• facebook
  • whatsapp
  • telegram

మౌర్య వంశం

ఉపఖండాన్ని ఏకం చేసిన తొలి పాలకులు!



భారత ఉపఖండంలో రాజకీయ ఏకీకరణ సాధించిన తొలి పాలకులు మౌర్యులు. ప్రజల శాంతి, సౌభాగ్యాలే పాలకుల బాధ్యత అంటూ రాజరికానికి భాష్యం చెప్పి సంక్షేమ పాలనకు నాంది పలికారు. ప్రస్తుతం మన దేశం పాటిస్తున్న ఎన్నో పాలనా విధానాలకు క్రీస్తు పూర్వమే బీజం వేశారు. బలమైన కేంద్ర ప్రభుత్వం, లౌకిక రాజ్యం, ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు, సంస్కృతి వ్యాప్తి లాంటి విశిష్ట సంప్రదాయాలెన్నింటినో ఆచరించి ఆదర్శంగా నిలిచారు. తొలి భారత సామ్రాజ్య సారథులుగా చరిత్రలో చెరగని ముద్ర వేసిన మౌర్య వంశం, అందులోని గొప్ప పాలకులు, వారి విశిష్టతలు, గొప్పతనం గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఒకే ధర్మం, ఒకే భాషతో రాజకీయ ఐక్యతను సాధించిన అశోకుడి పాలనా విశేషాలపైనా అవగాహన పెంచుకోవాలి. 

క్రీస్తు పూర్వం 321లో చంద్రగుప్త మౌర్యుడు పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుంచి ప్రాచీన భారతదేశ చరిత్రలో సామ్రాజ్య యుగం ప్రారంభమైంది. ఈ వంశంలో బిందుసారుడు, అశోకుడు, కుణాల, సాలిసుక, దేవధర్మన్, శతధనుష్‌లు ఇతర రాజులు. బృహద్రథ చివరి రాజు. పాటలీపుత్రం కేంద్రంగా ఈ రాజవంశ పాలన క్రీ.పూ.321 నుంచి  క్రీ.పూ.184 వరకు సాగింది. ఈ వంశంలో మొదటి ముగ్గురు రాజులైన చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు మగధ రాజ్యానికి సామ్రాజ్య వైభవం తీసుకొచ్చారు. వీరి పాలనా కాలంలో భారతదేశం అంతా (దక్షిణ భాగంలోని తమిళ, కేరళ ప్రాంతాలు మినహా) తొలిసారిగా ఒకే రాజకీయ పాలనా ఛత్రం కిందకు వచ్చింది. భారతదేశాన్ని రాజకీయంగా ఐక్యం చేయడం, భారతదేశ పశ్చిమోత్తర సరిహద్దులపై తరచూ దండయాత్రలు చేస్తున్న గ్రీకుల ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని తొలగించడం, భారతదేశంలో తొలిసారిగా బలమైన, స్థిరమైన కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించడం, లౌకిక రాజ్య భావన ఉన్న పాలనావ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ విధానంలో సంక్షేమ రాజ్యం అనే భావన కలిగించడం, విదేశాలతో సత్సంబంధాలను నెలకొల్పడం, భారతీయ సంస్కృతిని విదేశాలకు వ్యాప్తిచేయడం,  భారతదేశ చరిత్రకు ఒక స్పష్టమైన కాలక్రమాన్ని ఏర్పరచడం లాంటివన్నీ మౌర్యవంశ పాలనా విశిష్టతలు.

చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూ.321 - 298): భారత దేశాన్ని గ్రీకుల ప్రాబల్యం నుంచి, నంద వంశ నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసి, రాజకీయంగా ఐక్యత సాధించిన మొదటి భారతీయ చక్రవర్తి. ఇతడి తొలి చరిత్ర గురించి స్పష్టమైన చారిత్రక సమాచారం లేదు. క్రీ.పూ.326 - 325 మధ్య అలెగ్జాండర్‌ జీలం నదిని దాటి, పశ్చిమోత్తర భారతంలో చిన్నచిన్న రాజ్యాలను జయించి, మెసిడోనియాకు తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు చంద్రగుప్త మౌర్యుడు, అతడిని కలిసినట్లు ప్లుటార్క్‌ అనే గ్రీకు రచయిత పేర్కొన్నాడు. ‘జస్టిన్‌’ అనే మరొక రచయిత చంద్రగుప్తుడిని ‘సాండ్రో కొటú’Ã అని రాశాడు. తొలుత చంద్రగుప్తుడు తన గురువు చాణక్యుడి సహాయంతో, అలెగ్జాండర్‌ దండయాత్రల వల్ల బలహీనపడిన పశ్చిమోత్తర రాజ్యాలను    జయించాడు. ఆ తర్వాత క్రీ.పూ.321లో నంద వంశ రాజు (ధననందుడు)ను ఓడించి పాటలీపుత్ర సింహాసనాన్ని అధిష్టించాడు. చాణక్యుడు రాసిన అర్థ శాస్త్రం నాటి పాలనా విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

చంద్రగుప్తుడు క్రీ.పూ.321 - 305 మధ్య సౌరాష్ట్ర, సింధు, మధ్య భారత, దక్షిణ భారతదేశ ప్రాంతాలను (కళింగ, కేరళ, తమిళనాడు మినహా) జయించాడు.  క్రీ.పూ.305లో దండెత్తివచ్చిన గ్రీకు రాజు సెల్యూకస్‌ను ఓడించాడు. ప్రతిఫలంగా సెల్యూకస్‌ నుంచి కాబూల్, హీరత్, బెలూచిస్థాన్, కాందహార్‌లను పొందాడు. సెల్యూకస్‌ తన కుమార్తె హెలీనాను చంద్రగుప్తుడికిచ్చి వివాహం చేశాడు. తన రాయబారిగా మెగస్తనీస్‌ను చంద్రగుప్తుడి కొలువులో ఉంచాడు. మెగస్తనీస్‌ చాలాకాలం పాటలీపుత్రంలోనే ఉండి రాసిన ‘ఇండికా’ గ్రంథం ఆనాటి పాటలీపుత్ర నగర పాలనా విశేషాలను తెలియజేస్తుంది. ‘జస్టిన్‌’ అనే గ్రీకు రచయిత చంద్రగుప్తుడు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించాడని రాశాడు. అతడి రాజ్యం క్రీ.పూ. 305 నాటికి దాదాపు భారత ఉపఖండం అంతా వ్యాపించింది. ఇతడు తన పాలనాకాలం చివర్లో జైన ముని భద్రబాహుడి ప్రభావంతో జైన మతం స్వీకరించాడు. క్రీ.పూ.298లో కర్ణాటక సమీపంలోని శ్రావణబెళగొళ చేరి, జైన మత ఆచారాల ప్రకారం సల్లేఖన వ్రతం ఆచరించి, కైవల్యాన్ని పొందాడు. ఈ విషయాలను హేమచంద్రుడు తన ‘పరిశిష్ట పర్వం’ గ్రంథంలో వివరించాడు.

బిందుసారుడు (క్రీ.పూ.298 - 273): ఇతడు చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు. గ్రీకు చరిత్రకారులు బిందుసారుడిని ‘అమిత్రఘాత’ అని సంబోధించారు. అంటే శత్రువులను నిర్మూలించినవాడు అని అర్థం. తన పాలనా కాలంలో ఇతడు చేసిన యుద్ధాలు లేవు. బహుశా విశాల సామ్రాజ్యంలో అంతర్గత తిరుగుబాట్లను విజయవంతంగా అణచివేసి ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం. విదేశీయులతో సత్సంబంధాలను నెలకొల్పాడు. ఈజిప్ట్‌ రాజు అయిన టోలమి ఫిలడెల్ఫాస్‌తో చెలిమి చేశాడు.. గ్రీకు రచనల ప్రకారం బిందుసారుడు, సిరియా రాజైన మొదటి యాంటియోకస్‌ను ద్రాక్ష సారాయి, అత్తిపళ్లు, ఒక తాత్వికుడిని పంపమని కోరగా.. ద్రాక్ష సారాయి, అత్తిపళ్లు పంపాడని, తాత్వికులు తమ దేశంలో అమ్మకానికి దొరకరని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. బిందుసారుడి కొలువులో డైమకాస్‌ అనే సిరియా రాయబారి, డైనీషియస్‌ అనే ఈజిప్ట్‌ రాయబారి ఉన్నారు. మక్కలి గోసల స్థాపించిన జైవిక మతాన్ని బిందుసారుడు ఆదరించాడు.

అశోకుడు (క్రీ.పూ. 269 - 231): బిందుసారుడు, రాణి సుభద్రంగిల కుమారుడు అశోకుడు. ఇతడి భార్యలు అసందిమిత్ర, తిష్యరక్షిత, కారువాకి, పద్మావతి. కుమార్తెలు సంఘమిత్ర, చారుమతి. కుమారులు కునాల, మహేంద్ర, టివర, జాలుక. అశోకుడిని పురాణాల్లో ‘అశోక వర్ధన’ అని పేర్కొన్నారు. లఘు శిలా శాసనాలైన రూపనాథ్, సహస్రం, బ్రహ్మగిరి, సిద్ధాపురంలలో దేవానాం ప్రియ (దేవతలకు ప్రియమైనవాడు) అని పిలిచారు. భైరత్‌ శాసనంలో మగధ రాజగు ప్రియదర్శి (చక్కనిరూపం గలవాడు) అని ఉంది. బిందుసారుడి కాలంలో అశోకుడు ఉజ్జయిని ప్రాంత పాలకుడిగా నియమితుడయ్యాడు. అదేకాలంలో అశోకుడి అన్న సుసేముడు ప్రాంతీయ పాలకుడిగా ఉన్న తక్షశిల ప్రాంతంలో తిరుగుబాట్లు జరిగాయి. బిందుసారుడి ఆదేశంపై అశోకుడు తక్షశిల చేరి, తిరుగుబాట్లు అణచివేశాడు. ఆ తర్వాత తక్షశిల, ఉజ్జయిని ప్రాంతాల పాలకుడయ్యాడు. క్రీ.పూ.273లో బిందుసారుడి మరణాంతరం అశోకుడు మగధ రాజయ్యాడు. సింహాసనం కోసం ఏర్పడిన అంతఃకలహాల ఫలితంగా అశోకుడి పట్టాభిషేకం, సింహాసనానికి వచ్చిన నాలుగేళ్ల తర్వాత జరిగినట్లు ‘దీప వంశ’, ‘మహా వంశ’ అనే శ్రీలంక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ నాలుగేళ్లు మౌర్యుల చరిత్రలో అంధకార యుగం. అశోకుడి జీవితంలో ముఖ్య సంఘటన కళింగ యుద్ధం. కళింగ దిగ్విజయ యాత్ర, ఆ యుద్ధంలో జరిగిన మారణహోమం, రుధిరపాతం అశోకుడి మనసుపై ప్రభావం చూపి పరితాపం, పశ్చాతాపం కలిగించినట్లు అతడే వేయించిన పదమూడో బృహత్‌ శిలాశాసనం వల్ల తెలుస్తోంది. అనంతరం అశోకుడు బౌద్ధ మతం స్వీకరించి, దాని వ్యాప్తికి అనేక కార్యక్రమాలను చేపట్టాడు. బౌద్ధమత ప్రభావం అశోకుడి దేశీయ, విదేశీ విధానాలపైనా ఉంది. జీవ హింస నిషేధించాడు. శాకాహారిగా మారి, బౌద్ధ సన్యాసిలా జీవితం గడిపాడు. యుద్ధ ఘోష స్థానంలో, ధర్మ ఘోషను ప్రవేశపెట్టాడు. బుద్ధుడి జీవితంతో సంబంధం ఉన్న గయా, సారనాథ్, లుంబిని, కుశీనగర, శ్రావస్తి మొదలైన పవిత్ర క్షేత్రాలను దర్శించాడు. బౌద్ధ మతంపై తనకున్న విశ్వాసాన్ని బాబ్రు శాసనంలో ప్రకటించాడు. దేశవ్యాప్తంగా స్తూపాలను నిర్మించాడు. కళాత్మకంగా స్తంభాలు నెలకొల్పి, దమ్మ ప్రచారం చేశాడు. బౌద్ధ సంఘంలో వచ్చిన చీలికలను నివారించడానికి అశోకుడు మూడో బౌద్ధ సంగీతి నిర్వహించాడు. దీనికి మొగలిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో బౌద్ధ మత గ్రంథాలైన సుత్త పిటక, వినయ పిటకాలపై వ్యాఖ్యాన గ్రంథం అభిదమ్మ పిటకను పాళీ భాషలోకి తర్జుమా చేయించాడు. ఈ సమావేశానంతరం బౌద్ధమత వ్యాప్తి, ప్రచారానికి వివిధ దేశాలకు అశోకుడు తన ప్రచారకులను పంపించాడు. ఆరో బృహత్‌ శిలాశాసనంలో ప్రజలంతా తన సంతానమేనని ప్రకటించి రాచరిక సిద్ధాంతాలకు కొత్త భాష్యం చెప్పాడు. వారి సౌఖ్యం కోసం ఆసుపత్రులను కట్టించాడు. రహదారులను నిర్మించి, రెండు వైపులా మొక్కలు నాటించాడు. బావులు, సత్రాలను నిర్మించాడు. ప్రజల నైతికతను పెంపొందించడానికి, శాసనాల్లో దమ్మను ప్రకటించాడు. అశోకుడి దమ్మ ఆనాటి అన్ని మతాల్లోని నైతిక నియమావళి అని చెప్పొచ్చు. ధర్మ ప్రచారం కోసం ధర్మ మహామాత్రులు అనే ప్రత్యేకాధికారులను నియమించాడు. అశోకుడికి సిరియా రాజు రెండో యాంటియోకస్, ఈజిప్ట్‌ రాజు రెండో టోలమి ఫిలడెల్ఫాస్, మేసిడోనియా రాజు యాంటిగొనస్‌ గోనెటస్, సైరస్‌ రాజు మెగాస్‌లతో సత్సంబంధాలు ఉన్నాయని శాసనాల ద్వారా తెలుస్తోంది.

అశోకుడి సామ్రాజ్య విస్తరణ: తూర్పున కామరూపం (అస్సాం), దక్షిణాన తమిళ, కేరళ ప్రాంతాలు మినహా అఖండ భారత దేశం అంతా అశోక సామ్రాజ్యం పరిధిలోకి వచ్చింది. తన దేశ దక్షిణ సరిహద్దుగా పాండ్య, సత్యపుత్ర, కేరళ పుత్ర, తామ్రపర్ణి రాజ్యాలు ఉన్నట్లు అశోకుడి రెండో శిలాశాసనం తెలియజేస్తోంది. అశోకుడు భారతదేశంలో రాజకీయ ఐక్యత సాధించాడు. ఆ ఐక్యతను ఒక ధర్మంతో, ఒక భాషతో, తన శాసనాల్లో వాడిన బ్రహ్మి లిపితో పటిష్ఠం చేశాడు. శాంతి విధానాలు, సాంస్కృతిక విజయాలు, పొరుగు రాజ్యాలతో సత్సంబంధాలతో చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు.


కడపటి మౌర్యులు: అశోకుడి తర్వాత కుణాల, సాలిసుఖ, దేవధర్మన్, శతధనుష్, బృహద్రథ - రాజ్యానికి వచ్చారు. వీరు అసమర్థులు. విశాల సామ్రాజ్యం విచ్ఛిన్నమవుతుంటే ఆపలేకపోయారు. ఆఖరి రాజు బృహద్రథుడిని అతడి సేనాని పుష్యమిత్ర శుంగుడు క్రీ.పూ.184లో సంహరించి, పాటలీపుత్ర సింహాసనంపై శుంగ వంశ పాలన ప్రారంభించడంతో మౌర్య వంశ పాలన ముగిసింది.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 
 

Posted Date : 28-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌