• facebook
  • whatsapp
  • telegram

పార్లమెంటు - శాసన నిర్మాణ ప్రక్రియ


ముసాయిదా మొదలు... ఆమోద‌ ముద్ర వ‌రకు!

పాలన సక్రమంగా నియంత్రణలో సాగాలంటే కొన్ని నియమ నిబంధనలు అవసరం. వాటిని దేశ సార్వభౌమాధికార పరిధిలో న్యాయబద్ధంగా రూపొందించి, అమలు అధికారాన్ని ప్రభుత్వానికి అందించేదే శాసనం. ఇందుకోసం రాజ్యాంగ నిర్మాతలు పటిష్ఠమైన విధానాలను ఏర్పాటు చేశారు.  ఆ వివరాలను ముసాయిదాతో మొదలు పెట్టి శాసన నిర్మాణం వరకు సమగ్రంగా అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

పార్లమెంటు - శాసన నిర్మాణ ప్రక్రియ

దేశానికి అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. మన దేశం శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటన్‌ నుంచి గ్రహించింది. ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఏడు దశలు అధిగమించాల్సి ఉంటుంది. ‘బిల్లు’ అంటే ‘శాసనం లేదా చట్టం’ చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన/ముసాయిదా. ఇది చట్టం నిర్మాణంలో మొదటి దశ.

బిల్లును ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లు ప్రతిని న్యాయమంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపుతారు. ఆ శాఖ నుంచి సూచనలు, సలహాలు సేకరించిన తర్వాత ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ ముందు ఉంచుతారు. కేబినెట్‌ ఆమోదించిన బిల్లును ప్రవేశపెట్టబోయే సభాధిపతికి 7 రోజులు ముందుగా నోటీసు ఇచ్చి వారి అనుమతి కోరతారు. సభాధిపతి నిర్ణయించిన తేదీన బిల్లును సభలో ప్రవేశపెడతారు.

 

ఏడు దశలు

1) ప్రవేశ దశ: ఈ దశలో బిల్లును ప్రవేశపెట్టే వ్యక్తి/మంత్రి, సభాధిపతి అనుమతితో బిల్లుకు సంబంధించిన శీర్షికను ప్రకటిస్తూ దాన్ని ప్రవేశపెట్టేందుకు సభ అనుమతి కోరతారు. అవసరమైతే ఈ దశలో బిల్లుపై ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో నెగ్గితే బిల్లు ప్రతిని ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురిస్తారు. ఈ దశలో ఓటింగ్‌లో ఓడిపోతే కేవలం బిల్లు మాత్రమే రద్దవుతుంది. ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

2) మొదటి పఠనం: ఈ దశలో బిల్లు ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, బిల్లు చట్టంగా మారితే దానివల్ల చేకూరే ప్రయోజనాల గురించి బిల్లును ప్రవేశపెట్టే వ్యక్తి/మంత్రి వివరిస్తారు.

3) ద్వితీయ పఠనం: ఈ దశలో బిల్లుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సమగ్రంగా సభకు వివరిస్తారు. బిల్లును సభ మొత్తంగా చర్చించాలా లేదా కమిటీకి అప్పగించాలా అనే అంశంపై చర్చ జరుగుతుంది. సాధారణంగా ఏ బిల్లునైనా పార్లమెంటరీ కమిటీలకు అప్పగిస్తుంటారు.

4) కమిటీ దశ: ఆధునిక కాలంలో పార్లమెంటు చేసే చట్టాల తయారీలో పార్లమెంటరీ కమిటీలదే కీలక పాత్ర. సంబంధిత రంగాలకు చెందిన నిపుణుల సలహాలు, రాజ్యాంగ, న్యాయ నిపుణుల సూచనలు, ప్రజాభిప్రాయాన్ని ఈ కమిటీ సేకరిస్తుంది. ఈ విధంగా సేకరించిన అంశాలతో కూడిన నోట్‌ను బిల్లుకి జతపరచి సభాపతికి సమర్పిస్తారు.

5) నివేదిక దశ: వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల ఆధారంగా బిల్లులో చేసే సవరణలు, అవసరమైన సూచనలు, నిపుణుల సలహాలను క్రోడీకరించి ఒక నివేదిక రూపొందించి సభ ముందు ఉంచుతారు.

6) తృతీయ పఠనం: పార్లమెంటరీ కమిటీ సమర్పించిన బిల్లులోని అంశాలపై చర్చిస్తూ ఒక్కో క్లాజుపైన లేదా మొత్తం బిల్లుపై సమగ్ర చర్చ జరిపి, సభ్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్‌కు ప్రవేశపెడతారు. ఈ దశలో లోక్‌సభలో జరిగే ఓటింగ్‌లో బిల్లు వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.

7) రాష్ట్రపతి ఆమోదం: పైన పేర్కొన్న దశలన్నీ రెండో సభలో కూడా పూర్తయిన తర్వాత బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళుతుంది. రాష్ట్రపతి ఆమోదంతో శాసనంగా రూపొందుతుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న రోజులో ఒక బిల్లు శాసనంగా రూపొందేందుకు కనీసం 19 రోజులు పడుతుంది.

 

బిల్లులు - రకాలు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 107 నుంచి 122 మధ్య శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, బిల్లుల వివరాలను పొందుపరిచారు.

 

సాధారణ బిల్లులు:  ఆర్టికల్‌ 107 ప్రకారం ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు కాని వాటిని సాధారణ బిల్లులుగా పరిగణిస్తారు. సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ బిల్లులు ఉభయ సభల్లో వేర్వేరుగా గాని, సంయుక్తంగా గాని ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టాలు/శాసనాలుగా మారతాయి. సాధారణ బిల్లులను ఆమోదించే సందర్భంలో ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్‌ 108 ప్రకారం రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేస్తారు. ఈ విధంగా ఏర్పాటయ్యే సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ఇంతవరకు మన దేశంలో మూడు సార్లు మాత్రమే పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలు జరిగాయి.  

* 1961, మే 6న వరకట్న నిషేధ బిల్లు విషయమై రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి అప్పటి లోక్‌సభ స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌ అధ్యక్షత వహించారు.

* 1978, మే 17న బ్యాంకింగ్‌ సర్వీస్‌ రెగ్యులేషన్‌ బిల్లు విషయమై సభల మధ్య భినాభిప్రాయాలు వ్యక్తం కావడంతో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దానిక అప్పటి లోక్‌సభ స్పీకర్‌ కేఎస్‌ హెగ్డే అధ్యక్షత వహించారు.

* 2002, మార్చి 26న ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజం ఆర్డినెన్స్‌ (POTO) విషయమై సభల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి అప్పటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పి.ఎం.సయీద్‌ అధ్యక్షత వహించారు.

 

ద్రవ్య బిల్లులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 109లో ద్రవ్యబిల్లుల (Money Bills) ఆమోద ప్రక్రియ గురించి వివరించారు. ఆర్టికల్‌ 110లో ద్రవ్య బిల్లుల నిర్వచనం గురించి వివరించారు. భారత సంఘటిత నిధి, ఆగంతక నిధి నుంచి నగదు తీసుకోవడం, జమ చేయడం, పన్నులు విధించడం, తగ్గించడం, క్రమబద్ధీకరించడం, ఆర్థిక లావాదేవీలు లాంటి వాటిని ద్రవ్య బిల్లులుగా పరిగణిస్తారు.

* ఆర్టికల్‌ 110(3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అనేది లోక్‌సభ స్పీకర్‌ నిర్ణయిస్తారు. స్పీకరు నిర్ణయాన్ని దేశంలోని ఏ న్యాయస్థానంలోనూ సవాల్‌ చేయరాదు.

* ద్రవ్య బిల్లును రాష్ట్రపతి అనుమతిలో లోక్‌సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలి. లోక్‌సభ ఆమోదం పొందిన ద్రవ్య బిల్లు స్పీకర్‌ ధ్రువీకరణతో రాజ్యసభకు వెళ్తుంది.

* ద్రవ్య బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. 

 

ఆర్థిక బిల్లులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 117లో ఆర్థిక బిల్లుల (Financial Bills) ప్రస్తావన ఉంది. ఆర్థిక బిల్లులను కింది విధంగా వర్గీకరించవచ్చు. అవి:

* ద్రవ్య బిల్లులు - ఆర్టికల్‌ 110

* మొదటి రకం ఆర్థిక బిల్లులు - ఆర్టికల్‌ 117 (1)

* రెండో రకం ఆర్థిక బిల్లులు - ఆర్టికల్‌ 117 (3)

 

ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే. కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు. స్పీకర్‌  ధ్రువీకరించిన ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు అవుతాయి. అంటే ద్రవ్య బిల్లులకు, ఆర్థిక బిల్లులకు తేడా స్పీకర్‌ ధ్రువీకరణ మాత్రమే.

మొదటి రకం ఆర్థిక బిల్లులు ఆర్టికల్‌: కేంద్ర ప్రభుత్వం రుణాలను సేకరించే అంశాలపై చట్టాలు చేయాలనుకున్నప్పుడు రుణాలను సేకరించే నియమాలతో పాటు, సాధారణ నియమాలు కూడా ఉంటాయి. ఈ రకమైన బిల్లు ద్రవ్య బిల్లులతో సరిసమానమైంది. ఈ బిల్లును రాష్ట్రపతి అనుమతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి.

రెండో రకం ఆర్థిక బిల్లులు: ఈ రకమైన ఆర్థిక బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలుంటాయి. ఆర్టికల్‌ 110లో పేర్కొన్న అంశాలు దీనిలో ఉండవు. అందువల్ల దీన్ని సాధారణ బిల్లులా పార్లమెంటు ఉభయసభలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ బిల్లుపై ఉభయసభల సంయుక్త సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు.

రచయిత: బంగారు సత్యనారాయణ

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత పార్లమెంట్ - లోక్‌సభ

‣  ఉపరాష్ట్రపతి

 కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

 

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 08-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌