• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగరికత

ఆర్యులకు ముందే అద్భుత సమాజం!

చక్కటి ప్రణాళికతో ఏర్పాటైన పట్టణాలు, అధునాతన డ్రెయినేజీ వ్యవస్థ, ప్రామాణిక కొలతల కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు, ప్రత్యేకమైన లిపి కలిగిన నాగరికత అయిదు వేల సంవత్సరాల క్రితమే భారత దేశంలో విలసిల్లింది. వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులతో కూడిన సంక్లిష్ట ఆర్థిక సమాజం ఒకటి అప్పట్లోనే వర్థిల్లడమే కాకుండా నేటికీ దాని ఆనవాళ్లు కొనసాగుతున్నాయి . సమకాలీన ప్రపంచ నాగరికతలతో సమానంగా వెలిగింది. తర్వాతి తరాల ప్రగతికి పునాదులు వేసింది. భారతీయత తొలి మూలాలను ఘనంగా చాటి చెప్పే ఆ నాగరికతను, అది వెలుగు చూసిన విధానాన్ని, వెలికితీసిన వ్యక్తుల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి. భారతదేశ చరిత్రను శాస్త్రీయంగా గుర్తించి, ఒక క్రమంలో కూర్చిన తీరును అర్థం చేసుకోవాలి.

మానవ జీవిత మహా ప్రస్థానంలో చరిత్ర అధ్యయనాన్ని స్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి 

1) పూర్వ చారిత్రక యుగం, 

2) చారిత్రక యుగం. ఈ విభజన లిపి ప్రాతిపదికగా జరిగింది. లిఖిత ఆధారాలు లేకపోవడంతో కేవలం పురావస్తు ఆధారాల ప్రాతిపదిక పై మాత్రమే చరిత్ర నిర్మాణం చేసిన కాలాన్ని పూర్వ చారిత్రక యుగం అని, లిఖిత ఆధారాలతో చరిత్రను తెలుసుకునే కాలాన్ని చారిత్రక యుగమని అంటారు. లిపి ఉండి, దాన్ని అధ్యయనం చేయలేక పురావస్తు ఆధారాలతోనే చరిత్ర అధ్యయనం చేస్తే దానిని సంధి యుగమని పిలుస్తారు. మానవ సమాజ ప్రయాణం సుదీర్ఘ కాలం పూర్వ చరిత్ర యుగంలోనే గడిచింది. ఈ యుగంలో జీవనానికి రాతితో చేసిన పనిముట్లను విశేషంగా వాడారు. పూర్వ చారిత్రక యుగానికి, చారిత్రక యుగానికి మధ్య ఒక పరిణామ క్రమంగా సంధి యుగాన్ని పేర్కొనవచ్చు. చరిత్రను మరో విధంగా ప్రాచీన యుగ చరిత్ర, మధ్య యుగ చరిత్ర, ఆధునిక యుగ చరిత్ర అని విభజిస్తారు. భారతదేశ చరిత్ర పూర్వ చారిత్రక యుగం నుంచి హర్షవర్ధనుడి (క్రీ.శ.647) వరకు కాలాన్ని ప్రాచీన యుగమని; హర్షుడి అనంతర కాలం నుంచి ఔరంగజేబు కాలం వరకు (క్రీ.శ.1707) మధ్య యుగమని, ఆ తర్వాతి కాలాన్ని ఆధునిక యుగమని చరిత్రకారులు విభజించారు.


చరిత్ర పూర్వ యుగం నుంచి, చారిత్రక యుగంలోకి అడుగుపెట్టడం గొప్ప శుభ పరిణామం. చరిత్ర పూర్వ యుగం చివరి నాటికి లిపి ఒక్కటే కాదు, మానవ సమాజం లోహ పరిజ్ఞానాన్ని కూడా సాధించింది. 


వ్యవసాయ విధానాల గురించి అవగాహన, కళల పట్ల అభిరుచి పెంచుకుంది. స్థిర జీవనానికి అలవాటుపడింది. ప్రాచీన యుగ భారతదేశం అద్భుతమైన, వైవిధ్యమైన, విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించినప్పటికీ సరైన చరిత్ర గ్రంథాలు లభ్యం కాకపోవడం ఒక లోపం. అందుకే ప్రాచీన భారతదేశ చరిత్రను పునర్‌ నిర్మించడానికి చరిత్రకారులు అనేక సాహిత్య, పురావస్తు వనరులపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ విషయంలో భారతదేశ ప్రాచీన యుగ చరిత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి, కొంతమంది బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగులు/ వారి సంస్థలు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పవచ్చు.


వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న కాలంలో క్రీ.శ.1784లో వృత్తిరీత్యా న్యాయమూర్తి, ప్రవృత్తి రీత్యా లాక్షణిక భాషావేత్త అయిన విలియం జోన్స్, రాయల్‌ ఆసియాటిక్‌ సొసైటీని స్థాపించాడు. తూర్పు దేశాల సంస్కృతులు అధ్యయనం చేయడం, మరుగున పడిన విషయాలను వెలుగులోకి తీసుకురావడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. బక్సర్‌ యుద్ధం (1764) తర్వాత జరిగిన అలహాబాద్‌ సంధి (1765) ఇంగ్లిష్‌ కంపెనీని బెంగాల్‌ పాలకులుగా చేయడంతో, పరిపాలన కోసం ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, న్యాయశాస్త్రాలను అధ్యయనం చేయాల్సి వచ్చింది. కంపెనీ ప్రోత్సాహంతో తూర్పు (ప్రాచ్య) దేశాల సంస్కృతుల అధ్యయనంపై మక్కువ ఉన్న కొంతమంది ఇంగ్లిష్‌ కంపెనీ అధికారులు, భారతదేశ చరిత్ర సంస్కృతులపై అధ్యయనం చేయడం ప్రారంభించారు.


ముందుగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేశారు. ఉదాహరణకు కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ను విలియం జోన్స్‌; ‘భగవద్గీత’ను చార్లెస్‌ విల్కిన్స్, ‘మనుస్మృతి’ని ‘జెంటూ లాస్‌’ అనే పేరుతో హాల్‌ హెడ్‌ ఆంగ్లంలోకి అనువదించడంతో ఈ ప్రక్రియ ఊపందుకుంది. ఈ క్రమంలో ప్రాచీన సంస్కృతి వైభవాన్ని చాటే అనేక అద్భుతమైన ప్రాచీన గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. జేమ్స్‌ ప్రిన్సెన్‌ అనే ఆంగ్లేయ అధికారి బ్రాహ్మి లిపిలో, ప్రాకృత భాషలో రాసిన అశోకుడి శాసనాలను కనుక్కుని, వాటి అర్థాలను వివరించి భారత రాజకీయ వ్యవస్థలో అశోకుడి ప్రాముఖ్యతను తెలియజెప్పారు. ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మొదటి డైరెక్టర్‌ జనరల్‌ అలెగ్జాండర్‌ కన్నింగ్‌ హామ్‌ అనేక పురాతన కట్టడాలను వెలుగులోకి తెచ్చారు. బ్రిటిష్‌ రాజప్రతినిధి లార్డ్‌ కర్జన్‌ (1899-1905) తన ప్రభుత్వంలో పురావస్తు శాఖను ఏర్పాటు చేసి, ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం (1904) తీసుకొచ్చి చరిత్ర పరిశోధనను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ బ్రిటిష్‌ అధికారుల కృషి ఫలితమే ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతుల శాస్త్రీయ అధ్యయనానికి పునాదులు వేసింది.


19వ శతాబ్ది అర్ధభాగంలో, భారతదేశ వాయవ్య దిశలో చార్లెస్‌ మేసస్, ప్రస్తుత పాకిస్థాన్‌లోని హరప్పా వద్ద ఒక పెద్ద దిబ్బ ఉనికిని కనుక్కున్నారు. ఆ తర్వాత అలెగ్జాండర్‌ బర్నీస్‌ కూడా దానిని వెలుగులోకి తెచ్చారు. అలెగ్జాండర్‌ కన్నింగ్‌ హామ్‌ శాస్త్రీయ అధ్యయనం చేశారు. 1921లో అప్పటి ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ సర్‌ జాన్‌ మార్షల్‌ నాయకత్వంలో హరప్పా, మొహంజోదారో వద్ద తవ్వకాలు జరిపి, అక్కడ దొరికిన పురావస్తు అవశేషాలు అధ్యయనం చేసి ప్రపంచం విస్తుపోయే విషయాలు ప్రకటించారు.


అంతవరకు భారతదేశ చరిత్ర ఆర్యులతోనే ప్రారంభమైందని భావించేవారు. కానీ పురావస్తు శాఖ తవ్వకాల ఫలితాలు ఆ నమ్మకాన్ని సహేతుకంగా తుడిచేశాయి. భారతదేశ వాయవ్య ప్రాంతంలో ఆర్యులకు ముందు, ఆర్యేతరులు నిర్మించిన ఒక గొప్ప నాగరికత అని నిర్ధారణ అయ్యింది. ఈ పరిశోధనలు ప్రాచీన భారతదేశ రచనలో ఒక సంచలనం కలిగించాయి. బ్రిటిష్‌ ఇండియాలో, స్వాతంత్య్రానంతరం అనేక స్థలాలను గుర్తించి తవ్వకాలు నిర్వహించగా, ఎన్నో విషయాలు తెలిశాయి. ఈ నాగరికతకు సర్‌ జాన్‌ మార్షల్‌ ‘సింధు నాగరికత’ అని నామకరణం చేశారు.


విస్తీర్ణం: నాటి నుంచి నేటి వరకు సుమారు రెండు వేలకు పైగా స్థలాల్లో తవ్వకాలు జరపగా తూర్పు దిక్కున ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలంగిర్‌పుర్‌ వరకు; పడమట అఫ్గానిస్థాన్‌ అవతల సుక్త జండర్‌ వరకు; ఉత్తరాన కశ్మీర్‌లోని మాండ వరకు; దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్‌ వరకు సింధు లోయ నాగరికత వ్యాపించినట్లు తేలింది. ఈ విస్తీర్ణం సుమారు 1.3 మిలియన్‌ కిలోమీటర్లు.


నాగరికత నిర్మాతలు: ఈ మహోన్నత నాగరికత, సంస్కృతుల నిర్మాతలు ప్రొటో ఆస్ట్రాలాయిడ్, ఆస్ట్రాలాయిడ్, మంగోలాయిడ్, మెడిటరేనియన్, అల్పినోయిడ్‌ మొదలైన తెగలు. వీరిలో మెడిటరేనియన్‌ తెగ జనాభా ఎక్కువ.


నదీ తీరాలు: ఇంతవరకు తవ్విన స్థలాలు ఎక్కువగా నది ఒడ్డున లేదా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్నాయి. ఉదాహరణకు మొహంజోదారో, చాన్హుదారో, అమ్రీ, కోట్‌ డిజీ లాంటివి సింధు నది ఒడ్డున; హరప్పా రావి నది ఒడ్డున, లోథాల్‌ భోగవ నది ఒడ్డున, అలంగిర్‌పుర్‌ హిండాస్‌ నది ఒడ్డున, కాలీభంగన్‌ ఘగ్గర్‌ నది ఒడ్డున ఉన్నాయి.


ఆరు కేంద్రాలు: వందల స్థలాలు తవ్వగా, హరప్పా సంస్కృతి ఆరు పట్టణ కేంద్రాల చుట్టూ విస్తరించి ఉందని, అవే నాటి నాగరికతకు కేంద్ర స్థానాలని నిర్ధారించారు. అవి హరప్పా, మొహంజోదారో, చాన్హుదారో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాయి); లోథాల్‌ (గుజరాత్‌), కాలిభంగన్‌ (రాజస్థాన్‌), బన్వాలి (హరియాణా).


కాలం: సింధు నాగరికత వర్ధిల్లిన కాలం గురించి చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఉదాహరణకు.

* సర్‌ జాన్‌ మార్షల్‌ క్రీ.పూ.3250 - క్రీ.పూ.1750, 

* మోర్టిమోర్‌ వీలర్‌ క్రీ.పూ.2500 - క్రీ.పూ.1750, 

* డీపీ అగర్వాల్‌ క్రీ.పూ.2300 - క్రీ.పూ.1750. ఈ వాదనలన్నింటినీ పరిశీలించిన తర్వాత సింధు నాగరికత సుమారుగా క్రీ.పూ.2750 నుంచి క్రీ.పూ.1600 మధ్య వర్ధిల్లిందని చాలామంది చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు. 


సమకాలీన ప్రాచీన నాగరికతలు: హుయాంగ్‌ హో నదీ పరిసరాల్లో వెలిసిన చైనా నాగరికత; నైలు నది ఒడ్డున వెలిసిన ఈజిప్షియన్‌ నాగరికత, టైగ్రిస్‌ - యూఫ్రటిస్‌ నదుల మధ్య మెసపటోమియా నాగరికతలు వికసించిన కాలంలోనే సింధు నాగరికత వర్ధిల్లింది. ఇది ఆ నాగరికతలకు సమకాలీనమే కాదు, సమస్థాయిలోనూ ఉంది.


పట్టణాలు: సింధు నాగరికతలో చాలా పట్టణాలను గుర్తించారు. అప్పటి నిర్మాణాలు, ప్రజల జీవన విధానాన్ని, నిర్మాణ కౌశలాన్ని చాటుతున్నాయి. దాదాపు ఈ పట్టణాలన్నీ ఒకే విధమైన ప్రణాళికతో ఉన్నాయి.


* ప్రతి పట్టణం రెండు భాగాలుగా ఉంది. ఒకటి   పడమటి దిక్కున ఉన్న ఎత్తయిన కోట ప్రాంతంలో (సిటాడెల్‌) నిర్మించిన ప్రజా భవనాలు, స్నానవాటికలు, ప్రభుత్వ భవనాలు లాంటివి ఉన్నాయి. ఒక్క చాన్హుదారో మాత్రం దీనికి మినహాయింపు.


* పట్టణ తూర్పు వైపు సామాన్యులు అంటే పౌర గృహాలు ఉన్నాయి. ఇక్కడి వీధులు, ఇళ్లన్నీ ఒక పద్ధతి ప్రకారం నిర్మించి ఉన్నాయి.


 

 


 

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌