• facebook
  • whatsapp
  • telegram

అసఫ్‌జాహీలు

హైదరాబాద్‌లో నిజాం రాజ్యం!

కుతుబ్‌షాహీల తర్వాత ప్రాభవాన్ని కోల్పోయిన హైదరాబాద్‌ రాజ్యం మళ్లీ నిజాంల పాలనలో ఆధునిక యుగ వైభవాన్ని సంతరించుకుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు, ఆనకట్టలు, ప్రఖ్యాత నిర్మాణాలు వెలిశాయి. దాంతోపాటు బ్రిటిషర్ల ఆధిపత్యమూ పెరిగింది. ఈ పరిణామాలను అభ్యర్థులు సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే నిజాంల  రాజకీయ చరిత్రను తెలుసుకోవాలి. 

 

కుతుబ్‌షాహీ అనంతర యుగం

  క్రీ.శ.1687లో కుతుబ్‌షాహీ రాజ్యం మొగల్‌ సామ్రాజ్యంలో కలిసిపోయింది. బీజాపూర్‌ రాజ్యం గోల్కొండలో భాగమైపోయింది. దక్కన్‌ ప్రాంతాన్ని మొగల్‌ పాలకులు ఖాన్‌దేశ్, బీరారు, ఔరంగాబాద్, బీదర్, హైదరాబాద్, బీజాపూర్‌ అనే ఆరు సుబాలుగా విభజించారు. వీరు హైదరాబాద్‌ను బాలాఘాట్, పైన్‌ఘాట్‌ అని వ్యవహరించేవారు. మొగలుల దక్కన్‌కు ఔరంగాబాద్‌ రాజధాని. అక్కడి రాజప్రతినిధికి ప్రతినిధిగా ప్రతి సుబాలో ఒక ఫౌజుదారు ఉండేవాడు. గోల్కొండ సైనిక స్థావరమైంది. హైదరాబాద్‌ రాజకీయ వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. వ్యవసాయం, పరిశ్రమలు, వజ్రాల గనులు మూతపడ్డాయి. దోపిడీ దొంగల బెడద పెరిగి రహదారులపై భద్రత కరవైంది. వాణిజ్యం క్షీణించింది. 

  మరాఠీ దండులు రాజ్యంలో ప్రవేశించి గ్రామాలు, పట్టణాలపై దాడులు చేసి బీభత్సాన్ని సృష్టించేవి. జమీందార్లు గ్రామాలను దోచుకునేవారు. క్రీ.శ.1688లో క్షామం సంభవించిన వెంటనే వచ్చిన విషూది వ్యాధి గురించి మార్టిన్‌ అనే ఫ్రెంచి వర్తకుడు వర్ణించాడు. పశ్చిమాంధ్ర ప్రాంతాలు హైదరాబాద్‌ సుబాలో, తీరాంధ్ర ప్రాంతాలు మచిలీపట్నం సుబాలో చేరాయి. ఔరంగజేబు కాలంలో నిర్మించిన రాచబాట (దండు బాట) హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం వరకు ఉంది. మార్గమధ్యలో నిర్మించిన మసీదులు, విశ్రాంతి భవనాలు, గుమ్మటాలు నేటికీ ఉన్నాయి. వీరి పాలనా కాలంలో తెలంగాణలో తపాలా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ కాలంలో దక్కన్‌ - మొగల్‌ సంస్కృతి కలిసి మిశ్రమ సంస్కృతి ఏర్పడింది.

 

అసఫ్‌జాహీలు (క్రీ.శ.1724 - 1948)

  అసఫ్‌జాహీలు హైదరాబాద్‌ సంస్థానాన్ని దాదాపు రెండు శతాబ్దాలకు పైగా పాలించారు. తెలంగాణ హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉండేది. 1948లో హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే వరకు వీరు పాలించారు. వీరి పాలనా కాలంలో తెలంగాణలో అనేక ఆధునిక పరిశ్రమలు, ఆనకట్టలు, నిర్మాణాలు చేపట్టారు. సాలార్‌జంగ్‌ సంస్కరణల వల్ల తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించింది.

 

నిజాం-ఉల్‌-ముల్క్‌ (క్రీ.శ.1724 - 1748): ఈయన అసఫ్‌జాహీ వంశస్థాపకుడు. ఇతడి అసలు పేరు మీర్‌ ఖమ్రుద్దీన్‌. నిజాం-ఉల్‌-ముల్క్‌ పూర్వీకులు టర్కీ దేశస్థులు. ఈయన రాజకీయ జీవితం క్రీ.శ.1690లో ప్రారంభమైంది. ఔరంగజేబు ఈయన ప్రతిభను గుర్తించి కర్ణాటక ఫౌజుదారుగా నియమించి చిన్‌ఖిలిచ్‌ ఖాన్‌ అనే బిరుదు ఇచ్చాడు. మరో మొగల్‌ పాలకుడు ఫరుక్‌షియర్‌ ఈయనకు పతేజంగ్, నిజాం-ఉల్‌-ముల్క్‌ అనే బిరుదులను ప్రదానం చేశాడు. క్రీ.శ.1724లో ముబారిజ్‌ ఖాన్‌ అనే మొగల్‌ సేనానిని షకర్‌ ఖేడా వద్ద ఓడించి నిజాం-ఉల్‌-ముల్క్‌ దక్కన్‌ సుబేదారు అయ్యాడు. మొగల్‌ చక్రవర్తి ఈయన అధికారాన్ని గుర్తిస్తూ అసఫ్‌జా అనే బిరుదును ప్రదానం చేసి గౌరవించాడు. ఈయన ఔరంగాబాద్‌ను రాజధానిగా చేసుకుని పాలించాడు.

 

నిజాం అలీఖాన్‌ (క్రీ.శ.1761 - 1803): ఈయన నిజాం-ఉల్‌-ముల్క్‌ కుమారుడు. రెండో అసఫ్‌జా బిరుదుతో పాలకుడయ్యాడు. తన రాజధానిని క్రీ.శ.1763లో ఔరంగాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు మార్చాడు. ఈయనకు ఉన్న నిజాం పేరు వల్ల ఇతడి వారసులందరూ నిజాంలుగా ప్రసిద్ధి పొందారు. ప్రముఖ దుబాసి కాండ్రేగుల జోగి పంతులు నిజాం అలీఖాన్, బ్రిటిషర్లకు మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చాడు. దీని ప్రకారం 1766లో నిజాం అలీఖాన్‌ గుంటూరు సర్కారు మినహా మిగిలిన ఉత్తర సర్కారులను బ్రిటిష్‌ తూర్పు ఇండియా వర్తక సంఘానికి కౌలుకు ఇచ్చాడు. ఫ్రెంచి సేనాని రేమండ్‌ సహాయంతో తన సైన్యాన్ని పటిష్ఠం చేసుకున్నాడు. రేమండ్‌ ఫిరంగులను తయారుచేసుకోవడానికి హైదరాబాద్‌లో గన్‌ఫౌండ్రీని స్థాపించాడు. ఇతడికి సైనికులు, ప్రజల్లో మంచి ఆదరణ ఉండేది. రేమండ్‌ను ముస్లింలు మూసారహీం, హిందువులు మూసారాం అని పిలిచేవారు. ఇతడి పేరు మీద మూసారాంబాగ్‌ను నిర్మించారు. అస్మాన్‌గఢ్‌ సమీపంలో 1798లో ఆయన సమాధిని నిర్మించారు. ఈ సమాధి వద్ద సంవత్సరానికి ఒకసారి ఉర్సు ఉత్సవం జరిగేది. 

  భారత గవర్నర్‌ జనరల్‌ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందంలో (1798) చేరిన మొదటి భారతీయ పాలకుడు నిజాం అలీఖాన్‌. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో నిజాం రాజ్య రక్షణకు ఏర్పాటు చేసిన బ్రిటిష్‌ సైన్యాల పోషణ కోసం రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారీలను బ్రిటిషర్లకు ధారాదత్తం చేశాడు. అందుకే వాటికి దత్త మండలాలు అనే పేరు వచ్చింది. 1798లో జేమ్స్‌ పాట్రిక్‌  ఆ మండలాలకు బ్రిటిష్‌ రెసిడెంట్‌గా నియమితుడయ్యాడు. ఈయన మీర్‌ ఆలం బంధువైన ఖైరున్నీసా బేగంను వివాహమాడి ఆమె నివాసం కోసం రంగమహల్‌ను నిర్మించాడు. జేమ్స్‌ పాట్రిక్‌కు హష్మత్‌జంగ్‌ అనే బిరుదు ఉండేది. ఈ బిరుదు పేరు మీదుగా హష్మత్‌గంజ్‌ను నిర్మించారు. నిజాం ఆస్థానంలో దక్కన్‌ సంప్రదాయంలో ఆరితేరిన వెంకటాచలం అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. నిజాం మొదటిసారిగా తమ వంశ మూలపురుషుడైన నిజాం-ఉల్‌-ముల్క్‌ పేరుతో నాణేలు వేయించాడు. ఆయన పేరున ఖుత్బా చదివించాడు. గుల్షన్‌ మహల్, మోతీ మహల్, రోషన్‌ మహల్, చార్‌బంగ్లా లాంటి భవనాలు నిర్మించాడు.

 

సికిందర్‌జా (క్రీ.శ.1803 - 1829): ఇతడు నిజాం అలీఖాన్‌ కుమారుడు. మూడో అసఫ్‌జా బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు. సికిందర్‌జా తన అధికారాలన్నీ కోల్పోయి ఆంగ్లేయులకు సామంతుడిగా మారాడు. క్రీ.శ.1806లో హెన్రీ రసెల్‌ పర్యవేక్షణలో హైదరాబాద్‌లో మీర్‌ ఆలం తటాకాన్ని నిర్మించారు. బ్రిటిష్‌ రెసిడెంట్‌ హెన్రీ రసెల్‌ ‘రస్సెల్‌ బ్రిగేడ్‌’ పేరుతో కొత్త సైన్యాన్ని ఏర్పాటుచేశాడు. తర్వాతి కాలంలో ఇది హైదరాబాద్‌ సైన్యంగా ప్రఖ్యాతిగాంచింది. నిజాం ప్రభుత్వం ఈ సైన్యం ఖర్చును భరించలేక రైతులపై విధించే భూమి శిస్తు వసూలును వేలం పాట ద్వారా దళారులకు అప్పగించింది. ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసింది. ఫలితంగా పామర్‌ అండ్‌ కంపెనీ దగ్గర వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. ఈ కంపెనీని విలియం పామర్‌ క్రీ.శ.1814లో హైదరాబాద్‌లో స్థాపించాడు. విలియం పామర్‌ క్రీ.శ.1799లో నిజాం సైన్యంలో చేరి క్రీ.శ.1812లో పదవీ విరమణ చేశాడు. నిజాం సైన్యంలో చేరిన తొలి బ్రిటిష్‌ పౌరుడు విలియం పామర్‌. ఈ కంపెనీ ఇతరుల నుంచి 12 శాతం వడ్డీకి అప్పు తీసుకుని నిజాం ప్రభుత్వానికి 25 శాతం వడ్డీకి అప్పులు ఇచ్చేది. క్రీ.శ.1820లో హైదరాబాద్‌ రెసిడెంట్‌గా వచ్చిన మెట్‌కాఫ్‌ నిజాం రుణ సమస్యను పరిష్కరించాడు. సికిందర్‌జా పేరుతో వెలిసిన నగరమే సికింద్రాబాద్‌.

 

నాసీరుద్దౌలా (క్రీ.శ.1829 - 1857): ఇతడు సికిందర్‌జా కుమారుడు. నాలుగో అసఫ్‌జా బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించాడు. నాసీరుద్దౌలా కాలంలో ఇస్లాం మతాన్ని పరిశుద్ధమైన మతంగా సంస్కరించి దేశంలో మహ్మదీయ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో వహాబీ ఉద్యమం జరిగింది. హైదరాబాద్‌లో ఆ ఉద్యమానికి నిజాం సోదరుడు ముబారిజ్‌ ఉద్దౌలా నాయకత్వం వహించాడు. ప్రభుత్వం ముబారిజ్‌ను క్రీ.శ.1839లో గోల్కొండ కోటలో నిర్బంధించింది. ఆయన అక్కడే క్రీ.శ.1854లో మరణించాడు. నిజాం ప్రభుత్వం బ్రిటిష్‌ కంపెనీ వద్ద తీసుకున్న రుణాన్ని చెల్లించలేక క్రీ.శ.1853, మే 21న కంపెనీతో బీరారు ఒడంబడికను చేసుకుంది. దీని ప్రకారం బీరారు రాష్ట్రంతో పాటు రాయచూరు, ఉస్మానాబాదు జిల్లాలను బ్రిటిష్‌ కంపెనీకి దత్తత ఇచ్చారు. నాసీరుద్దౌలా కాలంలో క్రీ.శ.1854లో లోకింగ్‌ ఎడ్వర్డు మెమోరియల్‌ హాస్పిటల్‌ను నిర్మించారు. ఇదే తర్వాతి కాలంలో గాంధీ ఆసుప‌త్రిగా మారింది. క్రీ.శ.1834లో హైదరాబాదులో మొదటి ఆంగ్ల పాఠశాల సెయింట్‌ జార్జ్‌ గ్రామర్‌ హైస్కూల్‌ను స్థాపించారు.  

 

అఫ్జలుద్దౌలా (క్రీ.శ.1857 - 1869): ఇతడు నాసీరుద్దౌలా కుమారుడు. అయిదో అసఫ్‌జా బిరుదుతో రాజ్యానికి వచ్చాడు. ఇతడి కాలంలో జరిగిన 1857 తిరుగుబాటును అణచివేయడంలో నిజాం, అతడి దివాన్‌ (ప్రధాని) సాలార్‌జంగ్‌ బ్రిటిషర్లకు సహకరించారు. 1857, జులై 17న హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి చేసిన తుర్రెబాజ్‌ ఖాన్‌ను కాల్చి చంపారు. అతడికి సహకరించిన మౌల్వీ అల్లావుద్దీన్‌ను బంధించి అండమాన్‌ దీవుల్లోని జైలుకు పంపారు. తిరుగుబాటు అణచివేతలో సహకరించినందుకు ఆంగ్లేయులు అఫ్జలుద్దౌలాకు ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ అనే బిరుదు ఇచ్చి సత్కరించాడు. నిజాం అఫ్జల్‌గంజ్‌ మసీదు, వంతెన, బజారులను నిర్మించాడు. చౌమహల్లా ప్యాలెస్‌ నిర్మాణాన్ని నాసీరుద్దౌలా ప్రారంభించగా ఈయన పూర్తిచేశాడు. 

 

మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ (క్రీ.శ.1869 - 1911): ఇతడు అఫ్జలుద్దౌలా కుమారుడు. పాలకుడిగా ప్రకటించే నాటికి ఈయన వయసు 3 సంవత్సరాలు. కాబట్టి బ్రిటిష్‌ ప్రభుత్వం ఇతడికి సంరక్షకులుగా సాలార్‌జంగ్, షంషద్‌ ఉమ్రాలను ప్రకటించింది. ఈయనకు 18 ఏళ్లు పూర్తయిన తర్వాత 1884, ఫిబ్రవరి 5న ఆనాటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ రిప్పన్‌ హైదరాబాద్‌కు వచ్చి నిజాంకు అధికార బాధ్యతలు అప్పగించాడు. హైదరాబాద్‌ను దర్శించిన మొదటి గవర్నర్‌ జనరల్‌ రిప్పన్‌. నిజాం క్రీ.శ.1884లో పర్షియన్‌ భాష స్థానంలో ఉర్దూను రాజభాషగా చేశాడు. ఈయన కాలంలో రాజ్యంలో మొదటిసారిగా క్రీ.శ.1883లో జరిగిన చందా రైల్వే ఆందోళన సందర్భంగా ప్రజా చైతన్యం వ్యక్తమైంది. ఈయన కాలంలోనే క్రీ.శ.1887లో నిజాం కళాశాలను స్థాపించారు. స్వదేశీయులకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ లాయర్‌ కిషన్‌రావు ఆధ్వర్యంలో ముల్కీ ఉద్యమం జరిగింది.  ముల్కీలనే సమర్థిస్తూ నిజాం క్రీ.శ.1888లో నిబంధనలను రూపొందించాడు. క్రీ.శ.1893లో ఖానున్‌ సే బారిక్‌ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగ, పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టాడు. వీటి ఫలితంగా పరిపాలనలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు విభాగాలు ఏర్పడ్డాయి. ఇంపీరియల్‌ సర్వీసు పేరుతో ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 1905లో రాజ్య పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణలో మెదక్, వరంగల్‌ సుబాలు ఏర్పాటయ్యాయి. 

  ప్రధాని వికారుద్దీన్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌ను నిర్మించగా, నిజాం అతడి దగ్గరి నుంచి క్రీ.శ.1897లో ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేశాడు. క్రీ.శ.1890లో జాబ్‌ సాల్మన్‌ అనే స్థానిక జర్నలిస్టు హైదరాబాద్‌ రికార్డు అనే పత్రికను ప్రారంభించాడు. 1908 సెప్టెంబరులో మూసీనది వరద భయంకరమైన ప్రళయాన్ని సృష్టించింది. దీని కారణంగా వేలమంది చనిపోయారు. సర్జన్‌ - మేజర్‌ రోనాల్డ్‌రాస్‌ బేగంపేటలో ఉండి పరిశోధన చేసి 1897 ఆగస్టు 20న మలేరియాను కలిగించే పరాన్నజీవిని ఆవిష్కరించాడు. నిజాం హైదరాబాద్, గుల్బర్గా, ఔరంగాబాద్‌లలో అనేక పత్తి మిల్లులను ఏర్పాటు చేశాడు. క్రీ.శ.1895లో నిజాం ప్రోత్సాహంతో శాస్త్ర పరిశోధనల కొరతను తీర్చడానికి హైదరాబాదులో క్లోరోఫామ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. క్రీ.శ.1891లో అసఫియా స్టేట్‌ గ్రంథాలయం (స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ) ఏర్పడింది. నవాబు ఇమాద్‌-ఉల్‌-ముల్క్‌ కృషి వల్ల క్రీ.శ.1892లో దైరతుల్‌ మారిఫ్‌ అనే గ్రంథాలయం ఏర్పడింది. క్రీ.శ.1878లో స్థాపించిన మదర్సా-ఇ-అలియా విద్యాసంస్థ 1908లో మహబూబియా బాలికల పాఠశాలగా మారింది. 1885, ఫిబ్రవరి 5న విక్టోరియా రాణి మహబూబ్‌ అలీఖాన్‌కు ‘గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ అనే బిరుదును ప్రదానం చేసింది. విక్టోరియా మహారాణి జ్ఞాపకార్థం విక్టోరియా మెమోరియల్‌ అనాథాశ్రమాన్ని 1905, మే 5న సరూర్‌నగర్‌లో నిజాం ప్రారంభించాడు. 
 

ఉస్మాన్‌ అలీఖాన్‌ (క్రీ.శ.1911 - 1948): ఈయన మహబూబ్‌ అలీఖాన్‌ కుమారుడు. ఉస్మాన్‌ అలీఖాన్‌ ఏడో, చివరి నిజాం. ఈయన పరిపాలన 1948లో భారత ప్రభుత్వం హైదరాబాద్‌పై పోలీసు చర్య జరిపే వరకు సాగింది. ఈయన పాలనా కాలంలో హైదరాబాద్‌ సంస్థానం అనేక రంగాల్లో అభివృద్ధి చెందింది.  

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌