• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాద్‌లో ప్రజాభిప్రాయ రూపకల్పన

జన వాహినిలో.. నవ భావనగా!

బ్రిటిష్‌ దురాగతాలపై దేశంలో నాడు సమరం సాగుతున్నప్పుడు నిజాం రాజ్యంలో అరాచకాలపై ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ దశలో అన్ని విధాలుగా జనాన్ని చైతన్యవంతం చేసి స్వాతంత్య్ర ఉద్యమం వైపు నడిపించేందుకు అనేక సంస్థలు ఏర్పడ్డాయి. ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా కృషి చేశారు. సొసైటీలను, సేవాదళాలను నెలకొల్పారు. యువతకు రకరకాల శిక్షణలు ఇప్పించారు. పత్రికలు స్థాపించి ఆధునిక ఆలోచనలను నూరిపోశారు. జనవాహినిలో నవ భావనగా నిలిచారు. పోరాటాల్లో అందరినీ భాగస్వాములను చేశారు. 

 

నిజాం పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉండేది. తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు అనేక సంస్థలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో బ్రిటిష్‌ ఇండియాలో సాగుతున్న స్వాతంత్య్రోద్యమ ప్రభావం హైదరాబాద్‌ రాజ్యంపై ఉండేది.

 

యంగ్‌మెన్స్‌ ఇంప్రూమెంట్‌ సొసైటీ: దీన్ని 1886, ఆగస్టు 8న అఘోరనాథ ఛటోపాధ్యాయ హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో స్థాపించారు. నాటి యువతరంలో నవీన భావాలను ప్రేరేపించడానికి ఈ సొసైటీ కృషి చేసింది. 

 

థియోసాఫికల్‌ సొసైటీ: వయోవృద్ధుల్లో జాతీయ భావాలను కలిగించేందుకు రామస్వామి అయ్యర్‌ 1882, డిసెంబరు 26న చాదర్‌ఘాట్‌లో థియోసాఫికల్‌ సొసైటీని ప్రారంభించారు. ఈ సంస్థ హనుమాన్‌ టేక్డీ ప్రాంతంలో సొంత భవనాన్ని నిర్మించుకోగా అనిబిసెంట్‌ 1906లో ప్రారంభించారు.

 

హిందూ సోషల్‌ క్లబ్‌: 20వ శతాబ్దం ఆరంభంలో ఉన్నత విద్య కోసం యువత హైదరాబాద్‌ నుంచి ఇంగ్లండ్‌కు వెళ్లేది. వీరికి నిజాం ప్రభుత్వం వేతనాలిచ్చి సహాయపడేది. అయితే ప్రభుత్వం ముస్లిం విద్యార్థులను ప్రోత్సహించి హిందూ విద్యార్థులను నిరుత్సాహపరచడానికి సనాతనుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ దురుద్దేశాన్ని గ్రహించిన రాజా మురళీ మనోహర్‌ చాదర్‌ఘాట్‌లో ‘హిందూ సోషల్‌ క్లబ్‌’ స్థాపించి హిందూ విద్యార్థులను ప్రోత్సహించారు. మాల్‌వాలా సభ అనే సంస్థను కూడా ఆయనే ఏర్పాటు చేశాడు. చార్మినార్‌ వద్ద ఉండే మాల్‌వాలా ప్యాలెస్‌ అనే దేవిడీలో సమావేశాలు ఏర్పాటుచేసి ప్రముఖులతో ప్రసంగాలు ఇప్పించి నాటి యువతలో ధైర్యం, ఉత్సాహం నింపారు.

 

బారిస్టర్‌ రుద్ర: బారిస్టర్‌ రుద్ర ఉత్తర భారత దేశం నుంచి హైదరాబాద్‌కు 1889లో వచ్చి వకీలుగా కొనసాగారు. ఇతడి ప్రతిభను గుర్తించిన విద్యావంతులు నిజాం క్లబ్‌లో సభ్యుడిగా చేర్చుకొని సత్కరించారు. ‘పయనీర్‌ పత్రిక’ విలేకరిగా కూడా పనిచేసిన రుద్ర ఆ సమయంలో నిజాంను విమర్శిస్తూ వ్యాసాలు రాశారు. దీంతో అందరూ అతడిని శత్రువుగా చూసి నిజాం క్లబ్‌ నుంచి తొలగించారు. వేధింపులు తట్టుకోలేక రుద్ర చివరికి హైదరాబాద్‌ వదిలి వెళ్లిపోయారు.

 

వ్యాయామశాలలో ఆయుధ శిక్షణ: ఆర్యసమాజం చాదర్‌ఘాట్‌లో వ్యాయామశాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు, యువకులకు వ్యాయామంతోపాటు ఆయుధ శిక్షణ ఇచ్చి స్వాతంత్య్రోద్యమానికి వాలంటీర్లుగా తయారుచేసేవారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి యువకులు వచ్చి తెలంగాణ మారుమూల గ్రామాల్లోని వ్యాయామశాలల్లో వివిధ రకాల శిక్షణలు పొందేవారు.

 

స్వచ్ఛంద సేవాదళం: బహిరంగ సభలు, సమావేశాలు జరిగినప్పుడు ఏర్పాట్లు చేయడానికి హైదరాబాద్‌లో ‘ఆంధ్ర వాలంటీర్‌ కోర్‌’ అనే దళాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణస్వామి ముదిరాజ్‌ దళాధిపతిగా (కెప్టెన్‌) ఉండేవారు.

 

హ్యుమానిటేరియన్‌ లీగ్‌: ప్రముఖ సంఘసంస్కర్త రాయ్‌ బాలముకుంద్‌ అధ్యక్షతన 1913లో హైదరాబాద్‌లో ‘హ్యుమానిటేరియన్‌ లీగ్‌’ సంస్థ ఏర్పాటైంది. కలప వర్తకులైన లాల్‌జీ మేఘ్‌జీ, గణేశ్‌మల్‌ ఈ సంఘానికి కార్యదర్శులుగా ఉండేవారు. సోషల్‌ సర్వీసు లీగ్‌ అనే సంస్థను వామన్నాయక్, కేశవరావు 1915లో హైదరాబాద్‌లో స్థాపించారు.

 

బ్రహ్మసమాజం: రాజా రామ్మోహన్‌రాయ్‌ 1829లో కలకత్తాలో బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. బ్రహ్మసమాజ ఆచారం ప్రకారం జరిగిన వివాహాలకు 1872లో హైదరాబాద్‌లో చట్టబద్ధత కల్పించారు. సరోజినీ నాయుడు సూచన మేరకు బ్రహ్మసమాజ ప్రథమ సమావేశం 1914, సెప్టెంబరు 20న రెసిడెన్సీ బజారులో నారాయణ గోవింద వెల్లింకర్‌ అధ్యక్షతన జరిగింది. 

 

విజ్ఞానం పెంచిన పత్రికలు

ప్రజలను చైతన్యపరచడంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయి. 1870లో వనపర్తిలో, 1875లో గద్వాల సంస్థానాల్లో ముద్రణాశాలలను ఏర్పాటు చేశారు. 1864లో సికింద్రాబాద్‌లో ‘దక్కన్‌ టైమ్స్‌’ మొదలైంది. నిజాం రాజ్యంలో ఇది మొదటి ఆంగ్ల పత్రిక. 1882లో ‘హైదరాబాద్‌ టెలీగ్రఫీ’ అనే ఇంగ్లిష్‌ పత్రిక ప్రారంభమైంది. 1885లో ‘హైదరాబాద్‌ రికార్డు’ అనే ఇంగ్లిష్‌ పత్రిక ఏర్పాటైంది. బ్రిటిష్‌ రెసిడెంట్‌ను స్థానిక సీజర్‌గా అభివర్ణించినందుకు ఈ పత్రికను ప్రభుత్వం 1892లో నిషేధించింది. 1886లో ‘శేద్య చంద్రిక’ పత్రికను వ్యవసాయ సమాచారం కోసం ఏర్పాటు చేశారు. ఇది ఉర్దూ పత్రిక పుమాన్‌కు అనువాదం. 1887లో దక్కన్‌ పంచ్, 1889లో దక్కన్‌ స్టాండర్డ్, 1898లో ది దక్కన్‌ మెయిల్‌ పత్రికలు ప్రారంభమయ్యాయి. మౌల్వీ మొహిబ్‌ హుస్సేన్‌ పత్రికా రంగం పితామహుడిగా పేరు పొందారు. ఈయన 1892లో ‘మొవాలియే విశ్వాన్‌’ అనే పత్రికను స్థాపించి ముస్లిం మహిళల విద్య కోసం, పర్దా పద్ధతి తొలగించడానికి పోరాడి సంఘసంస్కర్తగా ప్రసిద్ధి చెందారు. ఈయన నడిపే మౌల్లిం-ఎ-షఫిక్‌ పత్రికను ప్రభుత్వం నిషేధించడంతో 1904లో ‘ఇల్మ్‌-ఓ-అమల్‌’ అనే ఉర్దూ వార పత్రికను ప్రారంభించారు.


  1909లో ‘సంయుక్త సంఘ వర్థమాని’ అనే పత్రిక ఖమ్మం జిల్లాలో క్రైస్తవ మత ప్రచారం కోసం వెలువడింది. ‘పయామ్‌’ పత్రిక ఖాజీ అబ్దుల్‌ గఫార్‌ సంపాదకత్వంలో హైదరాబాదు నుంచి ప్రచురితమయ్యేది. ఇది రజాకార్ల దురంతాలను ఖండించిది. 1927లో ‘రయ్యత్‌’ ఉర్దూ పత్రిక మందముల నరసింగరావు సంపాదకత్వంలో హైదరాబాద్‌  లో ప్రారంభమైంది. షోయబుల్లా ఖాన్‌ మొదట ఈ పత్రికలోనే పనిచేసి తర్వాత 1947లో ‘ఇమ్రోజ్‌’ పత్రికను స్థాపించాడు. రజాకార్ల చేతిలో హత్యకు గురయ్యాడు. ఇమ్రోజ్‌కు అర్థం నిప్పు కణిక. 1929లో హైదరాబాద్‌ బులిటెన్, 1934లో దక్కన్‌ కేసరి, 1938లో దక్కన్‌ క్రానికల్‌ వంటి ఇంగ్లిష్‌ పత్రికలు హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యాయి.

 

తెలుగు పత్రికల పరంపర

1912లో ‘సరోజినీ విలాస్‌’ అనే తెలుగు పత్రిక మహబూబ్‌నగర్‌ నుంచి వెలువడింది. ఇది తెలంగాణ తొలి తెలుగు పత్రిక. 1913లో ‘హితబోధిని’ పత్రిక బండారు శ్రీనివాస శర్మ సంపాదకత్వంలో మహబూబ్‌నగర్‌ నుంచి ప్రచురితమైంది. 1917లో స్వామి వెంకటరావు సంపాదకుడిగా హైదరాబాదు నుంచి ‘ఆంధ్రమాత’ పత్రిక వచ్చింది. 1921లో ‘దేశీయ వాజ్ఞ్మయ’ పత్రికను తెలంగాణ లిటరరీ అసోసియేషన్‌ ఏర్పాటు చేసింది. 1922లో నీలగిరి పత్రిక (తొలి తెలుగు రాజకీయ పత్రిక) షహ్నవీస్‌ వెంకట నరసింహారావు సంపాదకత్వంలో నల్గొండలో ప్రారంభమైంది. 1925లో ‘గోలకొండ’ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో హైదరాబాద్‌లో మొదలైంది. ఇది అర్ధ వార పత్రిక. 1947లో వనపర్తి సంస్థానాధీశులు శ్రీ రాజారామేశ్వరరావు, నూకల నరోత్తంరెడ్డిలు లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుచేసి గోలకొండ పత్రికను దినపత్రికగా నడిపేవారు. ఈ పత్రిక 1966 వరకు కొనసాగింది. గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి కృషి వల్ల 1934లో గోలకొండ కవుల సంచిక వెలువడింది. ఇది ఆధునిక కాలంలో ప్రచురించిన మొదటి తెలుగు కవితా సంకలనం. 1925లో ‘ఆంధ్రాభ్యుదయం’ పత్రిక కోకల సీతారామశర్మ సంపాదకత్వంలో హనుమకొండ నుంచి వెలువడింది. 1927లో ‘సుజాత’ పత్రిక హైదరాబాద్‌ నుంచి ప్రచురితమయ్యేది. 1941లో ‘మీజాన్‌’ అనే పత్రిక ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు భాషల్లో వచ్చేది. దీని యజమాని గులాం మహ్మద్‌. తెలుగులో ఈ పత్రికకు అడవి బాపిరాజు సంపాదకుడు. ఈ పత్రికలన్నీ ప్రజల్లో జాతీయభావాన్ని, చైతన్యాన్ని కలిగించి స్వాతంత్య్రోద్యమం వైపు మళ్లించాయి.

 

విద్యాభివృద్ధితో చైతన్యం

తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో విద్య కీలకపాత్ర పోషించింది. రాజవంశీయుడైన షామ్‌ షల్‌ ఉమ్రా అనువాదం కోసం 1834లో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. గణితం, భౌతిక, రసాయన, ఖగోళ, వైద్య శాస్త్రాలు, ఇంజినీరింగ్‌ లాంటి 50 పుస్తకాలను ఈ అనువాద బ్యూరో తయారు చేయించింది. ఉమ్రా 1829లో మదర్సా-యే-షక్రియా అనే ఉర్దూ మాధ్యమిక పాఠశాలను స్థాపించాడు. ఈ పాఠశాలలో భౌతిక, రసాయన, గణిత, ఖగోళ శాస్త్రాలను బోధించేవారు. 1834లో సెయింట్‌ జార్జ్‌ గ్రామర్‌ స్కూల్‌ అనే మొదటి ఆంగ్ల పాఠశాల హైదరాబాద్‌లో ఏర్పడింది. 1839లో బొల్లారంలో మొదటి మెడికల్‌ స్కూల్‌ను స్థాపించారు. 1915లో మిర్‌ అక్దర్‌ అలీ కొందరు పట్టభద్రులైన యువకులతో కలిసి హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ కాన్ఫరెన్స్‌ను స్థాపించారు. ఫలితంగా 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. 1906లో కేశవరావు కొరాట్కర్‌ వివేకవర్ధని విద్యాసంస్థను స్థాపించారు.

 

స్వేచ్ఛ వైపు నడిపించిన సాహిత్యం

ఆంధ్ర సారస్వత పరిషత్తు అభివృద్ధిలో దేవులపల్లి రామానుజరావు కీలకపాత్ర పోషించారు. ‘నవ్య సాహితీ సమితి’ని రావి నారాయణరెడ్డి, ‘తెలంగాణ రచయితల సంఘాన్ని’ దాశరథి, ‘వైతాళిక సమితి’ని కాళోజీ నారాయణరావు స్థాపించారు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, చిలుకూరి వీరభద్రరావు ‘ఆంధ్రుల చరిత్ర’, రావి నారాయణరెడ్డి ‘వీర తెలంగాణ నా అనుభవాలు’, ఖండవల్లి లక్ష్మీరంజనం ‘ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి’ వంటి రచనలు గత చరిత్ర వైభవాన్ని తెలియజేశాయి. ఆ అన్ని సంస్థలు, వ్యక్తుల వల్ల ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది.స్వాతంత్య్రోద్యమం వైపు అడుగులు వేసేలా చేసింది. 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి


 

Posted Date : 14-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌