• facebook
  • whatsapp
  • telegram

పార్లమెంటు - అధికారాలు, విధులు

శాసన నిర్మాణంలో సర్వోన్నతం

  ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత శాసన నిర్మాణ వేదిక పార్లమెంటు. దేశ అవసరాల మేరకు శాసనాలను రూపొందిస్తుంది, సరిచేస్తుంది, రద్దు చేస్తుంది. ప్రభుత్వాలకు మార్గదర్శనం చేస్తుంది, నియంత్రిస్తుంది. ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపంగా పాలన సాగేవిధంగా చూస్తుంది.

 

  పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు. ఈ విధానానికి పుట్టినిల్లు బ్రిటన్‌. ప్రపంచ పార్లమెంటులకు మాతగా బ్రిటన్‌ పార్లమెంటును పేర్కొంటారు. మన దేశం పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్‌ నుంచి గ్రహించింది.

 

భారత్‌లో పార్లమెంటు పరిణామ క్రమం 

* చార్టర్‌ చట్టం-1833 ప్రకారం మన దేశంలో తొలిసారిగా కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన నిర్మాణ శాఖను వేరు చేశారు. 

* చార్టర్‌ చట్టం-1853 ప్రకారం మన దేశంలో జాతీయ స్థాయిలో తొలిసారిగా లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. 

* ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం-1861 ప్రకారం కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో ముగ్గురు భారతీయులకు తొలిసారి ప్రాతినిధ్యం కల్పించారు.

* ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం-1892 ప్రకారం మన దేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు. 

* మింటో - మార్లే సంస్కరణల చట్టం-1909 ప్రకారం మన దేశంలో పరిమిత ప్రాతిపదికపై కొద్దిమందికి ఓటుహక్కును కల్పించి  ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.

* మాంటేగ్‌ - ఛేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం-1919 ప్రకారం జాతీయ స్థాయిలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఎగువ సభను కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌గా, దిగువ సభను లెజిస్లేటివ్‌ అసెంబ్లీగా పేర్కొన్నారు. ఈ ద్విసభా విధానం 1921 నుంచి అమల్లోకి వచ్చింది. 

* భారత పార్లమెంటు భవనాన్ని 1921 - 1927 మధ్య నిర్మించారు. దాన్ని ఎడ్విన్‌ ల్యూటిన్స్, ఎడ్వర్డ్‌ బేకర్‌ రూపకల్పన చేశారు. 1921లో గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఛేమ్స్‌ఫర్డ్‌ పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1927, జనవరి 18న గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. 

 

రాజ్యాంగ వివరణ

భారత రాజ్యాంగంలోని అయిదో భాగంలో ఆర్టికల్స్‌ 79 నుంచి 122 మధ్య పార్లమెంటు నిర్మాణం, శాసన ప్రక్రియ, అధికార విధులను వివరించారు. ఆర్టికల్‌ 79 ప్రకారం భారతదేశానికి ఒక అత్యున్నత శాసన నిర్మాణ శాఖ ఉంటుంది. దాని పేరు  పార్లమెంటు. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభలను కలిపి పార్లమెంటు అంటారు. రాజ్యాంగ నిర్మాతలు జాతీయ స్థాయిలో రెండు సభలు ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పరిచారు. మన దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా రూపొందించడంతో సమాఖ్య స్ఫూర్తికి అవసరమైన రెండు సభలను అంటే రాజ్యసభ, లోక్‌సభలను ఏర్పాటు చేశారు. మన దేశంలో 1952, ఏప్రిల్‌ 3న రాజ్యసభ, 1952, ఏప్రిల్‌ 17న లోక్‌సభ ఏర్పడ్డాయి. పార్లమెంటు తొలి సమావేశం 1952, మే 13న జరిగింది. రెండు సభల సభ్యులను పార్లమెంటు సభ్యులుగా పరిగణిస్తారు. అందుకే ఏ సభలోని సభ్యుడినైనా మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంటు (ఎంపీ) అంటారు. 

 

శాసనాధికారాలు

భారతదేశానికి అవసరమైన సమగ్ర శాసనాలను రూపొందించేది పార్లమెంటు మాత్రమే. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలను రూపొందిస్తుంది.  

 

ఆర్టికల్‌ 249 - జాతీయ ప్రాధాన్యం రీత్యా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం చేసినప్పుడు.

 

ఆర్టికల్‌ 252 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల కోరిక మేరకు. 

 

ఆర్టికల్‌ 253 - అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం.

 

ఆర్టికల్‌ 356 - రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రాలకు. 

 

ఆర్టికల్‌ 250 - జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్‌ 352 ప్రకారం కొనసాగుతున్నపుడు.

 

ఇతర శాసనాధికారాలు 

 

ఆర్టికల్‌ 2 - కొత్త రాష్ట్రాల ఏర్పాటు 

 

ఆర్టికల్‌ 3 - రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ

 

ఆర్టికల్‌ 11 - పౌరసత్వానికి సంబంధించిన అంశాలు 

 

ఆర్టికల్‌ 71 - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారాలు 

 

ఆర్టికల్‌ 33 - సైనికులు, శాంతిభద్రతల ఉద్యోగుల ప్రాథమిక హక్కులపై

 

ఆర్టికల్‌ 248 - అవశిష్టాంశాలపై 

 

ఆర్టికల్‌ 169(1) - రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్‌ ఏర్పాటు లేదా తొలగింపు 

 

ఆర్టికల్‌ 312 - రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే కొత్త అఖిల భారత సర్వీసుల ఏర్పాటు 

 

ఆర్టికల్‌ 123 - రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్‌ను ఆమోదించడం ద్వారా 

 

కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే అధికారాలు

ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలిని పార్లమెంటు వివిధ పద్ధతుల ద్వారా నియంత్రిస్తుంది. 

* కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహించాలి.

* పార్లమెంటులో సభ్యులు అడిగే ప్రశ్నలకు, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే వాయిదా తీర్మానం, అవిశ్వాస తీర్మానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.

లోక్‌సభ ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నియంత్రణను కలిగి ఉంటుంది. 

* ద్రవ్య బిల్లులు, బడ్జెట్‌ను తిరస్కరించడం  

* రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని తిరస్కరించడం 

* కోత తీర్మానాలను ప్రవేశపెట్టడం 

* అభిశంసన తీర్మానం, అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం  

* ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశపెట్టడం 

* ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌  

 

రాజ్యాంగ సవరణ అధికారాలు 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 368 ప్రకారం పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని మూడు రకాల పద్ధతుల ద్వారా సవరింస్తుంది. 1951 లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం మొదటిసారిగా రాజ్యాంగాన్ని సవరించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో (1976) 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని అనేక అంశాలను సవరించారు.

 

ఆర్థిక అధికారాలు 

* పార్లమెంటు అనుమతి లేనిదే ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేయకూడదు. ఆర్టికల్‌ 265 ప్రకారం చట్టబద్ధంగా తప్ప ఇతర పద్ధతుల ద్వారా పన్నులు విధించకూడదు.

* బడ్జెట్, ఆర్థిక, పారిశ్రామిక తీర్మానాలను పార్లమెంటు ఆమోదిస్తుంది.

* ఆర్టికల్‌ 266 ప్రకారం కేంద్ర సంఘటిత నిధిపై పార్లమెంటు పూర్తిస్థాయి నియంత్రణ కలిగి ఉంటుంది.

* ఆర్టికల్‌ 292 ప్రకారం విదేశాల నుంచి ప్రభుత్వం రుణాలు పొందాలంటే పార్లమెంటు అనుమతి ఉండాలి.

* పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ, ఎస్టిమేట్స్‌ కమిటీ, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ తమ నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తాయి.

* ఆర్టికల్‌ 151 ప్రకారం కాగ్‌ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు.

 

అర్ధన్యాయాధికారాలు

* ఆర్టికల్‌ 61 ప్రకారం మహాభియోగ తీర్మానం (ఇంపీచ్‌మెంట్‌ మోషన్‌) ద్వారా పార్లమెంటు రాష్ట్రపతిని తొలగిస్తుంది.

* సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులను తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది.

* కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లను తొలగించే తీర్మానాలను పార్లమెంటు విచారిస్తుంది. 

* సభా హక్కులకు భంగం కలిగించిన వారిని శిక్షిస్తుంది.

జీతభత్యాలను నిర్ణయించడం: పార్లమెంటు సభ్యులు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, ఇతర జాతీయ ప్రాధాన్యం ఉన్న పదవుల జీత భత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత పార్లమెంట్ - లోక్‌సభ

‣  ఉపరాష్ట్రపతి

 కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

 

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 17-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌