• facebook
  • whatsapp
  • telegram

నిజాం ఆంధ్ర మహాసభ సమావేశాలు - ఆంధ్ర సారస్వత పరిషత్తు

మాతృభాషోద్ధరణలో మహామహులు!


నిజాం రాజ్యంలో అత్యధికులు మాట్లాడే తెలుగు భాషను పాలకులు చిన్నచూపు చూసేవారు. బోధనలో వివక్షను ప్రదర్శించేవారు. సాహిత్యానికి ఎలాంటి ప్రోత్సాహం ఉండేదికాదు. ఈ పరిస్థితులను గమనించిన తెలుగువారు ఏకమయ్యారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. పరిషత్తులు ఏర్పాటు చేశారు. గ్రంథాలు రచించారు. ప్రజలను విద్యావంతులను చేసి, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించారు. ఆ దశలో మాతృభాష అభివృద్ధికి ఎందరో మహానుభావులు చేసిన కృషి అందరిలో ఐకమత్య సాధనకు దోహదపడింది. తెలంగాణ చరిత్రలో భాగమైన ఈ అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

హైదరాబాదు రాజ్యంలో తెలుగు వారు అధికసంఖ్యలో ఉన్నప్పటికీ వారి మాతృభాష తెలుగుకు ఏమాత్రం గుర్తింపు ఉండేదికాదు. 1921, నవంబరు 11, 12 తేదీల్లో మహర్షి కార్వే అధ్యక్షతన జరిగిన నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల సభ సందర్భంగా ఆ విషయం స్పష్టమైంది. ఫలితంగా నిజాం ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఇది తెలుగువారి పూర్వవైభవాన్ని పునరుద్ధరించడానికి, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసింది. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశాన్ని జోగిపేటలో నిర్వహించారు. ఆంధ్ర మహాసభ సమకాలీన సమస్యల పరిష్కారం కోసం వివిధ పుస్తకాలు ప్రచురించి తెలుగువారిలో చైతన్యం కలిగించింది. రెండో ఆంధ్ర మహాసభ దేవరకొండలో జరిగింది. మూడోది ఖమ్మంలో, నాలుగోది సిరిసిల్లలో జరిగాయి. ఈ సభలతోపాటు ఆంధ్ర మహిళాసభ సమావేశాలను కూడా నిర్వహించేవారు.

అయిదో నిజాం ఆంధ్ర మహాసభ (1936):  ఈ సమావేశం షాద్‌నగర్‌లో కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆ సమయంలోనే మరణించిన వామన్‌ నాయక్‌ సంస్మరణార్థం ఈ సభా ప్రాంగణానికి దేశభక్త నగరమని పేరు పెట్టారు. అందులో నిర్బంధ విద్య, గ్రామ పంచాయతీలు, రైతుల సమస్యలపై చర్చించారు. ఇక్కడే జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశానికి అనంతలక్ష్మీదేవి అధ్యక్షురాలిగా వ్యవహరించారు.

ఆరో నిజాం ఆంధ్ర మహాసభ (1937): ఈ సమావేశం మందుముల నర్సింగరావు అధ్యక్షతన నిజామాబాద్‌లో జరిగింది. ఇందులో మొదటిసారిగా ఆంధ్ర మహాసభను ఒక రాజకీయ సంస్థగా పరిగణించారు. సభా కార్యక్రమాలు తెలుగులోనే నిర్వహించాలనే నిబంధనను తీసివేశారు. తెలుగు భాషకు ప్రాముఖ్యమివ్వకుండా, నిజాం రాష్ట్ర ఆంధ్రుల అభివృద్ధికి ఆంధ్ర మహాసభ కృషి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశానికి నందగిరి ఇందిరాదేవి అధ్యక్షత వహించారు.

ఏడో నిజాం ఆంధ్ర మహాసభ (1940): ఈ సమావేశం మందముల రామచంద్రారావు అధ్యక్షతన మల్కాపురం (హైదరాబాదు జిల్లా)లో జరిగింది. దీంట్లో అతివాదులు ఎక్కువగా పాల్గొన్నారు. రాజకీయ సంస్కరణల కోసం వేసిన అరవమూడు అయ్యంగార్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై సభలో చర్చించారు. అప్పుడు జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశానికి యోగ్య శీలాదేవి అధ్యక్షత వహించారు.

ఎనిమిదో నిజాం ఆంధ్ర మహాసభ (1941):  ఈ సమావేశాన్ని రావి నారాయణరెడ్డి అధ్యక్షతన చిలుకూరు (నల్లగొండ జిల్లా)లో నిర్వహించారు. ఈ ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల ప్రాబల్యంలో సాగింది. ఈ సందర్భంగా జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశానికి రంగమ్మ ఓబులారెడ్డి అధ్యక్షత వహించారు.

తొమ్మిదో నిజాం ఆంధ్ర మహాసభ (1942): ఈ సమావేశం మాదిరాజు రామకోటేశ్వరరావు (మితవాద నాయకుడు) అధ్యక్షతన ధర్మవరం (వరంగల్‌ జిల్లా)లో జరిగింది. ఈ సమావేశం క్విట్‌ ఇండియా తీర్మానాన్ని బలపరిచింది. ఇక్కడ జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశానికి రంగమ్మ ఓబులారెడ్డి అధ్యక్షత వహించారు.

పదో నిజాం ఆంధ్ర మహాసభ (1943):  ఈ సమావేశం కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగింది. ఈ సభలో మొదటిసారిగా అధ్యక్ష పదవికి కమ్యూనిస్టు నాయకుడైన బద్దం ఎల్లారెడ్డి, మితవాద పక్షం నుంచి కొండా వెంకట రంగారెడ్డి పోటీ పడగా రంగారెడ్డి ఎన్నికయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటు గురించి ఈ సభలో చర్చించారు. తెలంగాణ సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించాలని తీర్మానం చేశారు. ఇక్కడ జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశానికి సీతాకుమారి అధ్యక్షత వహించారు.

పదకొండో నిజాం ఆంధ్ర మహాసభ (1944): రావి నారాయణరెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగింది. ఈ సభలో అతివాదులు, మితవాదులు అధికారికంగా విడిపోయారు. దీంతో ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది. నిజాం ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల ఆధీనంలోకి పోవడంతో మితవాద నాయకులైన కె.వి.రంగారెడ్డి, ఎం.రామచంద్రరావులు జాతీయ ఆంధ్ర మహాసభ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ జరిగిన ఆంధ్ర మహిళా సభకు సత్యవతీ దేవి అధ్యక్షత వహించారు.

పన్నెండో నిజాం ఆంధ్ర మహాసభ (1945):  రావి నారాయణరెడ్డి అధ్యక్షతన ఖమ్మంలో జరిగింది. పూర్తిగా కమ్యూనిస్టుల అదుపులో ఉన్న ఈ సభకు 40 వేల మందికి పైగా జనం హాజరయ్యారు.

పదమూడో నిజాం ఆంధ్ర మహాసభ (1946):  ఈ సమావేశం బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షతన కరీంనగర్‌లో జరిగింది. నిజాం ఆంధ్ర మహాసభకు చివరి సమావేశమిది. 1946, డిసెంబరు 3న కమ్యూనిస్టు పార్టీని నిషేధించడంతో ఆంధ్ర మహాసభ కూడా ముగింపు దశకు చేరుకుంది.

జాతీయ ఆంధ్ర మహాసభ ప్రథమ సమావేశం (1945): ఈ సమావేశం మాదిరాజు రామకోటేశ్వరరావు అధ్యక్షతన మడికొండ (వరంగల్‌ జిల్లా)లో జరిగింది. రెండో జాతీయ ఆంధ్ర మహాసభ 1946లో జమలాపురం కేశవరావు (తెలంగాణ సర్దారు) అధ్యక్షతన సంగారెడ్డి (అప్పటి మెదక్‌ జిల్లా) సమీపంలోని కందిలో జరిగింది. ఈ సభ తర్వాత జాతీయ ఆంధ్ర మహాసభ హైదరాబాద్‌ రాజ్య కాంగ్రెసులో విలీనమైంది.

ఆంధ్ర మహాసభ కార్యకలాపాలను పయాం, రయ్యత్‌ అనే ఉర్దూ పత్రికలు ప్రచారం చేశాయి. పయాం పత్రిక సంపాదకుడైన అబ్దుల్‌ గఫార్‌ అభ్యదయ రచనలకు చోటిచ్చాడు. రయ్యత్‌ పత్రిక సంపాదకుడైన మందుముల నర్సింగరావు మొత్తం ఆంధ్ర మహాసభల అధ్యక్షోపన్యాసాలను అనువదించి ప్రచురించాడు.

 

సారస్వత పరిషత్తు 

1942లో వరంగల్‌ జిల్లా ధర్మవరంలో తొమ్మిదో ఆంధ్ర మహాసభ జరిగిన సందర్భంలో కొందరు సాహిత్యాభిమానులు సమావేశమై హైదరాబాద్‌ సాహిత్య పరిషత్తు ఏర్పాటుపై చర్చించారు. 1943లో హైదరాబాద్‌లో పదో ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు సాహిత్య సంస్థ స్థాపన విషయంలో స్పష్టత వచ్చింది. 1943, మే 26న రెడ్డి హాస్టల్‌లో సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, గడియారం రామకృష్ణశర్మ, భాస్కరభట్ల కృష్ణారావు తదితరులు సమావేశమై చర్చించి ‘హైదరాబాదు సాహిత్య పరిషత్తు’ పేరును ‘నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్తు’గా మార్చారు. ఈ సంస్థ మొదటి అధ్యక్షుడు లోకనంది శంకర నారాయణ. మొదటి కార్యదర్శి బిరుదు వెంకట శేషయ్య.

సారస్వత పరిషత్తు లక్ష్యాలు: తెలుగు సాహిత్యాభివృద్ధికి ఈ సంస్థ అనేక లక్ష్యాలను ఏర్పరచుకుంది.

* ప్రజల్లో మాతృభాషాభిమానం పెంచడం.

* గ్రామాల్లో రాత్రి పాఠశాలలు నిర్వహించడం.

* విద్యార్థులకు పాఠ్యప్రణాళిక తయారు చేసి పరీక్షలు నిర్వహించడం.

* వయోజనులు, స్త్రీలు, బాలలు, వృద్ధులు సులభంగా రాయగలిగిన పరీక్షలు నిర్వహించి మాతృభాష పట్ల ఆసక్తి కలిగించడం.

* ఉత్తమ గ్రంథాలకు పారితోషికం ఇవ్వడం.

గోలకొండ పత్రిక ఆఫీసు సారస్వత పరిషత్తు కార్యాలయంగా ఉండేది. ఈ సంస్థ మొదటి వార్షికోత్సవాన్ని వరంగల్‌లో 1944, డిసెంబరు 28, 29, 30 తేదీల్లో జరిపారు. సురవరం ప్రతాప రెడ్డి అధ్యక్షత వహించారు. తెలుగు భాషాభివృద్ధి చేయాలని, జానపద సాహిత్యాన్ని కాపాడాలని నిఘంటువులు, శాసనాలు, జీవిత చరిత్రలను అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 1944, జులై 18, 19 తేదీల్లో మొదటిసారిగా పరిషత్తు ప్రవేశపరీక్ష జరిగింది. 1945, అక్టోబరు 4, 5, 6 తేదీల్లో ప్రాథమిక ప్రవేశ పరీక్ష జరిగింది. 1945లో ఈ సంస్థకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1949లో ‘నిజాం రాష్ట్ర’ అనే పదాలను తొలగించి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’గా మార్చారు. పరిషత్తు అభివృద్ధికి దేవులపల్లి రామానుజరావు విశేష కృషి చేశారు.

 

ఇతర సాహితీ సంస్థలు

తెలుగు సాహిత్యాభివృద్ధి కోసం వివిధ సంస్థలు పనిచేశాయి. వాటిలో సాధన సమితి (1931), విజ్ఞాన వర్థినీ పరిషత్‌ (1941), తెలుగు భాషా సమితి (1943) తదితర సంస్థలు హైదరాబాద్‌లో స్థాపితమయ్యాయి.

సారస్వత పరిషత్తు ప్రచురించిన గ్రంథాలు

పుస్తకం                                  రచయిత

ఆంధ్రుల సాంఘిక చరిత్ర   -    సురవరం ప్రతాపరెడ్డి

కావ్యాలంకార సంగ్రహము -   సూర్యనారాయణ శాస్త్రి

సాహిత్య సోపానాలు -          దివాకర్ల వెంకటావధాని

శాలివాహన గాథాసప్తశతిసారం - రాళ్లపల్లి అనంతకృష్ణశాస్త్రి

పల్లె పదాలు, స్త్రీల పౌరాణిక పాటలు - కృష్ణశాస్త్రి

మనదేశము - దేవులపల్లి రామానుజరావు

వీరగాథలు - గడియారం రామకృష్ణ

మిఠాయి చెట్టు - ఆదిరాజు వీరభద్రరావు

 

మాదిరి ప్రశ్నలు


1) ఆంధ్ర సారస్వత పరిషత్తును ఎప్పుడు స్థాపించారు?

1) 1941       2) 1943      3) 1944      4) 1945


2) ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిన సమావేశంలో అధికారికంగా చీలిపోయింది?

1) ధర్మవరం     2) హైదరాబాద్‌      3) భువనగిరి    4) మడికొండ


3) రయ్యత్‌ పత్రిక సంపాదకుడు ఎవరు?

1) గఫార్‌ఖాన్‌    2) ఆజంఖాన్‌    3) షమ్‌షల్‌ ఉమ్రా    4) మందుముల నర్సింగరావు


4) నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్తు మొదటి అధ్యక్షుడు?

1) వెంకట శేషయ్య                  2) రామకోటేశ్వరరావు

3) మాడపాటి హనుమంతరావు          4) లోకనంది శంకరనారాయణ


5) నిజాం రాష్ట్ర సారస్వత పరిషత్తు పేరును ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ఎప్పుడు మార్చారు? 

1) 1944        2) 1946        3) 1949        4) 1952


6) మిఠాయి చెట్టు గ్రంథ రచయిత ఎవరు?

1) ఎ.వీరభద్రరావు          2) రామానుజరావు

3) సూర్యనారాయణ శాస్త్రి     4) కృష్ణశాస్త్రి


7) ‘పయాం’ పత్రిక సంపాదకుడు ఎవరు?

1) వలీఖాన్‌    2) నస్గర్‌       3) అబ్దుల్‌ గఫార్‌  4) మహ్మదాలీ


8) సారస్వత పరిషత్తు మొదటి వార్షికోత్సవం ఎక్కడ జరిగింది?

1) వరంగల్‌             2) కరీంనగర్‌      3) హైదరాబాద్‌           4) ఖమ్మం

 

సమాధానాలు 

1-2, 2-3, 3-4, 4-4, 5-3, 6-1, 7-3, 8-1.

డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

Posted Date : 20-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌