘శ్రీలక్ష్మణరాయ పరిశోధక మండలి’గా మారింది. లక్ష్మణరాయ పరిశోధక సంఘానికి ఆదిరాజు వీరభద్రరావు జీవితకాలం కార్యదర్శిగా పనిచేశారు.


ప్రచురణలు: వెట్టిచాకిరిని నిరసిస్తూ నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం 'వెట్టిచాకిరి' అనే గ్రంథాన్ని ప్రచురించింది. (జనసంఘ కృషి వల్ల నిజాం ప్రభుత్వం 1923లో వెట్టిచాకిరిని రద్దు చేసింది) అవినీతి అధికారుల నుంచి వర్తకులకు స్వేచ్ఛ కోసం ‘వర్తక సంఘం’ గ్రంథం వెలువడింది. చేనేతకారులపై విధించే ‘మోతుర్బా’ అనే మగ్గం పన్నును రద్దు చేయించింది. జన సంఘం కృషితోనే ‘నిజాం రాష్ట్ర ప్రశంస’, ‘నిజాం రాష్ట్రం- ఆంధ్రులు’ అనే లఘు పుస్తకాలు వెలువడ్డాయి. 1930లో వరంగల్‌లో తెలుగు పండితులు, చరిత్రకారుల సమావేశం జరిగింది. ఫలితంగా ‘కాకతీయ సంచిక’ అనే చారిత్రక సంచిక ప్రచురితమైంది. దాని ద్వారా కాకతీయుల కాలం నాటి రాజకీయ, సాంఘిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి రచించారు. ‘తెలంగాణ శాసనాలు’ గ్రంథాన్ని ఆదిరాజు వీరభద్రరావు రచించారు. మాడపాటి హనుమంతరావు తన స్వీయ చరిత్ర కథలను తెలుగులోకి అనువదించారు.

 

స్త్రీ విద్య

1928 నుంచి ఆంధ్ర జన కేంద్ర సంఘం స్త్రీ విద్య కోసం పాటుపడింది. సంఘం కృషి వల్ల 1928లో హైదరాబాద్‌లో ఆంధ్ర బాలికోన్నత పాఠశాల ప్రారంభమైంది. తెలుగు బోధన భాషగా విద్య అభ్యసించిన మొదటి బ్యాచ్‌ 1934లో మెట్రిక్యులేషన్‌ పరీక్షకు అనుమతి పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పాఠశాలకు గుర్తింపు నిరాకరించడంతో పుణెలోని మహిళా విద్యాపీఠం కులపతి మహర్షి కార్వే అనుమతితో వీరు పుణెలోనే పరీక్షలు రాసి మెట్రిక్యులేషన్‌ సర్టిఫికెట్‌ పొందారు. ఆంధ్ర జన కేంద్ర సంఘ రెండో సమావేశం నల్గొండలో (1924), మూడో సమావేశం మధిరలో (1925), నాలుగో సమావేశం సూర్యాపేటలో (1928) జరిగాయి. ఇవి రావు బహద్దూర్‌ వెంకట్రామరెడ్డి అధ్యక్షతన జరిగాయి. 1920లో వరంగల్‌లో త్రిలింగ ఆయుర్వేద విద్యాపీఠం, ఆయుర్వేద ధర్మ వైద్య‌శాల, ఆయుర్వేద ఔషధశాల నడిచేవి. వీటికి మాదిరాజు రామకోటేశ్వరరావు కార్యదర్శిగా ఉండేవారు.

 

నిజాం ఆంధ్ర మహాసభ

1930, మార్చి 3, 4, 5 తేదీల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా జోగిపేటలో ఆంధ్ర జన కేంద్ర సంఘం సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఆంధ్ర జన కేంద్ర సంఘం తన పేరును ఆంధ్ర మహాసభగా మార్చుకుని రాజకీయ సంస్థగా మారింది. సమావేశాలకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వ్యవహరించారు. పేరు మార్పుతో కొన్ని కొత్త లక్షణాలు ఈ సంస్థలోకి ప్రవేశించాయి. అవి సాంఘిక, సాంస్కృతిక విషయాలను లోతుగా పరిశీలించడం, దానికి అనుగుణంగా తీర్మానాలు చేయడం. ఇదే సందర్భంలో అక్కడే జరిగిన ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశానికి నడింపల్లి సుందరమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో స్త్రీ విద్య, హరిజనోద్ధరణ, సాంఘిక దురాచారాల తొలగింపు, జాగీరు భూముల్లో రైతుల హక్కుల రక్షణ, తెలంగాణ సరిహద్దులను కచ్చితంగా నిర్ణయించడం, స్థానిక సంఘాల్లో ఎన్నికల పద్ధతి తదితర అంశాలను చర్చించారు. ఆంధ్ర మహాసభలకు ప్రజాదరణ బాగా పెరగడంతో ప్రభుత్వం ఆందోళనకు గురైంది. 1929లో గస్తి నెంబరు 53ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే పది రోజుల ముందే సమావేశ ఎజెండా ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి తీసుకోవాలి. 1937లో నిజాం రాజ్యంలోని మహారాష్ట్ర వారు మహారాష్ట్ర పరిషత్తును, కర్ణాటక వారు కర్ణాటక పరిషత్తును స్థాపించారు.

 

రెండో నిజాం ఆంధ్ర మహాసభ

ఈ సమావేశాలు 1931లో దేవరకొండలో బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగాయి. భాగ్యరెడ్డి వర్మ, గూడవల్లి రామబ్రహ్మం పాల్గొన్నారు. రావి నారాయణ రెడ్డి హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌ నుంచి కాలినడకన బయలుదేరి సమావేశానికి హాజరయ్యారు.  ఆంధ్ర మహాసభ పేరును తెలుగు లేక తెలంగాణ సభగా మార్చుకోమని నిజాం ప్రభుత్వం సలహా ఇవ్వగా ఆంధ్ర మహాసభ నాయకులు నిరాకరించారు. ఇక్కడే జరిగిన ఆంధ్ర మహిళా సభ రెండో సమావేశానికి టి.వరలక్ష్మమ్మ అధ్యక్షత వహించారు. మూడో నిజాం ఆంధ్ర మహాసభ సమావేశాలు 1934లో ఖమ్మంలో జరిగాయి. వీటికి పులిజాల వెంకట రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాల్లో దేవదాసీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని తీర్మానించారు. ఈ సభతోనే సర్దార్‌ జమలాపురం కేశవరావు, మాడపాటి రామచందర్‌రావుల రాజకీయ జీవితం ప్రారంభమైంది.

 

నాలుగో నిజాం ఆంధ్ర మహాసభ

ఈ సమావేశాలు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో జరిగాయి. మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహించారు. వేములవాడ భీమకవి దివ్యస్మృతిగా సభావరణానికి ‘భీమకవి నగరము’ అని పేరు పెట్టారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారి అయిన మెకంజీ విద్యావిధాన పునర్నిర్మాణం గురించి ఒక ప్రణాళికను రూపొందించారు. ఈయన ప్రణాళికలోని ప్రజల మాతృభాషలో విద్యావ్యాప్తి అనే అంశాన్ని ఆంధ్ర మహాసభ బలపరిచి నిజాం ప్రభుత్వానికి పంపింది. నిర్బంధ ప్రాథమిక విద్య, జాగీరు ప్రజల హక్కులు, స్థానిక స్వపరిపాలన, గ్రామ పంచాయతీల స్థాపన, నిమ్నజాతుల ఉద్ధరణ వంటి 26 తీర్మానాలను ఈ సభ ఆమోదించింది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి రాజకీయ జీవితం ఈ సభతో ప్రారంభమైంది. ఇక్కడ జరిగిన నాలుగో ఆంధ్ర మహిళా సభకు మాడపాటి మాణిక్యాంబ అధ్యక్షత వహించారు.


మాదిరి ప్రశ్నలు

1. ఆంధ్రుల సాంఘిక చరిత్రను ఎవరు రచించారు?

1) దాశరథి 2) వీరభద్ర రావు 3) నారాయణ రావు 4) సురవరం ప్రతాపరెడ్డి


2. ఆంధ్ర జన కేంద్ర సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు?

1) 1921 2) 1923 3) 1925 4) 1926


3. ఆంధ్ర మహాసభ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది?

1) మధిర 2) జోగిపేట 3) సూర్యాపేట 4) షాద్‌నగర్‌


4. కాకతీయ సంచిక ఎప్పుడు వెలువడింది?

1) 1925   2) 1928  3) 1930  4) 1932


5. మొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?

1) వడింపల్లి సుందరమ్మ 2) యోగ్య శీలాదేవి

3) టి.వరలక్ష్మమ్మ 4) ఎల్లాప్రగడ సీతాకుమారి


6. ఆంధ్ర పరిశోధక సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు?

1) 1921 2) 1922 3) 1923 4) 1924


7. ‘తెలంగాణ శాసనాలు’ అనే గ్రంథాన్ని రచించినవారు?

1) నారాయణ రావు 2) సురవరం ప్రతాపరెడ్డి

3) ఆదిరాజు వీరభద్ర రావు 4) దాశరథి


8. ఆంధ్ర బాలికోన్నత పాఠశాల ఏర్పాటైన సంవత్సరం?

1) 1922 2) 1924 3) 1926 4) 1928


9. మోతుర్బా అంటే ఏమిటి?

1) మగ్గం పన్ను 2) నీటి పన్ను 3) భూమి శిస్తు 4) పరిపాలనా విభాగం

 

సమాధానాలు

1-4, 2-2, 3-2, 4-3, 5-1, 6-2, 7-3, 8-4, 9-1.


రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 23-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌