• facebook
  • whatsapp
  • telegram

జోగినీ/దేవదాసీ వ్యవస్థ

ఆ ఆచారం ఆమెకు అప‌చారం

అభం శుభం తెలియని అట్టడుగు వర్గాల అమ్మాయిలను ఆలయాలకు సేవల పేరుతో సమాజానికి సమర్పిస్తారు. కరవు కాటకాలు, మహమ్మారుల నుంచి రక్షించే దేవతల ప్రసన్నం కోసమంటూ మూఢనమ్మకాలతో బాలికల బతుకులను బలిచేస్తారు. చివరికి ఊరికి ఉపకారం అంటూ ఉంపుడుగత్తెలను చేస్తారు. నిస్సహాయులైన ఆ అబలలు కఠిన నియమాల మధ్య కాలం గడపాలి. వివాహం ఉండదు. కుటుంబం కుదరదు. సొంత జీవితం లేదు. ప్రాచీన కాలం నుంచి దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ దారుణ దురవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేశాయి. సమాజ నిర్మాణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.  

సంప్రదాయం పేరుతో అనాదిగా ఆచరిస్తున్న సామాజిక దురాచారాల్లో జోగినీ వ్యవస్థ ఒకటి. ఆలయాలకు, దేవతల సేవకు అమ్మాయిలను సమర్పించే మూఢ నమ్మకమిది. ప్రాచీన కాలం నుంచి దేవతలకు స్త్రీలను అర్పించడం ఆచారంగా వస్తోంది. అత్యంత ప్రాచీన నాగరికత అయిన బాబిలోనియాలో కూడా మైలిట్టా దేవాలయంలో స్త్రీల శీలాన్ని ఆ విధంగానే సమర్పించారని చరిత్ర పితామహుడు హెరిడోటస్‌ పేర్కొన్నాడు.తమను రక్షించే దేవతలకు/శక్తులకు కృతజ్ఞత చూపడం అనే భావనతో ఇలాంటి ఆచారాలు ప్రారంభమయ్యాయి.

 

జోగినీ వ్యవస్థ శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్న సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో దీన్నే దేవదాసీ వ్యవస్థ అంటారు. సాంకేతికంగా తేడాలు ఉన్నప్పటికీ జోగినీ, దేవాదాసీ సంప్రదాయాలు దాదాపు ఒకే రకమైనవి. రెండింటిలోనూ సుమారు 95 శాతం ఎస్సీ కులానికి చెందిన బాలికలను స్థానిక దేవాలయానికి కట్టుబానిసలుగా మార్చినట్లు తెలుస్తోంది. అభం శుభం తెలియని ఆడపిల్లకు గ్రామదేవతతో పెళ్లి చేసి ఆమెను జోగిని అని పిలిచేవారు. 2002లో నిర్వహించిన సర్వే ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో 42 వేల మంది, ఆంధ్రాలో 20 వేల మంది వరకు జోగినీలు/దేవదాసీలు ఉన్నట్లు అంచనా వేశారు.

 

జోగిని పదం ‘జోగి’ నుంచి వచ్చింది. దీనికి సంస్కృత పదమూలం యోగి. జోగి పదానికి బిచ్చగాడు/యాచకుడు వంటి అర్థాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థ ఏ కాలంలో దేశంలో ప్రారభమైందో చెప్పడానికి కచ్చితంగా ఆధారాలు లేనప్పటికీ అర్థం చేసుకోవడానికి కులం, లింగ భేదం చాలావరకు ఉపయోగపడతాయి. దీని గురించి మొదటిసారిగా అబ్బెజార్జ్‌ డ్యుబోయిస్‌ తన గ్రంథం ‘హిందూ మానెర్స్, కస్టమ్స్‌ అండ్‌ సెరెమొనీస్‌’లో ప్రస్తావించారు. జోగినీ ఆచారం కర్ణాటక ప్రాంతంలోని ‘బసవిరాండ్ర వ్యవస్థ’ నుంచి ఉమ్మడి ఆంధ్రాకు పాకింది. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌: అనంతపురం, చిత్తూరు - శివపార్వతి; చిత్తూరు - మాతమ్మ, ప్రకాశం - మాతంగి, విజయనగరం - తాయరమ్మ, కోస్తాతీర ప్రాంతాలు - దేవదాసి, కర్నూలు - బాల్వాయి

తెలంగాణ: నిజామాబాద్, మెదక్, వరంగల్‌ - జోగిని; రంగారెడ్డి - అంబాబాయి, కరీంనగర్‌ - శివసతులు, పార్వతి; మహబూబ్‌నగర్‌ - బసవి, జోగిని;

అసోం: నాటీస్, కుర్మపాస్, కడిపస్‌

కేరళ: మహరీస్, తెవిడిచ్చిన్, నంగైనర్‌

మహారాష్ట్ర: మురళీ, దేవాలి

కర్ణాటక, రాయలసీమ: బసవీ

తమిళనాడు: దేవర్‌ అడిగళర్

ఒడిశా: మహరి, మోహననారి.

 

చారిత్రక ఆధారాలు

క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందిన ‘జోగిమరశాసనం’ దేవదాసీలు/జోగినీల గురించి తెలియజేస్తున్న శాసనాధారం. ఛత్తీస్‌గఢ్‌లో జోగిమర గుహల్లో దొరికిన శాసనం బ్రహ్మీలిపిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రేమ సందేశం. సూత్నుక అనే దేవదాసీ గురించి ‘దేవదత్త’ అనే రాజు ఈ శాసనాన్ని వేయించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 7వ శతాబ్దం ప్రథమార్ధంలో భారత్‌లో పర్యటించిన చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్‌ దేశమంతా దేవదాసీ వ్యవస్థ విస్తరించినట్లు పేర్కొన్నాడు. క్రీ.పూ.4 - 2 శతాబ్దాల మధ్య మౌర్యుల కాలంలో ‘నగరవధు’ అనే పదవి ఉండేదని, దానికి 64 కళల్లో ఆరితేరిన స్త్రీలు పోటీపడేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. నగరవధుగా ఎన్నికైన యువతి అత్యంత వైభవోపేతమైన జీవితం గడిపేది. వీరు రాజులు, ప్రముఖులకు ఉంపుడుగత్తెలుగా ఉండేవారు. మౌర్యుల కాలం నాటి ప్రముఖ నగరవధు ఆమ్రపాలి. కాళిదాసు మేఘదూత కావ్యంలో బాలికలను చిన్న వయసులోనే ఉజ్జయినిలోని మహంకాళీ దేవాలయాలకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

నిర్ణయం, మార్పు క్రమం

జోగినీగా మార్చేందుకు బాలికను గుర్తించడం, నిర్ణయించడంలో స్థానిక భూస్వాములు, అగ్రకులాలకు చెందినవారు, కుల పెద్దలు, బాలిక తల్లిదండ్రులు ముఖ్యపాత్ర పోషిస్తారు. గ్రామాల్లో వర్షాభావం, కరవు, అంటువ్యాధులు వంటివి తలెత్తినప్పుడు గ్రామదేవత ఎల్లమ్మ ఆగ్రహం వల్లే ఇలా జరిగిందని చెప్పి, దేవతను ప్రసన్నం చేసుకునే పేరిట బాలికను అంకితం చేస్తారు. ఈ క్రమంలో ముందుగా బాలికను గుర్తిస్తారు. పెళ్లికూతురుగా ముస్తాబు చేయించి స్థానిక ఎల్లమ్మ గుడిలో పోతురాజు ద్వారా పసుపుతాడుతో తాళి కట్టిస్తారు. సాధారణంగా పోతురాజు జోగినీగా మారే బాలికకు మాతృ సంబంధమైన మామగా ఉంటాడు. జోగినీగా ప్రకటించే క్రమం గ్రామం మధ్యలోని ఎల్లమ్మ గుడి ముందు జరుగుతుంది. ఆ రోజు నుంచి ఆమెను ఎల్లమ్మకు సేవలు చేయడానికి అంకితమైన వ్యక్తిగా గ్రామస్థులు గుర్తిస్తారు. ఇలా కొంత కాలంపాటు గౌరవం పొందుతుంది. బాలిక తల్లిదండ్రులు కూడా తమ కూతురిని జోగినీని చేసేందుకు సంతోషంగా అంగీకరిస్తారు. గ్రామానికి ఉపకారం చేస్తున్నామనే భావన వారిలో ఉంటుంది. జోగినీగా మారిన బాలిక యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాతే యథార్థంగా జరిగే విషయం తెలుస్తుంది. అప్పటికే క్రమంగా గ్రామం మొత్తానికి ఆమె పూర్తిస్థాయి వేశ్యగా మారుతుంది.

 

అగ్రవర్ణం వారైనా, నిమ్నకులం వారైనా వివాహ సమయంలో జోగినీ బృందాన్ని పిలిపించుకొని వారి ఆశీస్సులు తీసుకుంటారు. అంటే జోగినీలు ఇతరుల వివాహ విషయంలో ప్రధానపాత్ర పోషిస్తారు. గ్రామాల్లో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ముందుగా జోగినీలను సంప్రదిస్తారు. ఆమె చేయి తగిలితే తిరిగి మూమూలు మనిషిగా మారుతారని నమ్ముతారు.

 

కఠిన నియమాలు

జోగినీలు ప్రతి శుక్రవారం, మంగళవారం స్నానం చేసిన తర్వాత ఎల్లమ్మ గుడిని కడగాలి. పూజలు చేయాలి. ఒక్కపూట మాత్రమే భోజనమే చేయాలి. మాంసం ముట్టుకోకూడదు. ఆ రెండు రోజులే ఊర్లో యాచించి వారమంతా గడపాలి. దేవుడిని పూజించిన తర్వాతే భోజనం చేయాలి. ఊరిపెద్ద, కులపెద్దలు చనిపోతే వారి శవయాత్రలో నృత్యాలు చేయాలి. జోగినీ చనిపోతే ఆ కుటుంబంలో మరొక స్త్రీ జోగినిగా మారాలి. చనిపోయిన జోగినితో వారికి వివాహం చేస్తారు.

 

కారణాలు

ఇంట్లో మగ సంతానం లేనప్పుడు ఆడపిల్లను జోగినిగా మారిస్తే కొడుకు పుడతాడని నమ్మడం.

ఒక ప్రాంతంలో క్షామం, వరదలు తొలగిపోతాయని విశ్వసించడం. 

కుటుంబంలో అనారోగ్యం, పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మలకు కోపం వచ్చిందని భావించి ఆడపిల్లను దేవతకు వదిలేస్తామని మొక్కుకోవడం.

 

వ్యవస్థ - పదజాలం

1) జోగినీ సమర్పణ: దేవతల సేవ కోసం స్త్రీ, పురుషులను సమర్పించడం. ఇది ఎక్కువగా దళితులైన మాదిగ, మాల కులాల్లో జరుగుతుంది.

2) పోతురాజులు: వీరిని ‘దేవాంతలు’ అంటారు. గ్రామదేవతలందరికీ తమ్ముడు. జోగినీలకు గ్రామదేవతలకు బదులుగా ఇతడే మంగళసూత్ర ధారణ చేస్తాడు.

3) కొలువులు: ఏ ఆపద వచ్చినా, దురదృష్టకర సంఘటన సంభవించినా గ్రామదేవతకు కోపం వచ్చిందని వీటిని నిర్వహిస్తారు. సాధారణంగా ఏడు రోజులు జరుగుతుంది.

4) గోత్రం: కులానికి ఉన్నట్లుగానే జోగినీలకు గోత్రాలు ఉంటాయి. ఉదా: భూముల, గోనేగుర్కీ, హెగ్గెడ, మల్లెల

5) జోగినీలకు ఇంటిపేర్లు: తప్పెట, కొమ్ము, కత్తిబైండ్ల, దాసరి, పూజారి

6) గ్రామదేవతల పేర్లు, విధులు

ఎల్లమ్మ- ఊరికి కాపలా

ఊరడమ్మ - ఊరిని రక్షించడం

లక్ష్మమ్మ - ఊరి సిరిసంపదలు కాపాడటం

ఈరమ్మ - దొరల ఆడవాళ్ల రక్షణ

మైసమ్మ - విలాసాలు పాడైపోకుండా రక్షణ

పోశమ్మ - ప్రేతాత్మలు రాకుండా శ్మశానానికి కాపలా

పౌడాలమ్మ - గ్రామ సరిహద్దులకు కాపలా

సాగరమ్మ - దొరల కల్లాలకు కాపలా

7) గావుపట్టడం: ఊరి పండగల సమయంలో పోతురాజు నోటితో ప్రాణంతో ఉన్న మేకపిల్ల లేదా కోడి పిల్ల మెడకొరికి తలను వేరు చేస్తాడు. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి పోతురాజులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి.

8) జోగుపట్టం: గ్రామపెద్ద సమక్షంలో అమ్మాయిని జోగినీగా మార్చడానికి ఒకరోజు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పోతురాజు లేదా గ్రామపెద్ద లేదా మేనమామ లేదా వృద్ధ జోగిని మంగళసూత్ర ధారణ చేస్తారు.

9) మైలపట్టం/కన్నెరికం: జోగుపట్టం కోసం ధనం ఖర్చు పెట్టిన వ్యక్తితో అమ్మాయి రజస్వల కాగానే సమాగమం ఏర్పాటు చేస్తారు. దీన్నే కన్నెరికం అంటారు. ఇలాంటి సమయంలో ఆ వ్యక్తి ఆమెకు ఆభరణాలు, ధనం, భూములు ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె అతడికి ఉంపుడుగత్తెగా ఉండిపోతుంది. అతడికి ఇష్టం లేనప్పుడు ఊరందరికీ వేశ్యగా మారుతుంది.

10) రంగం: జోగిని చెప్పే భవిష్యవాణి

 

నిర్మూలన చర్యలు

జోగిని వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా 1987లో దిల్లీలో జాతీయస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం సుమారు 5 మిలియన్ల గ్రాంటు విడుదల చేసింది. ఈ నిధులతో జోగినీలకు మేకలు, గొర్రెల కొనుగోలుతో పాటు కొన్నిచోట్ల భూమిని కేటాయించారు. 1988లో దేవదాసీ, దేవాలయాల్లో వేశ్య వృత్తిని నాటి ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీన్ని జోగినీ నిషేధ చట్టంగా పేర్కొంటారు. ఎవరైనా జోగినీ వ్యవస్థను ప్రోత్సహించినా, వారికి దేవతలతో వివాహం చేసినా 3 నుంచి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తారు. ఆశ్చర్యకరంగా ఎవరి మీదా ఈ చట్టం కింద కేసు నమోదు కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆశ్రమ, జోగినీ వ్యతిరేక కమిటీ, సంస్కార్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.

 

లక్ష్యాలు: 

జోగినీలు చదువుకోవాలి.

అందరిలా వారికీ వివాహం జరిపించాలి.

ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి.

ఊరి పెద్దలను బాధ్యులను చేస్తూ చట్టంలో సవరణలు తీసుకురావాలి.

 

చర్యలు: 

బ్రిటిష్‌ వలస ప్రభుత్వం 1929లో బాలికల రక్షణ చట్టాన్ని రూపొందించింది.

1987లో నిసా (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అకాడమీ) ఆధ్వర్యంలో దిల్లీలో జోగినీల సంక్షేమంపై జాతీయ సదస్సు జరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి జోగినీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు.

జస్టిస్‌ రఘనాధరావు కమిషన్‌: జోగిని, మాతంగి, దేవదాసి, బసవి మహిళలకు జన్మించిన పిల్లల సమస్యలపై అధ్యయనం కోసం ఏకసభ్య కమిషన్‌ ఏర్పడింది. 1988లో జోగినీ/దేవదాసీ వ్యవస్థ నిషేధ చట్టాన్ని రూపొందించారు.

1946లో ట్రెయినీ ఐఏఎస్‌ ఆనంద్‌ కుమార్‌ జోగినీల గురించి పరిశోధనలు జరిపి ఆ దురాచారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. 1984లో నిజామాబాద్‌ కలెక్టర్‌ ఆశామూర్తి జోగినీ వ్యవస్థను రద్దు చేయడానికి చిన్న, చిన్న పనులు నేర్పించారు. వారి కోసం ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణలో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో జోగినీలను గుర్తించారు.

జోగినీ వ్యవస్థ లేని ఏకైక జిల్లా ఖమ్మం.

తెలంగాణలో జోగినీ వ్యవస్థపై సంపూర్ణంగా అధ్యయనం చేసినవారు హేమలతా లవణం.

 

తీసిన చలనచిత్రాలు

1. 1978లో ‘ప్రత్యూష’ సినిమా జట్ల వెంకటస్వామినాయుడు దర్శకత్వంలో రూపొందింది.

2. 1984లో దేవాదాసీ/జోగినిలపై తీసిన చలనచిత్రం ‘గిథ్‌’. దర్శకుడు టి.ఎస్‌.రంగా.

3. 1981లో మోహన్‌ కావ్య నిర్దేశకత్వంలో ‘మహానంది’ అనే చిత్రం తీశారు.

 

రచనలు

మృత్యోర్మ అమృంతంగమయ - హేమలతా లవణం

జోగిని - శాంతి ప్రబోధ్‌

జోగిని వ్యవస్థ - వకుళాభరణం లలిత

ఎల్లమ్మ కథ - లక్షీకాంత మోహన్‌

మట్టిమనుషులు - వి.ఆర్‌. రాసాని

మతం ముసుగులో వ్యభిచారం - వకుళాభరణం లలిత

జగడం - బోయ జంగయ్య

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం జోగినీ వ్యవస్థ ఎక్కువగా ఉన్న జిల్లాలు నల్గొండ (40), ఆదిలాబాద్‌ (906), కరీంనగర్‌ (5,861), నిజామాబాద్‌ (5,666), మహబూబ్‌నగర్‌ (2,879), మెదక్‌ (1,145).

 

రచయిత: వట్టిపల్లి శంకర్‌రెడ్డి

 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ విద్యుత్తు 

‣ కొలతలు - ప్రమాణాలు

‣ ఉష్ణం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 11-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌